Editorial

Thursday, November 21, 2024
కథనాలుఇదే పాట... ప్రతీ చోటా... ఇలాగే పాడుకుంటాము - ఎస్.వి. సూర్యప్రకాశరావు

ఇదే పాట… ప్రతీ చోటా… ఇలాగే పాడుకుంటాము – ఎస్.వి. సూర్యప్రకాశరావు

sp
Narsim

నేను సన్నిహితంగా మెలిగిన ఆ మహా వ్యక్తిత్వం, అందులో వైశిష్ట్యం , నేను పొందిన అనుభూతి, నేర్చుకున్నది ఏమిటో నాకు అబ్బిన పరిమిత మైన అక్షర జ్ఞానంతో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.

ఎస్.వి. సూర్యప్రకాశరావు

suryaఒక ఇరవై అయిదేళ్ళ క్రితం ఇప్పుడు చెన్నైగా పేరు మారిన మద్రాసులో ప్రసన్న సర్రాజు అనే ఒక ఉదాత్తమైన మిత్రుడు నాకు పరిచయం అయ్యాడు. ఇండియా టుడే జర్నలిస్ట్ ని కావటం వల్ల పరిచయాలు ఆశ్చర్యం కాదు. ఆయన సంగీత కర్త. గజల్ శ్రీనివాస్ యుగం ప్రారంభం కానప్పటినుంచే ప్రసన్న గుజ్జెల్స్- ముఖ్యంగా హస్యప్రియత్వం ఆయనకు చాలామంది అభిమానుల్ని తెచ్చిపెట్టాయి. ఆయన ఒకసారి ఒక కథల పుస్తకం వెలువరించి సమీక్ష కోసం తీసుకు వచ్చారు. ఆయన సతీమణి అనురాధ అభ్యుదయ స్త్రీవాద రచయిత్రి నాకు కూడా మంచి స్నేహితురాలు. దురదృష్టవశాత్తు 40 యేళ్లు రాకుండానే నూరేళ్ళు నిండిపోయాయి. కల్ల కపటం లేని సహృదయం. అయితే సర్రజు కథలు పేరుతో వెలువడిన ఆ సంకలనంలో ఒక కథ నన్ను బాగా ఆకట్టుకుంది. సినీ సంగీతాన్ని ఇష్టపడే వారెవరికైనా నచ్చుతుంది. ఆ కథ లో ఇంద్రుడి బారి నుంచి తప్పించుకున్న మైనాకుడు అనే పర్వతం స్వర్గం ద్వారానికి అడ్డంగా కూలబడతాడు. దానిని తొలగించటానికి గాన గంధర్వము తో రాళ్ళను కరిగించే గాయకులు (ఘంటసాల తో సహా) అందరూ స్వర్గం లోపల ఉండిపోయారు. ఎలా అని దేవతలు తమకి ఈ అడ్డు తొలగించే వారెవరా అని తర్జనభర్జనలు పడుతుండగా భూలోకంలో అంతటి గాయకుడు ఒకడు ఉన్నాడు అని అతనిని రప్పిస్తే మైనాకుడి అడ్డు తొలిగి పోతుందని చెప్తారు. అప్పుడు దేవతల కోరిక మేరకు ఆ గాయకుడు తన గాన ప్రావీణ్యంతో పర్వతాన్ని కరగించి స్వర్గానికి శాంతిని ప్రసాదిస్తాడు.

బాలు దివికేగిన స్వర పారిజాతం. వారితో పరిచయ భాగ్యం నిజంగా ఒక సుకృతం. ఆ స్వరయానంలో ఇది తొలి భాగం.

ఆ గాన గంధర్వ గాయకుడే ఈ రోజున అభిమానులు పుట్టిన రోజు జరుపుకుంటున్న శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. ఈ సారి ఏ కొండను కరిగించే పని పడినదో కానీ కరోనా సాకుతో ఆయనను దేవతలు శాశ్వతంగా తీసుకు వెళ్లి పోయారు.కానీ. ‘లక్షలాది గుండెల్లో పదిలంగా అల్లుకున్న పొదరిల్లు నాది’ అనే ఆయన స్వర కీర్తిని తీసుకు వెళ్ళలేకపోయారు.

ఆయన బాల్యం, విద్యాభ్యాసం, గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, టివిలో సినీ సంగీత కార్యక్రమాల ప్రయొక్తగా ఆయన ప్రస్థానంలో బహుముఖ ప్రజ్ఞను నేను వర్ణిస్తే చర్విత చరణం అవుతుంది. సంగీత ప్రపంచం నిత్యం అనుభవిస్తున్న శీలాక్షర పారవశ్యాన్ని పరిచయం చేసినట్లుగా ఉంటుంది. కానీ నేను సన్నిహితంగా మెలిగిన ఒక మహా వ్యక్తిత్వం, అందులో వైశిష్ట్యం , నేను పొందిన అనుభూతి, నేర్చుకున్నది ఏమిటో నాకు అబ్బిన పరిమిత మైన అక్షర జ్ఞానం తో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.

ఆయన కరోనా బారిన పడి మరణించే వరకు తన పాటలతో, మాటలతో అందరినీ సంతోష పెట్టారు. హఠాత్తుగా మనల్ని విడిచి శాశ్వతమైన బాధను, ఆ బాధను మరచిపోవటానికి ఎన్నో మధురమైన పాటలను మిగిల్చి వెళ్ళారు

అవి నేను ఆంధ్రప్రభలో కొత్తగా చేరిన రోజులు. హైదరాబాద్ నుంచి బెంగళూర్ ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. శంకరాభరణం సినిమా అప్పుడే రిలీజ్ అయింది. బెంగళూర్ పల్లవి థియేటర్ లో సంవత్సరం పైగా ఆడింది. అప్పటికే కన్నడంలో కూడా స్టార్ సింగర్ స్థాయికి చేరుకున్న బాలుకి ముఖ్యంగా శంకరాభరణం బృందానికి కర్ణాటకలో కూడా బ్రహ్మ రథం పడుతున్న రోజులు. అటువంటి సందర్భంలో ఇండియన్ express లో బ్యూరో చీఫ్ గా అనిచేసే విఎన్. సుబ్బారావు గారు నన్ను తనతో చాళుక్య హోటల్ కి తీసుకు వెళ్ళారు. బాలసుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేశారు. మొదటి సారి ఆయనను కలవటం. సుబ్బారావు గారు నాకంటే వయసులో 30 యేళ్లు పెద్ద ఆయనకి 50 ఏళ్ళు. మా నాన్నగారి వయసు. నన్ను చాలా వాత్స ల్యంగా చూసేవారు. ఆయన బెంగుళూరులో స్థిరపడ్డ తెలుగు ప్రముఖులలో ఒకరు. అలాగే ఆయనతో పాటు నారాయణ స్వామి అని కన్నడ ప్రభ సంపాదకులు కూడా వచ్చారు. వీళ్ళిద్దరూ తెలుగు సినిమాలు సంగీతం మీద ఎంత పట్టు సంపాదించారు అంటే నాగయ్య, భానుమతి, ఘంటసాల, రాజేశ్వరరావు సంగీతం పాటల గురించి అనర్గళంగా అభిమానంతో మాట్లాడే వారు. బాలు వీళ్ళని ఎంతో గౌరవంగా ఆహ్వానించారు. నన్ను సుబ్బారావు తెలుగులోనే ఆయనకు పరిచయం చేశారు. చాలా సంతోషించారు అయన.

లేని బిరుదులు, విశేషణాలు పెడితే గానీ ముఖం మీద చిరునవ్వు కనిపించని చాలామంది సినిమా ప్రముఖుల కంటే భిన్నంగా అనిపించారు బాలు ఆ మాటల వింటుంటే. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటేనే ఎదుగుతామనే తొలి పాఠం నేను అయన ప్రవర్తన చూసి నేర్చుకున్నాను.

ఇన్ఫార్మల్ గా జరిగిన మా సంభాషణను ఒక ఇంటర్వ్యూ గా రాశాను. అప్పుడు టేపు రికార్డర్లు లేవు. గూగుల్ సెర్చ్ అవకాశం లేదు. మర్నాడు నేను రాసిన ఇంటర్వ్యూను ఆయనకు ఎవరో చూపించారు. బహుశా అజంతా రాధాకృష్ణ (బెంగళూర్ లో సినిమా నిర్మాణం, పంపిణీ రంగాలలో స్థిరపడ్డ మరొక తెలుగు ప్రముఖుడు) కావొచ్చు. బాలు సుబ్బారావు గారికి ఫోన్ చేసి మనం ఇంటర్వ్యూ అని అనుకోలేదు. కానీ ఆంధ్రప్రభలో అంత వివరంగా రాశారు. మీరు నిన్న పరిచయం చేసిన అబ్బయేనా అని అడిగారట. అప్పటికి సుబ్బారావు గారు కూడా అది చూడలేదు. ‘ఉండండి… ఒక్కసారి’ అని నన్ను పిలిపించి మాట్లాడించారు. నేను విష్ చేశాను. అయన ‘ఏమిటండీ చెప్పా పెట్టకుండా అంత ఇంటర్వ్యూ రాశారు. నేను నోట్ చేసుకోవటం కూడా గమనించలేదు’ అన్నారు. నా నోట మాట రాలేదు. ఆయన నా ఇబ్బందిని గ్రహించినట్లు, నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు. In fact I am very happy to read your interview . చాలా బాగుంది. ఎక్కడా అతిశయోక్తులు, విశేషణాలు, పొగడ్తలు లేకుండా రాశారు. మళ్ళీ నేను మద్రాసు వెల్లెలోగా కలుద్దాము. నేను ఫ్రీ అయాక సుబ్బారావు గారికి చెప్తాను. God bless you. అన్నారు. లేని బిరుదులు, విశేషణాలు పెడితే గానీ ముఖం మీద చిరునవ్వు కనిపించని చాలామంది సినిమా ప్రముఖుల కంటే భిన్నంగా అనిపించారు బాలు ఆ మాటల వింటుంటే. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటేనే ఎదుగుతామనే తొలి పాఠం నేను అయన ప్రవర్తన చూసి నేర్చుకున్నాను.

ఒక జర్నలిస్ట్ కి పైగా పత్రికలో ఎలాంటి స్వాతంత్య్రం స్వేచ్ఛా లేని అప్పుడే వృత్తిలో ప్రవేశించిన నాలాంటి వాడికి అంత గౌరవం ఇచ్చిన సంస్కారానికి ఏ పేరు పెట్టాలి?

మరొక భాష సంప్రదాయాల పరిధిలో పనిచేస్తున్నప్పుడు మనస్పూర్తిగా పూర్తిగా వాటిలో మమేకం కావటం ద్వారానే ఆ భాష సంప్రదాయాల ప్రజల అభిమానం సంపాదించ వచ్చునని బాలు నిరూపించారు. ఇది అయన చాలా సందర్భాలలో చెప్పినట్లు, ఏదో ప్లాన్ వేసుకుని చేసింది కాదు. పెద్దవాళ్ళు చెప్పినట్లు- తెలియంది తెలుసుకోవటం, పట్టు సాధించటం, మన ప్రవర్తనతో ఎదుటి వారిని సంతోష పెట్టలేక పోయినా బాధ పెట్టకుండా ఉండటం. కానీ, ఆయన కరోనా బారిన పడి మరణించే వరకు తన పాటలతో, నలుగురికి మంచి చెప్పే మాటలతో అందరినీ సంతోష పెట్టారు. హఠాత్తుగా మనల్ని విడిచి శాశ్వతమైన బాధను, ఆ బాధను మరచిపోవటానికి ఎన్నో మధురమైన పాటలను మిగిల్చి వెళ్ళారు.

మరోసారి బెంగళూర్ లోనే విండ్సర్ మేనర్ అనే ఒక పెద్ద హోటల్ లో కన్నడ సినిమా పరిశ్రమ తరఫున ఏదో పెద్ద పార్టీ ఏర్పాటైంది. (ఆ హోటల్ లోనే పుష్పక విమానం షూటింగ్ జరగింది. మొదటి సారి కమల్ హాసన్ ను, సింగీతం శ్రీనివాసరావు గారిని నేను కలుసుకున్నది అక్కడే) పార్టీలో బాలు గారిని చూసాను. ఆయన నన్ను చూడగానే ఆప్యాయంగా పలకరించారు. మిమ్మల్ని విడిగా కలవాలి అన్నాను. Sure. రేపు ఉదయం 7 గంటలకి చాళుక్య హోటల్ కి వచ్చేయండి. శంకరశాస్త్రి గారిని (జేవి సోమయాజులు) కూడా కలవొచ్చు అన్నారు. పార్టీ అర్ధరాత్రి దాటింది.. అయినా పూర్తి అవలేదు. అయన ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది. ఏమిటి ఈయన పొద్దున్నే రమ్మన్నాడు. ఒంటి గంట అవుతోంది. ఎప్పుడు హోటల్ కి వెళతాడు ఈ స్థితిలో పొద్దున్నే లేస్తాడా? ఫ్లైట్ 10 గంటలకి అన్నాడు. అనుకున్నాను. నేను వెంటనే బయటపడి ఇంటికి వెళ్లి ఉదయమే 5 గంటలకి లేచి స్నానం చేసి హడావుడిగా హోటల్ కి చేరుకున్నాను.7 గంటలకి అయన రూమ్ కి వెళ్ళాను. లోపల కి వెళ్లి ఆశ్చర్యపోయాను. అయన స్నానం చేసి మల్లెపువ్వు లాంటి తెల్లని దుస్తులతో రెడీగా ఉన్నారు. నేను వెళ్ళగానే ‘రండి మీకోసమే వెయిటింగ్’ అని బ్రేక్ఫాస్ట్ కి ఆర్డర్ చేసి ‘సోమయాజులు గారు కూడా మనతో జాయిన్ అవుతారు’ అన్నారు. బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి సోమయాజులు గారు వచ్చారు. ‘ఆంధ్రప్రభ ఇక్కడ కూడా వుండటమే. విశేషమే’ అని ఆయన తన గంభీర స్వరంతో అన్నారు. తరువాత బాలు ‘i hope this meeting is not for interview’ అన్నారు. నేను ‘no sir just ఇన్ఫార్మల్ మీటింగ్’ అన్నాను నవ్వుతూ. ‘అదిగో ఇన్ఫార్మల్ అంటే ఏదో ఉందన్నమాట’ అని అన్నారు. ‘లేదండి మీరు ఏదైనా చెప్పి రాయమంటే రాస్తాను’ అన్నాను. దానికి ఆయన ‘ఏముంది చెప్పటానికి..జస్ట్ కలుసుకుని మాట్లాడదాం అని రమ్మన్నాను. అయినా మీరు జర్నలిస్ట్ నేను ఓక ఫిల్మ్ సింగర్ హోదాలలో తప్ప ఫ్రెండ్లీ గా కలుసుకుని మాట్లాడ కూడదా? మనం కలుసుకున్న ప్రతిసారీ నాగురించి మీరు రాయాలి అనుకునే వాడిని కాదు. You are always welcome’ అని ఆయన మద్రాసులో తన ఇంటి నంబర్ ఇచ్చారు. ‘విఠల్ కి మీ పేరు చెప్పండి అయన నాకు connect చేస్తాడు. ఎప్పుడైనా సరే. మద్రాసు వస్తె మా ఇంటికి మీరు వస్తున్నారు’ అని అన్నారు. తరువాత ఆయన కారులో నన్ను మా ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్ళిపోయారు. ఒక జర్నలిస్ట్ కి పైగా పత్రికలో ఎలాంటి స్వాతంత్య్రం స్వేచ్ఛా లేని అప్పుడే వృత్తిలో ప్రవేశించిన నాలాంటి వాడికి అంత గౌరవం ఇచ్చిన సంస్కారానికి ఏ పేరు పెట్టాలి?

అయన ఆశువుగా ప్రదర్శించే బహుముఖ ప్రజ్ఞను ,అంతకు మించి హా స్యప్రియత్వాన్ని నేను చాలా సందర్భాలలో ఆస్వాదించడం మరుపురాని అనుభవాలు.

తరువాత ఆయన పాల్గొనే ప్రతి సినిమా, సాంస్కృతిక కార్యక్రమానికి నాకు ఆహ్వానం వచ్చేది. వీలైనప్పుడు పలకరించే వాడిని. తరువాత మద్రాసు ఆంధ్రప్రభ షిఫ్ట్ అయింది. ఆయన చాలా బిజీ ఎందుకులే పలకరించడం అనుకున్నాను. అయితే. ఆంధ్రప్రభలో నేను షిఫ్ట్ ఇంఛార్జి చీఫ్ సబ్ ఎడిటర్ గా ఉండేవాడిని. జిల్లా వార్తలు రాయటానికి తెలుగు బాగా రాయగలిగే ముగ్గురు పెద్దవాళ్ళ ను తీసుకున్నారు. వాళ్ళలో ఒకరు చెరువు ఆంజనేయ శాస్త్రి గారు. పెళ్లి కానుక చిత్రంలో ఆడే పాడే పసివాడి పాట రాసింది ఆయనే. ఆత్రేయ దగ్గర ఆదుర్తి సుబ్బారావు దగ్గర సహకార దర్శకుడిగా పనిచేశారు. రెండవ వ్యక్తి షణ్ముఖ శ్రీ.కే. విశ్వనాద్ గారి సమీప బంధువు. ఉండమ్మా బొట్టుపెడతా చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. మంచి కథా రచయిత. మూడవ వ్యక్తి వ్యాఘ్రేశ్వరారవు గారు. సాక్షాత్తు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారికి మామగారు. అయన 70 ఏళ్ల వయసులో కూడా మౌంట్ రోడ్ లో స్పెన్సర్ దగ్గర్నుంచి కొడం బాక్కం నడిచే వెళ్ళేవారు నడిచే వచ్చేవారు. ఆయనకు బాలు గారితో నా పరిచయం గురించి చెప్పాను. వెంటనే ఆయన మిమ్మల్ని ఈ రోజే ఇంటికి తీసుకు వెళతానన్నారు. ఆరోజు కుదరలేదు. ఒక హాఫ్ రోజు వెళదాం అన్నాను. అలాగే ఒకరోజు అయన చెప్పిన సమయానికి వెళ్ళాను. బాలు గారు నన్ను ఆశ్చర్యంగా రిసీవ్ చేసుకున్నారు. ఈయన నాకు ఇమ్మిడియేట్ బాస్ అని వాళ్ల మామగారు నన్ను పరిచయం చేశారు. భోజనం చేస్తే గానీ వదల్లేదు. అన్నీ చూపించారు. అక్కడ ఉన్న వారిని పరిచయం చేశారు. మీరు ఎప్పుడైనా రావొచ్చు అని కారు ఇచ్చి ఇంటికి దిగ బెట్టించారు. అంత బిజీగా ఉన్నా ఆయన నాతో పరిచయానికి ఇచ్చిన విలువకు ఏ పేరు పెట్టాలి?

ఆయన తో ఉన్న చనువుతో అయన రికార్డింగ్స్ కి, డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆ స్టూడియోలు వెళ్లి కూర్చునే వాడిని. ప్రముఖ అనువాద రచయిత రాజశ్రీ గారు నాకు అలాగే పరిచయం. కమల్ హాసన్ నటించిన చిత్రాల డబ్బింగ్ సమయంలో చాలాసార్లు వెళ్ళాను. బాలు గారి శైలిని, అయన ఆశువుగా ప్రదర్శించే బహుముఖ ప్రజ్ఞను ,అంతకు మించి హా స్యప్రియత్వాన్ని నేను చాలా సందర్భాలలో ఆస్వాదించడం మరుపురాని అనుభవాలు.

( తరువాయి రేపు )

 

ఎస్.వి. సూర్యప్రకాశరావు పూర్వ సంపాదకులు, ఇండియా టుడే.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article