‘ప్రత్యక్ష అంతరిక్ష వింతలు’గా భావించే ‘గ్రహణాలు’ ప్రతీ ఏడాది వచ్చేవే అయినా, ఈ రాత్రి సంభవించనున్న ‘సంపూర్ణ చంద్రగ్రహణం’ మాత్రం మరిన్ని విశేషాలతో, ‘అతి అరుదైన ఘటనలలో ఒకటి గానే ఖగోళశాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే, తెలుగు రాష్ట్రాలతో సహా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలో ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించలేము.
‘రక్తవర్ణ చంద్రుడి గా అభివర్ణిస్తున్నప్పటికీ నిజానికి చందమామ ఎరుపు తామ్రవరం (Reddish Copper Color) లో కనిపించనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. గ్రహణం ఏర్పడే సరైన ప్రదేశంలో, ఆ రాత్రివేళ దర్శనమిచ్చే కొద్ది నిమిషాలు సరైన సమయానికి అందుబాటులో వుండేవారు మాత్రం ‘దర్శించి తీరవలసిన దృశ్యం’ అని వారు తెలిపారు. 26న సంభవించనున్న ఈ చంద్రగ్రహణమే ఈ ఏడాదికి అతి పెద్దదని కూడా వారు పేర్కొన్నారు. చంద్రుడు ఈ సారి సదరు దీర్ఘచతురస్ర మాసకక్ష్యలో భూమికి అతి సమీపంలోకి (2,22,022 మైళ్లు) వస్తున్నాడు. ఈ కారణంగానే సాధారణ పరిణామం కంటే 8 శాతం ఎక్కువ సైజులో కంటినిండుగా కనిపిస్తాడని వారుంటున్నారు. మే నెలలోని పరమపవిత్రమైన వైశాఖ పూర్ణిమనాటి ఈ గ్రహణాన్ని సైద్ధాంతిక భాషలో ఖగ్రాస (దాదాపు సంపూర్ణం) గా సిద్ధాంతులు చెప్తారు.
“సూపర్ ఫ్లోవర్ బ్లడ్ మూన్ ఎక్లిప్స్’గా వారు చెబుతున్న ఈ తరహా గ్రహణాన్ని రెండేండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ప్రపంచ ప్రజలు చూడబోతున్నారు.
మనకు కనిపించదు!
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల (పూరి, భువనేశ్వర్, కటక్, కోల్‌కత, అండమాన్ నికోబార్, ఆసోమ్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్)తో సహా ప్రపంచంలోని అనేక ప్రదేశాలలో దర్శనమిచ్చే ఈ అరుదైన చంద్రగ్రహణం” తెలుగురాష్ట్రాలతో సహా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలో కనిపించదని పంచాంగకర్తలు ఇదివరకే ప్రకటించారు. కాగా, 2019 జనవరి 20న సంభవించిన సంపూర్ణ చంద్రగ్రహణం తర్వాత అంతటి స్థాయిలో సుమారు రెండున్నరేండ్లకు తిరిగి త్వరలో దర్శనమిస్తున్నది. దీనిని ఒక సంక్షిప్త (ఖగ్రాస) సంపూర్ణ చంద్రగ్రహణంగానే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తర అమెరికా, పసిఫిక్ రిమ్ (ఎత్తయిన ప్రదేశాలు) ప్రాంతాల ప్రజలకు ఇదొక అత్యంత అరుదైన ఖగోళ అద్భుత దృశ్యంగా వారు పేర్కొన్నారు.
“కింగ్ టైడ్స్’ తప్పవా?
ఈ చంద్రగ్రహణం నిజానికి పూర్తిస్థాయిలో ఒక అద్భుత దృశ్యమే అయినా, సూపర్ మూన్ పెద్ద పరిమాణంలో భూమికి అతి సమీపానికి వస్తున్న కారణంగా సముద్రాలలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడే ప్రమాదం లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘కింగ్ టైడ్స్’ (భారీ అలలు)కు అవకాశం ఉంటుంది కనుక తీర ప్రాంతీయులు పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిందేనని వారు సూచిస్తున్నారు.
అమెరికాలోని హవాయి పరిసరాల ప్రజలకైతే ఆర్థరాత్రి వేళ ఆకాశంలో నడినెత్తిన రక్తవర్ణంలో చందమామ (బ్లడ్ మూన్) కనిపిస్తాడు.
అద్భుత దృశ్యం
‘పసిఫిక్ రిమ్ ప్రాంతాల ప్రజలకు ఈ చంద్రగ్రహణం పూర్తిస్థాయిలో ఎంతో చక్కగా దర్శనమిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ తీర ప్రాంతాలతో కూడిన ఆమెరికా నుంచి దక్షిణ పసిఫిక్ ప్రదేశాలైన న్యూజిలాండ్ ఆస్ట్రేలియా, తూర్పు ఆసియా దేశాల పరిసర ప్రాంతాలవారికి ఇదొక గొప్ప అవకాశమని వారన్నారు. లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి ప్రాంతాలలో పశ్చిమాకాశంలో గ్రహణ ‘చంద్రాస్తమయ దృశ్యం’ అతి దగ్గరగా కనిపిస్తుంది. హాంగ్ కాంగ్, సింగపూర్ తోపాటు తూర్పు ఆసియా ప్రదేశాల వారికైతే చంద్రోదయం’ తర్వాత కొద్ది సేపటికే పూర్తిగా సంపూర్ణ గ్రహణదృశ్యం సాక్షాత్కారిస్తుందని వారు తెలిపారు. అమెరికాలోని హవాయి పరిసరాల ప్రజలకైతే ఆర్థరాత్రి వేళ ఆకాశంలో నడినెత్తిన రక్తవర్ణంలో చందమామ (బ్లడ్ మూన్) కనిపిస్తాడు.’
పావుగంటలోనే అంతా!
ఆయా ప్రత్యేకతలను బట్టి, సాధారణంగా చంద్రగ్రహణ సమయం 105 నిమిషాల (ఉదాహరణకు 2018లో) నుంచి కేవలం 5 నిమిషాలలో (ఉదా||కు 2015లో)నే ముగుస్తుంది. ఈ ‘సంపూర్ణ చంద్రగ్రహణం’ మరీ తక్కువగా కాకుండా, మరింత ఎక్కువగా కాకుండా కేవలం 14 నిమిషాల 30 సెకండ్లలోనే ముగుస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమికేంద్రం నీడగుండా, బాహ్య అంచుకు కేవలం 21 మైళ్ల (34 కి.మీ.) దూరం నుంచి ఉత్తరాది దిశవైపు చంద్రుడు ప్రయాణించడమే దీనికి కారణమని వారు చెబుతున్నారు.
మహా ఎరుపు తారకు దగ్గరగా…
ఈ గ్రహణం సమయంలో చందమామ వృశ్చికరాశిలో ‘మహా ఎరుపు తార’ అంటేయర్స్ (Antares) కు ఎంతో దగ్గరగా, కేవలం 5 డిగ్రీల కోణంలోనే ఉంటాడు. మొత్తం ఆకాశంలోనే అత్యంత ప్రకాశవంతమైన తారలలో 15వదిగా చెప్పే అంటేయర్స్ సాధారణంగానే ఎరుపురంగులో కనిపిస్తుంది. మన సూర్యునికంటే 700 రెట్లు పెద్దది. 600 కాంతి సంవత్సరాల దూరంలోని ఈ నక్షత్రాన్ని ‘అంగారకుని ప్రత్యర్థి’గానూ పిలుస్తారు.
పాలపుంతనూ చూడవచ్చు!
ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వేళ రక్తవర్ణ చంద్రుణ్ణి చూడటమేకాక మరో బోనస్ కూడా అంతరిక్ష ప్రేమికులకు, శాస్త్రవేత్తలకు లభిస్తున్నది. ఆదేమిటంటే, ఏకంగా మన పాలపుంతను చూడగలగడం.
ఆసలు, అమావాస్యనాటి చిక్కని చీకట్లో, అత్యంత స్పష్టంగా ఆకాశాన్ని చూడగలిగే వేళలోనూ మన సూర్యునికి నెలవైన తారా మండలాన్ని (పాలపుంత) దర్శించలేం. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో అయితే, ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన కాంతికారకంగా భావించే చంద్రుడు పూర్తిగా కనుమరుగవుతాడు. ఈసారి 14 నిమిషాల 30 సెకండ్లపాటు ఎలాంటి సౌరకాంతి ఆకాశంలో ప్రవహించదు. కనుక, ఈ ఆరుదైన వేసవి పూట పాలపుంతను చూడటం మంచిదని, చంద్రుడు ఈసారి వృశ్చికరాశిలోకి రావడమే ముఖ్య కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్థానిక గెలాక్సీ (పాలపుంత) ఆర్ధచంద్రాకృతికి నివాస ప్రదేశంగా వృశ్చిక రాశిని చెప్తారు.
వారెంతో అదృష్టవంతులు
పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాలలోని ఎక్కడ్నించైనా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. కానీ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని పగడపు ద్వీపదేశం ‘నియోయి (Niue) అయితే గ్రహణానికి కేంద్రస్థానం’ వంటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దేశ జనాభా కేవలం 1,500. వారెంత అదృష్టవంతులో కదా
– గడీల ఛత్రపతి