ఉద్యోగ జీవితం కారణంగా పెరిగిన ఒత్తిడి, ఘర్శణాత్మక జీవన సరళిని త్రోసి రాజని అత్మశాంతితో బ్రతికేందుకు వెనక్కు వచ్చిన ఆధునికులు వారు.
స్వాతంత్ర దినోత్సవం రోజున చేపట్టిన సైకిల్ రైడ్ అవధి, లక్ష్యం – అటువంటి ‘అనహద్’ సృష్టికర్తలను కలవడం, వారు ఏ విధంగా స్వేచ్చను పొంది స్వతంత్ర జీవనం గడుపుతున్నారో స్వయంగా చూసి తెలుసుకోవడం.
కందుకూరి రమేష్ బాబు
నిన్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఫ్రీడం సైకిల్ రైడ్’ పేరిట కొద్ది మంది మిత్రులు ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న అప్పా జంక్షన్ నుంచి మొదలై వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం, నారెగూడెం గ్రామ పరిధిలో సుమారు 18 ఎకరాల్లో నిర్మాణమైన ‘అనహద్’ – ‘పర్యావరణ ప్రేమికుల నెలవు’కు వెళ్ళడం ఒక మంచి అనుభవం. రాను పోను కలిపి వంద కిలోమీటర్ల ‘రైడ్’ ఇది.
ఈ సైకిల్ యాత్రకు ప్రేరణ ‘వందేమాతరం’ మాధవరెడ్డి గారు. వారు ఆధునిక జీవనంలో ఆరోగ్యానికి, ఆనందానికి సైకిల్ యాత్ర ప్రాధాన్యతను నొక్కి చెబుతూ యువతను సైకిల్ రైడ్స్ లో భాగస్వామ్యం చేస్తున్న ‘Pedal Paltons’ సంస్థ వ్యవస్థాపకులు. ఈ కార్యక్రమాన్ని వారు కోఆర్డినేట్ చేయగా, భవన నిర్మాణ రంగంలో పేరొందిన ‘ఆర్క్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ చైర్మెన్ గుమ్మి రామిరెడ్డి గారు నాయకత్వంలో ఇరవై మంది బృందం ‘అనహద్’ ( Anahad) కు చేరుకోవడం మరో విశేషం.
ఒక్క మాటలో చెప్పాలంటే భద్ర జీవితాన్ని వదిలి పెట్టి ప్రకృతి ఒడిలో ఒదిగిన బిడ్డలు వాళ్ళు.
‘అనహద్’ అన్నది ఒక ‘Eco Community’. ఇద్దరు సోదరులు అబిద్ – షబ్బర్ గార్లు దాని వ్యవస్థాపకులు. వారు మధ్యప్రదేశ్ వాస్తవ్యులు. మన భాగ్యనగరంలో సాఫ్ట్ వేర్ రంగంలో పని చేసే వీరు ఉద్యోగ జీవితంలోని పరిమితిని గుర్తించి, అవధులు లేని జీవితోత్సాహం కోసం లాభాపేక్ష లేకుండా, పై పైకి ఎదగాలన్న లక్ష్యాలను వొదిలిపెట్టి సాధారణ మానవులుగా మారిన ప్రొఫెషనల్స్.
ఒక్క మాటలో చెప్పాలంటే భద్ర జీవితాన్ని వదిలి పెట్టి ప్రకృతి ఒడిలో ఒదిగిన బిడ్డలు వాళ్ళు. యాంత్రిక జీవితం డిమాండ్ చేసే ‘కంపార్టమెంటలిజం’, మూస ‘ప్రోగ్రామింగ్ సరళి’ని వదిలి, తద్వారా జీవిత పర్యంతం ఎదుర్కొనే వైరుధ్యాలను పక్కన పెట్టి , ఒత్తిడి పెంచే ఘర్శణాత్మక జీవన సరళిని త్రోసి రాజని అత్మశాంతితో బ్రతికేందుకు వెనక్కు వచ్చిన ఆధునికులు వారు. స్వాతంత్ర దినోత్సవం రోజున చేపట్టిన సైకిల్ రైడ్ అవధి, లక్ష్యం ‘అనహద్’ సృష్టికర్తలను కలవడం, వారెలా స్వేచ్చను పొంది స్వతంత్ర జీవనం గడుపుతున్నారో స్వయంగా చూసి తెలుసుకోవడం.
పదేళ్ళలో వందమంది సివిల్ సర్వెంట్లను మన దేశానికి అందించే బృహత్తర బాధ్యతను సైతం తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.
కాగా, నిరుపేదలు, సామాన్యుల ఉన్నతి కోసం పాటుపడే స్వభావం గుమ్మి రామిరెడ్డి గారిది. ప్రతిభ చేరుకోవాల్సిన చోటకు తప్పక చేరుకోవాలన్నది వారి సంకల్పం. ARK అన్న తమ భవన నిర్మాణరంగ సంస్థ ‘Above and Beyond’ అన్న లక్ష్యంతో పని చేసేలా వారు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. మూడున్నర దశాబ్దాలలో రామి రెడ్డి గారు నైతిక విలువలతో కూడిన సుధ్రుడ వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రమే నిర్మించలేదు. దాతృ హృదయం గల వీరు తమ ఫౌండేషన్ ద్వారా వందలాది బాల బాలికలకు విద్యారంగంలో వెన్నుదన్నుగా నిలుస్తూ వారు చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరేందుకు అండదండలు అందిస్తున్నారు. అంతేకాదు, ఈ పదేళ్ళలో వందమంది సివిల్ సర్వెంట్లను మన దేశానికి అందించే బృహత్తర బాధ్యతను సైతం తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. దేశంలోనే అతి పెద్ద గోశాలను రాష్ట్రంలో సాధ్యం చేయడం కూడా వారి సమున్నత ఆదర్శాలలో మరొకటి. వారూ, మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా ‘అనహద్’ మిత్రులను కలుసుకుని, వారి ఆతిథ్యాన్ని స్వీకరించి ప్రకృతి కేంద్రంగా వారు అనుసరిస్తున్న జీవన సరళి గురించి తెలుసుకునేందుకు ఒక బృందంగా వెళ్ళ రావడం ఒక చక్కటి అనుభూతి.
చిట్ట చివరకు ఒక చోట ఆగి ప్రకృతితో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఆత్మ శాంతితో బతకాలన్న నిర్ణయానికి వచ్చారు.
సరిపడినంత డబ్బు, చేతినిండా పని, బ్రతికేందుకు విలాసవంతమైన బంగాళా తదితర సౌకర్యాలు అన్నీ ఉన్నప్పటికీ అంతరంగంలో ఎదో తెలియని అశాంతి ‘అనహద్’ స్థాపనకు మూలం అని తెలిసింది. ముందు చెప్పినట్టు ఇద్దరు సోదరుల పూనిక ఇది. ఆ ఇద్దరు సోదరుల్లో మొదట షబ్బర్ మేలుకున్నారు. జీవితంలోని సకల పార్శ్వాలను ఉద్యోగ జీవితమే ప్రభావితం చేస్తున్నదని, దాని కారణంగా ఎంత పని చేసినా సంతృప్తి లేకపోవడం, ప్రయాణించే మార్గంలో నిరంతర ఘర్షణ, తద్వారా ఎదో తెలియని అశాంతిని వారిని నిలవనీయలేదు. ఆ కారణంగా తాను, తన భార్య దేశమంతా తిరిగారు. చిట్ట చివరకు ఒక చోట ఆగి ప్రకృతితో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఆత్మ శాంతితో బతకాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయ ఫలితమే పద్దెనిమిది ఎకరాల్లో నెలకొన్న ఈ రమణీయ ఆశ్రమం. సువిశాల కార్యశాల. ఇది 2016లో ప్రారంభమైంది.
షబ్బీర్ ఆలోచన నచ్చి మొదట అతడి సోదరుడు తన భార్యతో కలిసి వచ్చారు. ఆ తర్వాత దేబాంజన్, దిలీప్ గారి దంపతులూ వచ్చి చేరారు.
ఇప్పుడు దాదాపు ఐదు కుటుంబాలు ఇక్కడ పిల్లాజెల్లతో, పశు పక్ష్యాదులతో, ప్రకృతి కేంద్రంగా జీవితం గడుపుతున్నాయి. చూస్తుండగానే వ్యవసాయం ఇరుసుగా వారి జీవితం మారిపోయింది. దానికో తోడు చల్లటి ఇండ్లలో జీవనం.
ఉద్యోగ జీవితంలో గడిపిన జీవితంతో పోలిస్తే వీరు ‘అనహద్’ స్థాపించిన అనతికాలంలో సాధించినదే ఎక్కువ.
అవును. తాము తినే ఆహారం కోసం చేసుకునే వ్యవసాయం వారికి జీవానాధారంగా మారింది. సేంద్రీయ వ్యవసాయంతో వారు వివిధ పంటలతో పాటు పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. ఆదే విధంగా తాము నివసించడానికి ఏర్పాటు చేసుకున్న ఎకో ఫ్రెండ్లీ ఇండ్లను ఇతరుల కోసం నిర్మించి ఇవ్వడానికి వారు పూనుకునేలా చేసింది. అది కూడా వారి అవసరాలకు ఆధారంగా నిలిచే ‘ఎంటర్ ప్రైజ్’ గా మారడం విశేషం.
అట్లా ఉద్యోగ జీవితంలో గడిపిన జీవితంతో పోలిస్తే వీరు అనతికాలంలోనే సాధించింది ఎక్కువే. ఈ ఏడేళ్ళలో తాము సుఖశాంతులతో జీవిస్తూ ఇతరులకు అనందాయకమైన ఆదర్శ జీవనం గడిపేలా ఈ కుటుంబాలు మారడం అన్నది నిజానికి అతి తక్కువ కాలంలో సాధించిన విజయం కిందే చెప్పాలి.
ఇండ్లు నిర్మాణం కోసం వీళ్ళు ప్రసిద్ద బ్రిటీష్ ఆర్కిటెక్ట్ లారీ బేకర్ విధానాన్ని అవలభించారు.
సిమెంట్, కంకర జోలికి వెళ్ళకుండా ఇటుక, బంక మన్ను, డంగు సున్నం తదితర స్థానిక మెటీరియల్ ను వాడుతూ లోకల్ Artisansతోనే వారు తమ ఇండ్లు నిర్మించుకున్నారు. అందుకోసం ప్రసిద్ద బ్రిటీష్ ఆర్కిటెక్ట్ లారీ బేకర్ ఇండ్ల నిర్మాణానికి దగ్గరైన విధానాన్ని వీరు అవలభించారు. నిర్మాణ కౌశలం కోసం బెంగుళూరులోని ఒక సంస్థ వారితో వారు అంగీకారానికి వచ్చి తమ ఇండ్ల నిర్మాణంలో పాల్గొనే స్థానిక పనివాళ్లకు శిక్షణ ఇప్పించారు. ఆ బృందంతో వారు అడిగిన వాళ్లకు ఇంటి నిర్మాణంలో సహకరిస్తున్నారు కూడా.
దీనికి తోడు ఇప్పుడు ‘అనహద్’ అనేక వర్క్ షాప్స్ కు కేంద్రంగా కూడా మారింది. సంగీతం, సామాజిక సేవ, కళలు వంటి కార్యక్రమాలకు ఇదొక ప్రశాంత వేదికగా మారింది. ఆసక్తి ఉన్న వారు లాభాపేక్ష లేకుండా అక్కడ తమ సమావేశాలు నిర్వహించుకోవచ్చు, బోజన సదుపాయాలు కూడా వారు ఏర్పాటు చేస్తారు. అందుకు మీ వంతు విరాళం ఇవ్వవచ్చు.
ఐతే, ‘అన హద్’ నిర్మాణం, ఎదుగుదల అంతా కూడా ఎటువంటి నిర్దిష్ట ప్రణాళిక- లక్ష్యాలు లేకుండా ప్రారంభమైందని వారు వివరించారు. మొదట ఉద్యోగం వదులుకోవడంతో వీరి జీవితాల్లో ఈ నెమ్మది, సానుకూల మార్పు, ఉల్లాస భరితంగా మొదలైందని తెలిసింది. ఒక అందమైన కథగా మారిన దాని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు అని అబిద్ జీ అన్నది నిజం. కాబట్టి ఈ పరిచయ కథనం ఇక్కడ ఆపడం మంచిది.
అక్కడికి వెళ్ళేవారు వ్యక్తులుగా కాకుండా చిన్న బృందాలుగా వెళితే బాగుంటుంది.
‘అనహద్’ గురించి మరింతగా తెలుసుకోవాలంటే https://anahad.life/ అన్న ఈ వెబ్సైట్ చూడొచ్చు. ఈ వీడియో కూడా చాలా వివరాలు తెలుపుతుంది. ఇండ్ల నిర్మాణం కోసం ఏర్పాటు వారు ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపులో కూడా మీరు చేరవచ్చు. ఐతే, ఇదంతా వారు పది మంది కలిసి చేస్తున్నది కాదు. ఆ నాలుగైదు కుటుంబ సభ్యులే అన్నీ చూసుకోవలసి ఉంటుంది కనుక వ్యాపార దోరణిలో కాకుండా మీకు కావలసిన సలహా సూచనలను డిమాండ్ చేయకుండా సానుకూల ధోరణితో పొందవచ్చు. వీరితో మీరు కలిసి పని చేయవచ్చు. మీ పనిని సైతం వారితో కులాసాగా పంచుకోవచ్చు. అట్లా ఒక సమిష్టి ఆలోచనలతో జీవితాన్ని మరింత సరళంగా, సహజ సుందరంగా మార్చుకోవలన్నదే వారి ఆలోచన.
అక్కడికి వెళ్ళేవారు వ్యక్తులుగా కాకుండా చిన్న బృందాలుగా వెళితే బాగుంటుంది. ముందస్తుగా సమాచారం అందించి వెళ్ళడం తప్పనిసరి.
మొత్తానికి ఇప్పుడు వారి జీవితం లేదా ప్రయోగం ఒక ‘ఎకో కమ్యూనిటీగా, హర్మోనియాస్ గా ఎదగడం విశేషం. ఇదంతా ఒకరకంగా ‘సామాన్యశాస్త్రం’. అందుకే మిత్ర బృందంతో వెళ్లి వారిని కలవడం, మీకూ వివరంగా తెలపడం. కృతజ్ఞతలు మరి.