“నేను ఏది బోధించడానికి రాలేదు. మీరు నిద్రావస్థలో ఉన్నారు. కేవలం మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను” అని వినమ్రంగా చెప్పే మెహర్ బాబా జూలై 10, 1925 నుండి నిరాటంకంగా నలభై నాలుగు సంవత్సరాలు మౌనాన్ని పాటించడం విశేషం.
‘ప్రేమ’, ‘సేవ’, ‘విధేయత’, ‘అన్నివేళలా నిజాయతీ’ – వీటిని పాటించాలి. నిత్యజీవితంలో సత్ప్రవర్తనతో నడుచుకోవాలి. అప్పుడు మానవులు తమలోని భగవంతుడిని దర్శించగలుగుతారు అని చెప్పిన మెహర్ బాబా (Avatar Meher Baba ) జీవితంలో మాట కన్నా మౌనం (Silence ) ప్రధానంగా ఉండటం ఒక విస్మయానందం. వారు మన హైదరాబాద్ సందర్శించిన స్థలంలో ఏర్పాటైన మనోనాష్ గుహ (Mano-Nash cave) కూడా ఒక గొప్ప silence center. దర్శనీయం ఆ మౌనరుషి స్మారక స్థలం.
ఫిబ్రవరి 25, 1894 పూణేలో జన్మించిన మెహర్ బాబా అసలు పేరు మెర్వాన్ షెరియార్ ఇరానీ. ‘అవేకనర్’ అని కూడా పిలవబడే మెహర్ బాబా పర్షియన్ సంతతికి చెందిన వారు. జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. పూణేలోని దక్కన్ కళాశాలలో చదివారు. తన పందొమ్మిది సంవత్సరాల వయస్సులో అతను ఒక వృద్ధ ముస్లిం మహిళ హజ్రత్ బాబాజాన్ కలుసుకున్నాడు. ఆమె తనకు తారసిల్లిన ఐదుగురు పరిపూర్ణ మాస్టర్స్లో ఒకరని, తన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈవిడ ఎంతగానో సహాయపడ్డారని మెహర్ బాబా చెప్పారు.
మెహర్‌బాబా జీవితం మూడు అరల యోగకావ్యం. ఏకాంతవాస, ఉపవాస, సహవాసాల సమాహారం వారు హిందూ ముస్లిం సంప్రదాయాల దివ్యధామం. ఆత్మదర్శనానికి సరికొత్త భాష్యం. తనకు జీవితమే ప్రేమాలయం, ఆశ్రమమే సేవాసదనం. మౌనమే ఆయన మంత్రం.
జొరాస్టర్ , రామ , కృష్ణ , బుద్ధుడు , యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, వంటి వారి గురించి చెబుతూ “నేను అదే ప్రాచీన వ్యక్తిని. మళ్లీ మీ మధ్యలోకి వచ్చాను” అని తన శిష్యులతో చెప్పేవారు. ఐతే, “నేను ఏది బోధించడానికి రాలేదు. మీరు నిద్రావస్థలో ఉన్నారు. కేవలం మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను” అని కూడా మెహర్ బాబా వినమ్రంగా చెప్పేవారు. విశేషం ఏమిటంటే, జూలై 10, 1925 నుండి నిరాటంకంగా నలభై నాలుగు సంవత్సరాలు వారు మౌనాన్ని పాటించడం. తాను మొదట తన శిష్యులతో వర్ణమాల బోర్డు ద్వారా సంభాషించారు, తరువాత హావభావాలతో సందేశాన్ని అందించేవారు.”వాస్తవమైనవి అన్ని నిశ్శబ్దంగా ఇవ్వబడతాయి. స్వీకరించండి.” అన్నది వారి సందేశంలో ఒక ముఖ్య విశేషం.
1931వ సంవత్సరం. మెహెర్‌బాబా లండన్ పర్యటనకు రాజ్‌పుఠానా అనే ఓడలో వెళుతున్నారు. అప్పటికి ఆరేళ్ళ నుంచీ ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. అదే ఓడలో మహాత్మా గాంధీ కూడా ప్రయాణిస్తున్నారు. ఆ సందర్భంలో మహాత్ముడు, మెహెర్ బాబా పలుసార్లు సమావేశమయ్యారు. అనేక ఆధ్యాత్మిక విషయాలను బాబాతో గాంధీజీ ముచ్చటించారు. ఆ సమయంలో “మీ సుమధుర వాక్కులు వినాలని ఉంది. పెదవి కదపకుండానే ప్రజలను ప్రభావితులను చేస్తున్నారు. మీరు పెదవి విప్పి, మౌన విరమణ చేసి త్వరలోనే మాట్లాడాలి”అని బాబాను గాంధీ కోరారు. త్వరలోనే మాట్లాడతానని బాబా హామీ ఇచ్చారు. కానీ అయన మౌనం వీడనే లేదు.
మౌనం వీడని మహర్షి
మెహర్ బాబా 1925 జూలై 10న ప్రారంభించిన మౌన దీక్షను 1969 జనవరి 31న భౌతిక శరీరం వదిలే దాకా సుమారు 44 ఏళ్ళు మెహెర్‌బాబా కొనసాగించారు. మౌనంలోనే పదమూడు సార్లు అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా తదితర విదేశాలలో పర్యటించారు. ఆయనకు రెండుసార్లు ఘోర కారు ప్రమాదాలు జరిగాయి. ఆయన కాలికీ, తుంటి ఎముకకూ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆ బాధను ఆయన మౌనంగా భరించారు. అది చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. 1925 నుంచి 1954 వరకూ ఆంగ్ల అక్షరాలు ఉన్న పలక సహాయంతో బాబా తన మౌనం కొనసాగించారు. ఆపై ఆ అక్షర ఫలకం కూడా వదలి, కేవలం సంజ్ఞలతో సందేశాలు ఇచ్చారు. మౌనంలో ఉండగానే సృష్టి రహస్యాలను వివరించే ‘భగవద్వచనం’, ‘సర్వం-శూన్యం’ అనే అద్భుత ఆధ్యాత్మిక గ్రంథాలను భావితరాల వారి కోసం ఆయన అందజేయడం మరో విశేషం.
“వాస్తవానికి తానెన్నడూ మౌనంగా లేనని” చెప్పే మెహెర్ బాబా తన ప్రేమికుల, భక్తుల, ప్రజల హృదయంతో…. నేరుగా మాట్లాడుతూనే ఉన్నానని చెప్పేవారు. “దేవుడు అన్నిటా, అంతటా, అందరిలోనూ ఉన్నాడు. గత జన్మసంస్కారాల ప్రభావం వల్ల మీలో ఉన్న దేవుణ్ణి మీరు దర్శించలేకపోతున్నారు” అని చెప్పేవారు. “ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడేననీ, అన్నిమతాల సారం ఒక్కటే…!! భగవంతుని యొక్క సంపూర్ణ ఏకత్వాన్ని గ్రహించడమే అందరి లక్ష్యం, నా మతం ‘ప్రేమ’ అని బాబా పలు సందర్భాలలో ప్రకటించారు.
“అందుకే మాటల అవసరం ఎక్కువైంది”
మెహర్ బాబా మౌన దీక్ష ప్రారంభించక ముందు ఎదుటివారు సమ్మోహితులయ్యేలా చమత్కారంగా ఆయన మాట్లాడేవారు. స్వయంగా డోలక్ వాయిస్తూ, అద్భుతంగా గజల్స్ గానం చేసేవారు. అనేక ఆధ్యాత్మిక విషయాలు అనర్గళంగా చెప్పేవారు. ‘‘బాబా! నువ్వు మౌనం పాటిస్తే, నువ్వు నిత్యం చెప్పే అనేక ఆధాత్మిక మర్మాలు ఎవరు చెబుతారు? దయచేసి మౌనాన్ని ఆశ్రయించవద్దు” అని శిష్యులు పలుమార్లు విన్నవించుకునేవారు. అప్పుడాయన ‘‘నేను బోధించడానికి రాలేద”ని విస్పష్టంగా చెప్పెవారు. “కేవలం మేలుకొలపడానికి వచ్చాను! అందుకు మాటల అనవసరం’’ అని చిరునవ్వుతో చెప్పేవారు.
“మనుషులు ముందు ఇవ్వాలి. తరువాత తీసుకోవాలి. మొదట మీరు ఇస్తే, తరువాత అన్నీ మీకు వస్తాయి. కానీ మనిషి మొదట తనకు ఫలానా కావాలి అనుకుంటాడు. ఆ తరువాతే ఇవ్వడం గురించి ఆలోచిస్తాడు. అందుకే మానవుడికి మాటలు అవసరం ఎక్కువైంది. ఇవ్వడానికి మౌనం చాలు” అంటారాయన. ఈ సందేశంలోనే అయన మౌనం తాలూకు తాత్వికత మొత్తం ఇమిడి ఉన్నదనుకోవచ్చు.
మెహెర్ బాబాను ఆరాధించేవారు చాలా మంది ప్రతి ఏటా జూలై 10న మౌనం పాటిస్తుంటారు. అందుకోసం కొందరు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ సమీపంలో గల మెహెరాబాద్‌లో బాబా సమాధి దగ్గరకు వెళుతూ ఉంటారు.
భగవంతుడి దర్శనం గురించి కూడా మంచి ఉదాహారంతో అయన వివరించేవారు.”నేను ఏనుగును కావాలనుకుంటున్నాను అని ఒక చీమ అంటే ఎలా ఉంటుందో నేను దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను అనుకోవడం కూడా అలాంటిదే! దేవుణ్ణి చూడాలంటే హృదయంలో తపన ఉండాలి” అంటారాయన. అంతేకాదు, “దేవుడు ఒక వాస్తవికత. తపన అందుకు మార్గం” అని మెహెర్‌బాబా ప్రకటించారు.
మెహెర్ బాబాను ఆరాధించేవారు చాలా మంది ప్రతి ఏటా జూలై 10న మౌనం పాటిస్తుంటారు. అందుకోసం కొందరు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ సమీపంలో గల మెహెరాబాద్‌లో బాబా సమాధి దగ్గరకు వెళుతూ ఉంటారు. ఆ రోజు తన ఆరాధకులు మౌనం పాటించాలన్నది బాబా ఆదేశం.
“డోంట్ వర్రీ బీ హ్యాపీ”
“మనిషి లక్ష్యం తన స్వంత ఆధ్యాత్మిక మార్గ సాఫల్యం కావడంగా ఉండాలి. అదే దైవత్వం గురించి అవగాహన పొందడం” అనే మెహర్ బాబా ప్రసిద్ద గ్రంధం దేవుడు మాట్లాడుతాడు….God Speaks. వారు జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన ఈ లోకం తీరు గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ ప్రపంచం మిథ్య అనీ భగవంతుడొక్కడే సత్యమనీ, ప్రతి ఒక్కరు తమలోని పరమాత్మను తెలుసుకోవాలని బోధించారు. చావు పుట్టుకల వలయం నుంచి బయటపడటానికి అవసరమైన ఆత్మజ్ఞానం గురించిన డిస్కోర్సెస్ గాడ్ స్పీక్స్ అనే పుస్తకంలో మనం చదవచ్చు.
అవతార్ మెహెర్ బాబా ఎప్పుడు “డోంట్ వర్రీ బీ హ్యాపీ” అనే వారు ఈ పదం ఆయన వదిలి వెళ్ళిన గొప్ప వారసత్వ సంపద.
అవతార్ మెహెర్ బాబా ఎప్పుడు “డోంట్ వర్రీ బీ హ్యాపీ” అనే వారు ఈ పదం ఆయన వదిలి వెళ్ళిన గొప్ప వారసత్వ సంపద.
మెహెర్ బాబా మనిషి లోని స్వార్థభూతాన్ని తరిమికొట్టేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఇతరుల లోపాలను ఎత్తి చూపడం కన్నా మనని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనముందన్నారు. ఇతరులకు చెడు చెయ్యకపోవడమే మనం చేయగలిగే మంచి అన్నారు. భౌతిక సుఖాలకోసమెంత తపించిపోతామో అంతకు రెట్టింపు తపన పరమాత్మవైపు పడగలిగితే తప్పకుండా భగవంతుని దర్శనం లభిస్తుందని ప్రకటించారు. విశ్వాసం, విధేయత, ఫలాపేక్ష లేకపోవడం, నిస్వార్థంగా తనకు తాను సమర్పణం చేసుకోగలిగే నిజాయతీ గుణాలున్న వారంటే దైవానికి ప్రియం అనేవారు.
మెహెర్ బాబా ప్రపంచం అంతా పర్యటించి ఆర్తులను, భక్తులను, తన ప్రేమికులకు ఆలింగన దర్శనంతో (హృదయపూర్వకమైన కౌగిలి ద్వారా) ప్రేమను పంచారు. కుష్టు రోగులకు, పేదలకు, అన్ని మతస్థులకు కాళ్ళు కడిగి స్నానం చేయించి, అన్నం తినిపించి, నూతన వస్త్రాలు తొడిగే సేవ చేసేవారు. అటువంటి మహాత్ములు జనవరి 31, 1969న తన 74 ఏళ్ల వయస్సులో అహ్మద్ నగర్ లో శాశ్వత మౌనంలోకి వెళ్ళారు.
మనోనాశ్ గుహ@ మణికొండ
మెహర్ బాబా 1951 వ సవత్సరం అక్టోబర్ 16 నుండి 24వ తేది వరకు హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలోని మణికొండ, ఖాజాగూడ కొండపైన ఉన్న గుహలో విశ్వమానవాలి శ్రేయస్సు కోసం మనోనాశ్ అనే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారంటారు. అందుకే ఈ గుహకు ‘మనో నాష్ గుహ’ (Mano-Nash cave) అనే విశ్వ విఖ్యతమైన పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ మనోనాశ్ గుహ పవిత్రమైన, ఆరాధనీయమైన ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రంగా మారింది. ఈ గుట్టపై అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకవైపు, మరోవైపు దర్గా ఉన్నాయి. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఆనుకొని అత్యంత ఖరీదైన స్థలంలో 120 ఎకరాలలో ఈ కొండ ఉంది.
“దైవం ఒక్కడే…మీరే భిన్నంగా చూస్తున్నారు” అని మెహర్ బాబా ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ కొండ మీద చూస్తే అది కాకతాళీయమే అయినా…. ఓకే గుట్టమీద అ గుడి మసీదు రెండు ఉండటం విశేషం.
“దైవం ఒక్కడే…మీరే భిన్నంగా చూస్తున్నారు” అని మెహర్ బాబా ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ కొండ మీద చూస్తే అది కాకతాళీయమే అయినా…. ఓకే గుట్టమీద అ గుడి మసీదు రెండు ఉండటం విశేషం. అక్కడే ముందు పేర్కొన్న బాబా ఆశ్రమం కూడా ఉంది.
మెహెర్ బాబా విశ్వ కార్యం- మనోనాశ్ ఘట్టం హైదరాబాద్ లో జరిగిన దానికి గుర్తుగా ఇప్పటికీ మణికొండ పక్కనున్న ఖాజాగూడ కొండమీద అక్టోబర్ 16 నుంచి 24 వరకు మెహర్ బాబా భక్తులు ధ్యానం, భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు వెళ్లి దర్శించుకోవచ్చు.
Avatar Meher Baba Manonash Cave – ఈ లింక్ క్లిక్ చేస్తే మనోనాశ్ గుహకి వెళ్లేందుకు దారి చూపే గూగుల్ మ్యాప్ చూడవచ్చు
వ్యాసకర్త రమేశ్ చెప్పాల రచయిత, సినీ దర్శకులు. ఇటీవల వారు ‘మా కనపర్తి ముషాయిరా’ అన్న కథల సంపుటి, ‘బాంబే డాల్’ అన్న నవలను వెలువరించారు. రచనల్లో ఆధ్యాత్మిక ధార నిశ్శబ్ద స్రవంతిగా ఉండటం వారి ప్రత్యేకత. ఇ మెయిల్ : rameshcheppala@Gmail.com
Super
Super sir
Me writings chadvina prathi sari edho teliyani feeling loki theeskelthayi,
I am hoping to get much more writings from u like this sir
ఒక రచయిత గ మీరు సూపర్ సక్సెస్ సార్.ఎందుకంటే ఎంతో మందికి తెలియని గొప్ప గొప్ప ఆవిష్కరణలు,అద్భుతాలు మన చుట్టే ఉన్న గుర్తించలేకపోతున్నం. కానీ మీరు వాటి యొక్క,వారి యొక్క గొప్పతనాన్ని మాకు తెలియని ఎంతో స్ఫూర్తి దాయకమైన విషయాలను మాకు తెలిజేస్తున్నారు.ఇదొక్కటే కాదు మీ నుండి వచ్చిన ప్రతి వ్యాసం,నవల,సినిమాలు అన్ని కూడా కొత్తదనాన్ని,విజ్ఞాన,వినోద సంపదను కూడా అందిస్తు వస్తున్నాయి.మీరు మరెన్నో రచనలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సార్.జై మెహెర్ బాబా మెహర్ బాబా వ్యాసం అద్బుతం.
గొప్ప సందేశం ఇచ్చారు
వ్యాసం చాల బాగుంది sir.
మీ రచనలు చాల స్ఫూర్తి ధాయాకంగా ఉంటాయి సార్, చదువు తున్నా కొద్ది తెలియని ఒక మరో ప్రపం ప్రపంచం లోకి తిసుకెళ్తాయ్.
అధునికథతో కొత్తదనం తో కప్న్పిస్తుంటాయి,
జీవితానికి ఒక మంచి సందేశాన్ని కల్పిస్తాయి
మీ రచనలు కాని సినిమాలు కాని ఇలా ఇంకా ఎన్నో రావాలని, మీరు ఆరోగ్యంగా చిరకాలం ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాము.
ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ లో మీరు ఒక రైటర్ గా మరియు ఒక దర్శకుడి గ దొర్కడం మా అద్రుష్టం అనే చెప్పుకోవాలి.
ఇంకా ఇలా ఎన్నో రచనలు, సినిమా లు మీ నుంచీ రావాలని కోరుకుంటు …
Urs adimerer
బి. రంజిత్