Editorial

Wednesday, January 22, 2025
ARTSINDIAN PHOTO FESTIVAL 2021 : హిమాలయాలు తెలుపు – నేడు సత్యప్రసాద్ యాచేంద్ర ప్రసంగం

INDIAN PHOTO FESTIVAL 2021 : హిమాలయాలు తెలుపు – నేడు సత్యప్రసాద్ యాచేంద్ర ప్రసంగం

హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ పోటోగ్రఫీ ఫెస్టివల్ లో నేటి సాయంత్రం ప్రసిద్ద ఛాయా చిత్రకారులు సత్యప్రసాద్ యాచేంద్ర తనని తెలుపు. తనపై ముద్రితమైన మహోన్నత హిమాలయ సానువుల చిత్రణలు తెలుపు.

కందుకూరి రమేష్ బాబు 

వెలుగు నీడలను ఎక్కడ చూడాలో అక్కడ చూడాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సరే. లోయలు, కొండలు, శిఖరాలు చూడాలి. కళ్లారా చూడాలి. ఉదయం, మధ్యాహ్నం, సంధ్యా సమయాల్లో వాటి వర్ణ సంచయాలను చూడాలి. వెలుతురు కిరణాల్లో హిమశిఖరాలను, వాటి అడుగులను, జాడలనూ దర్శించాలి. దివ్యమైన అనుభవంతో జీవితాన్ని పరమ పావనం చేసుకోవాలి. అదొక యానం. ఫోటోగ్రఫీ ఒక యానకం. అందులో పుణీతం అవుతున్న ఛాయా చిత్రకారులు శ్రీ సత్యప్రసాద్ యాచేంద్ర, ప్రముఖ ల్యాండ్ స్కేప్ ఫోటోగ్రాఫర్.

ఇంద్రధనస్సులోని వర్ణాలు తెలుపు

సత్యప్రసాద్ యాచేంద్ర తీసిన ఒక్కో చిత్రం చూస్తుంటే ఇది వాస్తవికమా లేక నైరూప్యమా? అనుకుంటాం. నిజానికి అది ఛాయా చిత్రణం కాదు, చిత్రలేఖనమే కాబోలని ఆశ్చర్యపోతాం.

నిజంగానే ఒక్కొక్కటి ఒక తెలుపు. సప్తవర్ణ ఇంద్ర ధనుస్సునూ తెలుపు.

ప్రకృతి ముందు వినయంగా నిలబడి, తనను తాను సవరించుకుని, ఒక అలౌకిక ధ్యానంలో ఒడిసి పట్టుకున్న ముద్రణలే ఇవి.

అవి పద్యాలు, వెలుగు నీడల మధ్య పొదిగిన కెంపులు. అవును, ఇవి ప్రకతి ప్రసాదాలు. నిజం. వెంకటగిరిలో పుట్టి హైదరాబాద్‌లో స్థిరపడ్డ సత్యప్రసాద్ తీసిన హిమ శిఖరాలు ఒక అర్తిగొన్న చిత్రారుడి మేలిమి సంపదలు. చూసేవారు భాగ్యవిధాతలు. చిత్రమేమిటంటే, వారు హైదరాబాద్ నివాసులైనప్పటికీ తానుండేది హిమవన్నగాల్లోనే అనాలి.

పదిహేడేళ్లకు మలిదశ బాల్యం

“ఇప్పుడు కాదు, సరిగ్గా పదిహేడేళ్ళ క్రితం జరిగిందా అద్భుతం” అంటారాయన.

అవి 2004 ఘడియలు. తన భవితను అవి ఎంత సమూలంగా మార్చివేశాయీ అంటే తన గతం వేరు, వర్తమానం వేరు అన్నంతగా. తిరిగి బాలుడై నడయాడిన వైనం అది.

అతడి ధ్యాస…చూపరులకు ధ్యానం

తాను టిబెట్‌లోని మానస సరోవరాన్ని, అటు పిమ్మట కైలాస శిఖరాన్ని ఎప్పుడైతే సందర్శించారో ఇక అప్పటినుంచి తన అడుగులు పూర్తిగా మారిపోయాయి. లోయల్లోకి నడిచి. ఎత్తుగా నిలిచినా శిఖరాలోలో నిలిపాయి. మధ్యలో తానే చిత్రమై ప్రవహించేలా గద్దకట్టేలా మార్చివేశాయి.

చిత్రిస్తూ ఉండగా తన లోవేలుపలా మార్పు వచ్చేసింది. తన దక్పథం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా ద్వితీయంగా ఉన్న ఛాయా చిత్రలేఖనం తనకు ప్రాథమిక కావడం, అది నిజంగానే అద్వితీయం కావడం తనకే కాదు, మనకూ ఒక వరమే అయిందనడంలో అతిశయోక్తి కాదు. వారి చిత్రాలు చూడటం ఒక మెడిటేషన్. అతడి ధ్యాసలో కొన్ని క్షణాలు తేరపార చూడటం ఒక ధ్యానం.

అక్కడి ఒంటరి నిశ్శబ్దం

“ఆకాశాన్ని చుంబించే ఆ హిమవన్నగాల ఉన్నతి, అక్కడి ఒంటరి నిశ్శబ్దం, దాన్ని నిదానంగా అనుభూతి చెందడం, నా ఆత్మను సరికొత్తగా తట్టిలేపింది” అంటూ సత్యప్రసాద్ గారు చెప్పసాగారు. “ఆ హిమాలయాలు నన్ను తనలోకి లాక్కున్నాయి. రణగొణధ్వనుల మధ్య లౌకిక జీవితాన్నుంచి ఒక్కపరి ఆ అలౌకిక ఛాయల్లోకి నేను తెలియకుండానే వచ్చి పడ్డాను. అదీ మొదలు. ఛాయాచిత్రకారుడిగా నేను పదే పదే ఆ హిమాలయాల చెంత సేద తీరసాగాను. అదొక మోహం, తాపం. ఒక శాంతి కూడా” అని వివరించారాయన.

Ode to the Great Ranges

ఈ చిత్రాలు కేవలం చూడటం కాదు, దర్శనం అనాలి. అలా చూడాల్సినదే. నిజానికి అవన్నీ అపూర్వమైన వెలుగు నీడల పల్లవులు, చరణాలు. వర్ణణలు. సుమధుర సంగీత రవళులు. తానంటాడు ఇవన్నీ నా పాటలు. అసమాన్యమైన శిఖరాలను అందుకునే నా పాటల పల్లవులు…My ode to the Great Ranges అని.

అలౌకికం

నిజంగానే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఒక్కో చిత్రంలోకి వెళుతుంటే, వాటిని మనం దర్శిస్తూ ఉంటే నిజంగానే మహోన్నతమైన స్థాయిలో తాను కంపోజ్ చేసిన ఆయా పాటల్లో మన చరణాలు మునిగి తేలుతాయి. విస్మయంతో మ్రాన్పడిపోతాం. ఆనంద పారవశ్యులవుతాం. ఒకానొక అలౌకిక జగత్తులో తేలియాడుతాం.

కాఫీ టేబుల్ బుక్ వస్తే…

వాటి సంగతి అలా ఉంచి మాట్లాడితే, సత్యప్రసాద్ తన చిత్రాలను హైదరాబాద్, ముంబై, ఫునే, చండీగర్‌లలో ప్రదర్శించినప్పటికీ ఒక కాఫీ టేబుల్ బుక్‌ను అచ్చువేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అది త్వరగా నెరవేరితే మనం టీపాయిపై నుంచే అక్కడకి వెళ్ళగలం.

వేరే.. తీయలేని మొహమూ…

2004లో మొదటిసారి హిమాయల సానువుల సౌందర్యానికి ముగ్దుడైన సత్య ప్రసాద్ అటు తర్వాత ఇక వేరే వాటిని ఫొటోలు తీయలేదంటే అతిశయోక్తి కాదు. వాటినే తీయసాగాడు. ఇప్పటికి ఇరవై పది సార్లు దర్శించినా ఆయన అన్వేషణ పూర్తికాలేదు. ప్రతిసారీ విస్మయమే, విభ్రాంతే!

మంచు కమ్మిన ఆ పర్వతాలు సూరీడి కిరణాలకు కరుగుతూ ఉంటే ఆ సౌందర్యం కేవలం సత్యమే కాదు, శివం కూడా అని అర్థమైందతనికి! ఇక, అప్పటినుంచీ అదే తాదాత్మ్యత. ఒక అనిర్వచనీయమైన దివ్యానుభవం. అదే తనని పదే పదే అచ్చటకు తీసుకెళుతోంది. ప్రతిసారీ అతడి మనోనేత్రాన్ని విస్తరింపజేస్తోంది. విస్తారమైన ఆ పర్వత సానువుల మార్మికత, సమ్మోహన పరిచే ఆ కాంతి ప్రతిఫలనమూ తనను కెమెరా కంటితో చిత్రించేలా చేస్తూ ఉన్నది. అది యాంత్రిక జీవితాన్ని యోగం వలె మార్చివేస్తున్నది.

క్రికెటర్ గా పర్వతాలపై అడే ఇన్నింగ్స్ ఇది

స్వతంత్రంగా ఛాయా చిత్రకళను సాధన చేస్తున్న సత్యప్రసాద్ ఇదివరకే ముంబైలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో తన చిత్రాలను ప్రదర్శించారు. వారు తెలంగాణ ఫొటోగ్రఫిక్ సొసైటీకి అధ్యక్షులుగా పని చేశారు. తను ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కూడా. 1981 నుంచి 86 వరకు రంజీ ట్రోఫీకి ప్రాతినిద్యం వహించారు. 2014లో బంగ్లాదేశ్‌లో పర్యటించిన భారత జట్టుకు మేనేజర్‌గానూ సేవలు అందించారు. ఇప్పటికీ అయన మేనేజర్ గా క్రికెట్ జట్టు బాధ్యతల్లో ఎక్కడో ఎదో పనిలో ఉంటారు, కానీ వాటి గురించి మనకు చెప్పారు. చూపరు. అది తన సహపంక్తి . పర్వత సానువులతో సహవాసమే తన సహజ పంక్తి అన్నట్టు ఉంటారు.

LIGHT WRITER

అన్సల్ ఆడమ్స్, డేవిడ్ వార్డ్, గెలెన్ రోవెల్ వంటి మాస్టర్ ఫొటోగ్రాఫర్స్ నుంచి స్ఫూర్తి పొందిన సత్యప్రసాద్, ల్యాండ్‌స్కేప్ చిత్రాలంటే నిశ్చలమే కాదు, చలనాన్నీ ఒడిసిపట్టుకోవడం కూడా అని అంటారు. ఆ దిశగా సత్యప్రసాద్ ప్రకృతిలోని రేణువులను, సానువులను రెంటినీ హిమాలయాల్లో చిత్రిస్తూ కాంతి రచయితగా  నిశ్శబ్దంగా తన ఉనికిని ప్రదర్శిస్తున్నారు.

ఎదిగి ఒదిగి

ఉన్నతి అంటే తన దృష్టిలో ప్రకృతి నుంచి నేర్చుకుని బుద్ధిమంతుడు కావడం, మానసిక ఉన్నతిని సాధించడం. ఆ యాత్రలో సత్యప్రసాద్ ఒక వ్యక్తిగానే కాదు, ఒక కళాకారుడిగానూ సంతృప్తిగా ఉన్నారు. ఆయన ఎంతో ఎదిగి, ఒదిగారు. అదృష్టవంతులు.

నేడు హైదరాబాద్ లోని చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో వారి ప్రసంగం.  ఐదున్నరకు. నిర్వహణ ఇండియన్ ఫోటో ఫెస్టివల్, హైదరాబాద్. ఐదున్నరకు.

Sathyaprasad Yachendra is a landscape photographer and was inspired by first light hitting mountain peak in Tibet in 2004. Since then photographing Himalayas became his passion. He says for him photography starts and ends with Himalayas. This passion made him travel to Great Ranges several times and he specializes in Himalayan landscape especially Ladakh, Lahul and Spiti and North Sikkim. He held several solo, group exhibitions and presentations across India and widely covered in print and electronic media.

Look forward to seeing you this evening !!

His mobile: 9849025273, email: WWW.MAGICLIGHT.CO

 

 

More articles

2 COMMENTS

  1. సత్యప్రసాద్ నిత్య అన్వేషి.సత్య అన్వేషే.ఆ సత్యన్నే అతని ఆలోచనలను ఛాయ చిత్రకళ ద్వారా విశద పరచే తీరు అద్బుతం. ఒక్కో చిత్రం మనను అధ్యాత్మికత వైపు మరల్చి తదాక్మత చెందింప చేయడంలో సఫలీకృతమైంది.అంతకన్న కళాకారుడు ఆశించేదేమున్నది.ఎంత చెప్పుకున్న తక్కువే.ఆ కృషికి దేవదేవుడే ఆశ్చర్యపడి భుజం తట్టి ముందుకు నడిపాడేమెు.అన్యులకు అసాధ్యం మరి.🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article