అశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రుల వేడుకలతో జరిగేది బతుకమ్మ పండుగ. పాడ్యమికి ముందు భాద్రపద బహుళ పంచమి నుంచి తొమ్మిది రోజులు, మహాలయ అమావాస్య వరకు జరుపుకునేది బొడ్డెమ్మ పండుగ. బొడ్డెమ్మ, ఇది బాలికల, కన్యల పండుగ.
సాధారణంగా బొడ్డెమ్మను సాయంత్రం వాకిట్లో నిలిపి చీకటి పడే వరకూ ఆడి పాడతారు. ఒకరు పాట చెబుతూ ఉంటే చప్పట్లు చరుస్తూ చుట్టూ తిరుగుతూ మిగతా వారు పాడుతారు. ఈ పాటలు కూడా చిన్న చిన్న ఇతివృత్తాలతో ఉండి మనోహరంగా సాగుతై…
చిన్నంగ సన్నంగా వలలో… జల్లూ కురువంగా వలలో
ఏ రాజు కురిపించే వలలో… ఏడు గడియెల్లు వలలో
పట్నంబు ఏలేటి వలలో… బాల ఇబ్రాహిం భాషా వలలో
బంగారు వాన కురిసే వలలో… బాలాధరి మీద వలలో
అచ్చు మల్లెలు కురిసె వలలో… ఆలాద్రి మీద వలలో
సన్నమప్లూలు కురిసె వలలో… చెన్నయ్య మీద వలలో
బొడ్డు మల్లెలు కురిసె వలలో… బోనగిరి మీద వలలో
బంతిపూలు పూసే వలలో… వనమెల్లా గాసె వలలో
బాలలు బతుకమ్మ వలలో… పండుగలడిగిరి వలలో
బాలలు బొడ్డెమ్మ వలలో… పండుగలడిగిరి వలలో
బొడ్డెమ్మ పండుగ నాటికి సన్నగా వర్షపు జల్లులు పడుతూ ఉంటయి. ఆ విషయాన్ని సున్నితంగా ప్రస్తావిస్తూ సాగే ఈ పాటలో ఆ సన్నని జల్లులు… సన్నమల్లెపూలు, బొడ్డు మల్లెలై కురిసాయట…కురవడంతో వనాలే అయ్యాయట…
సాధారణంగా బొడ్డెమ్మ పండుగ నాటికి సన్నగా వర్షపు జల్లులు పడుతూ ఉంటయి. ఆ విషయాన్ని సున్నితంగా ప్రస్తావిస్తూ సాగే ఈ పాటలో ఆ సన్నని జల్లులు… సన్నమల్లెపూలు, బొడ్డు మల్లెలై కురిసాయట…కురవడంతో వనాలే అయ్యాయట…ఆ వనాలను చూసిన బాలికల మనసులు బతుకమ్మ, బొడ్డెమ్మ ఆటలను కోరాయట. ప్రాచుర్యంలో ఉన్న ఈ పాట ఒకప్పుడు మన ప్రాంతాన్ని నైజామ్‌లు పాలించారనే విషయాన్ని గుర్తు చేస్తది.