రఘుభీర్ సింగ్ చిత్రాల్లో బాగా గుర్తుండిపోయే చిత్రం ఇది. రాజస్థాన్‌లోని హతోడ్ అన్న గ్రామంలో, 1975లో- ఒక మిట్ట మధ్యాహ్నం హాయిగా ఊయ్యాల లూగుతున్న పిల్లల్ని ఇలా అపూర్వంగా చిత్రించారాయన.
కందుకూరి రమేష్ బాబు
ఉష్ణమండలంలోని భారతీయ ఆత్మ ఎట్లా వెలుగులు విరజిమ్ముతూ ఉన్నదో, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనాగానీ, శాంతంగా జీవిస్తూ ఉన్నదో చెప్పాలంటే భారతీయ ఫొటోగ్రాఫర్లలో అది రఘుభీర్ సింగ్ ఛాయా చిత్రాలతోనే చూపాలి. అదీ ఆయన ప్రత్యేకత. మన దేశ జీవన వాస్తవికతను ఆధునికతకు గురైనా ఆయా స్థలకాలాదుల్లో సంస్కృతీ సంప్రదాయాలు రూపు మాసిపోని విధానాన్ని ఉదాహరణ పూర్వకంగా చెప్పాలంటే ఆయన తీసిన చిత్రాలను కొన్నింటిని చూడవలసిందే.
అన్నిటికీ మించి నది నాగరికతను చెబుతుందని గ్రహించి, ఛాయాచిత్రాలు చేసిన మహత్తర ఛాయా చిత్రకారుడాయన. జైపూర్‌లో జన్మించినందువల్ల కావచ్చు, ఆయనకు భారతదేశం అంటే రంగుల మయం. రంగు లేకుండా ఆయన చిత్రాలని ఊహించుకోలేం. అంతటి వర్ణ ప్రేమికుడాయన.
వారి చిత్రాల్లో బాగా గుర్తుండిపోయే చిత్రం ఇది. రాజస్థాన్‌లోని హతోడ్ అన్న గ్రామంలో, 1975లో- ఒక మిట్ట మధ్యాహ్నం హాయిగా ఊయ్యాల లూగుతున్న పిల్లల్ని ఇలా అపూర్వంగా చిత్రించారాయన.
తన చిత్రం చాలా సామాన్యంగా ఉంటుంది. కానీ లో-వెలుపల్ని కలుపుతుంది. ఏదీ తాను నాటకీయం చేయరు. ఉన్నది ఉన్నట్టే చిత్రిస్తారు. కానీ, ఆయన కన్ను పెద్దది. విశాలమైన జీవితాన్ని ఒకే ఒక ఫ్రేంలో నిక్షిప్తం చేసి జీవన గాంభీర్యాన్ని అర్థం చేయిస్తరు. దేన్ని తీసినా, అంటీ ముట్టనట్టు అనిపిస్తుందిగానీ, అందులో అన్నింటికీ ఆయన సమ ప్రాధాన్యం ఇవ్వడం విశిష్టత. వారి పుస్తకాల్లో రివర్ ఆఫ్ ఇండియా, గంగాః సాక్రెడ్ రివర్ ఆఫ్ ఇండియా సుప్రసిద్ధం. ముంబై, తమిళనాడు, బెనారస్, కోల్‌కతలపై వారు వెలువరించిన పుస్తకాలు ఈ దేశ వైవిధ్యాన్ని, మహత్యాన్ని అపూర్వంగా ఆవిష్కరిస్తయి. కుంభమేళ చిత్రాలకు కూడా ఆయన ప్రసిద్ధి.
యాభై ఐదవ ఏట రఘుభీర్ సింగ్ కన్నుమూసినప్పటికీ ఫొటోగ్రఫీలో ఆయన తెరిచిన ద్వారాలు భారతీయ ఫొటోగ్రాఫర్లకే కాదు, ప్రపంచ ఛాయాచిత్రకారులకూ ఆదర్శం. ఆయన మరణానంతరం వెలువడిన వే టు ఇండియా ఫొటోగ్రాఫర్‌గా ఆయన పరిణతికి, పరిణామ వికాసానికి నిదర్శనం.
ఫొటోగ్రఫీని స్వయంగా నేర్చుకున్న ఆయన ఇండియాలో జన్మించినప్పటికీ పారిస్, లండన్, న్యూయార్క్‌ల్లో నివసించారు. 1970వ దశకంలో కలర్ ఫొటోగ్రఫీని వాడిన తొలి భారతీయ ఫోటోగ్రాఫర్లలో ఆయన ముఖ్యులు.
ఒక రకంగా మన దగ్గర కలర్ ఫొటోగ్రఫీకి పయోనీర్ అంతటి వారైన రఘుభీర్ సింగ్ (Raghubir Singh) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి గొప్పతనం చెప్పే ఒక్క ఈ చిత్రాన్ని చూసి మురవండి. వీలైతే ఇంటర్నెట్‌లో ఆయన చిత్రాలు వెతికి చూడండి.