Editorial

Monday, December 23, 2024
కథనాలుసద్దుల బతుకమ్మ : ముదిగంటి సుజాతా రెడ్డి తెలుపు

సద్దుల బతుకమ్మ : ముదిగంటి సుజాతా రెడ్డి తెలుపు

Painting by Sri Thota Vaikuntam

స్త్రీల సంగీతం, నృత్యం, కోలాటం ఆటలతో కూడిన అందమైన పండుగ బతుకమ్మ! పసుపు పచ్చని బంగారు రంగులో వుండే తంగేడు పూలు ప్రధానంగా పెట్టి పేర్చే బతుకమ్మను ‘బంగారు బతుకమ్మ’ అంటారు. అష్టమి నాడు ఆడే బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’ అంటారు.

ముదిగంటి సుజాతా రెడ్డి

మహాలయ అమావాస్య రోజు స్త్రీలు తాము పేర్చుకొని వచ్చిన బతుకమ్మను దేవాలయ ప్రాంగణంలో పెట్టి చప్పట్లు చరుస్తూ, పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. మొదటిరోజు ఆడే బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అంటారు. తర్వాత ఏడు రోజులు చిన్న చిన్న బతుకమ్మలను పేర్చి ఎవరింట్లోనైనా జమకూడి బతుకమ్మ ఆడుతారు. ఈ ఎనిమిది రోజులు బతుకమ్మ ఆటలో సామాన్యంగా చిన్నపిల్లలు నవయువతులు ఉత్సాహంగా పాల్గొని ఆడుతారు. అష్టమి నాడు ఆడే బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’ అంటారు. అది పెద్ద పండుగ. సద్దుల బతుకమ్మ రోజు చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొంటారు.

బతుకమ్మ ఎత్తుగా వుండాలని పోటీ పడి సద్దుల బతుకమ్మ రోజు ప్రతి ఒక్కరు బతుకమ్మను పేరుస్తారు.

ఇది కేవలం స్త్రీలు మాత్రమే పాల్గొనే పండుగ. సద్దుల బతుకమ్మ రోజు పెద్దపెద్ద బతుకమ్మలను అందంగా పేరుస్తారు. కొన్ని రోజుల ముందునుంచే ఈ బతుకమ్మల కోసం తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలను సేకరిస్తారు.

గునుగు పూలను కట్టలుగా కట్టి వేరు వేరు రంగుల్లో అద్ది తయారు చేసి పెట్టుకుంటారు. ఇక అదే రోజు తాజాగా వికసించే బీర, గుల్మాల, కట్ల, గోరింట, తామర, నీటి తామర, గట్టు తామర వంటి పూలను సేకరించి బతుకమ్మలను అందంగా ఆకర్షణీయంగా పేరుస్తారు. ఇంతకు ముందు ఊరిబయట గట్లమీద బంజరు భూముల్లో తంగేడు పూలు భాద్రపద మాసం వచ్చిందంటే విరగపూసేవి. ఇప్పుడంతగా కనిపించడం లేదు. అంతేగాక పట్నాల్లో నివసించే వాళ్ళకు తంగేడుపూలు అసలే దొరకడం లేదు. బజారులో అమ్మకానికి వస్తే ఆ తంగేడు పూలను కొని బతుకమ్మలో అలంకరిస్తున్నారే కాని మొత్తం బతుకమ్మను తంగేడు పూలతో పూర్వంలా పేర్చడం లేదు. ఇప్పుడు ఎక్కువగా పసుపు పచ్చ రంగులో వుండే బంతిపూలను పెట్టి పేరుస్తున్నారు. ఇంతకుమందు బంగారు తంగేడు పూల బతుకమ్మలు ఇప్పుడు బంగారు బంతిపూల బతుకమ్మలుగా కనబడుతున్నాయి. అంతేగాక ఇప్పుడు గులాబీ పూలు, మల్లెలు, కనకాంబరాలు ఎక్కువ దొరుకుతున్నాయి. ఆ పూలను ఎక్కువగా తీసుకొని రంగురంగుల అందమైన బతుకమ్మలను పేరుస్తున్నారు.

బాగా అలంకరించుకున్న అందమైన స్త్రీలు వాళ్ళ చేతుల్లో పసుపు రంగుతో ఇంకా చిత్రవిచివూతమై రంగుల పూలతో పేర్చిన అందమైన బతుకమ్మలు! ఆ దృశ్యం శోభాయాత్ర చూడటానికి నిరుపమానంగా వుండేది.

ఏ పూలతో పేర్చినా బతుకమ్మను అందంగా రకరకాల రంగుల పూలతో అలంకరించి పేర్చడం ముఖ్యం. ఆ కాలంలో దొరికే వికసించే పూలను ఉపయోగించి బతుకమ్మను పేర్చటం ఆచారం. బతుకమ్మ ఎత్తుగా వుండాలని పోటీ పడి సద్దుల బతుకమ్మ రోజు ప్రతి ఒక్కరు బతుకమ్మను పేరుస్తారు.

మా చిన్నప్పుడు మా అమ్మ మమ్మల్నందరినీ తీసుకొని మా అమ్మమ్మ ఇంటికి పోయేది. దసరా అయిపోయేంత వరకు మేమక్కడే వుండేది. మా నడిపి మేనమామకు బతుకమ్మను పేర్చడమంటే చాలా ఇష్టంగా వుండేది. చాలా కళాత్మకంగా ఆయన బతుకమ్మను ఆరడుగుల వరకు పడిపోకుండా సన్నని తాడుతో బిగిస్తూ పేర్చేవాడు. తాళ్ళతో బిగిస్తే ఇక ఆ బతుకమ్మ తొణకకుండా వుండేది. పూర్వం ఊర్లల్లో ఎవరికివారు పోటీలు పడి ఒకరికి తెలియకుండా మరొకరు పూలు సేకరించి పెద్దగా పేర్చేవాళ్ళు. ఒక్కొక్క ఇంట్లో మూడు, నాలుగు బతుకమ్మలనూ పేర్చేవాళ్ళు. సామాన్యంగా బతుకమ్మలను తలస్నానం చేసి ఆడవాళ్ళు పేర్చడమే వుంటుంది. స్త్రీలు తమ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఏ రంగు, ఏ పరిమాణం గల పూలు పెట్టాలో పెడ్తూ, సుందరంగా బతుకమ్మలను పేరుస్తారు. కానీ, ఒక్కోసారి అభిరుచిగల మగవాళ్లు కూడా బతుకమ్మలను పేర్చేవారు. అందులో ఐదడుగులు, ఆరడుగుల బతుకమ్మలను మగవాళ్ళే పేర్చడం నేను చూశాను. అరచేతిలో పట్టకునేంత బతుకమ్మ నుంచి ఆరడుగుల బతుకమ్మ వరకు పేరుస్తారు. ఐదారడుగుల బతుకమ్మలను నలుగైదుగురు పురుషులు పట్టుకొని పోయేవాళ్ళు. లేదా దాన్ని బండి మీద పెట్టి తీసుకుపోయే వాళ్ళు.సద్దుల బతుకమ్మ రోజు సాయంత్రం మేళతాళాలతో మహిళలంతా ఊరి బతుకమ్మలతో వరుసగా ఊరిబయట వుండే చెరువు కట్టవరకు తరలిపోతారు.

ఆడవాళ్ళు తమ బతుకమ్మలను ఆ వెంపలి చెట్టు చుట్టూ పెడతారు. పాటలు పాడుతూ, లయాత్మకంగా చప్పట్లు చరుస్తూ అడుగులు వేస్తూ బతుకమ్మల చుట్టు తిరుగుతూ ఆడుతారు.

స్త్రీలు పట్టుచీరలు కట్టుకొని తమకున్న నగలు అలంకరించుకొని బతుకమ్మలను చేతితో పట్టుకొని బయలుదేరుతారు. వాళ్ళ అటు ఇటు పురుషులు, యువకులు తరలి వస్తుంటారు. బాగా అలంకరించుకున్న అందమైన స్త్రీలు వాళ్ళ చేతుల్లో పసుపు రంగుతో ఇంకా చిత్రవిచివూతమై రంగుల పూలతో పేర్చిన అందమైన బతుకమ్మలు! ఆ దృశ్యం శోభాయాత్ర చూడటానికి నిరుపమానంగా వుండేది.

ఊరి బతుకమ్మలు చెరువు కట్టకాడికి చేరకముందే దేవాలయ పూజారి ఒకచోట వెంపలి చెట్టును నాటి దానికింద పసుపుతో చేసిన గౌరీదేవిని ప్రతిష్టించి పసుపు కుంకుమలతో పూజ చేసి సిద్ధంగా వుంటాడు. తాళమేళాలతో ఊరి బతుకమ్మలు అక్కడికి చేరుకుంటాయి. ఆడవాళ్ళు తమ బతుకమ్మలను ఆ వెంపలి చెట్టు చుట్టూ పెడతారు. పాటలు పాడుతూ, లయాత్మకంగా చప్పట్లు చరుస్తూ అడుగులు వేస్తూ బతుకమ్మల చుట్టు తిరుగుతూ ఆడుతారు. బతుకమ్మ ఆడే స్త్రీలల్లో పాట బాగా పాడగలిగిన వాళ్ళు ముందు పాట పాడుతూ వుంటే ఆమెననుసరించి మిగతా స్త్రీలు పాటనందుకొంటూ పాడుతూ వుంటారు. బతుకమ్మ పాటలు బాగా వచ్చిన వాళ్ళు వుంటారు. కొందరికి పాతపాటల లయతో రాగంతో పాటను కొత్త ఇతివృత్తంతో కట్టిపాడే ప్రావీణ్యం వుంటుంది.

స్త్రీల సృజనాత్మక శక్తిని బతుకమ్మను పేర్చడంలోగాని, బతుకమ్మ పాటలను కట్టడంలో గాని ప్రదర్శించే గొప్ప పండుగ.

మనం బతుకమ్మ పాటలను పరిశీలిస్తే గౌరమ్మ పెళ్ళి, గౌరమ్మ మహిమ, రాముడు సీత వృత్తాంతం మొదలైన పౌరాణిక సంబంధమైన పాటలే గాక ఆయా కాలాల్లో జరిగిన సంవేదనాత్మకమైన ఇతివృత్తాలనూ తీసుకొని పాటలు కట్టి పాడటం గమనిస్తాం. రజాకార్ల దుశ్చర్యలను గురించి, రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలను గురించి అట్లా ఎన్నో సమకాలీన సంఘటనలను పాటలుగా కట్టి బతుకమ్మ ఆటల్లో స్త్రీలు పాడుతారు. స్త్రీల సృజనాత్మక శక్తిని బతుకమ్మను పేర్చడంలోగాని, బతుకమ్మ పాటలను కట్టడంలో గాని ప్రదర్శించే గొప్ప పండుగ.

అన్ని బతుకమ్మల మీద దీపాలు వెలుగుతూ సాగనంపే పాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూ వుంటే బతుకమ్మలు నీళ్ళమీద తేలియాడుతూ పోతూ, చీకట్లో కన్పించడం ఒక మనోహరమైన దృశ్యం!

స్త్రీల సంగీతం, నృత్యం, కోలాటం ఆటలతో కూడిన అందమైన పండుగ బతుకమ్మ! బతుకమ్మ ఆటపాట అయిం తర్వాత స్త్రీలు పురుషుల సాయంతో బతుకమ్మలను చెరువు నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. అన్ని బతుకమ్మల మీద దీపాలు వెలుగుతూ సాగనంపే పాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూ వుంటే బతుకమ్మలు నీళ్ళమీద తేలియాడుతూ పోతూ, చీకట్లో కన్పించడం ఒక మనోహరమైన దృశ్యం!

వ్యాసకర్త ముదిగంటి సుజాత రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి. కథ, నవల, యాత్రా కథ, సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర గ్రంథాలు రాసిన వీరు ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఈమె నవలలు, కథలు హిందీ, ఇంగ్లీషు భాషలలోనికి తర్జుమా చేయబడ్డాయి. తన రచనలలో తెలంగాణ భాషలో తెలంగాణ జీవితాన్ని, రైతుల, సామాన్య జనుల, ఛిద్రజీవితాలను చిత్రించింది. సాఫ్ట్‌వేర్ రంగపు జీవితాలను, సన్నగిల్లుతున్న మానవ జీవితాలను, కుటుంబ వ్యవస్థలను ప్రపంచీకరణం, వ్యాపారీకరణం, మార్కెట్ వాదం కళ్ళకు కట్టేటట్లు తన కథలలో వర్ణించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలంగాణ సాహిత్య చరిత్రను వెలువరించడంలో వారిది విశిష్ట కృషి.. ‘రస చర్చ – ఆధునికత’లో సుజాతారెడ్డి ‘రస సిద్ధాంతాన్ని’ నవలకు కూడా వర్తింప జేయవచ్చునని ప్రతిపాదించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article