ఎన్.టి.ఆర్. లాంటి వ్యక్తి పుట్టటమే అరుదు. రూపం, గుణం కలబోసుకుని గొప్పగా ఎదిగి, పుట్టిన ఊరికే కాక రాష్ట్రానికి, దేశానికి కీర్తిని తెచ్చిన మహనీయుడు ఎన్.టి.ఆర్.
కష్టాల్లో, కన్నీళ్ళలో కూడా అధైర్యపడక పోరాడి గెలుపు సాధించిన వీరుడు. గొప్ప రైతు బిడ్డగా పుట్టికూడా ఉన్న ఆస్తులను కోల్పోయి, ఉన్న ఊరును విడిచి విజయవాడలో తండ్రి పాల వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచిన ఉత్తమపుత్రుడు. కూలిపోతున్న నిట్టాడి పూరిపాకలో వర్షం వస్తే తెల్లవార్లు తండ్రీ కొడుకులు నిట్టాళ్ళు పట్టుకొని కుటుంబాన్ని కాపాడుకున్న సంఘటనలు ఎన్నో ఆయనకు చిన్న విషయాలు.
బ్రేకుల్లేని పాత హెర్క్యులస్ సైకిల్ మీద 60 కిలోల బియ్యం, పప్పులను మోసుకుంటూ అర్ధ రాత్రి టైరు పంచరైతే వెనక్కుపోకుండా 60 మైళ్ళు సైకిల్ను బరువుతో విజయవాడకు నడిపించు కొచ్చిన రియల్ హీరో ఎన్.టి.ఆర్. స్నేహితుని వివాహానికి వెళ్ళాల్సి, రైలు తప్పిపోతే దారి తెలియనందున అదేపట్టాల వెంబడి 30 మైళ్ళు నడిచి పెళ్ళికి వెళ్ళిన పట్టుదల ఆయనిది.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రెండు చేతులా సంపాదించటానికి అవకాశమున్నా అవినీతిని అసహ్యించుకుని ఉద్యోగాన్ని వదలివేసిన నీతిమంతుడు. మిత్రుల సలహా మేరకు సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లి, తొలిరోజుల్లో సరిగా వేషాలు లభించక నిర్మాతలు చెప్పిన సమయానికి కాలినడకనే వెళ్లి కల్సుకుంటూ మూడేళ్ళు ఒకపూట తిండితో గడిపిన కార్యదక్షుడు.
ఒక మగవాని జీవితంలో ఎన్ని ఆరోహణ సోఫానాలుంటాయో వాటినన్నింటిని అధిరోహించిన సంపూర్ణ మానవుడు ఎన్.టి.ఆర్.
జేబులో డబ్బును తన మిత్రుడికిచ్చి మూడు రోజులు మంచి నీళ్ళతో కాలం గడిపిన ధీర చిత్తుడు. సహజత్వం కోసం ఫైటింగ్ దృశ్యాల్లో డూప్ లేకుండా పోరాడి ఎన్నో దెబ్బలు తగిలినా, చేయి, కాలు విరిగినా తొణకక బెణకక షూటింగుకు విధిగా హాజరై నిర్మాతలకు లాభం చేకూర్చిన సమయపాలన ఆయనది. ఆయన రావటం చూసి టైం సరిచూసు కొనేవారు.
దాదాపు 350 సినిమాల్లో నటించి, నష్టాల్లో ఉన్న సినీ రంగానికి కనక వర్షం కురిపించిన కల్పవృక్షం ఎన్.టి.ఆర్. బూజుపట్టిన పాత పురాణాలను తిరగరాయించి కథానయకులతోపాటు ప్రతి కథానాయలకు కూడా ఉన్నత స్థానం తన నటనచే కల్పించిన గొప్ప ప్రయోక్త.
ప్రతి సినిమాలో సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చి బడుగు పేద వర్గాల తరుపున నిలబడి ఎదిరించి పోరాడే కథానాయకుడు ఎన్.టి.ఆర్. తెలుగు ప్రజల హృదయాల్లోనే కాక దేశ ప్రజలందరి హృదయాల్లో నిలచిన అభినవ రాముడు, కృష్ణుడు, శ్రీనివాసుడూ ఆయనే.
కళ, కాసులకోసమే కాదు, ప్రజల కోసం కూడా అనే సిద్ధాంతాన్ని నమ్మి ఎన్నోమార్లు ప్రజలకొచ్చిన ఆపదల్లో అండగా నిలబడిన మహా మానవతావాది ఎన్.టి.ఆర్.
అధికారం కోసం, సింహంలా బ్రతికిన ఎన్.టి.ఆర్ ను స్త్రీ లోలుడిగా చిత్రించి వ్యక్తిత్వాన్ని కుంచించేట్లు చేయటానికి ప్రయత్నించినప్పటికీ అధికారాన్ని వదులుకున్నారు కానీ, వివాహామాడిన స్త్రీకి అన్యాయం చేయని ధీరోదాత్తుడు మన ఎన్.టి.ఆర్.
రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెన, పోలీస్ డిఫెన్సు ఫండ్ సహాయార్ధం, తను స్వయంగా జోలె పట్టి, నటీనటులందరిని మొదటిసారిగా సామాన్య జనంలోకి తీసుకొచ్చిన నిగర్వి ఎన్.టి.ఆర్. నిర్మాత కష్టాల్లో ఉంటే ఆదుకుని సినిమా పూర్తి చేయించే ఉదార స్వభావుడు. తన కష్టార్జితం తప్ప పరుల సొమ్ము అశించని నిక్కచ్చి మనిషి ఎన్.టి.ఆర్.
తాను పోషించిన పాత్రలే ప్రేరణగా తనగుండెలో నిండిన ఆశయాలే స్ఫూర్తిగా ప్రజల్లోకి వెళ్ళారు తప్ప ఏనాయకుడిని ఆయన అనుసరించలేదు.
గతచరిత్రలో 9 నెలల కాలంలో పార్టీ పెట్టి ఘన విజయాన్ని సాధించిన వ్యక్తులు, రాజకీయ కుయుక్తి వలన అధికారాన్ని కోల్పోయి కేవలం రెండు మాసాల వ్యవధిలోనే తిరిగి కైవసం చేసుకున్నవారు లేరు. కాంగ్రేసు పార్టీ కుదుళ్ళను కదిలించింది ఎన్.టి.ఆరే.
జయప్రకాశ్ నారాయణగారు ఎన్నో యేళ్లు నిష్కలంక నిస్వార్థ విదానాలతో రాజకీయ రంగాన్ని కదిలించి ఇందిరాగాంధి గారిని ఓడించగలిగితే, ఏ రాజకీయ అనుభవం లేకుండానే రాజీవ్గాంధి గారిని ఓడించటానికి కారణమైన “నేషనల్ ఫ్రంట్”ను దేశస్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నింటిని ఒకేతాటి మీదకు తెచ్చి ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే. అధికారం కోసం, సింహంలా బ్రతికిన ఎన్.టి.ఆర్ ను స్త్రీ లోలుడిగా చిత్రించి వ్యక్తిత్వాన్ని కుంచించేట్లు చేయటానికి ప్రయత్నించినప్పటికీ అధికారాన్ని వదులుకున్నారు కానీ, వివాహామాడిన స్త్రీకి అన్యాయం చేయని ధీరోదాత్తుడు మన ఎన్.టి.ఆర్.
ఒక మగవాని జీవితంలో ఎన్ని ఆరోహణ సోఫానాలుంటాయో వాటినన్నింటిని అధిరోహించిన సంపూర్ణ మానవుడు ఎన్.టి.ఆర్.
శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం ఎపి. తెలుగు అకాడెమి సొసైటీ అధ్యక్షురాలు