Editorial

Wednesday, January 22, 2025
ఆనందంఆనందం : ఓ అసాధారణ అనుభవం : రమణ జీవి

ఆనందం : ఓ అసాధారణ అనుభవం : రమణ జీవి

Pic: Steve McCurry

ఆ అనుభవం అలా వచ్చి పోయింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా మళ్లీ రాలేదు. నేను సాధించింది కాదు కాబట్టి!

రమణ జీవి 

నలభైయేళ్ల క్రితం ఓ సాయంత్రం మొదలై రాత్రంతా వుండిన ఒక అనుభవం.

అప్పుడు నా వయసు ఓ ఇరవై ఉండొచ్చు.

నేను మరో ఇద్దరు స్నేహితులూ అలా ఈవెనింగ్‌ వాక్‌ చేస్తూ జియాసరై విలేజ్‌ ఎదురుగా వున్న ఫారెస్ట్‌ను దాటి ఢిల్లీ జెఎన్‌టియూ దగ్గర్లో అప్పుడే కొత్తగా కట్టిన ఓ గుడికి చేరుకున్నాం. స్నేహితుల్లో ఒకరు బెంగాలీ ఒకరు తమిళియన్‌. వచ్చీరాని (నాకు) ఇంగ్లీషులో మా మాటలన్నీ అయిపోయాక సైలెంట్‌గా కూచున్నాము. నిజానికి మాట్లాడ్డం అనడం కన్నా పోట్లాడ్డం అంటే బావుంటుంది. వాళ్లిద్దరూ దేవుళ్లను, బాబాలను నమ్ముతారు. నేను వాటికి తీవ్ర వ్యతిరేకిని  అప్పుడూ, ఇప్పుడూ. నా మీద వాళ్లకి చాలా అసహనంగా వుండేది.

ఆ అనుభవం మొదలయ్యాక నేను చేసిన మొదటి క్రియ లేచి నిలబడ్డం. అద్భుతం ఆ నిలబడ్డం! మొదటిసారి నిలబడినట్టు… పరిసరాలన్నీ నాతో పాటే లేచి నిలబడినట్టు… ఇప్పడు కూడా వొళ్లు పులకరిస్తోంది.

నేను నా గతాన్ని తలుచుకుంటూ కళ్లు మూసుకున్నాను. అప్పటికి నేను మా వూరునీ నా వాళ్లని వదిలి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. అంతకు నెల క్రితమే పాలం ఎయిర్‌పోర్టు దగ్గర ఒక పశువుల దాణా చెక్కగదిలో ఆరు నెలలుగా నీళ్లు తాగి, వారానికొక బ్రెడ్‌ తిని బతుకుతున్న నా కోసం ఎన్నో ఇబ్బందులు పడి (వాళ్లేమీ సంపాదనపరులు కాదు) జియాసరైలో తమిళియన్‌ ఇంటి దగ్గర్లో ఓ గది ఏర్పాటు చేసారు.

ఇవన్నీ తల్చుకుంటూ అలా గతంలోకి వెళ్లిపోయాను. ఎంత వెనక్కంటే నేను నెలల పిల్లాడిగా వున్నప్పటి లేత మెమొరీని కూడా తాకినట్టు అనిపిస్తుంది. (ఈ మెమొరీలో నిజం ఎంతో! కాలం చేసిన కల్తీ ఎంతో!) అలాంటి ప్రయాణం ఎలా సాధ్యమో చాలా ఆశ్చర్యం ఇప్పటికీ!

వున్నట్టుండి విపరీతమైన బాధ మొదలయింది… ఒకటే బాధ! కళ్లల్లోంచి కొళాయిలో మాదిరి కన్నీళ్లు ధారలు ధారలుగా కారిపోతున్నాయి. ఇద్దరు మిత్రులు కంగారుపడి నన్ను అటూఇటూ కుదిపారు. నేను ఏం లేదని అలాగే కూచున్నాను. కాసేపటికి ఆ ఇంటెన్సివ్‌ పెయిన్‌ సడన్‌గా అంతే ఇంటెన్సివ్ ఆనందంగా మారిపోయింది. నాకయితే జస్ట్‌ లేబుల్‌ మారినట్టనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడయితే ఏ ఆలోచనా లేదు. వుట్టి ఆనందం! మాటలు అందుకోలేని ఆనందం. లేచి నిలబడ్డం మాత్రం ఇంకా నిన్న మొన్న జరిగినట్టే గుర్తుంది. ఆ అనుభవం మొదలయ్యాక నేను చేసిన మొదటి క్రియ లేచి నిలబడ్డం. అద్భుతం ఆ నిలబడ్డం! మొదటిసారి నిలబడినట్టు… పరిసరాలన్నీ నాతో పాటే లేచి నిలబడినట్టు… ఇప్పడు కూడా వొళ్లు పులకరిస్తోంది.

అప్పటికే కాదు, ఇప్పటికీ అనేక భ్రమలతో సాగిన, సాగుతున్న నా జీవితంలో ఆ ఎక్స్‌పీరియన్స్‌అంతా నా స్వీయకల్పనేనేమో అనే ఒక అనుమానం. కానీ ఆ అనుభవం నాకే కాకుండా నా పక్కవాళ్లని కూడా తాకిందే!

ఇక అక్కణ్ణించి నడక… ఆ నడకను వర్ణించడం అసాధ్యం. ప్రతి అడుగూ ఓ ఆనందపు మడుగు… నా చుట్టూ అడివి. నిజానికి అడివి చుట్టూ నేను… ప్రపంచమంతా నాలోనే వున్నట్టు… అసలు నేనే లేనట్టు… తమిళియన్‌ ఇంటి పక్కనే వున్న నా రూంకి చేరుకున్నాము. బెంగాలీ మిత్రుడు అప్పటికే వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా తమిళియన్‌ మిత్రుడు నన్ను నిద్రపోనివ్వలేదు. మా మధ్య ఉన్న గొడవలన్నిట్నీ పక్కన పెట్టేసి తన మొత్తం జీవితాన్ని చెబుతూ కన్‌ఫెస్‌ చేసుకుంటూ తెల్లారిందాకా అలా గడిపేశాడు. నేను ఆ మహా అనుభవాన్ని ఆస్వాదిస్తూ వూ కొడుతూ కూచున్నాను. ఆ వుదయమే మా తాత చనిపోయినట్టు కార్డుముక్క! పదిగంటలకు తమిళియన్‌ మిత్రుడు రైలెక్కించాడు.

అప్పటికే కాదు, ఇప్పటికీ అనేక భ్రమలతో సాగిన, సాగుతున్న నా జీవితంలో ఆ ఎక్స్‌పీరియన్స్‌అంతా నా స్వీయకల్పనేనేమో అనే ఒక అనుమానం. కానీ ఆ అనుభవం నాకే కాకుండా నా పక్కవాళ్లని కూడా తాకిందే!

బెంగాలీ మిత్రుడు పోతూపోతూ ‘నువ్వు దేవుడు లేడంటావు కానీ ఇదిగో దేవుణ్ణి నా కళ్లతో చూస్తున్నాను’ అని నా రెండు చేతుల్ని చాలాసేపు పట్టుకున్నాడే, నాలో ఏం కనపడిందో! అది ఎలా సాధ్యం? తమిళియన్‌ మిత్రుడు ఆ అనుభవాన్ని గురించి ఎంత వర్ణించేవాడో! ఎన్ని వుత్తరాలో!! దానికి గ్రీన్‌మెమొరీ అని పేరు కూడా పెట్టాడే!!!

సో ఆ అనుభవం నిజం అనుకుంటే నా పరిమిత బుద్ధితో దాన్ని ఇలా విశ్లేషిస్తాను.

అయితే అది పోతూపోతూ జీవితంలో అతి విలువైనవిగా భావించే చాలావాటిని చప్పగా మార్చిపోయింది. దాని సాంద్రత, తీవ్రత అలాంటిది!

సంక్లిష్టమైన మన మనసులోని ముడులు ఎప్పుడో… ఎందుకో విడిపోవడం… లేదా వదులవడం… లేదా లోతుల్లోకి ప్రయాణించడం… లేక మరేదో జరిగో… ఒక జీవానంద ఆవరణలోకి ప్రవేశిస్తాం. అప్పుడిక మనం వుండం. ఒక ఆనందాతిరేక అనుభవం తప్ప. దాన్ని మనుషులందరూ ఎప్పుడోసారి అనుభవిస్తూనే వుంటారు. బహుశా చాలాసార్లు గాఢనిద్రలో అది సంభవిస్తూండొచ్చు.

సో- మొత్తానికి ఆ అనుభవం అలా వచ్చి పోయింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా మళ్లీ రాలేదు. నేను సాధించింది కాదు కాబట్టి! అయితే అది పోతూపోతూ జీవితంలో అతి విలువైనవిగా భావించే చాలావాటిని చప్పగా మార్చిపోయింది. దాని సాంద్రత, తీవ్రత అలాంటిది!

చిత్రకారులైన అసలైన తాళం చెవి జ్ఞానం కాదు, అమాయకత్వం అని విశ్వసించే రమణ జీవి ప్రధానంగా  చిత్రకారులు. కథలు కూడా రాశారు. సంకలనం తెచ్చారు. నివాసం హైదరాబాద్.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article