బతుకమ్మ. అది తొమ్మిది రోజుల జాతర. నేలకు దిగి వచ్చిన హరివిల్లు. ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటుతూనే విశ్వ సందేశం వినిపించే పూల హారతి.
విజయ కందాళ
పూలతో పూజించడం, ఆభినందనలు తెల్పడం, నివాళులు అర్పించడం ప్రపంచానికి అలవాటైతే, పూలనే పూజించడం తెలంగాణ ప్రజల ప్రత్యేకత. ప్రకృతి ఆరాధనే మనం జరుపుకునే బతుకమ్మ పండుగ. ప్రకృతినుంచి సేకరించిన పూలను మళ్ళీ ఆ ప్రకృతికే సమర్పించడం ఈ పండుగ అంతరార్థం.
బతుకమ్మ అంటే ఆటపాటలు, నింగికెగసిన ఆనందోత్సాహాలు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు పండుగ నాటికి అంబరాన్నంటుతాయి.
బతుకమ్మ పండుగ ఎన్నో కళల సమాహారం. బతుకమ్మను పేర్చడమే ఓ కళ. స్త్రీల సజనాత్మకతకు అందమైన చిరునామా. తంగేడు, గుమ్మడి, గునుగు, కట్ల, గన్నేరు, బంతి, చామంతి, రుద్రాక్ష, బీర – అన్నీ స్వదేశీ సంపదే. ప్రాంతీయ సువాసనలే. ఇవన్నింటితో గోపురంలా పేర్చిన బతుకమ్మకు పైన పసుపుతో చేసిన గౌరీదేవి, పక్కల వెలిగించిన దీపం, సుగంధాలు వెదజల్లే అగరు వత్తుల ధూపం – ఇదీ రూపం. తర్వాత ఇంకేముందీ…ఆటలు, పాటలు, పట్టుచీరల పరపరలు, చప్పట్లు, వెలిగిపోయే మొహాలు – ఇవన్నీ చూసి ఆనందించాల్సిందే. పాల్గొని జీవితాన్ని రసభరితం చేసుకోవాల్సిందే. అలా ఆడి, పాడి అలసిసొలసిన మనశ్శరీరాల సంతృప్తిని ఏ భావాలూ పూర్తిగా వెల్లడించలేవు.
దసరా అంటేనే దేశమంతా దేవీపూజలు, రావణ దహనాలు, నవరాత్రుల సంరంభాలు. ఇవన్నిటితోబాటు బతుకమ్మ వేడుకలు తెలంగాణా ప్రాంతానికే ఓ ప్రత్యేకతను తెచ్చిపెడతాయి.
ఈ పండుగ శరత్కాలంలో వస్తుంది. అప్పటికి వర్షాలు వెనక్కు జారుకుంటే. నిర్మలఆకాశాలు ఆరుబయటికి వచ్చి ఆనందించమంటాయి. దసరా అంటేనే దేశమంతా దేవీపూజలు, రావణ దహనాలు, నవరాత్రుల సంరంభాలు. ఇవన్నిటితోబాటు బతుకమ్మ వేడుకలు తెలంగాణా ప్రాంతానికే ఓ ప్రత్యేకతను తెచ్చిపెడతాయి.
అయితే దసరా తెలంగాణాకు వచ్చేసరికి పూర్తిగా రూపం మార్చుకుని జానపద అందాల్ని సొంతం చేసుకుని, ప్రకృతి సంపదకు పట్టాభిషేకం చేస్తుంది. వినాయక చవితికు మూలికలే మహరాజులైనట్లు , బతుకమ్మలో పూలే మహరాణులు.
అసలు ఈ పండుగ వయసుతో సంబంధం లేకుండా కుల, వర్గ, జాతి, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అందరినీ కలుపుకుని హుషారెత్తిస్తుంది.
అసలు ఈ పండుగ వయసుతో సంబంధం లేకుండా కుల, వర్గ, జాతి, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అందరినీ కలుపుకుని హుషారెత్తిస్తుంది.
ఏముందీ నాలుగురకాల పూలను తెచ్చి అలా పళ్ళెంలో పెట్టేస్తే చాలనుకోకండి. అదో కళ. అనుభవం మీద అబ్బే పనితనం. నీళ్లల్లో వదిలినప్పుడు విచ్చిపోకూడదు. పళ్లెంలో పేర్చిన బతుకమ్మను జాగ్రత్తగా కదిలిపోకుండా, విడిపోకుండా క్రింది పళ్ళెం ఒడుపుగా జరిపి నీల్లల్లోకి జారవిడుస్తారు. అలా నీళ్లల్లో సాగిపోతుంటే మొహాల్లో కనిపించే పట్టరాని సంతోషం చూసి తీరవలసిందే .
మా చిన్నప్పుడు వాకిట్లో కాస్సేపు, వీధి మధ్యలో ఇంకాస్సేపు, పుష్కరిణి దగ్గర చాలాసేపు ఆడి, ఇంటికి తిరిగి వచ్చేవాళ్లం. అక్కడితో అయిపోయిందా లేదుగా. తిరిగొచ్చాక విశాలంగా ఉన్న వీధిలో లేదా ఎవరింట్లోనో కోలాటం వేసేవాళ్ళం. ఎవరూ నేర్పలేదు. చూసి నేర్చుకోవడమే.
నిజానికి ఆట లేని బతుకమ్మ అసంపూర్ణమే. అన్నీ అజ్ఞాత కర్తృకాలే.
నిజానికి ఆట లేని బతుకమ్మ అసంపూర్ణమే. అన్నీ అజ్ఞాత కర్తృకాలే. పాడుతూ, చప్పట్లు కొడుతూ వలయాకారంగా తిరుగుతూంటే, ఆ ఊపులో కొందరు మరిన్ని చరణాలను ఆశువుగా అందుకుంటారు.అలా తలా ఓ చెయ్యిపడి పాట నవరసభరితమౌతుంది.
ఈ పాటలకు విషయమెక్కడిది కథలెవరివి అని అడక్కండి. నిత్యజీవిత అనుభవాలు, పెద్దల సూక్తులు, వారి కష్టాలు, కన్నీళ్ళు, వేడుకలు, పండుగలు, నోములు, ఊహలు, కోరికలు ఒకటేమిటి జానపద జీవన సర్వస్వం వాటిలో అందంగా, హృద్యంగా దూరిపోతాయి. ప్రతిపాదం చివర సాధారణంగా ఉయ్యాల, కోల్ కోల్, సందమామా వంటి ఊతపదాలు ఆడేవారికి, పాడేవారికేగాక చూసేవారికీ ఉత్సాహాన్నిస్తాయి. దారిన వెళ్తున్న వాళ్లనీ ఓ రెండు చుట్లు ఆడి వెళ్దాం అనుకునేలా చేస్తాయి. చప్పట్లే వీటికి వాద్య సహకారం. తేలిక పదాలు, సులువైన వరుసలు, అందమైన ఊహలు, విలువైన, అపురూపమైన అచ్చ తెలుగు పదబంధాలు వీటికి చెరిగిపోని గుర్తులు.
పండుగలు జనజీవితాల్లోకి చొచ్చుకొనిపోయి, నిత్యనూతనంగా మనసులను రంజింపజేస్తాయనడానికి ఇంతకంటె గొప్ప ఉదాహరణ ఇంకెక్కడుంది?
పండుగలు జనజీవితాల్లోకి చొచ్చుకొనిపోయి, నిత్యనూతనంగా మనసులను రంజింపజేస్తాయనడానికి ఇంతకంటె గొప్ప ఉదాహరణ ఇంకెక్కడుంది?
అసలు బతుకమ్మ వేడుకలను కాస్త గమనించండి. ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటుతూనే విశ్వ సందేశం వినిపించడం లేదూ. అందులో వాడే ప్రతి పూవుకూ ఓ ప్రత్యేక లక్షణముంది. దాన్ని కాపాడుకుంటూ, పదిమందితో కలిసి, ఒక్కటై నిలిచిపోవడం భిన్నత్వంలో ఏకత్వం అనే సంప్రదాయాన్ని గుర్తుచేయడం లేదూ. అంతేకాదు, నా దృష్టిలో బతుకమ్మ అంటే ‘బతుకవే అమ్మా’ అనే అర్థంతో బాటు ‘నీ ప్రత్యేకత’ను నిలబెట్టుకుంటూ, ‘నలుగురితో కలిసి బ్రతుకు’ అని కూడా. మీరేమంటారు?
- రచయిత్రి విజయ కందాళ ఇతర ఆడియో రచనలు ఈ లింక్ ద్వారా వినవచ్చు.
బ్రతుకమ్మ పండుగ పరమార్థాన్ని చక్కగా ఆవిష్కరించిన రచయిత్రి కందాళ విజయమ్మకు అభినందనలు.