దేశంలో బలపడుతున్న ద్వేషపూరిత వాతావరణం తనను కాల్చి వేస్తున్నదనీ, రోజుల తరబడి నిద్ర పట్టటం లేదనీ అఖ్లాద్ ట్విట్టర్ లో రాశాడు. ఆ ఉక్కబోతను భరించలేని ఆయన గుండె లయ తప్పింది. గత వారం రోజుల్లో మూడు సార్లు గుండె పోటు వచ్చి నిన్న గాక మొన్న ఏప్రిల్ 11 న అది ప్రాణాలు తీసింది.
ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండిన ఈ యువ జర్నలిస్ట్ అకాల మరణాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది మన మేధావి వర్గం? అఖ్లాద్ లకు అండగా గొంతు విప్పాలనా? ఏమో!
‘చూపు’ కాత్యాయని
తెగ బలిసిన పెత్తందారులూ, వెన్నెముక లేని మధ్యతరగతి జీవులూ తప్ప సజీవమైన మనుషులు బతకటానికి అనువైన వాతావరణం అంతరించిందని బషాయిటుడు నవలలో ఒక పరిశీలన చేశారు మహాశ్వేతాదేవి.
ఆమె ఆ మాటలన్నది 1970ల చివరలో.
అదే పరిస్థితి నలబయ్యేళ్ళకు పైగా కొనసాగి కరడుగట్టాక,సమాజ దేహమంతటా విషం పాకిపోయాక, మనుషులు శకలాలై విడిపోయాక, స్పందించే వాళ్ళు ఒంటరులై మిగిలిపోయాక ఏం జరుగుతుందో చెప్పటానికి ఇదుగో ఈ అఖ్లాద్ ఖాన్ అకాల మరణమే సాక్ష్యం.
ఆయన వయసు 28ఏళ్ళు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్. తన వృత్తికి ఒక లక్ష్యం ఉన్నదనీ, అది చీకటి కోణాలలోకి వెలుగు ప్రసరింపజేసే బాధ్యత అనీ నమ్మిన వాడు.
అందుకే తప్పుడు కేసులతో జైళ్ళలో మగ్గుతున్న వారూ, మతోన్మాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న మైనారిటీలూ, దళితులూ వంటి నిస్సహాయుల విషాదాలను రిపోర్టింగ్ చెశాడు. ఢిల్లీ ,యు.పి, ఇంకా అనేక ప్రాంతాలలోని విద్వేష రాజకీయాలను విస్తృతంగా కవర్ చేశాడు.
సోషల్ మీడియాలో ఆయన రాసిన పోస్టులకు యువతరం నుండి మంచి స్పందన వచ్చింది.
ఈ రాతలను యాంత్రికంగా రాయలేదు అతడు. హృదయంలోకి తీసుకున్నాడు. దేశంలో బలపడుతున్న ద్వేషపూరిత వాతావరణం తనను కాల్చి వేస్తున్నదనీ, రోజుల తరబడి నిద్ర పట్టటం లేదనీ ట్విట్టర్ లో రాశాడు. ఆ ఉక్కబోతను భరించలేని ఆయన గుండె లయ తప్పింది. గత వారం రోజుల్లో మూడు సార్లు గుండె పోటు వచ్చి నిన్న గాక మొన్న ఏప్రిల్ 11 న ప్రాణాలు తీసింది.
తీవ్రమైన ఒత్తిడి వల్లనే ఇంత చిన్న వయసులో ఆయనకు ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.
ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండిన ఈ యువ జర్నలిస్ట్ అకాల మరణాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది మన మేధావి వర్గం?
అఖ్లాద్ లకు అండగా గొంతు విప్పాలనా?
ఏమో!
హృదయాల చుట్టూ మరింత భద్రమైన గోడలు కట్టుకోవాలని కూడా కావొచ్చు !!
కాత్యాయని గారు ‘చూపు’ సంపాదకులుగా తెలుగు సమాజానికి చిరపరిచితులు. నిశితమైన విమర్శకు వారు మారుపేరు.