Editorial

Monday, December 23, 2024
కథనాలుమట్టి పరిమళం మాండలికం - తెలిదేవర భానుమూర్తి

మట్టి పరిమళం మాండలికం – తెలిదేవర భానుమూర్తి

banumoorthi

తెలంగాణ మాండలికంలోనే ఎందుకు రాస్తున్నారు? అని చాలా మంది అడుగుతుంటారు. నేను ఊరోన్ని. మా ఊరివాళ్లతో మాండలికంలో మాట్లాడినప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయాల్ని చెప్పగలిగినప్పుడు ఇటు కవిత్వంలోనూ అటు కాలమ్ లోనూ ఎందుకు చెప్పలేనని అనుకున్నాను.

మాట నేర్చినప్పటి నుంచీ మాండలికంలో మాట్లాడుతున్నాను. చదువుకోవడం మూలంగా వ్యవహారిక భాష వంటబట్టింది. మధ్యలో నేర్చుకొన్న వ్యవహారిక భాషకంటే మొదట వచ్చిన మాండలికంలోనే చెబితే సహజంగా ఉంటుందనుకొన్నాను. తల్లి పాల కన్నా డబ్బాపాలు శ్రేష్టమైనవి కావు కదా! మబ్బులూ, కొండలూ, అడవులూ, సెలయేళ్ళు ఎంత సహజమైనవో తెలంగాణా మాండలికం కూడా అంత సహజమైనదే. కుహూ, కుహూ అనే వారు కావ్, కావ్ అంటే అసహజంగా ఉంటుంది. ఈ మధ్య ‘అందలం అందక కాళిక కదనం’ అనే హెడ్డింగుతో మమతా బెనర్జీ పై ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసమంతా వ్యవహారిక భాషలో ఉందని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. వ్యాసాన్ని చదివితే నువ్వు పరాయి భాషలో రాసినట్టు అనిపించింది అని ఒక మిత్రుడన్నాడు. మా ఊర్లో పసుల కాపరులు పాడే పాటలూ నాట్లు వేస్తూ కూలీలు పాడుకునే పాటలూ, బతుక‌మ్మ‌ పండుగ నాడు పాడే ఉయ్యాల పాటలూ, బాగోతాలు మాండలికంలోనే ఉన్నాయి. అవన్నీ మాండలికంలో రాయడానికి నన్ను ప్రేరేపించాయి.

తెలంగాణా జర్నలిస్టుల ఫోరం ( TJF) ఇరవై ఏళ్ల క్రితం తెచ్చిన ‘తెలంగాణ, మే 31, 2001’ పుస్తకంలోని రెండో వ్యాసం ఇది. మరి పదకొండు వ్యాసాలను కూడా ధారావాహికంగా ‘తెలుపు’ ప్రచురిస్తుంది. గమనించగలరు.

రేపటికి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్ళ నిండుతున్న సందర్భంగా ఈ వ్యాసాలు ద్విదశాబ్ది చరిత్ర గల ‘ఫోరం’ ఏర్పాటుకు గల ఆవశ్యకతను తెలుపడంతో పాటు, ఆ నాడే ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రభలమవుతున ఆకాంక్షను పాత్రికేయం లోకం ఎలా వ్యక్తం చేసిందో, ఎందుకు ఆయా అంశాలను బాధ్యతగాను నాటి సమాజం మందు పెట్టిందో నేటి తరం భేరీజు వేసుకోవడానికి కూడా ఉపకరిస్తాయి.

1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వచ్చింది. అప్పుడు నేను భువనగిరిలో పెన్నెండో తరగతి చదువుతున్నాను. విద్యార్థులంతా చదువుకు స్వస్తి చెప్పి ఉద్యమంలో దిగారు. మా ఊరి వాళ్లయిన కొందరు కవిమిత్రులు హైదరాబాద్లో చదువుకొంటున్నారు. ఉద్యమం కారణంగా వాళ్ళు కూడా భువనగిరి వచ్చారు. మా ఊరికి చెందిన రాజకీయ నాయకులు తరుచుగా పల్లెటూళ్లలో మీటింగులు పెట్టి ప్రత్యేక తెలంగాణా ఆవశ్యకత గూర్చి చెప్పేవారు. ఒకసారి జీపులోమా, మరోసారి సైకిళ్ళ మీదా పలెటూళ్లకు వెళ్ళేవాళ్లం. మా వంతుగా మేము గేయాలు రాసి ఆ మీటింగ్లో చదివేవాళ్ళం. రెండు కవితా సంకలనాల్ని కూడా భువనగిరి నుంచి తీసుకువచ్చాం. మీటింగులు లేనప్పుడు ఖిల్లా ఎక్కి సరదాగా ‘కృష్ణరాయబారం నాటకం ఆడేవాళ్ళం. మా నాటకానికి స్టేజిలేదు. ప్రేక్షకులు లేరు. మేకప్పుకూడా లేదు. కృష్ణరాయబారం అంటే ఏ పద్యనాటకమో అనుకోకండి. కృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళేటపుడు పాండవుల వద్దకు వస్తాడు.

అప్పుడు ధర్మరాజు “బావొచ్చిండు చాయ్ జేసి ఇయ్యే” అని ద్రౌపదితోని అంటాడు.
‘‘ఇంట్ల పాలొడ్సిపోయినై చాయెట్ల బెట్టుమంటవు” అని ద్రౌపది అంటుంది.

మనింట్ల పాలొడ్సి పోతయనే సంగతి మీ అన్నకు ఎర్కుండె బట్కెనే లీటరు పాలు దీస్కోని ఒచ్చిండు” అని ధర్మరాజు అంటాడు.

ఇలా సంభాషణలన్నీ తెలంగాణా మాండలికంలోనే నడిచేవి. ఒక్కొక్కళ్లం ఒక పాత్రలో ఒదిగిపోయి అప్పటికప్పుడు డైలాగులు చెప్పి నవ్వుకునే వాళ్ళం. పలాని ఊరిసర్పంచి ఇలా ఉపన్యసించాడంటూ ఒక మిత్రుడు మిమిక్రీ చేసేవాడు. ఇలాంటి అనుభవాలు కూడా తెలంగాణా మాండలికంలో రాయడానికి నాకు దోహదం చేశాయి.

కాలేజీలో చదువుకోవడానికి పట్నం వచ్చాను. కాలేజీలో చదివే కాలంలో పెట్టుకింద గూసోని, సుట్ట దాక్కుంట, అన్నా తమ్మీ అనుకుంట, కస్టంసుకం మాట్లాడుకునే టోల్లు అల్లు. ఊరోల్లు, ఉన్నోల్ల మోసాల కన్యాలమైనోల్లు అంటూ తెలంగాణ మాండలికంలో గేయాల్ని రాయడం ప్రారంభించాను. ‘అలా తెలంగాణ మాండలికంలో రాసిన గేయాలన్నీ ఊరోల్లు పేరన కవితా సంకలనంగా వెలుగు చూశాయి.

అవార్డుల కోసమో, సన్మానాల కోసమో కాలమ్ రాయడంలేదు. చెత్త రాజకీయాల్ని దుయ్యబట్టడానికి, తెలంగాణా మాండలిక మాధుర్యాన్ని నలుగురికి తెలియజెప్పడానికి రాస్తున్నాను. ఎవరేమన్నా, ఎందరు మొత్తుకున్నా, ఎన్ని విమర్శలు ఎదురైనా ఇక ముందు కూడా తెలంగాణా మాండలికంలోనే రాస్తాను.

జర్నలిస్టుగా మారిన తరువాత కాకతాళీయంగా ఉదయం దిన పత్రికలో కాలమ్ రాసే అవకాశం లభించింది. తెలంగాణ మాండలికంలో ‘పలుకుబడి’ని ప్రారంభించాను. పలుకుబడి రాజకీయ వ్యంగ్యం రచన అని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. తెలంగాణా మాండలికంలో రాయడంవల్ల తెలంగాణా ప్రాంతం వారికే తప్ప తక్కిన ప్రాంతాల వారికి అర్థం కాదనీ, ఆ కారణంగా వ్యవహారిక భాషలోనే కాలమ్ అయమని కొందరు సలహా ఇచ్చారు. వారి సలహాను నేను పాటించలేదు. ఏ హిందీలోనో, ఇంగ్లీషులోనూ నేను రాయడం లేదు. నేను తెలుగులోనే రాస్తున్నప్పుడు మన రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాల వారికి ఎందుకు అర్థం కాదు. సులభంగానో, కష్టంగానే తెలంగాణా మాండలికం తక్కిన ప్రాంతాల వారికి అర్థమై తీరుతుంది. నా నమ్మకం వమ్ము కాలేదు. తెలంగాణా మాండలికం మాండలికం పరిధుల్ని అధిగమించింది. ఆంధ్రుల అభిమానాన్ని కూడా పొందింది. అందరికీ తెలుసున్న రాజకీయాలను వ్యంగ్యంగా చెప్పడంవల్ల తెలంగాణా మాండలికానికి అందరి ఆదరణా లభించింది.

మాండలికంలో రాసినా చిన్న చిన్న వాక్యాలతో రాస్తే జనానికి సులభంగా అర్థమవుతుంది. చాంతాండంత వాక్యాలు రాస్తే మాండలి కేతరులకు విసుగు కలుగుతుంది. కధలు రాయకుండా కేవలం రాజకీయాల గురించే రాయడానికి ప్రాధాన్యమిస్తున్నావు? అని కొందరు విమర్శించారు. కాలమ్ లో రాజకీయ నాయకుల అసలు పేర్లకు బదులు వేరే పేర్లు రాస్తే అవి వ్యంగ్య కధలుగా మారవా? మహాభారతమంతా రాజకీయాల మయమే అయినప్పుడు రాజకీయాల గూర్చి నేను రాస్తే వాళ్లలో ఒకడిగా మెలిగితేనే మాండలికం వంటబడుతుంది. ఉద్యోగ రీత్యా నేను తిరుపతిలో నాలుగేళ్ళు ఉన్నాను. నాతో తెలంగాణా మాండలికంలో మాట్లాడే వారెవరూ లేరు. ఆ కాలంలో పలుకుబడి రాసేటప్పుడు కొంచెం తడుముకోవలసి వచ్చింది.

ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత – మాండలిక ప్రభావం పూర్తిగా కాకున్నా కొద్దిగానైనా మన మీద పడుతుంది. కానీ తెలంగాణా వారి విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వాస్తవానికి తెలంగాణా మాండలికంలోనే మాట్లాడాలి.

తిరుపతిలో ఉన్నప్పుడే ఆ వాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి పై కాలమ్ రాసి పంపితే ఏ కారణం వల్లనో ప్రచురించలేదు. ఆ కాలము ఎందుకు ఆపారో నాకు తెలియదు. ఆ ఒక్కసారి తప్ప ఎన్నడూ నేను రాసిన కాలమ్ ప్రచురణకు నోచుకోకుండా ఉండలేదు. కాలమ్ ఇలా రాయి. ఫలానా వారి పైనే రాయి అంటూ ఇంతవరకూ ఏ సంపాదకుడు నా పై ఆంక్షలు విధించలేదు. నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. మా జిల్లాలో వొస్తుండు అంటే నిజామాబాద్ జిల్లాలో అస్తుండు అంటారు. మేము వాన అంటే అక్కడ ఆన అని అంటారు. వంకాయలను అంకాయలంటారు. పాన్ డబ్బను కోక అంటారు. నేను నిజామాబాద్లో మూడేళ్ళు పని చేశాను. ఆ కాలంలో కాలమ్ రాసినప్పుడు ఇలాంటి మాండలిక పదాలు అప్ర‌యత్నంగా కాల‌మ్‌లోకి వచ్చిచేరేవి. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత – మాండలిక ప్రభావం పూర్తిగా కాకున్నా కొద్దిగానైనా మన మీద పడుతుంది. కానీ తెలంగాణా వారి విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వాస్తవానికి తెలంగాణా మాండలికంలోనే మాట్లాడాలి.

కానీ తెలంగాణా ప్రాంతం వారు ఇతర ప్రాంతాల వారి యాసను అనుకరిస్తున్నారు. పాలకుల భాషలోనే మాట్లాడటానికి యత్నిస్తున్నారు. ప్రచార సాధనాల ప్రభావానికి లోనై తెలంగాణా మాండలికం అనాగరికమైనదనే దురభిప్రాయంతో ఉంటున్నారు. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొందరు మంత్రులు డిన్నర్కు ఆహ్వానించారు. ప్రతిపక్షానికి చెందిన వారు సన్మానం చేస్తామని కబురు పంపారు. కానీ ఎవరు పిలిచినా నేను వెళ్లలేదు. అవార్డుల కోసమో, సన్మానాల కోసమో కాలమ్ రాయడంలేదు. చెత్త రాజకీయాల్ని దుయ్యబట్టడానికి, తెలంగాణా మాండలిక మాధుర్యాన్ని నలుగురికి తెలియజెప్పడానికి రాస్తున్నాను. ఎవరేమన్నా, ఎందరు మొత్తుకున్నా, ఎన్ని విమర్శలు ఎదురైనా ఇక ముందు కూడా తెలంగాణా మాండలికంలోనే రాస్తాను.

తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక పుస్తకం  సంపాద‌కీయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మన ప్రతాపరెడ్డికి వందనాలు- కె. శ్రీనివాస్ వ్యాసం కోసం దీన్ని క్లిక్ చేయండి

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article