Editorial

Monday, December 23, 2024
ఆరోగ్యంలోకం మెచ్చిన దొమ్మర వైద్యం - జయధీర్ తిరుమలరావు తెలుపు

లోకం మెచ్చిన దొమ్మర వైద్యం – జయధీర్ తిరుమలరావు తెలుపు

Line drawing by CHITRA

అవసరానికి మించి ఆధునిక ఔషధాలు బహుళజాతి కంపెనీల లాభాలకోసం ఈ నేలమీద తిష్టవేస్తాయి. కానీ, ఇక్కడి తరతరాల స్థానిక, ప్రాంతీయ, దేశీ ఔషధాలు మాత్రం పనికిరానివయ్యాయి అని విచారం వ్యక్తం చేస్తారు జయధీర్ తిరుమలరావు.

నిజానికి అనేక ఆధునిక వైద్య రీతులకు దేశీయ మూలాలు ఉన్నాయంటూ ప్రత్యేకంగా దోమ్మరుల వైద్య విధానం గురించి ఈ వ్యాసంలో విలువైన సమాచారం పంచుకున్నారు అంతేకాదు, వందేళ్ళ కిందట బ్రిటిష్ వారు దొమ్మరుల వైద్యవిధానంలో వాడే పరికరాల్ని సేకరించి లండన్ ప్రదర్శనశాలలో ఉంచిన విషయాన్ని కూడా నేటి కరోనా కాలంలో వారు తిరిగి గుర్తుచేస్తున్నారు.

భారతదేశంలోని పౌరుల శరీరాలలోకి ప్రతిరోజు వందల టన్నుల విదేశీ మందులు సరఫరా అవుతున్నాయి. వందలకోట్ల విలువచేసే ఈ విదేశీ మందులు చాలావరకు రసాయన పదార్థాలుగానే చేరుతున్నాయి. నిజానికి ఈ మందులు ముందు పరీక్షింపబడిన తరువాతే అవసరం కోసం వాడబడుతున్నాయా అనేది పెద్ద ప్రశ్న. విదేశీయులకోసం రూపొందించిన ఔషధాలు ఖండాలు, దేశాలు, శీతోష్ణస్థితులు దాటి, ఆహార అంతరాల్ని జయించి ఎలా, ఎంతమేరకు పనిచేస్తాయని ఆలోచిస్తున్నామా? ఔషధ పరిశోధకులెవరూ ప్రజలకు ఈ విషయం వివరించి చెప్పరు. విదేశాల్లో నిషేధించిన వందలాది మందులు ఇక్కడ మార్కెట్‌ చేయబడతాయి. వీటిని నియంత్రించే వారే లేరు. అవసరానికి మించి – ఆధునిక ఔషధాలు బహుళజాతి కంపెనీల లాభాలకోసం ఈ నేలమీద తిష్టవేస్తాయి. ఇక్కడి తరతరాల స్థానిక, ప్రాంతీయ, దేశీ ఔషధాలు మాత్రం పనికిరానివయ్యాయి. వాటిని మనం దూరం కొట్టాం. కానీ ఆ కంపెనీలు ఇప్పటికీ ఇక్కడి మూలికల్ని, మందుల్ని, వైద్య విధానాలను పరిశీలించి తీసుకెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నాం.

మనం రోడ్లమీద చూసే దొమ్మరి వాళ్ళ వైద్య విజ్ఞానాన్ని ఇంగ్లండ్‌ లోని ఆక్స్ఫర్డ్‌ లో గల ఒక మ్యూజియంలో దాచి ఉంచారు

సుమారు ఎనభై ఏళ్ళ కిందటి ‘ఆంధ్ర భారతి’ పత్రికలో ఈ విషయం స్పష్టంగానే రాశారు. ఇప్పుడు మేధావులే కాదు. పేటెంట్లు కూడా వలసపోవడం చూస్తూ ఆపలేని, చేతగాని తనంలో ఉన్నాం. దీన్ని శాసిస్తున్న రాజకీయ శక్తుల పడగ నీడలో బతుకుతున్నాం.

మనం రోడ్లమీద చూసే దొమ్మరి వాళ్ళ వైద్య విజ్ఞానాన్ని ఇంగ్లండ్‌ లోని ఆక్స్ఫర్డ్‌ లో గల ఒక మ్యూజియంలో దాచి ఉంచారు. మీర్జాపురం తదితర ప్రాంతాలనుండి తీసుకుపోయిన రంధ్రాలు గల ఆవు కొమ్ములు, దుప్పి కొమ్ములతో చేయబడిన‘అచూషణ’ పరికరాలు అక్కడ భద్రంగా ఉన్నాయని కోన సీతారామారావు అనే అతను రాసిన వ్యాసంలో తెలిపాడు.

దొమ్మరులు సంచారులు. దక్కనులో, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో దొమ్మరులు ఉన్నారు. విజయనగర రాజుల కాలంలో వేయించిన చాలా శాసనాలలో మొదటిసారి దొమ్మరుల ప్రస్తావన ఉందని సుప్రసిద్ధ శాసన పరిశోధకులు ఆచార్య ఎస్‌.ఎస్‌. రామచంద్రమూర్తి గారు మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థలోని ‘‘విశిష్ట తెలుగు భాషా కేంద్రం’’ వారు నిర్వహించిన సదస్సులో తెలిపారు.

క్రీ.శ. 1557 లో వేసిన కన్నమేడి శాసనంలో విప్ర వినోదులు, దొమ్మరులు తమ ఆదాయంలో కొంత భాగం దానంగా ఇచ్చారని శాసనాల ద్వారా తెలుస్తుంది. కృష్ణదేవరాయల కాలంలో ఇలాంటి అడుగు వర్గాల జాతులవారికి సమాజంలో గుర్తింపు పెరిగింది. లోగడ వీర శైవం వెలుగొందిన కాలంలోనే వీరి ఆవిర్భావం జరిగి రాయలకాలంలో సాహిత్యంలో, శాసన పాఠ్యాల్లో వీరి ప్రసక్తి ఎక్కువగా కనుపిసుంది. మెకంజీ కైఫియత్తులు, ఇతర లిఖిత ఆధారాలలో కూడా వీరి వివరాలు కొన్ని ఉన్నాయి.

వీరు తమ వైద్య విధానాన్ని తామే రూపొందించుకున్నారు. వీరు ఇతరులచే వైద్యం చేయించుకోరు. సంచార జీవులు కాబట్టి తమలోనే ఒకరు వంశపారంపర్యంగా వైద్యాన్ని చేబట్టి అందులో నిష్ణాతులవుతారు.

దొమ్మర స్త్రీలు సంచారం చేస్తూనే చాపలు, బుట్టలు అల్లుతారు. పురుషులతో సమానంగా సాహస క్రీడలు చేస్తారు. శారీరక విన్యాసాలు చేయడంలో దొమ్మర స్త్రీలు ప్రతిభావంతులు. రెండు గెడల మధ్య తాడుమీద బేలన్స్‌ చేస్తూ నడవడం వీరి ప్రత్యేకత.

1801 లో వెంకటగిరి సంస్థానంలో ‘‘దొమ్మర తఫీరమ్‌’పేర పన్ను విధించారు. దొమ్మరలు ప్రజలను వినోద పరుస్తూ ఆటలు ఆడి సంపాదించిన దానిలో కొంతభాగం గ్రామాధికారులకి చెల్లించేవారు. తమిళనాడులోని మధుర జిల్లాలో జమీందారీ గ్రామాలలో జమీందారీ బిడ్లం అని వీరు చెప్పుకొనేవారు.

దొమ్మర స్త్రీ, పురుషులు పిల్లలతో కలిసి వెళ్ళి వేటాడుతారు. దొమ్మరులలో ఆనాడు కొంతమంది దొంగతనాలకు కూడా పాల్పడేవారు. దొమ్మరులకు ముత్తిలి గురువు అనే కుల పెద్ద ఉంటాడు. వందేళ్ళ క్రితం కడప జిల్లాలోని చిట్వెలు ఊరిలో ఈ పెద్ద ఉండేవాడు. చిట్వేలు గ్రామానికే గతంలో ‘ముత్తి’ అనే పేరు ఉండేది.

తమ చుట్టూ ఉండే జంతువుల శరీర భాగాలనే వైద్యానికి ఉపయోగిస్తారు. నక్క కొమ్మును ఎప్పుడూ తమ వద్ద ఉంచుకుంటారు. దీన్ని కలిగి ఉన్నవాడు వారి వెద్యుడు.

దొమ్మరులు నిత్య మాంసాహారులు. పశువులు, జంతువుల చుట్టూ వీరి ఆహారం ఆధారపడి ఉంటుంది. అందుకే తమ వైద్యంలో కూడా జంతు సంబంధితమైన వాటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. వీరు తమ వైద్య విధానాన్ని తామే రూపొందించుకున్నారు. వీరు ఇతరులచే వైద్యం చేయించుకోరు. సంచార జీవులు కాబట్టి తమలోనే ఒకరు వంశపారంపర్యంగా వైద్యాన్ని చేబట్టి అందులో నిష్ణాతులవుతారు. వీరి వైద్యం గురించి ఏ గ్రంథం లోనూ, ఎక్కడా రాసిలేదు.తమ వైద్య విధానం అంతా మౌఖికమే.

తమ చుట్టూ ఉండే జంతువుల శరీర భాగాలనే వైద్యానికి ఉపయోగిస్తారు. నక్క కొమ్మును ఎప్పుడూ తమ వద్ద ఉంచుకుంటారు. దీన్ని కలిగి ఉన్నవాడు వారి వెద్యుడు. నక్క పాదాలు లేదా గోళ్ళను వైద్యుడు తన సంచిలో దాచి ఉంచుకుంటాడు. వేరెవరైనా ‘మందు’ కోసం వస్తే వీటిని చూపుతాడు. అన్ని నక్కలకు కొమ్ములు ఉండవు. కాని ప్రత్యేకమైన ఒక నక్క జాతికి మాత్రమే ఉంటాయని అంటారు.

ఒక గాజు ముక్కతో నొప్పి ఉన్నచోట గాయం చేస్తారు. గాజు ముక్కతోనే ఎందుకు గాయం చేస్తారు? అని అడిగితే ఇనుప కత్తిలా అది సెప్టిక్‌ కాదు కదా అన్నారు.

కీళ్ళ నొప్పులు, వాయు నొప్పులు, తేలు, పాము కాటులకు, పిచ్చి కుక్క కాటు, గుండె నొప్పులకు దొమ్మర వైద్యం బాగా పనిచేస్తుందని జనం అంటారు.

కీళ్ళనొప్పులకు, వాయు నొప్పులకు వీరి వైద్యం ఎంతో విలక్షణంగా కనుపిస్తుంది. ఈ వైద్యానికి వారు ‘అచూషణ పాత్ర’ ఒకదానిని ఉపయోగిస్తారు. కీళ్ళనొప్పి ఉన్నచోట ఒక గిన్నెను కరిపించి నెత్తురు పైకి లాగే పద్ధతి అవలంబిస్తారు. ఒక గాజు ముక్కతో నొప్పి ఉన్నచోట గాయం చేస్తారు. గాజు ముక్కతోనే ఎందుకు గాయం చేస్తారు? అని అడిగితే ఇనుప కత్తిలా అది సెప్టిక్‌ కాదు కదా అన్నారు. గాటు వేసినచోట నీటితో శుభ్రంగా కడుగుతారు. ఆవు కొమ్మునో, దుప్పి కొమ్మునో తెచ్చి దాని చివరి మొన దగ్గర చిన్నగా కోసి చివరన రంధ్రం చేస్తారు. తరువాత ఆ రంధ్రాన్ని మైనంతో పూడుస్తారు. సూదితో మైనం వద్ద చిన్న రంధ్రం చేస్తారు. నొప్పి ఉన్నచోట దాన్ని ఉంచి కొమ్ములోని గాలిని బెజ్జంలోకి పంపుతారు. తరువాత తిరిగి ఆ గాలిని నోటితో పీల్చివేస్తారు. తిరిగి తిరిగి అలా చేస్తారు. నడుము నొప్పులకు రెండుమూడు కొమ్ము బూరలను ఉపయోగించి వైద్యం చేస్తారు.

ఏ చెట్టు ముల్లు గుచ్చుకుంటే, ఆ చెట్టు ఆకుల పసరు తీసి గుచ్చుకున్నచోట ఒక పద్ధతి ప్రకారం రుద్దితే ముల్లు గుచ్చుకున్న సలుపు పోతుందని డెబ్బై ఏళ్ళ వయసు గల ఈడ్పుల నరసింహం (ఖమ్మం) చెప్పాడు

బ్రిటిష్ వారు ఈ కొమ్ము బూరల్ని సేకరించి ఇంగ్లండ్‌ లోని బ్రిటిష్ లైబ్రరీ ప్రదర్శనశాలలో ఉంచారు. ఇంగ్లీషు వాళ్ళు ఒకప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించి వైద్యం చేసేవారట . సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత కూడా ఇదే ‘టెక్నిక్‌’ని ఆధారం చేసుకుని చికిత్స చేసేవారు. అనేక మూలికలను కలిపి తయారుచేసిన మాత్ర లేదా నల్లరాయి చనుబాలతో గాని, పాలతీగె రసంలో కాని అరగదీసి తేలు కాటువేసిన చోట కట్టు కడతారు. కొంత సేపటికి నల్లరాయి విషాన్ని పీల్చుకుని కిందపడిపోతుంది.

పిచ్చి కుక్క కరిస్తే తెల్ల మేక పాలు, మిరియాలు, వెల్లుల్లి మొదలైన వాటితో ఒక వేరుని నూరి రసం తీసి మందు తయారుచేస్తారు. ఈ వేరు పేరు మాత్రం రహస్యం.

ఊరూరా తిరిగే వీళ్ళు పాదరక్షలు ఉపయోగించరు. కాళ్ళలో ముల్లులు గుచ్చుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో సహజం. ఏ చెట్టు ముల్లు గుచ్చుకుంటే, ఆ చెట్టు ఆకుల పసరు తీసి గుచ్చుకున్నచోట ఒక పద్ధతి ప్రకారం రుద్దితే ముల్లు గుచ్చుకున్న సలుపు పోతుందని డెబ్బై ఏళ్ళ వయసు గల ఈడ్పుల నరసింహం (ఖమ్మం) చెప్పాడు

కొన్ని కీళ్ళనొప్పులకు, వాతాలకు ముందు ఒక ఆకు పసరు రాస్తారు. నూనె గుడ్డను బిగించి చుట్టిన చుట్టకి నిప్పు అంటించి ఆకు పసరు రాసినచోట నొప్పి మాయం అవుతుందని అతని భార్య ఈడ్పుల సరోజనమ్మ చెప్పింది.

ఉబ్బసపు దగ్గుకు తెల్లజిల్లేడు పువ్వులు తెచ్చి ఎండబెడతాం . వాటిని పొడిచేసి తేనె, వెన్న కలిపి రోజుకి మూడుసార్లు నాకిస్తాను. ఉబ్బసం ఇంటిదారి పడుందని దొమ్మర వైద్యుడు నారసపురం నరసింహం ధీమాగా చెప్పాడు.

మనం మనని విస్మరించే దిశలో కోల్పోతున్న జ్ఞానం ఎంతో తెలియని అజ్ఞాన సమాజంలో జీవిస్తున్నాం.

వందేళ్ళ కిందే అంతర్జాతీయ గుర్తింపు పొందిన దొమ్మర వైద్యానికి పేటెంటు హక్కు వర్తిస్తుంది. దేశీయమైన ఎన్నెన్ని వైద్య విధానాలను కాజేసి ఎవరెవరు దొంగ పేటెంటు గుర్తింపులు పొందుతున్నారో లెక్క ఉందా. ముప్పొద్దుల దేశభక్తి పాట పాడేవాళ్ళు కూడా ఈ రంగంపై దృష్టి సారించకపోవడం బాధాకరం.

దేశమంతటా ఇలా ఎన్ని రకాల సజీవ వైద్య రీతులు ఉన్నాయో అనే లెక్క తీయ లేదు.

సంప్రదాయ వైద్య పద్ధతులను మూఢ విశ్వాసాలనో, అనాగరికాలనో కొట్టి వేసి – బయటి నుంచి వచ్చే బడా కంపెనీలకు తలుపులు బార్లా తెరిచే వ్యాపార సంస్కృతిలో మునిగిపోయి ఉన్నాం. తరతరాల జ్ఞానాన్ని తిరస్కరించే తిరకాసు విజ్ఞానం మన సొంతం.

మనం మనని విస్మరించే దిశలో కోల్పోతున్న జ్ఞానం ఎంతో తెలియని అజ్ఞాన సమాజంలో జీవిస్తున్నాం.

జయధీర్ తిరుమలరావు గారి గురించి పరిచయం అక్కరలేదు. వారు ప్రజల తొవ్వ ముచ్చట. జానపద ఆదివాసీల సంగీత సాహిత్య కళా రూపాల తాళపత్రం, వినిపించే వాయిద్యం, తలలో  నాలిక.  29 ఏప్రిల్‌ 2012 లో అచ్చయిన ఈ విలువైన వ్యాసం ‘తొవ్వ ముచ్చట్లు’ మొదటి భాగం (2013)లోనూ గ్రంధస్థం అయింది.  నేటి సందర్భంలో తెలుపు మరో సారి పంచుకుంటోంది. 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article