Editorial

Thursday, November 21, 2024
కాల‌మ్‌అంకురం : లక్ష్మికి పాప పుట్టింది! – సుమిత్ర తెలుపు

అంకురం : లక్ష్మికి పాప పుట్టింది! – సుమిత్ర తెలుపు

పొద్దున్నే “పాప పుట్టింది అక్కా” అంటూ ఫోన్ చేసింది. ఎంత ఆనందం. ఆ సంతోషాన్ని పంచుకున్నాక ఫోటో ను కూడా  పంపింది. ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేం.

సుమిత్ర మక్కపాటి

“పాప పుట్టిందక్కా!’ అంటూ ఈ రోజు సంతోషంగా ఫోనులో  చెప్పింది శ్రీలక్ష్మి! బిడ్డ ఫోటో పంపించి మరీ చూపించింది. ఆ ఆనందంలో ఎన్నో జ్ఞాపకాలు! ఎలా వచ్చింది తను! ఎలా ఉండెది?

అది 2000 సoవత్సరం. ఎనిమిదేళ్ళ వయసులో అంకురం హోమ్ లో చేరిన శ్రీలక్ష్మి ఎప్పుడూ ముభావంగానే ఉండేది!

హోమ్ లో పిల్లలు, ఎవరిపని వాళ్ళే చేసుకోవాలి అని పెట్టిన నిబంధనను ఎల్లప్పుడూ దాటేస్తు, పక్కవాళ్ళ పనిని కూడా మీదేసుకుని చేసుకుపోయేది. ఎంత వారించినా వినేది కాదు. పిల్లలంతా కేరింతలు కొడుతూ, అల్లరల్లరి చేసే సమయాల్లో కూడా శ్రీలక్ష్మి దూరంగా నిల్చుండి నిశ్చలంగా చూస్తూ ఆనందించేది. తనకెలా ఉండాలనిపిస్తే అలానే ఉండనివ్వండి, బలవంతంగా సంతోషపెట్టడానికి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేదాన్ని పిల్లలతోను, వారితో పనిచేస్తున్న సిబ్బందికి!

ఒకసారి, వేసవి సెలవులకు తన నాయనమ్మ దగ్గిరకి వెళ్లాలని కోరింది శ్రీలక్ష్మి.

ఆమె కోరుకున్నట్లే నాయనమ్మ దగ్గిర వదిలి వచ్చాము. నెల రోజులు తర్వాత శ్రీలక్ష్మి తిరిగి హోమ్ కి వచ్చేసింది. ఏమైందీ ఎవరికీ తెలియదు, కానీ చావుకు దగ్గర్లో పడిన శరీరాకృతితో హోమ్ లో వదిలివేయబడింది ఆ రోజున!!

శరీరం పైన వాలుతున్న ఈగలని తోలడానికి భారంగా చేయిని కదుపుతోంది శ్రీలక్ష్మి. తన కళ్ళు తెరిచే ఉన్నాయి. ఒక్క ఉబ్బిపోయిన పొట్టభాగం మినహా, శరీరమంతా శుష్కించి పోయి ఉంది. ఒక్కసారిగా హోమ్ పిల్లలతో పాటు, అందరం బావురుమన్నాం

ఎవరు వచ్చి తనను హోమ్ లో వదిలివెళ్లారో కూడా చెప్పలేని స్థితిలో ఉంది శ్రీలక్షి. నీళ్ళతొట్టి ప్రక్కన గుబురుగా పెరిగిన సపోటా చెట్టుకింద ఆమెను వదిలేసి వెళ్లారు. శరీరం పైన వాలుతున్న ఈగలని తోలడానికి భారంగా చేయిని కదుపుతోంది శ్రీలక్ష్మి. తన కళ్ళు తెరిచే ఉన్నాయి. ఒక్క ఉబ్బిపోయిన పొట్టభాగం మినహా, శరీరమంతా శుష్కించి పోయి ఉంది. ఒక్కసారిగా హోమ్ పిల్లలతో పాటు, అందరం బావురుమన్నాం, ఆ పరిస్థితిలో శ్రీలక్ష్మి ని చూసి…!

వాళ్ల బంధువులని పిలిపించి అసలేం జరిగింది కనుక్కోడానికి ప్రయత్నం చేసాం. ఎవరూ సమాచారం ఇవ్వడానికి కానీ ఆమె దగ్గరికి రావటానికి కానీ ఇష్టపడలేదు. హోమ్ లో చేరే ముందు చైల్డ్ లైన్ వారు ఇచ్చిన సమాచారం ప్రకరo ఆమె అమ్మా నాన్నలు ఇద్దరూ లేని పిల్ల అనిమాత్రమే తెలుసు. కానీ ఆమె పూర్వపు ఆరోగ్య సమాచారం ఏమీ మా వద్ద లేదు. ఎట్లైనా శ్రీలక్ష్మిని బతికించుకోవాలని అందరం ఒక్కమాటమీదికొచ్చాం! వాళ్ళ నాయనమ్మను మా ఆటోలో ఎక్కించుకుని హోమ్ కి తీసుకొచ్చాం. తెలిసిన డాక్టర్ ల దగ్గరకెళ్లి చూపించాం. అవసరమైన టెస్టులు చేపించాం. ఆఖరికి గాంధీలో అడ్మిట్ చేసి, నిర్ధారణ అయిన కడుపులో టీబీ తగ్గేవరకు, హోమ్ లో పిల్లలు సిబ్బంది, వంతులవారీగా ఉదయం, మధ్యాహ్న, రాత్రి శ్రీలక్ష్మికి భోజనం, మందులుఇస్తూ, తోడుగా ఉండి సరైన మందులను క్రమం తప్పకుండా వాడి, అనుకున్న మాట ప్రకారం శ్రీలక్ష్మిని బతికించుకున్నాం!!

హస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత , శ్రీలక్షిలో చాలా మార్పును గమనించాం. నెమ్మదిగా తనగురించి పట్టించుకోవడం మొదలెట్టింది.  తనకోసం ఏమి కావాలో అడగటమూ ప్రారంభించింది. తనకో చెల్లి ఉందని, ఆరేళ్ళ చెల్లిని వాళ్ళ మేనత్త రోజూ ఇండ్లలో పనికి తీసుకెళ్తున్నదనీ, ఎలాగైనా ఆమెను వాళ్ళ మేనత్త చెర నుండి విడిపించి హోంలో తనతోపాటు ఉంటూ స్కూల్ కి పంపే ఏర్పాటు చేయమనీ కోరింది.

పిల్లల కమిటీలో పెట్టిన శ్రీలక్ష్మి డిమాండ్ ను సిబ్బంది వెంటనే ఆమోదించి, శ్రీలక్ష్మితో కలిపి ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పడి, చాకచక్యంగా శ్రీలక్షి చెల్లిని హోమ్ కి తెచ్చేయడమూ జరిగింది.

సవాళ్లు ఎప్పుడూ పిల్లలను అన్యాయంగా దోపిడీ చేస్తూ వాడుకునే వర్గాలనుంచే వస్తాయన్న అంచనాతో ఉండే సంస్థ సభ్యులకు ఇది నిజంగా పెద్ద షాక్!

ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే సంస్థ సభ్యులకు షాక్ తగిలింది. అది ఈ కేస్ లో పిల్లల శ్రమని దోచుకుంటున్న వాళ్ళ బంధువుల నుంచే…

“మా పిల్లను ఫలానా సంస్థ వాళ్ళు కిడ్నప్ చేశారు” అని పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ దాఖలు చేశారు. పేదవాళ్ళ కోసం వాళ్ళ పిల్లల అభివృద్ధికోసం పనిచేస్తున్నామని అనుకుంటూ, సవాళ్లు ఎప్పుడూ పిల్లలను అన్యాయంగా దోపిడీ చేస్తూ వాడుకునే వర్గాలనుంచే వస్తాయన్న అంచనాతో ఉండే సంస్థ సభ్యులకు ఇది నిజంగా పెద్ద షాక్!

పిల్లల శ్రమపై ఆధారపడటానికి అలవాటుపడిన దగ్గిర బంధువులు, పెదవాళ్ళ నుంచి కూడా ఇలాంటి సవాళ్లు ఎదురవుతాయని మొదటి సారి గ్రహింపు లోకి వచ్చింది.

పోలీస్ స్టేషన్ కు వెళ్లి, పిల్లలు ఇద్దరినీ చూపించి, పిల్లలతోనే మాట్లాడించి ఉన్న నిజం బయటపెట్టాల్సి వచ్చింది పోలీస్ ల ముందు. సరే, వచ్చిన వాళ్ళు పేదవర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి, మా మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. అదే అవతలి వాళ్ళు ధనిక వర్గం అయినట్లైతే, పరిస్థితి మరోలా ఉండేది కదా!!

మొత్తానికి శ్రీ లక్ష్మి కి సంభందించి నేడు అందుకున్న వార్త గతంలో పడ్డ కష్టాలను ఒక్కసారి మరచిపోయేలా చేసింది.

ఎనిమిదేళ్ళ వయసులో మా దగ్గరకు వచ్చిన శ్రీలక్షి కి ఇప్పుడు ఇరవై తోమ్మిదేండ్లు. తాను స్వతంత్రంగా బతుకుతుంది… ఉద్యోగంచేసుకుంటూ. అంతేకాదు, చదువుకుని ఉద్యోగం చేస్తున్న ఒక మార్వాడీ అబ్బాయి తో తన చెల్లికి తానే పెళ్లిచేసి౦ది. చెల్లికి దగ్గరుండి ప్రసవం చేయించిoది. అన్నీ గుర్తోస్తున్నాయి.

పిల్లలను భారం అనుకోని అనాధలు లేని ఒక మంచి సమాజం రావాలి.

పొద్దున్నే “పాప పుట్టింది అక్కా” అంటూ ఫోన్ చేసింది. సంతోషాన్ని పంచుకున్నాక ఫోటోను పంపింది. ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేం.

నిజానికి పిల్లలంతా ప్రేమపాత్రులే…
పెద్దలే మారాలి!

పిల్లలకు రక్షణనివ్వాలి!

కులo, మతం, ప్రాంతo, భాష అనే భేదభావాలు లేని…
పిల్లలను భారం అనుకోని అనాధలు లేని ఒక మంచి సమాజం రావాలి.

కాలమిస్టు పరిచయం

సుమిత్ర గారి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. పిల్లలు, మహిళలు వారికి రెండు కళ్ళు. విద్య, సాధికారత ఆమె నిండు ఆశయాలు. రెండున్నర దశాబ్దాల వారి నిర్విరామ స్వచ్ఛంద సేవ గురించి మూడే మూడు పదాల్లో చెప్పాలంటే ‘ఆదరణ, సంరక్షణ, అభ్యున్నతి’ అని అభివర్ణించవచ్చు.

పల్నాడులోని రెంటపాళ్ళలో జన్మించిన సుమిత్ర మక్కపాటి హక్కులతో పాటు బాధ్యతల గురించీ ఎలుగెత్తే గొంతుక. ఎదురొడ్డి పోరాడే క్రమంలో నిరంతరం తాను అంకురం. వారి సంస్థ పేరు కూడా అదే. అంకురం తరపున ‘సంకల్పం’, ‘అప్నా ఘర్’లు ఆడపిల్లలకు ఆమె అందించిన అండదండలని పై కథనం చదివినా అర్థం అవుతుంది. తెలుపు ప్రచురించిన తన కాలమ్ వ్యాసాలు ఇవి…

అంకురం
భూమి ఆకాశం అంత తేడా!
మొదట్లోనే చెప్పినట్టు … అదే జరుగుతోంది!

 

 

More articles

1 COMMENT

  1. అనాథబాలలకు జీవితం మీద ఆశలు “అంకురింప”జేస్తున్న అందరికీ….. అభివందనాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article