Editorial

Tuesday, December 3, 2024
ఆరోగ్యంఅన్నం తెలుపు - గన్నమరాజు గిరిజామనోహరబాబు

అన్నం తెలుపు – గన్నమరాజు గిరిజామనోహరబాబు

నేటి ఆధ్యాత్మికం ఆరోగ్యం గురించి. అన్నం గురించి. అవును. అన్నం రూపంలో తీసుకునే ఆహారం మనిషి మనుగడకు ఎంత కీలకమో చదవి తెలుసుకోండి.

గన్నమరాజు గిరిజామనోహరబాబు

‘‘ఆయుః సత్త్వ బలారోగ్య సుఖప్రీతి విర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్విక ప్రియాః ॥’’

ఆహారాన్ని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో  చెప్పిన మాటలు ఇవి. ‘‘ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః’’ అని మూడు విధములైన ఆహార పద్ధతులను ప్రత్యేకంగా బోధించడంలోనే దాని ప్రాముఖ్యం తెలుస్తున్నది. మానవ జీవితంలో ఆహారానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. అన్నం రూపంలో తీసుకునే ఆహారం మనిషి మనుగడకు కారణం. పుట్టిన ప్రతిప్రాణికీ జీవించడానికి ఆహారం కావలసిందే. అయితే ఆహారాల కారణంగా కూడా కొన్ని కొన్ని గుణాలు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఆహార స్వీకరానికి కూడా మనవాళ్ళు అనేక నియమాలు పాటించాలని చెప్పారు. వైద్యశాస్త్రాలు, పురాణేతిహాసాల్లో కూడా ఆహార విహారాదుల ప్రసక్తి సందర్భానుసారంగా కనబడుతుంది. అదే విషయం మనకు భగవద్గీత కూడా చెప్పింది.

మన సనాతన ధర్మం తినే ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించింది. ఎప్పుడు కూడా ఆహారాన్ని  వృధా చెయ్యడం కాని, సరైన రీతిలో ఉపయోగింపకపోవడం వల్ల కాని అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

మన సనాతన ధర్మం తినే ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించింది. ఎప్పుడు కూడా ఆహారాన్ని  వృధా చెయ్యడం కాని, సరైన రీతిలో ఉపయోగింపకపోవడం వల్ల కాని అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. దాన్ని భగవత్సరూపంగా భావించినప్పుడు మిక్కిలి భక్తిశ్రద్ధలతో దాని వినియోగం జరుపుతాము.

మానవాళికి జీవితం నిలబెట్టే ఆహారాన్ని గురించి స్వామి అర్జునునితో చెబుతూ ‘‘అర్జునా! ఆయువును, సత్యాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని రెండింతలు చేయగలిగేవి, రసపూర్ణమైనవి, స్నిగ్ధము, స్థిరము అయినవి మాత్రమే సాత్వికులకు ఇష్టం కలిగించే ఆహారాలు. అవే వారికి అత్యంత ప్రియమైనవి కూడా’’ అన్నాడు. వీటిని సాత్విక ఆహారాలుగా పేర్కొనవచ్చు. ఈ ఆహారం పదివిధాల మేలు చేస్తుందన్నది శ్లోకం ద్వారా తెలుస్తున్నది.

ఇటువంటి ఆహార లక్షణాలు ఒకే పదార్థంలోనే లభించవచ్చు. కొన్ని పదార్థాల ద్వారా లభించవచ్చు. సాత్విక భావాలను పెంపొందింపజేసే ఇటువంటి ఆహారాన్నే మనం స్వీకరించాలి.

భగవద్గీత ప్రవచించిన మూడు విధాలైన ఆహారాలలో రెండో రాజాసాహారం…

‘‘కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ।
ఆహారా రాజ సస్యేష్టా దుఃఖ శోకామయప్రదాః ॥’’

ఇందులో ఏడు అంశాలు చోటుచేసుకున్నాయి. ‘‘అర్జునా! చేదు, పులుపు, ఉప్పు, మిక్కిలి వేడి, కారము, రసహీనము, దాహం కలిగించే పదార్థాలు రాజసగుణం కలిగినవారికి ప్రియమైన ఆహారాలు’’ అనడం రాజస ఆహారాన్ని గురించి చెప్పినట్లైంది. ఈ ఏడింటిలో నాల్గవదైన ‘‘అత్యుష్ణమనే పదంలో ఉన్న‘అతి’ అన్నింటికీ కూడా వర్తింపజేసుకోవచ్చు.

సాత్వికాహారం యోగమయమైనదైతే రాజసాహారం రోగమయమైనదని చెప్పుకోవచ్చు. మానవుని శరీరానికి ‘అతి’గా ఏది అందించినా అది అతని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ఈ ఆహార ప్రియులైనవారు సాత్వికాహార ప్రియులైన వారివలె సాత్విక స్వభావం కలవారు కాదు, వీళ్ళలో రాజసం అనే గుణం ఎక్కువగా ఉంటుంది. సాత్వికాహారం యోగమయమైనదైతే రాజసాహారం రోగమయమైనదని చెప్పుకోవచ్చు. మానవుని శరీరానికి ‘అతి’గా ఏది అందించినా అది అతని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ మందగించే ప్రమాదం ఉంది. ఉదర సంబంధమైన వ్యాధులకు లోను కావలసి వస్తుంది. ఈ లక్షణాలు మనిషి మనస్సుపై కూడా ప్రభావం చూపుతాయి. ప్రశాంతతకు, ఆధ్యాత్మిక సాధనకు అనారోగ్యం అడ్డువచ్చే అవకాశాలెక్కువ. ఒక్కోసారి వయసులో ఉన్నప్పుడు బాధలు తెలియకపోయినా వృద్ధాప్యంలో మాత్రం అనేక విధాల ఇబ్బందులు పెడతాయి. అందువల్ల శరీరం వణికిపోవడం, కాళ్ళు చేతులు స్వాధీనం తప్పడం, ఇటువంటి అనేక రుగ్మతలను మనిషికి కలిగిస్తాయి. అందుకని ఈ రాజసాహారపు అలవాట్ల నుండి దూరంగా ఉంటే రక్షణ కలుగుతుంది. మానసిక స్వస్థత లభిస్తుంది.

మనం పూర్తిగా పరిహరింపవలసిన తామసాహారం గురించి కూడా కృష్ణభగవానుడు

‘‘యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్‌ ।
ఉచ్ఛిష్ట మపిచామేధ్యం భోజనం తామస ప్రియమ్‌ ॥’’

అని బోధించాడు. ‘‘అర్జునా! తామసగుణం కలిగినవారు, పక్వం కాని ఆహారం, రసహీనమైన ఆహారం, దుర్గంధపూరితమైన ఆహారం, పాసిపోయిన ఆహారం, ఇతరులు ఎంగిలిచేసిన ఆహారం, అశుద్ధమైన ఆహారం తామస్వాహా ప్రియులు ఇష్టపడే ఆహారం’’ అంటూ వివరించాడు. రాజసాహారంలో ఏడు విధాలుంటే ఇందులో ఆరు విధాలు కనిపిస్తున్నాయి. ఈ ఆరు కూడా మనిషికి అనారోగ్యహేతువులే. ఇటువంటి అనుచిత ఆహారానికి దూరంగా ఉండాలని అర్జునుని నెపంతో స్వామి లోకానికి బోధిస్తున్నాడు.

ఎటువంటి మహాత్కార్యం చేసి విజయం సాధించాలన్నా శరీరం ముఖ్యం. శరీరారోగ్యానికి ఆహారం ముఖ్యం. అందుకే ప్రతి వ్యక్తి ఆహారాల్లోని ఈ బేధాలు గమనించి ఆహార స్వీకారం చెయ్యడం వల్ల సర్వ అనర్థాలకూ దూరమవుతాడు.

ఎటువంటి మహాత్కార్యం చేసి విజయం సాధించాలన్నా శరీరం ముఖ్యం. శరీరారోగ్యానికి ఆహారం ముఖ్యం. అందుకే ప్రతి వ్యక్తి ఆహారాల్లోని ఈ బేధాలు గమనించి ఆహార స్వీకారం చెయ్యడం వల్ల సర్వ అనర్థాలకూ దూరమవుతాడు. మానసికంగా, శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యవంతులైనప్పుడే అన్ని సాధనలు సాధ్యమౌతాయి. దానికి ‘అన్నం’ ప్రధానం కనుక అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భారతీయులు గౌరవించారు.

More articles

2 COMMENTS

  1. అన్నం గురించి
    సాహితీ పండితులు శ్రీ.గిరిజా మనోహర్ బాబు గారు
    చక్కగా వివరించారు.
    ఇలాంటి శ్లోకాలలో దాగిఉన్న గొప్పవిషయాలు సామాన్యులకు అందక పోవడం బాధాకరం.
    గిరిజా మనోహర్ బాబు గారికి కృతజ్ఞతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article