Editorial

Monday, December 23, 2024
ARTSకాపు రాజయ్య బోనం - జాతి సంపద తెలుపు

కాపు రాజయ్య బోనం – జాతి సంపద తెలుపు

ప్రసిద్ధ చిత్రకారులు, దివంగత కాపు రాజయ్య గారు చిత్రించిన అనేక చిత్రాల్లో బోనాలు చిత్రానికి ఒక విశిష్టత ఉన్నది. ఇది అలనాడే తెలంగాణ జానపద చిత్తాన్ని, చిత్రాన్ని అంతర్జాతీయంగా ఆవిష్కరించింది.

కందుకూరి రమేష్ బాబు

ఒక చిత్రకారుడు తన చుట్టూ ఉన్న పరిసర జీవితాన్ని అమిత శ్రద్ధతో గమనిస్తూ, అక్కడి ప్రజల పని పాటలను, వారి విశ్రాంతిని, పండుగలు- పబ్బాలను ఎంతో ఆర్తితో చిత్రీకరిస్తే అది ఆ తర్వాత జాతి సంపద అవుతుందనడానికి కాపు రాజయ్య గారి చిత్రాలే నిండు ఉదాహరణ.

శ్రీ కాపు రాజయ్య ఎంతో వినయంగా కళాసేవ చేసినందుకు మనం అదృష్టవంతులం. బోనాల పండుగ పారంభంలో వేళల్లో వారి చిత్రాన్ని చూడటం, ఒక్క క్షణం ఆ మహనీయుడిని తలుచుకోవడం నిజంగానే మర్యాద, మన్నన.

సిద్ధిపేట బిడ్డ

సిద్దిపేటకు చిందిన శ్రీ కాపు రాజయ్య 1925లో జన్మించారు. వారు గ్రామీణ జీవన చిత్రాలు వేయడంలో సిద్ధహస్తులుగా పేరు గడించారు. ఐతే,  నేడు వెనక్కి తిరిగి చూస్తే ఎంతో ముందుగానే వారు తెలంగాణ ఆత్మను పట్టుకొని బొమ్మల్లో ప్రాణం పోసి మనం ఎల్లవేళలా తలుచుకునేందుకు కానుకగా ఇచ్చి వెళ్ళారని అర్థమవుతుంది.

వారి బొమ్మలు హృద్యంగా ఉంటాయి. పెద్ద పెద్ద కళ్ళు, పోడుచుకొచ్చిన గదువలు అయన చిత్రాల్లో ప్రత్యేకం.

తెలంగాణ పండుగలతో పాటు వారి చిత్రాల్లో వివిధ వృత్తుల్లో, పలు వ్యాపకాల్లో ఉన్న మహిళలు ఎక్కువగా కనిపిస్తారు. వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు ఆయన ప్రాణం పోశారు. కడగండ్ల బ్రతుకులు చిత్రంలో గౌడ కులస్తులను, పాలోయమ్మ పాలు చిత్రంలో గొల్లభామలను అయన చిత్రించిన తీరు ఎంత చిత్రంగా ఉంటుందీ అంటే వీళ్ళు కదా నిజమైన మనుషులు ఈ నాగరికతలో మనం ఎటూ కాకుండా పోయాం కదా అని కూడా అనిపించక మానదు.

పండుగలకు మారుపేరు

2014లో తెలంగాణ రాష్ట్ర పెర్పాటు తర్వాత బతుకమ్మ, బోనాలు పండుగలు రాష్ట్ర పండుగలుగా గుర్తింపులోకి రావడం, అవి ఘనంగా జరుపడం చూస్తున్నాం. ఐతే, చిత్రకళా రంగంలో ఈ రెండు పండుగలను ఎంతో మనోహరంగా ఆరు దశాబ్దాల క్రితమే చిత్రించిన ఏకైక చిత్రకారులు శ్రీ కాపు రాజయ్యగ మనం చూడవలసి ఉన్నది.

వారి బతుకమ్మ చిత్రాలు ఎంతోమంది చూశారుగానీ ‘బోనాలు’ ఎక్కువ మంది దృష్టిలో పడినట్టు లేదు. పడినా దాని ప్రాధాన్యం భోదపడినట్లు అనిపించదు. అందుకే ఈ కథనం.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా హోర్డింగులు ఏర్పాటు చేసినప్పుడు కాపు రాజయ్య చిత్రాలనే వాడుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.  కాగా, వారి బతుకమ్మ చిత్రాలు ఎంతోమంది చూశారుగానీ ‘బోనాలు’ ఎక్కువ మంది దృష్టిలో పడినట్టు లేదు. పడినా దాని ప్రాధాన్యం భోదపడినట్లు అనిపించదు. అందుకే ఈ కథనం.

అకాడమీ పురస్కారం

1954లో చిత్రించిన బోనాలు అదే సంవత్సరం జాతీయస్థాయిలో ప్రారంభించిన లలిత కళా అకాడమీ చిత్రకళా పోటీల్లో రెండవ బహుమతి సాధించి కాపు రాజయ్యకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టింది.

ఈ చిత్రాన్ని చూసిన ప్రసిద్ధ కళా విమర్శకులు ఎ.ఎస్ రామన్ ఒక చక్కటి కథనం రాయగా అది లండన్ కు చెందిన స్టూడియో మ్యాగజైన వారు అచ్చు వేయడమే గాక, బోనాలు చిత్రాన్ని తమ సంచిక ముఖ చిత్రంగా రంగుల్లో ప్రచురించి గౌరవించారు.

‘బోనాలు’ చిత్రం కాపు రాజయ్య గారికి జాతీయ స్థాయి మన్ననలు తెచ్చిపెట్టడమే కాదు, అంతర్జాతీయంగా ఆదరణ పొందేలా చేసింది.

అన్నట్టు, ఈ చిత్రం వేసిన శైలి కూడా అప్పట్లో నవ్యమైనదే. జాజు, బొగ్గు పొడి వంటి స్థానిక రంగులకు గొందు (బంక) నీళ్ళు కలిపి చిత్రించడం నకాషీ కళాకారుల శైలి. ఇదే చిత్ర సంవిధాన్ని అనుసరించి కాపు రాజయ్య బోనాలు చిత్రాన్ని రచించడం అప్పట్లో ఒక విశేషం.

శ్రీ కాపు రాజయ్య 2012లో 87 ఏండ్ల వయసులో స్వర్గస్థులయ్యారు. సిద్దిపేటలో వారు స్థాపించిన కళా సమితి మన తరానికి అయన వదిలివెళ్ళిన ఆస్తిపాస్తులని చెప్పాలి.

More articles

2 COMMENTS

  1. గౌరవనీయులు కాపు రాజయ్యగారి చిత్రాల విశిష్టతను గురించి రాయడం అభినందనీయం. 1954 ప్రాంతంలోనే వారికి అంతర్జాతీయ గుర్తింపు రావడం తెలగాణ ప్రజల అదృష్టం

  2. ప్రఖ్యాత చిత్రకారుడు కాపురాజయ్య గారిపై వ్యాసం.రాయడం అభినందనీయం అన్న శుభాకాంక్షలు వందనాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article