Editorial

Wednesday, January 22, 2025
క‌రోనా మ‌హ‌మ్మారిమనసే మూలం : అమ్మ తెలుపు

మనసే మూలం : అమ్మ తెలుపు

Illustration Beera Srinivas

బడికి వెళ్ళి పెద్ద చదువులేమీ చదువక పోయినా, ప్రపంచాన్ని చదువగలిగే సహజసిద్ధమైన తెలివితేటలు కలిగిన మా అమ్మ లక్ష్మి, జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్ళను తన మనోధైర్యంతో ఎదుర్కో గలిగింది. అందులో ఇటీవలి కరోనా మహమ్మారి అనుభవాలు మీతో తప్పక పంచుకోవలసినవే.

త్రిపురారి పద్మ

అందరి కుటుంబాల్లోనూ అమ్మ అపూర్వం. కొండంత అండ. కానీ మా అమ్మలోని ప్రత్యేకత ఏంటంటే భయంకరమైన కాన్సర్ వ్యాధిని, ఆ తరువాత వచ్చిన ఊపిరితిత్తుల వ్యాధిని, ఒక నెల రోజుల క్రితం వచ్చిన కరోనా వ్యాధిని తన మనోధైర్యంతోనే ఎదురించడం. వాటిని జయించడమే కాదు. అన్నిటికీ మన మనసే మూలమనే మాటను నొక్కి వక్కాణించి చెప్పడం, అనుభవ పూర్వకంగా చాటడం, ఈ విషయం మన తరం తప్పక గ్రహించవలసి ఉంది.

ఎప్పుడు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు వచ్చినా, ఆ నిముషం బాధ కలుగుతుంది. కన్నీళ్ళూ వస్తాయి. కానీ ఆ కన్నీళ్ళను మన మనసే తుడిచి వేయాలి. కన్నీళ్ళ స్థానంలో కలల సౌధాలను నిర్మించగలిగేలా మనసును మలచుకోవాలని మా అమ్మ చెబుతుంది.  బాధ స్థానంలో బంధాల విలువను గుర్తుచేసుకొంటూ, మన చుట్టూ సంతోషకరమైన వాతావరణమే ఎప్పుడూ ఉండేటట్లుగా చూసుకోవాలని వివరిస్తుంది. మనసులో ఏ మాత్రం దిగులు. మేఘాలు కమ్మినా, వెంటనే నలుగురితో మాట్లాడడమో, లేక ఒక మంచి పుస్తకం చదువడమో లేదా ఏదైనా మంచి సినిమా చూడడమో లేదా నచ్చిన పాటలు వినడమో చేయాలే తప్ప, మనకున్న వ్యాధి గురించో లేక పడుతున్న బాధల గురించో పదే పదే గుర్తు చేసుకోవద్దని ఎప్పుడూ చెబుతుండేది. ప్రతిరోజూ పదిమందితో సంతోషంగా మాట్లాడతాను కాబట్టే, నాకున్న రుగ్మతలన్నింటినీ తరిమి వేయగలుగు తున్నానని చెబుతూనే, ప్రస్తుతం కరోనా వ్యాధితో బాధపడుతున్న వారికి ధైర్యవచనం తానవ్వాలని కోరుకుంటున్నది.

కష్టాలు కడగళ్ళు ఎన్ని వచ్చినా, తన ఆత్మ స్థైర్యంతో కుటుంబానికి బాసటగా నిలిచిన మా అమ్మ, ఇవాళ కరోనాకు భయపడే చాలా మంది చనిపోతున్నారని తెలుసుకొని, నా గురించి రాయి బిడ్డా. వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్పు. మన ధైర్యమే మనకు రక్ష అని నన్నే ఉదాహరణగా చూయించమని కోరింది. అందుకే ఈ అమ్మ బాట.

తాను కరోనా వ్యాధితో బాధపడుతున్న సమయంలో రోజూ హనుమాన్ చాలీసా చేస్తూనే, ఇతర పారాయణాలు చేసానని, చాగంటి సోమయాజులవారి సందేశాలను విన్నానని వివరించింది.

ఒక్కదాన్నే గదిలో ఉన్నాననే భావన మనసులోకి రానీయకుండా ప్రతి రోజూ కొడుకులు కోడళ్ళు, బిడ్డలు, మనుమలు మనుమరాండ్లు, స్నేహితులతో మాట్లాడానని చెబుతూనే, సమయాన్ని ఆధ్యాత్మిక చింతనతో పుస్తక పఠనంతో  గడిపేసానని చెబుతోంది.

ఇంతకీ మా అమ్మ చదివిన పుస్తకం ఏంటో తెలుసా? మా చిన్న మేనల్లుడి పదవతరగతి తెలుగు పుస్తకం.

ఇంతకీ మా అమ్మ చదివిన పుస్తకం ఏంటో తెలుసా? మా చిన్న మేనల్లుడి పదవతరగతి తెలుగు పుస్తకం.

అమ్మకు కరోనా అని తెలువగానే గదిని శుభ్రం చేసి, అన్ని వస్తువులు తీసి వేసాము. కానీ అనుకోకుండా పదవతరగతి తెలుగు పుస్తకం ఆ గదిలోనే ఉండిపోయింది. ఆ పుస్తకమే మా అమ్మకు ప్రాణస్నేహమయింది. అరవై ఎనిమిదేళ్ళ వయసులో కూడా కళ్ళద్దాలు లేకుండానే పుస్తకాలు చదువగలిగే మా అమ్మ, తనకు కనపడిన పదవతరగతి పుస్తకంలోని పాఠాలతో పాటు, రామాయణాన్ని చదివి, ఎంతో సంతోషపడింది. కరోనా సమయంలో ఆనందంగా కాలం గడిపింది.

ఇప్పుడే కాదు, మరి రెండు సందర్భాలను కూడా మీతో పంచుకోవాలి.

ఇప్పుడే కాదు, మరి రెండు సందర్భాలను కూడా మీతో పంచుకోవాలి. ఒకసారి యాత్రలకు వెళ్ళినప్పుడు శ్రీలంకలో మా అమ్మ బస్ ఎక్కక ముందే బస్ వెళ్ళిపోయిందట. అదంతా అడవి ప్రాంతం. అక్కడ ఆ పూజారి కుటుంబం తప్ప, మరెవరూ లేరట. ఎలాంటి వాహన సౌకర్యమూ లేదు. అయినా ధైర్యంగా అక్కడే ఉండిపోయిందట. వెళ్ళిన వాళ్ళు నేను లేనని తెలువగానే మళ్ళీ ఇక్కడికే వస్తారు. మళ్ళీ నేనెక్కడికో వెళితే వాళ్ళు మరెక్కడో వెతకడం ఇదంతా ఎందుకని అక్కడే కూర్చున్నదట. అమ్మ అనుకున్నట్టుగానే బస్ తిరిగి అక్కడికే వచ్చి, అమ్మను తీసుకొని వెళ్ళిందట.

ఇంకోసారి పాకిస్థాన్ బార్డర్ లో అక్కడ సైనికులను పరిచయం చేసుకొని మరీ భారత దేశ జండా పట్టుకొని బార్డర్లో అటూ ఇటు పరుగెడుతుంటే తానెంత గొప్పగా అనుభూతి చెందినదో గొప్పగా వర్ణించి చెబుతుంటే ఆశ్చర్య పోవడం మా వంతవుతుంది. ఆ సైనికుడి ఫోన్ నంబర్ తీసుకువచ్చి, చాలా రోజులు అతనితో మధ్య మధ్యలో మాట్లాడేది. అమ్మ హిందీ కూడా మాట్లాడుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎందరెందరినో పరిచయం చేసుకుంటుంది. అందరితో ఆత్మీయ బామ్మగా ఆనందం పంచుకుంటుంది.

కష్టాలు కడగళ్ళు ఎన్ని వచ్చినా, తన ఆత్మ స్థైర్యంతో కుటుంబానికి బాసటగా నిలిచిన మా అమ్మ, ఇవాళ కరోనాకు భయపడే చాలా మంది చనిపోతున్నారని తెలుసుకొని, నా గురించి రాయి బిడ్డా. వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్పు. మన ధైర్యమే మనకు రక్ష అని నన్నే ఉదాహరణగా చూయించమని కోరింది. అందుకే ఈ అమ్మ బాట.

           త్రిపురారి పద్మా ప్రసాద్ కవయిత్రి, ఉపాధ్యాయురాలు, జనగామ.

More articles

1 COMMENT

  1. అమ్మకు నమస్కారాలు.
    యెంత గొప్ప మాట. ఆమె సాధాసీదా మనిషి కాదు. నిలువెల్లా సృజనాత్మకతతో నిండి ఉంది. అంతేకాదు ప్రజల భావసంఘర్షణతో ఆమె మనసు సమ్మిళితమై వుంది.

    ఎలాంటి బాధాకరమైన సంఘటనలు వచ్చినా, ఆ నిముషం బాధ కలుగుతుంది. కన్నీళ్ళూ వస్తాయి. కానీ ఆ కన్నీళ్ళను మన మనసే తుడిచి వేయాలి. కన్నీళ్ళ స్థానంలో కలల సౌధాలను నిర్మించగలిగేలా మనసును మలచుకోవాలనడం…

    చాలా గొప్ప విషయం.
    కరతళా ధ్వనులతో ఆమెను అభినందిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article