Editorial

Wednesday, January 22, 2025
కవితBESOS | ముద్దులు : స్పానిష్ కవయిత్రి Gabriela Mistral కవిత - స్వేచ్చానువాదం గీతాంజలి

BESOS | ముద్దులు : స్పానిష్ కవయిత్రి Gabriela Mistral కవిత – స్వేచ్చానువాదం గీతాంజలి

బెసోస్ – ముద్దులు

Auguste Rodin’s sculpture of two lovers

గాబ్రియేలా మిస్ట్రాల్
స్వేచ్చానువాదం – గీతాంజలి

కొన్ని ముద్దుల గురుంచి చెప్పాలి నీకు
నా ముద్దు గురుంచి కూడా!

కొన్ని ముద్దులు ఉంటాయి.
అవి తమను తాము, ఖండించబడ్డ ప్రేమకి ఇచ్చిన తీర్పుగా ప్రకటించుకుంటాయి.
క్షణకాలపు చూపులతో పెట్టిన ముధ్ధులు కొన్నైతే , జ్ఞాపకాలు ఇచ్చిన ముద్దులు మరి కొన్ని .
నిశ్శబ్దమైనవి..ఉన్నతమైనవి…
మార్మికమైనవి..నిజాయతీతో కూడిన ముధ్ధులు… నిషేదించబడ్డ నిజమైన ముద్దులు…
ఈ ముధ్ధులు ఆత్మలున్న మనుషులు తప్ప అందరూ ఇవ్వలేరు మరి!

ఇంకొన్ని ముద్దులుంటాయి… సల సలా కాల్చేసేవి …లోతుగా గాయపరిచేవి.
ఇంద్రియాలను బంధించి పడేసేవి. ఇంకా
చంచలమైనవి. స్వప్నాల్ని వదిలేసినవి అయిన
కొన్ని రహస్యమైన ముద్దులు ఉంటాయి.

ఎవరూ విశ్లేషించలేని కొన్ని.
బహుశా చాలా నిగూఢమైన సంకేతాలను బంధించినట్లుండే సమస్యాత్మకమైన ముద్దు లుంటాయి.
లెక్కలేనన్ని గులాబీ మొగ్గల రేకుల్ని చిదిమేసినట్లుండే విషాదకరమైన, వికారమైన ముద్దులు కూడా ఉంటాయి.

కొన్ని గోరు వెచ్చని ముద్దు లైతే…
పరిమళంతో గుబాళించిపోతూ, సాన్నిహిత్యం కోసం తపిస్తూ,
హృదయం కొట్టుకునేలా చేసే ముద్దులు ఇంకొన్ని.
కొన్ని ముద్దులుంటాయి… అవి ఎలా ఉంటాయంటే, కాగిపోతున్న పెదవుల మీద, రెండు మంచు కొండల మధ్య ఉదయించే సూర్య స్పర్శ లాంటి ముద్రలు వదులుతున్నట్లే ఉంటాయి.

తెల్లని ఉత్క్రుష్టమైన…స్వచ్ఛమైన ..సరళమైన
లిల్లీ పూల లాంటి ముద్దులు కూడా ఉంటాయి

అలాగే నమ్మక ద్రోహంతో నిండిన … అత్యంత పిరికివైన ముద్దులు కూడా ఉంటాయి.
అది సరే…శాప గ్రస్థమైన.. ప్రమాదకరమైన
ముద్దుల సంగతేంటి మరి?

నీకు తెలుసో లేదో…జూడాలు జీసస్ క్రిస్ట్ ని మోసపు ముద్దు పెట్టుకుని వదిలేసాక.. ఆ అపవాదుని భగవంతుడి మొఖం మీద ముద్రించాక…
దేవత మగ్దలీనా కాదూ.. తన దయామయమైన ముద్దులతో ఆయనలోని వేదనని తగ్గించింది ??
ఇక అప్పటి నుంచీ…
ప్రేమ..ద్రోహం, నొప్పి, బాధలని
ఈ ముధ్ధులు తమ హృదయ స్పందనగా చేసుకున్నాయి కాదూ..
అందుకే.. ఎక్కడ పెళ్లిళ్లు జరిగినా …అక్కడ పూల మధ్యగా తేలిపోయే గాలుల్లో ..
ఈ ముద్దుల హృదయ ధ్వని కలిసిపోయి ఉంటుంది…
నువ్వు వినాలే గానీ!

అవునూ, నీకు నా ముద్దు గురించి కూడా చెప్తాన్నానుగా!
విను మరి.

కొన్నిసార్లు… కొంతమంది మనుషుల లోలోపల దాక్కుని
కోరికలు రేపే.. దహించి వేసే, ఉన్మత్థమైన… మోహపు
ముద్దులు ఉంటాయి.
నీకు బాగా తెలుసు. అవి, నా ముధ్ధులు అని.
వాటిని నేనే కనుక్కున్నాను!
ప్రత్యేకించి నీ పెదవుల కోసం మాత్రమే!

ఉప్పొంగే నిజమైన ప్రేమలో తమ జ్ఞాపకాలను వదిలే,
ఎగసిపడే అగ్నికీలల్లాంటి ముద్దులు, మన పెదవులు మాత్రమే రుచి చూసిన
తుఫాను లాంటి ముధ్ధులు. కొన్ని సార్లు నొప్పితో కూడిన క్రూరమైన ముధ్ధులు కదా అవి?

అనిర్వచనీయమైన మన తొలి ముధ్ధు
జ్ఞాపకం ఉన్నదా నీకు?
నీ ముఖాన్ని ఎరుపెక్కించి..
నిన్ను నిలువెల్లా వణికించి…కన్నీళ్లు తెప్పించిన ముద్దు??

పోనీ, వెచ్చని ఆ మధ్యాహ్నపు వేళ గుర్తుందా?
ఒక ఉన్మాదంలో…నీ చేతుల మధ్య…ప్రకంపనలు నింపిన ముద్దులో నలిగిపోయాక …తర్వాత ఏమైంది?? నా లేత పెదవుల మీద రక్తపు జీర.. నీ ప్రేమ తీవ్రతను తెలిపింది కదా!

అసలు ముద్దు ఎలా పెట్టుకోవాలో నీకు నేర్పింది నేనే కదా?
ప్రేమ లేని రాతి హృదయపు మనుషులు యాంత్రికంగా పెట్టుకునే,
మంచులా ఘనీభవించిన శీతలమైన ముద్దులు…ఎందుకు మనకు..చెప్పు ??
కావలిస్తే, నా ముద్దులు తీసుకో!
నా ముద్దులతోనే తిరిగి నన్ను ఎలా ముద్దు పెట్టుకోవాలో నేర్పించానుగా !
నేను కనుక్కున్న ముద్దులు…
నీ పెదవుల దాకా…నోటి దాకా
చేరే ముద్దులు !!
నా ముద్దులు !!

కవయిత్రి పరిచయం

స్పానిష్ కవయిత్రి గాబ్రియేలా మిస్ట్రాల్ 1945లో సాహిత్యంలో నోబుల్ ప్రైజ్ అవార్డు అందుకున్న తొట్టతొలి లాటిన్ అమెరికన్ రచయిత్రి. తాను చిలీలో ఒక చిన్న టౌన్ లో ఏప్రిల్ 7, 1889లో జన్మించింది.

గాబ్రియేల్ మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె తండ్రి భార్యా పిల్లలను వదిలేసినపటికీ తనపై అతడి ప్రభావం ఎంతో ఉంది. అతను చిన్నప్పుడు గెబ్రియేలా కోసం కవిత్వం రాసి గిటార్ వాయిస్తూ పాడటం,  ఆమెలో కవిత్వంపై ఇతర సాహిత్య ప్రక్రియలపై ఆసక్తిని కలిగించింది. అలాగే తన నాయనమ్మ చదివే బైబిల్ కథలు కూడా గెబ్రియేలాపైప్రభావాన్ని చూపించాయి.

నిజానికి ఆ కాలంలో ముద్దు మీద ఒక స్త్రీ నుంచి ఇంత దీర్ఘమైన కవిత రావడం గొప్ప సాహసం అని అందరూ భావించారు.

గాబ్రియేలా మిస్ట్రాల్ స్పానిష్ సాహిత్యంలో పీజీ చేశాక బతుకు తెరువు కోసం అమెరికాలోని వివిధ విశ్వ విద్యాలయాల్లో అలాగే కొన్ని కాలేజీలలో స్పానిష్ సాహిత్యం క్లాసులు తీసుకునేది. గెబ్రియేలా రచనకు భిన్నమైన వస్తువులు ఎంపిక చేసుకునేది. మీరు చదివిన ‘ముద్దుల’తో పాటు, సంతోషం, బాధ్యత, భయం, ప్రేమ…లాంటి అనేక అంశాలు ఆమె కవితా వస్తువులయ్యాయి. మనుషుల్ని అనాథలుగా వదిలేయడం కూడా ఆమె రాసిన ఒక అంశం. ఐతే, ఆమె కవిత్వంలోని విశేషం, నాణానికి రెండు వైపులా –  చిత్తూ బొత్తూ తరచి చూడటం,  రెండు విషయాల మీద జరిగే ఘర్షణల గురించి కూడా ఆమె ఎంతో అద్భుతమైన  కవిత్వం రాశారు. ఉదాహరణకు ప్రేమా – ద్వేషం, నొప్పి – సంతోషం, జీవితం – మృత్యువు, ఆశ – భయం…వీటిపై చక్కటి కవిత్వం వెలువరించారు. ఇక మీరు చదివిన కవిత – ‘బెసోస్’ లో  రక రకాల ముద్దుల గురుంచి, వాటి వెనక ఉన్న భిన్నమైన మనుషుల ఆంతర్యాల గురుంచి రాయడం గమనించే ఉంటారు. నిజానికి ఆ కాలంలో ముద్దు మీద ఒక స్త్రీ నుంచి ఇంత దీర్ఘమైన కవిత రావడం గొప్ప సాహసం అని అందరూ భావించారు.

గాబ్రియేలా సానెట్స్ ఆఫ్ డెత్, 80 కవితలున్న డెస్పైర్ కవితా సంపుటి. అలాగే, టెండర్నేస్, తాలా. పిల్లల కోసం ‘ద పైనాపిల్’ అనే ప్రత్యేకమైన కవిత్వం రాశారు. కథల సంపుటి కూడా వెలువరించారు. అన్నిటికీ మించి గెబ్రియేలా పిల్లలు, స్త్రీలు, బీదవాళ్ళ హక్కుల కోసం అనేక రచనలు చేయడమే కాదు, స్వయంగా అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. వారు జనవరి 10, 1957 లో తన 67 ఏళ్ళ వయసులో న్యూయార్క్ లో పాంక్రియేటిక్ కాన్సర్ తో మరణించారు.

బెసోస్ అన్న ఈ కవితను స్వేచ్చానువాదం చేసిన గీతాంజలి వృత్తిరీత్యా వైద్యులు. ప్రవృత్తి రీత్యా కథకులు. జీవితంలోని వ్యధలను, వివిధ రూపాలలో సాగే అణచివేతలను, స్త్రీల విషాద లైంగిక గాథలను తన రచనల్లో ఆవిష్కరించారు. హస్బెండ్ స్టిచ్, స్టోమా వారి రెండు కథా సంపుటాలు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article