మన ప్రయాణం అంతా కూడా ఒక్క అడుగులోనే ఉన్నదన్న రహస్యాన్ని చెప్పడానికి కారు హెడ్ లైట్స్ వెలుతురు ఆధారంగా రొండా బర్న్ ఆ అంశాన్ని వివరిస్తారు.
కందుకూరి రమేష్ బాబు
రొండా బర్న్ రాసిన ‘ది సీక్రెట్’ అన్న పుస్తకంలో జీవితాన్ని సులభం చేసే అనేక అంశాలున్నాయి. అందులో ఆమె చర్చించిన ఆకర్షణ శక్తి పట్ల మీకు విశ్వాసం కుదురినా కుదరకపోయినా మరెన్నో ఉదాహరణలు మీ జీవితాన్ని ఎంత సునాయాసం చేస్తాయో చదివిన వారు గ్రహించే ఉంటారు. చదవని వారికోసం ఇక్కడ ఒక అనుభవం ప్రస్తావించడం ఒక మెలకువ.
మనం కొన్ని పనులు చేయడానికి బద్దకిస్తాం. వేనుకాడుతాం. తికమకపడి ఆ పని మనవల్ల కాదని ఊరుకుంటాం. భయపడి మొత్తానికే మానేస్తాం. కానీ ఆ పని చేయడం ఎంత సునాయసమో తెలిపే ఒక ఉదాహరణను ఈ పుస్తకంలో రచయిత్రి చక్కగా తేటతెల్లం చేస్తుంది. అది Chicken Soup for the Soul సిరీస్ పుస్తకాలు రాసిన అమెరికన్ రచయిత జాక్ కాన్ ఫీల్డ్ చెప్పినది.
మన ప్రయాణం అంతా కూడా ఒక్క అడుగులోనే ఉన్నదన్న రహస్యాన్ని చెప్పడానికి కారు హెడ్ లైట్స్ వెలుతురు ఆధారంగా రొండా బర్న్ ఆ అంశాన్ని వివరిస్తారు. నిజానికి ఈ పుస్తకం ఎంతోమంది విశిష్ట అనుభవాల సమాహారం కూడా.
ఐతే, ఆ సూచన మన మొత్తం జీవితానికి వర్తిస్తుంది. మన గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతమాత్రం తటపటాయించాల్సిన అవసరం లేదని ధ్రువ పరుస్తుంది. ముందు అన్నట్టు, మన దృక్పథాన్ని చీకటి నుంచి వెలుతురు వైపు మరల్చే శక్తి ఉన్న అంశం అది.
ఆ సీక్రెట్ ఏమిటో చూడండి
ఈ రాత్రివేళ మీరున్న చోటు నుంచి కొన్ని వందల కిలోమీటర్లు దాటి ఒక చోటుకు వెళ్ళాలి అనుకొండి. మీకు కారు ఉంది. దాని హెడ్ లైట్స్ వెలుతురు సుమారు రెండొందల అడుగులు పడుతుంది. కానీ మీరు తటపటాయిస్తారు. అంత దూరం ఎలా ఈ రాత్రి వెళ్ళడం అని ఆలోచనల్లో పడుతారు. వెళ్ళవలసిన దూరం తాలూకు చీకటినే మననం చేసుకుని ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు. కానీ కారు స్టార్ట్ చేసి ప్రయాణం ప్రారంభిస్తే ప్రతి సారి రెండొందల అడుగుల దూరమే మీకు వెలుతురు అవసరం అని గ్రహిస్తారు. ఆ వెలుతురు ఎల్లవేళలా ఉండనే ఉంటుందని బోధపడుతుంది. ఆ దూరాన్ని అధిగమిస్తే మళ్ళీ అంతే దూరం వస్తుందనీ తెలుస్తుంది. అంత దూరమూ వెలుతురూ ఉండనే ఉంటుందన్న ఆనందం మీ ప్రయాణాన్ని మరింత ఉత్సాహవంతం చేస్తుంది.
మీరు ప్రయాణించేది ఆ రెండొందల అడుగులే. వేయి కిలోమీటర్ల దూరం పొడవునా అ వెలుతురూ బాట మీ వెంట ఉండటం ఖాయం.
మీరు ప్రయాణించేది ఆ రెండొందల అడుగులే. వేయి కిలోమీటర్ల దూరం పొడవునా అ వెలుతురూ బాట మీ వెంట ఉండటం ఖాయం. కావలసింది ఏమిటంటే, మీరు చూడవలసింది మొత్తం కాదు. అంతవరకే. నిజానికి మీ జీవన ప్రయాణం నిడివి అంతే అదే అని నమ్మండి. ఆ నమ్మికే చీకటిని పారద్రోలే వెలుతురూ. అది మీ గమనాన్ని తేలిక చేస్తుంది, గమ్యానికి చేర వేస్తుంది.
చిత్రమేమిటంటే, మీరు యోజనాల దూరం అలోచంచడం మానేయండి. మొదటి అడుగే సమస్తం. ఆ అడుగు వెలుతురు చాలు మీకు. ఇదే రొండా బర్న్ తెలుపు ‘రహస్యం’. సామాన్యశాస్తం వివేకం.