Editorial

Monday, December 23, 2024
సంప‌ద‌"బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ ...బిడ్డలెందరూ కోల్..."

“బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ …బిడ్డలెందరూ కోల్…”

‘ఆడపిల్లంటే ఓ నడిశే పండుగ’ అంటరు పెద్దోల్లు. దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అమ్మాయిల్లేని పండ్గ అందం దక్వేకదా? ఏయ్ బుడ్డి బొడ్డెమ్మలూ, మీరూ బొడ్డెమ్మ ఆడుతారు కదూ!

బొజ్జ రమాదేవి 

బత్కమ్మ తల్లుల పండ్గ… బొడ్డెమ్మ పిల్లల పండ్గ. బత్కమ్మలచ్చి బాంబోలె పేల్తె బొడ్డెమ్మ పొటాసు బిళ్ళలోలె శిటపట లాడ్తది. బొడ్డెమ్మ దించుడు అందరిండ్లకు ఒంతనుండది. అందరేశినా ఐరాదు. ఐ ఒచ్చినోల్లు యాట యిడ్వకుంట ఎయ్యాలె. ఇంట్ల ఆడపిల్లలు లేకున్నా బొడ్డెమ్మ నేసుడు ఒంతనున్నోల్లు యిడ్శి పెట్టరు.

మా వాడల గుండా శంకరయ్యింట్ల అంటే సంధ్యక్కోల్లింట్ల ఏశేది. వాల్లమ్మ సుగుణమ్మ పుట్టమన్ను దెప్పిచ్చి నానబోశి పొద్దుగాల్నె ఇల్లు శుద్ధి జేస్కొని తలలకు బోస్కొని ఒక్క పొద్దుండి పొద్దుగాల్నె వాకిట్ల అలికి పచ్చబిండితోటి స్వస్తిక్ అన్నా, పద్మం అన్నా ముగ్గేశి తుల్శమ్మకు దీపం బెట్టి, వాకిట్ల ముగ్గుమీద పెద్ద శెక్కపీట, దానిమీద మోదుగాకుల ఇత్తారు ఏశి ఎనిమిది తంతెలతోటి అందంగ అంత్రాల బొడ్డెమ్మ ఏశేది. ఒక్కసారి ఏత్తే ఇచ్చుకపోద్దు. సోలుగా ఏయ్యాలె. బొడ్డెమ్మ నాల్గు పక్కలా మల్లా బెత్తెడు, బెత్తెడు తంతెలు గట్టాలె. అదొక శిన్నసైజు గాలిగోపురవోలె కొడ్తది ముద్దుగ. బొడ్డెమ్మ ఎనిమిదో శికెమీద కల్మం దాంట్ల అచ్చింతలు శెంబుమీద రైక మలుపు, దాని మీద కుడుక, కుడుకల పోకశెక్కలు, పసుపు గౌరమ్మ. అన్ని అంత్రాలను పసుపు కుంక్మ పచ్చబిండి బొట్లు పెడ్తరు. మల్లా బొడ్డెమ్మ సుట్టూతా పచ్చబిండితోటి గోటి ముగ్గేత్తరు, ఎందుకో తెల్వది. అన్ని అంత్రాలకు తీరొక్క పూలమాలలు సుడ్తరు. ఉద్రాచ్చ, కట్లాయి, గట్టి గొరివిడి, జాజి, తీగ బఠాని, ముద్ద గోరింట మాలలు, కలశం కాడ ముద్ద మందారాలు, నాల్గు గద్దెలకు ముద్ద బంతిపూలు ఇగ పుదిచ్చిన బొడ్డెమ్మను సూత్తె కండ్ల పండ్గే. ‘అది సూత్తే సగం కండ్ల నొప్పి పోతదే’ అనేది మా సుభద్రత్త. అదీ సైంటిఫిక్ రీజనే మరి.

పల్కల సంచి గూట్లె పారేశి జెప్ప జెప్ప సందెకత్ తీసి కాల్జేతులు, మొఖం గడుక్కొని బిన్న బిన్న ఉర్కి పెరట్ల ఉద్రాచ్చ పూలు తెంపేది. పెరడంతా ఉద్రాచ్చ పూల కమ్మటి వాసన ఇంకా నాకు గుర్తు.

మేం ఇంటిబెల్లు అవుడే ఆల్స్యం ఉర్కొచ్చేది. పల్కల సంచి గూట్లె పారేశి జెప్ప జెప్ప సందెకత్ తీసి కాల్జేతులు, మొఖం గడుక్కొని బిన్న బిన్న ఉర్కి పెరట్ల ఉద్రాచ్చ పూలు తెంపేది. పెరడంతా ఉద్రాచ్చ పూల కమ్మటి వాసన ఇంకా నాకు గుర్తు. పూలన్ని తప్కు (Plate)లేస్కుని పిడికెడు బియ్యం, పసూకుంక్మ, ఊదుబత్తులు, దస్తీల శెన్గెపప్పు, శెక్కరి, నేను, ఉమక్క, పెదబుజ్జి, శినబుజ్జి, అలివేలక్క, పుష్పనీల ఇంకా వాడకట్ల దోస్తులు జామ్మంటూ ఉర్కేది బొడ్డెమ్మ కాడికి.

బజార్లల్ల గద్దెలమీద మొగపోరగాల్లు కూసునేటోల్లు, ముచ్చట్లు పెట్టుకుంట, కిచ్చర కిచ్చర నవ్వుకుంట. పొటాసు మిషిన్లు రాళ్లమీద కొట్టుకుంట నా దోస్తు సదిగాడు రాయిమీద పొటాసు బిల్ల పెట్టి ఇంకో రాయితోటి కొట్టబోయి ఏలు మీద కొట్టుకుని ‘వా..’అని ఏడ్వంగానే అందరు ఒకటే నవ్వుడు. వాడికి శిగ్గై ‘నేను మా అవ్వను తీస్కొత్త ఉండు’ అని జారిపోయే నెక్కరు ఎడ్వశేతుల పట్టుకుని సందులబడి ఒకటే ఉర్కుడు.

వాళ్ళు రంగు రంగుల ఓణీలు కట్టుకోని నిజ్జంగ శీతాకోకశిల్కల్లా ఎంతందంగా ఉండెటోల్లో. అందర్కిరొండు జెడలు, మందారపూలు.

బొడ్డెమ్మ కాడికి పోయినంక అంతా మా అక్కల పెత్తనమే కదా మమ్మప్నూందుకు ఆడనిత్తరు కోలాటం.మేం బుడ్డ పోరగాల్లం. అరుగుమీద కూసోని సూశెటోల్లం పప్పు శెక్కరి ఎపుడు పెడ్తరా అని. వాళ్ళు రంగు రంగుల ఓణీలు కట్టుకోని నిజ్జంగ శీతాకోకశిల్కల్లా ఎంతందంగా ఉండెటోల్లో. అందర్కిరొండు జెడలు, మందారపూలు. మా ఉమక్క ఏస్కున్న ఆరుద్ర రంగు ఓణి నేను దాస్కొని ఏస్కున్న. మేం కొంచబోయిన బియ్యం సర్వల ఊదుబత్తులు బొడ్డెమ్మ కల్మానికి గుచ్చి ముట్టిచ్చేది. ఊదుబత్తులు పొటాసు బిల్లలు కల్మిన వాసన వాడవాడంతా గుప్పుమనేది. అదే దోమల మందు. అపుడు దోమలేడ ఈ రోగాలేడ. వీళ్లు లోపట చేతుల కోలాటం ఏస్కుంట పాటలు పాడ్తాంటే అవుతల వాల్లు టప్ప టప్ప పొటాసు బిల్లలు కాల్శెటోల్లు. పోటా పోటిగుండేది. అక్కలు పాట గట్టిగ అందుకునెటోల్లు.

‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ …బిడ్డలెందరూ కోల్…
నీ బిడ్డ నీల్ల గౌరూ కోల్ నిచ్చమల్లే శెట్టూ కోల్
నిచ్చమల్లె శెట్టుకూ కోల్ నిచ్చ నీల్లూ పోశీ కోల్
ఒక్కడే మాయన్నా కోల్ ఒచ్చన్నాబోడు కోల్’
అని ఉమక్క పాడేది.

సంధ్యక్క ‘ఒక్కేశి పువ్వేశి సందమావా ఒక్క జాము ఆయె సందమావా’ అని వామ్మో ఇరువైపూలు పాడేది. మేం ఇరువై పూవు ఎప్పుడు జెప్పిద్దా అని బిత్తర సూపులు సూశేటోల్లం. రొండు పాటలకే శీకటయ్యేది. ఇంకేవుంటది మంగళారతి ముట్టిచ్చి బొడ్డెమ్మను నిదురబుచ్చే పాట పాడేది.

‘కుంకుమల పుట్టే బొడ్డెమ్మ కుంక్మల్ల పెరిగే బొడ్డెమ్మ
కుంక్మల వసంతవాడే బొడ్డెమ్మ
పొన్నంగిరి తాళ్ళకెల్లీ పోకల గంటీ వనముల కెల్లి
వనము చిల్కయీ జివనక పల్కులు
వనమెంతో గౌరికి ధనవంతా..
ఉశ్కెల బుట్టె గౌరమ్మా ఉశ్కెల పెరిగే గౌరమ్మా
ఉశ్కెల వసంతవాడె గౌరమ్మా
పొన్నంగీరి తాల్లకెల్లీ పోకలగంటీ వనముల కెల్లీ
వనము చిల్కయీ జివనక పల్కులు
వనమెంతో గౌరికి ధనమంతా….’

ఇలా ‘పసుపులో పుట్టే గౌరమ్మా’ అని కూడా పాడ్తరు. అయినంక అందరికి ఆరతిచ్చి కండ్ల కద్దుకొని శేతులు జాపేది. పప్పొక్కలు నపరింత (తలాఇంత) బెడ్తె శెయ్యి నాక్కుంట బైటికొచ్చేది. వామ్మో తల్సుకుంటే నవ్వాగదిపుడు.

కాలువ దూరవుంటది. ఎంకటిగాడు, తోక రాజిగాడు, సత్తిగాడు, సాంబడు, ఎంకన్న లసుంవోడు (లక్షడు) లీల్లు రెడీ! సుట్టబట్ట నెత్తిమీద పెట్టుకొని ‘ఎంతెంత దూరం’ అంటూ ఒక్కొక్కల్లు ఎత్తుకునే టోల్లు.

గిట్ల ఆడ్త పాడ్త ఎనిమిది రోజులు బొడ్డెమ్మ నాడుకున్నంక తొమ్మిదో నాడు బొడ్డెమ్మ నేశినోల్లు అందరు తెచ్చిన బియ్యం నైవేద్యం ఒండ్తరు. మేం అందరం బడి బంద్ బెట్టేది. ‘అరె బొడ్డెమ్మ బాయిల బడేనాడు గుడ ఆడపిల్లలు బడ్కి పోతరా, గట్లైతే అమ్మ కొట్టది కదా’ గందుకే డుమ్మా గొట్టేది. పగటీలి కాంచే పూలు తెంపుడు కోల్ మాలలు గట్టుడు సందె బడ్డంక కొత్త బట్టలేస్కొని గుంపుల్ గుంపుల్ పొయేటోల్లం బొడ్డెమ్మ కాడికి. ఇయ్యాల ఇంట్ల పాటలుండయి. అంతా కాల్వ ఒడ్డుకే బొడ్డెమ్మ బరువుంటది. కాలువ దూరవుంటది. ఎంకటిగాడు, తోక రాజిగాడు, సత్తిగాడు, సాంబడు, ఎంకన్న లసుంవోడు (లక్షడు) లీల్లు రెడీ! సుట్టబట్ట నెత్తిమీద పెట్టుకొని ‘ఎంతెంత దూరం’ అంటూ ఒక్కొక్కల్లు ఎత్తుకునే టోల్లు. మరి అక్కలు హంస పిల్లలోలె ఒయ్యారంగా నడ్సుకుంట ఈ పాట పాడుకుంట పోయేటోల్లు బాటెంబడి గట్టిగా.

‘ఉవూదాక్ష పూశింది ఉద్రాక్ష కాశింది
ఉద్రాక్ష వనములు ధరణి కొరిగినై
పచ్చీస పచ్చీసలే గౌరమ్మ
పచ్చవరి తాలికలె
కట్లాయి పూశింది కట్లాయి కాశింది
కట్లాయి వనములు ధరణికొరిగినై
పచ్చీస పచ్చీసలే గౌరమ్మ
పచ్చవరి తాలికలే’
అని పాడుకుంట, నవ్వుకుంట పోయెటోల్లు అక్కలు.

అపుడు అమ్మాయంటే అందం. ఆనందం. ఇగ మేము బుడ్డ పోరగాండ్లం ముంగట ఉర్కి ఉర్కి ఉశ్కెల బడ్తె పలుగురాల్లు గీర్కపోయి మోకాళ్లు, మోచేతులు కొట్కపోయేవి. కాల్వల దిగితే సల్లటి నీల్లకు మంట పుడ్తె సుక్కలు కనబడేవి. ఇంటికొచ్చినంక అమ్మ దిట్టేది. నన్ను గాదు, అక్కను. దాన్నెంద్కు ఉర్కనిచ్చినవని ‘హా..హా..’ అని నేను అమాయకంగా జూశేది మిట్ట మిట్ట. మా అక్కయ్య నన్ను మింగెటట్టే శూశేది. అది వేరే సంగతి.

ఇగ కాలువ ఒడ్డుకు బొడ్డెమ్మను దించి సాంబడు ‘అన్నన్నా’..అనెటోడు. ఆన్నే కూలబడేటోడు. బొడ్డెమ్మ సుట్టు కల్మంల అచ్చింతలు కొన్ని సల్లెటోల్లు. ఎంపలి శెట్టు తెచ్చి గౌరమ్మకు తోడు బెట్టెటోల్లు. మల్లా పాటలు జోరందుకునేది.

ఇంటి గల్వల్లకు రాంగనే బొడ్డెమ్మను మర్శిపోయి రేపటి పెత్రామాస, బత్కమ్మ కొరకు మల్లా ఆరాటం.

శీకటెక్కువైన కొద్ది పాటల స్పీడు పెర్గేది. అయినంక బొడ్డెమ్మ మట్టి నపరింత తీస్కునేది. శిక్కుడాకులల్ల బెట్టుకుని అమ్మకిత్తె కూరాడు కిందబె లచ్మి అని. శీకటైనంక బొడ్డెమ్మకు ఆరగింపు జేశి మంగళారతిచ్చి

‘పోయిరా బొడ్డెమ్మ పోయి రావమ్మా
మల్ల గీ యేడుకు తిర్గి రావమ్మా
నీవు వెలిశిన చోట నిచ్చ మల్లేలూ
సకల శుభంబూలూ కల్గునోయమ్మా
ముత్తైదులందరూ మురిపెంబు దీరా
ముద్దగా గొలుతురో తల్లి గౌరమ్మా
శిన్న పిల్లలూ శిత్రంగ జేరి తీరొక్కపూలతో నిన్ను కొలుస్తారూ
పిల్లలకు శుభమూ పెద్దలకు జయమూ
పోయిరా బొడ్డెమ్మ పోయి రావమ్మా’…అని బొడ్డెమ్మను నీల్లల్ల ఓలలాడిచ్చి ఒదిలిపెడ్తరు.

అక్షింతలు, పసుపు గౌరమ్మా నపరింత బెడ్తె అక్షింతలు బియ్యంల, గౌరమ్మ పుస్తెలకు బెట్టుకునేది అమ్మ. ‘అబ్బ ఓ పండ్గ ఐపోయింది’ అని మేం అంతా రంది పడేది. ఇంటి గల్వల్లకు రాంగనే బొడ్డెమ్మను మర్శిపోయి రేపటి పెత్రామాస, బత్కమ్మ కొరకు మల్లా ఆరాటం.

వ్యాసకర్త బొజ్జ రమాదేవి హన్మకొండ వాస్తవ్యులు, కరీంనగర్ డిగ్రీ కళాశాలలో హింది ఉపన్యాసకురాలు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article