Editorial

Tuesday, December 3, 2024
ARTSబైరు రఘురాం కళ : పల్లె నిద్దుర లేస్తున్నట్టి చిత్రం

బైరు రఘురాం కళ : పల్లె నిద్దుర లేస్తున్నట్టి చిత్రం

బైరు రఘురాం చిత్రల్లో మనిషి ఒక మూగ జీవిగా, మూగ జీవాలు చైతన్యానికి ప్రతీకలుగా కానవస్తాయి. ఆ అమాయకపు విజ్ఞత, మూగజీవుల లాలన వారి చిత్రాలను దయగా మార్చి మనలని అబ్భుర పరుస్తాయి.

కందుకూరి రమేష్ బాబు 

తెలంగాణ గర్వించదగ్గ చిత్రకారుల్లో మన హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన బైరు రఘురాం ఒకరు. వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ. చదివి ఆ తర్వాత గుల్బర్గా ఐ.ఎఫ్.ఎ.ఐ కాలేజ్ నుంచి డ్రాయింగ్, పెయింటింగ్‌లో డిప్లొమా పొందారు. అది కాదు విశేషం, ఆయన మన లక్ష్మా గౌడ్, తోట వైకుంఠం, దివంగత సూర్య ప్రకాష్ వంటి ప్రసిద్ధ చిత్రకారుల కోవలో గౌరవించదగ్గ చిత్రకారులుగా ఎదగడం. గొప్ప గౌరవం పొందడం. అంతేకాదు, నగరంలోని బోలక్‌పూర్‌లో నివసించె వారు ఏడు పదుల వయసులోనూ ఇప్పటికీ అమిత ఉత్సాహంతో చిత్రకళలో నిమగ్నమై ఉంటారు. ఇప్పటి చిత్రకారుల మాదిరిగా కాకుండా చాలా సాదా సిదాగా తన పనే మాట్లాడుతుంది తాను తప్ప అన్నట్టే ఉంటారు.

వారి చిత్రాల్లో మూగ జీవుల మాదిరి మనిషి ఎదో సుషుప్తిలో ఉన్నట్టు గమనిస్తాం. ఆ మనుషుల వెన్నంటి చేపలు, కోళ్లు, మేకలు, సీతాకోకచిలుకలు, దువ్వెనలు చేరువగా వచ్చి అతడిని లేదా ఆమెను మేలుకొలిపి ఆ చిత్రాలను మరింత దయగా మలుస్తాయి. ఇక అవి మెల్లగా పలకరిస్తాయి.

ఈ చిత్రకారుడి గురించి చెప్పడం కన్నా వారి బొమ్మలు పదే పదే చూడాలి. ఎంతో బాగుంటుంది.

ఐతే, పల్లెటూరు జీవితమే వారి కాన్వాసుకు పరిధి, పరమావధి అని చెప్పక తప్పదు. అదే తన బలిమి. ఆ చిత్రాల్లో స్త్రీ పురుషులు, వారి ఇండ్లు, పరిసరాలు, పని, పాటలు ముఖ్యంగా కాన వస్తాయి. అందులో ఒకాలాంటి సహానుభూతి ఉంటుంది. మనిషి ఒక మూగ జీవిగా, మూగ జీవాలు చైతన్యానికి ప్రతీకలుగా కానరావడమూ ఒక వైచిత్రిగా ఉంటుంది.

ముఖ్యంగా మూగ జీవుల మాదిరి మనిషి ఎదో సుషుప్తిలో ఉన్నట్టు గమనిస్తాం. ఆ మనుషుల వెన్నంటి చేపలు, కోళ్లు, మేకలు, సీతాకోకచిలుకలు, దువ్వెనలు చేరువగా వచ్చి అతడిని లేదా ఆమెను మేలుకొలిపి ఆ చిత్రాలను మరింత దయగా మలుస్తాయి. అవి మెల్లగా పలకరిస్తాయి. ఉదాహరణకు కోడి, మేక. అవి ఆ అమ్మను లేదా ఆ అయ్యను వీడిపోకుండా కాపలాగా ఉంటాయి. ప్రకృతి ఈ మూగ జీవులతో మనిషిని పట్టించుకున్నదా అనిపిస్తుంది.

ఇట్లా వారి చిత్రాలు గ్రామీణ జీవితానికి సన్నిహిత ప్రతిబింబాలు. మనల్ని పట్టణం నుంచి వేరు చేసి పల్లెపట్టులోకి దించే సుతారమైన వలలు. ఐతే, ఈ చిత్రకారుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అత్యంత శ్రమకోర్చి సొంతం చేసుకోవడం గురించి విశేషంగా చెప్పాలి. వారికి వస్తువు ఎంత ముఖ్యమో అయన ఎన్నుకున్న ఆ శైలి కారణంగానే ఆయన మనల్ని విస్మయానికి గురి చేస్తారనిపిస్తుంది.

వారు చిన్న చిన్న రేఖలతో చిత్రమంతా తనదైన నగిశీ పని వంటి ఒక సంవిధాన్ని అవలంభిస్తారు. అటువంటి రూపకల్పన కారణంగా ఆయన చిత్రాల శైలి ప్రత్యేకంగా మారడం మనం చూస్తాం.

ఆ విశేషాన్ని వర్ణించడానికి నాకున్న అవగాహన సరిపోదు. కానీ ప్రయత్నిస్తే ఇలా చెప్పాలి. వారు చిన్న చిన్న రేఖలతో చిత్రమంతా తనదైన నగిశీ పని వంటి ఒక సంవిధాన్ని అవలంభిస్తారు. అటువంటి రూపకల్పన కారణంగా ఆయన చిత్రాల శైలి ప్రత్యేకంగా మారడం మనం చూస్తాం. అందుకే బైరు రఘురాం చిత్రాలంటే గొప్ప రేఖా లావణ్యానికి ప్రసిద్ధి. అదే సమయంలో తనదైన పనితనానికీ అంతే ప్రసిద్ధి. ఇక ముందే  చెప్పినట్టు అమాయకపు విజ్ఞత, వినిర్మల ప్రజానీకపు తీరుబాటు కార్యకలాపాలు.

వారి శైలిలోని ఆ లైనియార్ మీడియం, ఆ రేఖా రచన, దాన్ని తనంతట తాను రూపొందించుకున్న తీరు – ఇవన్నీ వారి చిత్రాలకు ఆకర్శణీయం చేసే అంశాలే. వీటన్నిటి కారణంగా బైరు రఘురాం చిత్రకళా ప్రపంచంలో ఒక సిగ్నేచర్ ఆర్ట్‌కు ప్రతీకగా మారడం మన అదృష్టం.

అయితే వారి శైలిలోని ఆ లైనియార్ మీడియం, ఆ రేఖా రచన, దాన్ని తనంతట తాను రూపొందించుకున్న తీరు, మొత్తం కాన్వాసును ఒకే రకమైన టెక్చర్‌ని తలపించే మాదిరిగా  మలిచే హస్త లాఘవం, వాడిన రంగుల్లో నిదానమైన మార్పు, మెలమెల్లగా తీసుకువచ్చే టోనల్ గ్రేడేషన్, ఇవన్నీ వారి చిత్రాలకు ఆకర్శణీయం చేసే అంశాలే.

వీటన్నిటి కారణంగా బైరు రఘురాం చిత్రాలు తెలుగు చిత్రకళా ప్రపంచంలో ఒక సిగ్నేచర్ ఆర్ట్‌కు ప్రతీకలుగా మారడం మన అదృష్టం.

మరో ముఖ్య విషయం. తాను ఎచ్చింగులు చేసినా, డ్రాయింగులు వేసినా, పెయింటింగులు చేసినా స్త్రీలు జుట్టు ముడిచే విధానాన్ని మటుకు మీరు తప్పక గమనించాలి.

“ఇది మా అమ్మ జుట్టు ముడిచే విధానం నుంచి స్వీకరించి ఒకింత స్టయిలైజ్ చేసుకున్నాను” అని బైరు రఘురాం గారు చెప్పారు.

ముఖ్యంగా వారు జడకొప్పును చిత్రీకరించే తీరు చూడవలసిందే. “ఇది మా అమ్మ జుట్టు ముడిచే విధానం నుంచి స్వీకరించి ఒకింత స్టయిలైజ్ చేసుకున్నాను” అని బైరు రఘురాం గారు చెప్పారు.

ఇట్లా అమ్మ, పల్లె., పని పాటలు -వీటిని యాది మరవని చిత్రకారులను తలుచుకోవడం అంటే అది నిజంగానే ఆనందం, ఆరోగ్యం. ఒక సంపద కూడా. అందుకే వారి గురించి నాలుగు మాటలతో మీకు తెలుపడం.

More articles

1 COMMENT

  1. ఉత్తమ చిత్రకారుని పరిచయం చేసినందులకు ధన్యవాదాలు.
    చూపును చిత్రానికి కట్టేయడం
    బైరు రఘురాం కుంచెకు బాగా తెలిసినట్టుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article