Editorial

Wednesday, January 22, 2025
ఆనందంతన్మయత్వం తెలుపు - మారసాని విజయ్ బాబు ఈ వారం కథనం

తన్మయత్వం తెలుపు – మారసాని విజయ్ బాబు ఈ వారం కథనం

Illustration Beera Srinivas

చిత్రకారుడి సృష్టి అపూర్వం. అనంతం…

తనలోని వూహలను, కోరికలను, స్వప్నాలను, చిత్రాలను, ప్రతిబింబాలను, ఆవేదనను, ఆలోచనను, ఆనందాన్ని, చైతన్యాన్ని కళాత్మకంగా వ్యక్తం చేసే నేర్పరి అతడు. అటువంటి సృజనాత్మకమైన వ్యక్తితో పరిచయం నా వూహకైనా అందకుండా జరిగింది.

అది నా అదృష్టం.

అప్పటికే నాకు పదిహేడేళ్లు నిండిపోయాయి. బీయే ఫస్టియర్ లో చేరాను. వో నెల రోజులు గడిచిపోయాయి కూడా.
అంతా చిత్రంగా వుంది. కొంత గజిబిజి. ప్రపంచం యేదో కొత్తగా అర్థమవుతోంది. అన్నింటికీ మించి తిరుపతి యెస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నాకు భలే నచ్చింది. అందులోకి అడుగిడిన ప్రతి వుదయం అనిర్వచనీయమైన భావన యేదో నా హృదయంలో మెదలాడేది.
వో రోజు సర్క్యులర్ వచ్చింది. ఆర్ట్ కాంపిటీషన్ కు పేర్లిచ్చేవాళ్లు చేతులెత్తండని లెక్చరర్ అడిగాడు.
నాకు చాలా ఆనందం కలిగింది. హుషారుగా చేయి పైకెత్తాను.
చాలా బాధ కలిగింది.

జీవితంలో ఆపాదమస్తకం కుదిపేసే అపురూప ఆనంద క్షణాల గురించిన అనుభవగాథా సంపుటిలో ఇది ఐదో కథనం.

జీవితంలో మొదటిసారి చిత్రలేఖనంలో నాకు ఫస్ట్ ఫ్రైజ్ రాలేదు. పైగా ఆ పిల్ల బొమ్మ సరిగా వేయలేదు. ఆ అనాటమీనీ చూస్తే యెవరైనా సరే నవ్విపోతారు. వాటర్ కలర్స్ కాస్తా ఫర్వాలేదు. అయినా ప్రిన్సిపాల్ కూతురని మొదటి బహుమతిని యిచ్చేసినట్టుంది.
రెండో బహుమతి తీసుకునేందుకు స్టేజ్ పైకి రావాలని విజయ్ బాబు అంటూ నన్ను పిలిచారు.
అప్పటికే భరించరాని వేదనతో నేను వెనుతిరిగాను. యేదో పెద్ద అవమానం జరిగినట్టు నా శరీరంలోని అణువణువు ఆక్రోశంతో రగిలిపోతోంది.
అన్ని విధాల మెరుగైన నేను చిత్రించిన చిత్రానికి సెకండ్ ఫైజ్ యివ్వడమేమిటి? ఆ ప్రకటన నాలో యెన్నడూ కలగని అసంతృప్తిని రగిల్చింది.
నా అడుగులు వున్నట్టుండి ఆగిపోయాయి. అందుకు కారణం నా భుజాన్ని తాకిన వొక ఆత్మీయ స్పర్శే.
వెనుదిరిగి చూశాను.
ఆయన కళ్ళు ప్రశాంతతను వెదజల్లుతున్నాయి. మూర్తీభవించిన రుషిలా వున్నాడు ఆయన.
నాకు తెలుసు నువ్వెందుకు వెళ్లిపోతున్నావో… అన్నడాయన.
ఆ మాటకు ఆశ్చర్యపోయాను నేను. నా అంతరంగంలో యెగసిపడుతున్న  జ్వాలలను ఆయనెలా పసిగట్టాడు? అన్న సందేహం నన్నల్లుకుంది.

బావిలోని కప్ప చెరువులో పడ్డట్టు విస్తారమైన ప్రపంచంలోకి నువ్వు వచ్చేశావు. మునుపటిలా కాదు. యిక్కడ పోటీ పడాలంటే నువ్వు మరింత నేర్చుకోవాల్సిందే.

బాబూ, నీ సందేహం యేమిటో నాకర్థమైంది. నువ్వు చిత్రాన్ని వేస్తున్నప్పుడు నిన్ను నేను గమనించాను.
నువ్వు యీ ప్రపంచాన్ని మరచిపోయి అద్భుతంగా చిత్రించావు.
ఆయన వైపు కృతజ్ఞతతో చూశాను. నా నోటి వెంట ఆప్రయత్నంగా థాంక్యూ మాస్టారు అని అన్నాను. ఆ సమయంలో ఆయన్ను మాస్టారు అని యెందుకు అన్నానో నాకే తెలియదు. అదే సమయంలో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
మాస్టారు, చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలంటే చాలా యిష్టం. నేను మూడో తరగతి చదివేటప్పుడు పుస్తకంలోని బొమ్మలన్నింటినీ బోర్డుపై వేసేవాడిని. ఆరో తరగతి నుంచి యింటర్ వరకు ప్రతి సంవత్సరం నాకే మొదటి బహుమతి వచ్చేది. యీసారి రెండో బహుమతి తీసుకోవడానికి మనసు వొప్పుకోవడంలేదు.
నా మానసిక స్థితిని బాగా ఆర్థంచేసుకున్న ఆయన యిలా అన్నాడు.
బావిలోని కప్ప చెరువులో పడ్డట్టు విస్తారమైన ప్రపంచంలోకి నువ్వు వచ్చేశావు. మునుపటిలా కాదు. యిక్కడ పోటీ పడాలంటే నువ్వు మరింత నేర్చుకోవాల్సిందే.
నీలో గొప్ప చిత్రకారుడు దాగున్నాడు. లేదంటే రంగులు యెలా కలపాలో నీకు యింకా బాగా తెలియాలి. టెక్నిక్స్ తెలియకపోవడంవల్లనే నీకు మొదటి బహుమతి రాలేదు. ఆ అమ్మాయి చిత్రాన్ని మొదటి బహుమతికి యెంపికచేసింది కూడా నేనే.
విస్తుపోయాను నేను. నాకు తెలియకుండానే నాలోని అహం వో మెట్టు కిందికి జారింది.
నాపేరు హేమాద్రి. ఇక్కడే సెంట్రల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. పైగా డ్రాయింగ్ మాస్టార్నీ కూడా. నీకు వీలున్నప్పుడు నా దగ్గరకు రా. రంగులు యెలా కలపాలో చెబుతాను అంటూ కరచాలనం చేశాడు.
అలాగే మాస్టారూ అని అంటూ ఆయన చేతిని గట్టిగా పట్టుకున్నాను.
ఆ కరచాలనం నాకు కనువిప్పు కలిగించింది.

జీవితం గమ్మత్తయింది. యెవర్ని యెప్పుడు యెలా కలుపుతుందో తెలియదు, అనుకోకుండా పరిచయం అయిన హేమాద్రి మాస్టారు నా జీవిత గతినే మార్చేస్తారని నేనపుడు యెంతమాత్రం గుర్తించలేదు.

ఆరోజు ఉదయాన్నే సెంట్రల్ స్కూలుకు వెళ్లాను. ఆయన నవ్వుతూ నన్ను ఆహ్వానించాడు. అప్పటికే యేదో పనిలో వున్న ఆయన, తన టేబుల్ కు యెదురుగా వున్న కుర్చీలో కూర్చోమన్నాడు.
నేను కూర్చోని ఆ గది గోడలపై అందంగా అమర్చిన పెయింటిగ్స్ ని చూస్తున్నాను.
కొంతసేపటి తర్వాత ఆయన నన్ను వో పెద్ద గది దగ్గరకు తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లమని చెప్పి, వెలుపలి నుంచి గెడియపెట్టేశాడు.
నేను సంభ్రమాశ్చర్యానికి లోనైయాను.
పెయింటింగ్స్ తో ఆ గదంతా నిండిపోయివుంది. నేను వొక్కో దానిని చూస్తున్నాను.
మొత్తం ప్రపంచాన్నే యెవరో మూటకట్టుకుని తీసుకొచ్చి అక్కడ పోసినట్టుంది.
నా చుట్టూ నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దమే…నా మదిలో అనేకానేక దృశ్యాలు హత్తుకునేందుకు దోహదపడింది.
వో పెయింటింగ్ అయితే నన్ను అమితంగా ఆకర్షించింది.
రాత్రివేళ…
జోరుగా వర్షం పడుతున్నా లెక్కచేయకుండా…
వో పొడవాటి గోడకు నిచ్చెన వేసి…
దానిపై వో చిత్రకారుడు నిలబడి పెయింటింగ్ చేస్తున్నాడు.
ఆ పాడుబడ్డ గోడలోంచి మొలిచిన తీగను, దాని చివర వో ఆకును.
యింతలో హేమాద్రి మాస్టారు లోనికి వచ్చాడు.
నన్ను గమనించి…
యీ చిత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘ద లాస్ట్ లీఫ్’ కథకు సంబంధించినది అని, ఆ కథను చెప్పాడు.
వొక ఆర్టిస్ట్ అంటే యేమిటో, యెలా వుండాలో అప్పుడే నాకు అర్థమైంది.
జీవితం గమ్మత్తయింది. యెవర్ని యెప్పుడు యెలా కలుపుతుందో తెలియదు, అనుకోకుండా పరిచయం అయిన హేమాద్రి మాస్టారు నా జీవిత గతినే మార్చేస్తారని నేనపుడు యెంతమాత్రం గుర్తించలేదు.
విజయ్ బాబు రేపేదైనా బొమ్మను గీచుకురా. పెయింటింగ్స్ టెక్నిక్ ను నేర్పిస్తానన్నాడు హేమాద్రి మాస్టారు.
మర్నాడు అలానే చేశాను.

నెల తర్వాత తెలిసిందేమిటంటే…ఆల్ యిండియా ఆర్ట్ యెగ్జిబిషన్లో నా పెయింటింగ్ మొదటి బహుమతిని వశం చేసుకుందని. యిక నా ఆనందానికి అవధులు లేవు.

అదే బొమ్మను మరో ఆర్ట్ బోర్డుపై అయన చకచకా గీసేశారు.
తర్వాత రంగులను కలుపుతూ పెయింటింగ్ యెలా వేయాలో చక్కగా నేర్పించారు. ఆయన చెప్పినట్టే రంగులు వేశాను నేనూ.
విజయ్ బాబు, యీ పెయింటింగ్ చాలా అద్భుతంగా వచ్చింది. వచ్చేవారం గుంటూరు జిల్లా వెల్లటూరులో ఆల్ యిండియా ఆర్ట్ యెగ్జిబిషన్ వుంది. దానిని పూర్ణానంద శర్మ గారు నిర్వహిస్తున్నారు. ఆ కాంపిటీషన్ కు పంపుతానన్నారు.
మాస్టారూ, మీ యిష్టం అన్నాను సంతోషంగా…
నెల తర్వాత తెలిసిందేమిటంటే…
ఆల్ యిండియా ఆర్ట్ యెగ్జిబిషన్లో నా పెయింటింగ్ మొదటి బహుమతిని వశం చేసుకుందని.
యిక నా ఆనందానికి అవధులు లేవు.
ఇంతకీ ఆ చిత్రంలో వస్తువు, శైలి, సాంకేతికత అన్నీ బాగా కుదిరాయా? ఏమో. నాకప్పుడు తెలియదు. కానీ నేను చిత్రించింది, తల్లి తన్మయత్వంతో బిడ్డకు పాలిస్తున్న దృశ్యం.
నాకు తెలిసి అంతకుమించి అనిర్వచనీయమైన ప్రేమను వ్యక్తపరిచే చిత్రం మరొకటి వుండదని నా భావన.
చిత్రమేమిటంటే, చిత్రిస్తున్న సమయంలో ఆ చిత్రంలోనే కాక నాలోనూ ఆత్మీయత, అనురాగం, ఆనందం కదలాడింది. ఆ మధురానుభూతి ఈ వార్త తెలిసి రెట్టింపయ్యింది.
మారసాని విజయ్ బాబు  రైతుబిడ్డ. పుట్టింది చిత్తూరు జిల్లా మంగినాయనిపల్లిలో.  స్వతహాగా ఆర్టిస్ట్. సాహిత్యంపై అభిలాషతో కథలు రాశారు. అలాగే మహత్తర జీవిత కాంక్షను రగిలించే తాత్వికతతో ‘కొత్తగీతలు’ అన్న నవలను అందించారు. పైగా సీనియర్ పాత్రికేయులు. ‘సహచర’ సమాంతర ఆలోచనల సామాజిక వేదిక వ్యవస్థాపకులు. జీవితానుభవంలో ఎగసిపడిన ఆనందోత్సాహాలను, అందలి తాత్వికతను  వారం వారం ‘ఆపాదమస్తకం’ శీర్షిక ద్వారా అందిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article