Editorial

Wednesday, January 22, 2025
ప్రేమ‌నువ్వెళ్ళిపోయాక : అపర్ణ తోట Musings on భగ్నప్రేమ

నువ్వెళ్ళిపోయాక : అపర్ణ తోట Musings on భగ్నప్రేమ

ప్రేమ, ప్రేమ అన్ని కలవరించే బలహీనతల బట్టలనూడదీసి కొట్టిన కొరడా దెబ్బల్లాంటి కథలు- ఇవన్నీ.

అపర్ణ తోట

ప్రేమ. ఉందా?

ఉంది, అనుకుందాం.

కొత్తగా వస్తుందా. వచ్చాక పోతుందా. వచ్చింది, పోతుంది. ఇక ఈ భగ్నప్రేమేంటి సామి?

లేదు లేదు.

Love is eternal. Love is Divine.

మరి! ప్రేమ మనసులో వెచ్చని వెన్నెల కాయించి, ఊహలలో ఊయలూగించి, చల్లని గాలులు, ఎదలో పన్నీటి జల్లులు, ఆకాశం లో ఇంద్రధనుస్సు…అబ్బబ్బబ్బా… ప్రేమ ఎంత మధురమైనది…

కానీ చూపు, శబ్దం, స్పర్శ, వాసం, రుచి అన్ని ఉన్న ఈ ప్రేమ, శ్వాస లో శ్వాసగా మరి మాయ చేసి అద్వితీయ లోకాలకు తీసుకెళ్లే ఈ ప్రేమానుభూతి ఎలా ఆరిపోతుంది?

అయితే మిత్రులారా! కాంక్ష, ఆశలు, ఆశయాలను నైతికతకు ఈవలే చూడగల ప్రేమ. సరిహద్దులను, మోతాదులనూ, స్వార్ధాలనూ, త్యాగాలనూ తూచే ప్రేమ. సమాజపు ఆమోదాన్ని కోరే ప్రేమ. ఇటువంటి భేషజాలతో అవధులు ‘లేని’ ప్రేమ భగ్నమవక ఏమవుతుంది.

తమ ఖాళీతనాలూ – దక్కనితనాలకు, వైఫల్యాలూ – మూర్ఖత్వాలకు, పంతాలూ – బలహీనతలకు, అహాలకూ- ఆవేశాలకు లోబడినవారు, అంటే ప్రేమించినవారు, చివరికి భగ్నప్రేమికులవుతారా?

ప్చ్. నిజంగా ప్రేమంటే ఇన్ని ఉన్నాయా? కళ్ళలో కళ్ళు పెట్టి, చేతిలో చేయి వేసి, ఒకటినొకరు చూసుకుంటూ లోకాన్నే మరచి, మైమరిచిపోయే ప్రేమ ఏది?

ఉంది కానీ, రాత్రి గడిచాక, ఊరొచ్చాక, నలుగురు చూసేశాక, మనసు నిండేశాక, శరీరం అలిసిపోయాక, జేబు ఖాళీ అయ్యాక… ఈ లెక్కలు మొదలవుతాయి. అసలక్కడి వరకు రాలేదనుకో, భయమేం లేదు. అప్పుడు కూడా డబల్ ప్రమోషన్ తో ముందే భగ్నప్రేమికుల కిరీటం తగులుకుంటుంది.

విరహం, ఎదురుచూపులు, అబద్ధపు సిగ్గును మతించని వెర్రిమోహం, ఆడవారి తెంపు, మగవారు పడక పై పడే సిగ్గు, ప్రీమారిటల్ సెక్స్, లివ్- ఇన్ రిలేషన్స్, క్వీర్ లవ్, టాక్సిక్ లవ్, కనిపించని హింస, నార్సిస్టు తో ప్రేమ- ఇటువంటి అద్భుత కథనాలు, కథాకావ్యాలు – ఈ బ్రేక్ అప్ స్టోరీలు.

నిజం చెప్పనా!

అసలు ప్రేమికులుగా మారిన రోజే, ప్రేమ భగ్నమవుతుంది.

విరహం, ఎదురుచూపులు, అబద్ధపు సిగ్గును మతించని వెర్రిమోహం, ఆడవారి తెంపు, మగవారు పడక పై పడే సిగ్గు, ప్రీమారిటల్ సెక్స్, లివ్- ఇన్ రిలేషన్స్, క్వీర్ లవ్, టాక్సిక్ లవ్, కనిపించని హింస, నార్సిస్టు తో ప్రేమ- ఇటువంటి అద్భుత కథనాలు, కథాకావ్యాలు – ఈ బ్రేక్ అప్ స్టోరీలు. ప్రేమ, ప్రేమ అన్ని కలవరించే బలహీనతల బట్టలనూడదీసి కొట్టిన కొరడా దెబ్బల్లాంటి కథలు- ఇవన్నీ.

ఊర్వశి కోసం వగచిన పురూరవుడి నుంచి మంత్రగత్తెల పాటలకు పిచ్చెత్తిపోయిన యులస్సీస్ దాకా; పల్లెటూరు నుంచి ఖండాతరాలు దాటి, హిల్ స్టేషన్లు దాటి, శ్రీనగర్ కాలనీ వీధుల మీదుగా, రెస్టారెంట్ లోను,పొదలమాటున, పబ్బులలోనూ, హద్దులు దాటే ఈ ప్రేమ ఎప్పుడో ఒకప్పుడు గుండెను బద్దలుకొట్టే తీరుతుంది.

అప్పుడే ఇటువంటి నిజాయితీ నిండిన కథలు బయటకువస్తాయి.

అప్పటిదాకా ప్రేమ జిందాబాద్!

అపర్ణ తోట రచయిత్రి. వారి కథా సంపుటి ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ ఇటీవలే పునర్ముద్రణ పొందింది కూడా.

‘నువ్వెళ్ళిపోయాక’ పన్నెండు భగ్న ప్రేమ కథల సంపుటి. ఇది ‘అన్విక్షికి’ యాభయ్యవ ప్రచురణ. సంపాదకులు స్వాతికుమారి బండ్లమూడి, అరిపిరాల సత్య ప్రసాద్. కాపీలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article