Editorial

Thursday, December 26, 2024
కాల‌మ్‌వజ్రాలు - కట్రౌతులు – కంకరరాళ్లు! – సూరజ్ వి. భరద్వాజ్ తెలుపు

వజ్రాలు – కట్రౌతులు – కంకరరాళ్లు! – సూరజ్ వి. భరద్వాజ్ తెలుపు

‘సూరజ్ వి. భరద్వాజ్ సీనియర్ జర్నలిస్టు. టెలివిజన్ జర్నలిజంలో ప్రత్యేక  ముద్ర ఉన్న వ్యక్తి.  మంచి వాక్యం రాయగల అరుదైన ఈ టెలివిజన్ జర్నలిస్టు ‘తెలుపు’ కోసం సూరజ్’ కా సాత్వా ఘోడా పేరిట మనం చూస్తున్న లోకాన్నేకాదు, చూడని వింతలనూ సరికొత్తగా దర్శనం చేయిస్తారు. ఈ వారం వజ్రాల గ్రహం గురించి తెలుపు.

వజ్రాల వానలు సరే! మరి విశ్వంలో ఏకంగా ఓ వజ్రగ్రహమే ఉంటే! దానిపై మానవుడు కాలుమోపితే! ఆ వజ్రాలను భూమ్మీదికి తరలిస్తే! ఏమౌతుంది? గుప్తులకాలం రిపీటవుతుందా! వజ్రాలు రాశులుగా పోసి సోలల లెక్కన అమ్మే టైం మళ్లీ వస్తుంది అనుకుంటున్నారా? నో, నెవర్! అదంతా ట్రాష్! మార్కెట్లో డైమండ్స్ వ్యాల్యూ డౌనయి, రేట్లు ఢమాలంటాయ్! వజ్రాలు కాస్తా ఉత్త కట్రౌతులు, కంకర రాళ్లవుతాయ్! ఇంతకీ ఆ వజ్రగ్రహం ఎక్కడుంది? దాని కథాకమామీషు ఏంటి? అంటే..

అదిగో సౌరమండలం బయట అక్కడ మిణుకుమిణుకుమని మెరుస్తోన్న ఆ గ్రహమే, వజ్రగ్రహం! భూమికి 41 కాంతి సంవత్సరాల దూరంలో కర్కాటక నక్షత్ర మండలంలోని 55 కాంక్రీ ‘ఏ’ అండ్ ‘బీ’ అనే జంటతారల చుట్టూ తిరుగుతున్న 5 గ్రహాల్లో అది కూడా ఒకటి!

ఆసాంతం వజ్రమయమై, భూమికి రెండింతలుండి, అధిక ద్రవ్యరాశి కలిగిన ఈ గోళాన్ని డైమండ్ ప్లానెట్ లేదా సూపర్ ఎర్త్ అని కూడా పిలుస్తున్నారు!

మన సౌరకుటుంబంలో యురేనస్, నెప్ట్యూన్, శాటర్న్ లాంటి గ్రహాలపై వజ్రాలవానలు కురుస్తాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించారు! సంచలన రీతిలో ఆ వర్షాలను ల్యాబుల్లో కృత్రిమంగా సృష్టించి సైంటిఫిక్ గా రుజువు చేశారు. ఈ ప్రయోగాలు ఇలా జరుగుతుండగానే వినువీధిలో సుదూరంగా ఉన్న జంటతారల సమూహంలో ఏకంగా ఓ వజ్రగ్రహమే ఉందని నాసా పరిశోధనల్లో వెల్లడైంది! ఈ ఎగ్జో ప్లానెట్ ను హబుల్ టెలిస్కోప్ తన సూపర్ పవర్ లెన్స్ తో క్యాప్చర్ చేసింది! 2 మిలియన్ కీ. మీ దూరంలో బైనరీ స్టార్ సిస్టంకు అత్యంత సమీపంగా తిరుగుతున్న ఆ గ్రహానికి నాసా సైంటిస్టులు 55 కాంక్రీ ‘ఈ’ అని నామకరణం చేశారు! ఆసాంతం వజ్రమయమై, భూమికి రెండింతలుండి, అధిక ద్రవ్యరాశి కలిగిన ఈ గోళాన్ని డైమండ్ ప్లానెట్ లేదా సూపర్ ఎర్త్ అని కూడా పిలుస్తున్నారు! ఇది దాని నక్షత్రం చుట్టూ కేవలం 18 రోజుల్లో పరిభ్రమణాన్ని పూర్తిచేస్తుంది! అంటే అక్కడ ప్రతి 18 రోజులకొక న్యూ ఇయర్ వస్తుందన్నమాట!

పెద్దపెద్ద గ్రాఫైట్ రాళ్లతో కూడిన ప్లానెట్ కోర్ భాగమంతా మూడు వంతుల స్పటిక వజ్రంతో కూడి ఉన్నదని సైంటిస్టులు భావిస్తున్నారు.

భూగ్రహంతో పోలిస్తే డైమండ్ ప్లానెట్ ద్రవ్యరాశి 8 రెట్లెక్కువ! అది ఎర్త్ కన్నా రెట్టింపు వ్యాసం (22891 కీమీ) కలిగి ఉంటుంది! దాని భ్రమణవేగం కూడా ఎక్కువే! టైడల్లాకయి ఉండటంతో నక్షత్రానికి అభిముఖం వైపు నిరంతరం పగలు, గ్రహానికి మరొకవైపు ఎప్పుడూ చీకటిమయమై ఉంటుంది! ఇక్కడ 1700℃ (3140°F) తీవ్రతతో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి! అంటే లోహమే కరిగిపోయేంత వేడన్నమాట! సూర్యకాంతి పడనివైపు వేడి కొంత తక్కువగా ఉంటుంది. 55 కాంక్రీ ‘ఈ’ గ్రహంపై 75 శాతం కార్బన్, 25 శాతం ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్ అస్సలు లేకపోవడంతో ఇక్కడ నీటిజాడ మచ్చుకైనా కనిపించదు! నీటిఆవిరి సంగతి సరేసరి! అదసలే ఉండదు! భూగ్రహం తరవాత శాస్త్రజ్ఞులు అట్మాస్పియర్ ను కనుగొన్న మొట్ట మొదటి ఎగ్జో ప్లానెట్ 55 కాంక్రీ ‘ఈ’. భూమితో పోలిస్తే ఈ గ్రహ ఉపరితలంపై వాతావరణం 1.4 శాతం ఎక్కువ మందం ఆవరించి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన పీడనాల కారణంగా ఇక్కడి కార్బన్ అణువులు గ్రాఫైట్ గా, ఆ తరవాత క్రిస్టల్ డైమండ్ గా రూపాంతరం చెందుతాయి! పెద్దపెద్ద గ్రాఫైట్ రాళ్లతో కూడిన ప్లానెట్ కోర్ భాగమంతా 3 వంతుల స్పటిక వజ్రంతో కూడి ఉన్నదని సైంటిస్టులు భావిస్తున్నారు.

ఏది ఏమైనా వజ్రాల వాకిట్లో నిలబడి మనిషి తన మస్తిష్కానికి పదునుపెడితే మాత్రం ఇక అంతే!

రేడియేషన్ ఎక్కువగా ఉండి, అనూహ్య వాతావరణ పరిస్థితులు కలిగి ఉన్న 55 కాంక్రీ ‘ఈ’ గ్రహంపై మానవుడు మనుగడ సాగించి నాగరిక సమాజాలు ఏర్పాటు చేయడం అసాధ్యం! ఒకవేళ అన్ని అవాంతరాలను అధిగమించి, సవాళ్ళను పరిష్కరించి తప్పిదారి ఈ గ్రహంపైన మనిషి అడుగుపెడితే?

భారీ ద్రవ్యరాశితో కూడిన ఈ సూపర్ ఎర్త్ పై గురుత్వాకర్షణశక్తి ఎక్కువగా ఉంటుంది. వస్తువులు అధిక బరువు తూగుతాయి! పైకి విసిరితే మెరుపు వేగంతో కింద పడతాయి! మనిషి వజన్ కూడా సడెన్ గా పెరిగిపోతుంది! నడక మొదలు పెడితే కొన్ని నిమిషాల్లోనే అలసిపోయి, ఆయాసపడటం ఖాయం! ఇక పూర్తి వజ్రమయమై మిరుమిట్లు గొలిపే కాంతితో ధగధగ మెరిసే ఈ గ్రహాన్ని చూడాలంటే మనిషి శక్తివంతమైన ప్రత్యేక కళ్ళజోడును ధరించాల్సిందే! అలాకాక, ఆ డైమండ్ ప్లానెట్ ను ఎవరైనా నేరుగా చూస్తే, వాళ్ళు ఏకంగా తమ కంటిచూపునే కోల్పోవాల్సివస్తుంది!

అంతర్జాతీయ సంస్థ ఫోర్బ్స్ మ్యాగజైన్, ఆ డైమండ్ ప్లానెట్ మార్కెట్ వ్యాల్యూను ఆల్రెడీ లెక్కగట్టడం ట్విస్ట్! ఆ వజ్రగ్రహం విలువ ఎంతనుకుంటున్నారూ? జస్ట్ 26.9 నానిలియన్ డాలర్స్! అంటే 26 పక్కన కేవలం 30 సున్నాలు పెడితే ఎంతో, అంతన్నమాట!

ఏది ఏమైనా వజ్రాల వాకిట్లో నిలబడి మనిషి తన మస్తిష్కానికి పదునుపెడితే మాత్రం ఇక అంతే! ఆ ప్రపంచంలో ప్రతిదీ వజ్రమయమే! బిల్డింగుల పునాదుల్లో సైతం వజ్రపురాళ్లు దర్శనమిస్తాయి! కాకిలెక్కల కాసుల పర్వం మొదలవుతుంది! ఆ మహా వజ్రపు గోళాన్ని డబ్బుల్లో కొలవడం షురూ చేస్తాడు! ఐతే, ధనికుల ఆస్తుల చిట్టాపద్దులు వెల్లడించి, వరల్డ్ లెవెల్ ర్యాంకింగులు ప్రకటించే అంతర్జాతీయ సంస్థ ఫోర్బ్స్ మ్యాగజైన్, ఆ డైమండ్ ప్లానెట్ మార్కెట్ వ్యాల్యూను ఆల్రెడీ లెక్కగట్టడం ట్విస్ట్! అకార్డింగ్ టు దట్ ప్రిడిక్షన్ ఆ వజ్రగ్రహం విలువ ఎంతనుకుంటున్నారూ? ఇట్స్ సో సింపుల్ అండ్ చీపండీ బాబూ! జస్ట్ 26.9 నానిలియన్ డాలర్స్! అంటే 26 పక్కన కేవలం 30 సున్నాలు పెడితే ఎంతో, అంతన్నమాట! ఇక మన రూపాయల్లోనైతే, అబ్బో! అందాజక్కూడా అందని ధరన్నట్టు! సరే, ఆ కాసుల లొల్లి పక్కనపెడితే, ఎకాఎకీ ఓ గ్రహం సైజులో వజ్రాల ఉత్పత్తి జరిగితే, డిమాండ్ – సప్లై గ్రాఫ్ బ్యాలెన్స్ తప్పడం గ్యారెంటీ! మార్కెట్లో డైమండ్స్ సప్లై విపరీతంగా పెరిగిపోయి, వాటి డిమాండ్ అధ: పాతాళానికి పడిపోతుంది! తరవాత ఆ వజ్రాలు గులకరాళ్ల మాదిరి కచ్చకాయలు ఆడుకోవడానికి తప్ప దేనికీ పనికిరావనడం బహుశా అతిశయోక్తి కాదేమో!

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article