Editorial

Monday, December 23, 2024
Peopleరామలింగం కొడుకు..... కార్టూన్‌ కళాకారుడు 

రామలింగం కొడుకు….. కార్టూన్‌ కళాకారుడు 

నమస్తే తెలంగాణా కార్టూనిస్టు మృత్యుంజయ కార్టూన్ల సంకలనం ‘ఉద్యమ గీత గతవారం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కారమైంది. ఆ పుస్తకంలోని అనేక కార్టూన్లు ప్రచురించింది ఆ పత్రిక పూర్వ సంపాదకులు అల్లం నారాయణ గారే. వారు ఈ పుస్తకానికి మకుటం వంటి ముందుమాట రాసి ఈ చేనేత బిడ్డ పాతికేళ్ళ ప్రస్థానంపై చక్కటి రూప చిత్రం వేశారు. చిలువేరు రామలింగం కొడుకుగా మొదలై తెలంగాణా ఉద్యమ గీత దాకా ఎదిగిన వైనాన్నిఆత్మీయంగా పంచుకున్నారు. ఆ అభినందన తెలుపు వ్యాసం ఇది.

అల్లం నారాయణ 

చిలువేరు రామలింగం కొడుకు చిలువేరు మృత్యుంజయ. కార్టూనిస్టు. తెలంగాణ కార్టూనిస్టు. నల్లగొండ కార్టూనిస్టు. ఊరు భూదాన్‌ పోచంపల్లి. తండ్రి గుడ్డమీద మహాత్మాగాంధీని, పి.వి.నరసింహారావును, ఇందిరాగాంధీని నేసాడు. కొడుకు డిజిటల్‌ పెయింటింగ్‌లో రాజకీయ నాయకుల క్యారికేచర్లు గీశాడు. మృత్యుంజయానికి ప్రేరణ తండ్రి. ప్రేరణ తను పుట్టిన చేనేత కళాకారుల కుటుంబం. నల్లగా పొగచూరిన వంటగది గోడ. అమ్మ వంటగదిలో పుట్టిన పొగ ‘చార్‌కోల్‌ ’ మాదిరిగా వంటింటి గోడను పొగచూర్చింది. అది బాల్యంలో మృత్యుంజయ కాన్వాసు. తండ్రి ఎడ్లబండి మీద భూదాన్‌ పోచంపల్లిలో ఇంటి దగ్గర మొదలై, గుడి చేరే వరకే చీర నేసిన ఘనుడు. బోనాలప్పుడు అట్లా ఎడ్లబండి మీద నేసిన చీరను మహంకాళి దేవతకు అర్పించిన కళాకారుడు. తేలియా రుమాల్‌, మూడు కొంగుల చీర, పైజామా, షర్టు కుట్టు లేకుండా నేసిన రామలింగం సామాన్య నేతకాడు కాదు. రంగుల కలలను వస్త్రాల మీద కలెనేసిన కళాకారుడు. చిత్రకారుడు. మృత్యుంజయ వారసత్వం అదే.

మృత్యుంజయ ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు అతని మ్యానువల్‌, డిజిటల్‌ క్యారికేచర్లు, అతని గీత నచ్చాయి. వాళ్ల నాయిన గురించిన ముచ్చట, తెలంగాణ అభినివేశం ‘నమస్తే తెలంగాణ’కు మృత్యుంయ గీతకారుడయ్యాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా మృత్యుంజయ వెనుదిరిగి చూడలేదు.

ఇంట్లో వాతావరణం కళాత్మకమైనది. కట్టెలపొయ్యి వల్ల పొగచూరిన గోడ కాన్వాసు. గుడ్డల మీద చేనేతలో బొమ్మలకు ప్రాణాలు పోసే నాయిన వాడే రంగులు, కాగితాలు, స్కెచ్‌పెన్నులు, పెన్సిళ్ళు. ఇకనేం బాల్యం నుంచే మృత్యుంజయ గీతల మీద, రాతల మీద, కళ మీద మక్కువ పెంచుకున్నాడు. తెలంగాణలో దళితులకు గాత్రమబ్బినట్టుగా, ‘ఆర్టిజాన్‌’ కులాలకు కళలు అబ్బాయి. దృష్టాంతాలు అనేకం. అందువల్లే ఇరవై ఏళ్లకే కార్టూన్‌ గీతలు గీసి రాతలు రాసిన మృత్యుంజయ ఇవ్వాళ్ల తెలంగాణ తొలి, ఉద్యమ పత్రిక, తెలంగాణ ఏకైక గొంతు ‘నమస్తే తెలంగాణ’కు రాజకీయ కార్టూనిస్టుగా, సంపాదక కార్టూనిస్టుగా ఎదిగాడు.

ఉద్యమ గీత : ఇది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా ప్రచురణ

ఇరవైఐదు సంవత్సరాల ఈ కార్టూన్ల కళల ప్రపంచపు అనుభవంలో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు పొందారు. అవార్డులు దక్కించుకున్నారు. ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాలో కార్టూనిస్టుగానే కాదు, డిజిటల్‌ క్యారికేచరిస్టుగా సుప్రసిద్ధుయ్యారు. ఇంతేనా?

కాదు. మృత్యుంజయ రాజకీయశాస్త్రంలో పట్టభద్రుడు. అందువల్ల రాజకీయాలు ఒంటపట్టిచ్చుకున్నాడు. ఎక్కడ పనిచేసినా, ఎలాంటి సంస్థల్లో పనిచేసినా తెలంగాణ జర్నలిస్టులు అందరిలాగే, కళాకారులు, చిత్రకారులు, కార్టూనిస్టులు అందరిలాగే అస్తిత్వ ఉద్యమంలో చురుకుగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆయన తెలంగాణ వైపు నిలిచాడు. నల్లగొండ కార్టూనిస్టులకు పుట్టినిల్లు. రాజకీయ కార్టూనిస్టులుగా పేరుపడిన నర్సిమ్‌, శంకర్‌, శేఖర్‌, శ్రీధర్‌, ఇంకా అనేకులు నల్లగొండ వారే. వీళ్లందరికి మోహన్‌ గీత, రాత ఆదర్శం. కానీ ఎవరికి వారు, వారి వారి ప్రత్యేక ఛాయలలో ఎదిగిన వారే. వారి సరసన నల్లగొండ జిల్లా నుంచి వికసించిన మరో కార్టూనిస్టు మృత్యుంజయ.

రామలింగం ప్రేరణగా, ఆయన బతుకు చైతన్యంగా శ్యామ్‌బెనెగళ్‌ ఓంపురి హీరోగా ‘సుష్మాన్‌’ సినిమా తీశాడు. రామలింగం కొడుకు నాయిన ప్రేరణగా అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.

రామలింగం ప్రేరణగా, ఆయన బతుకు చైతన్యంగా శ్యామ్‌బెనెగళ్‌ ఓంపురి హీరోగా ‘సుష్మాన్‌’ సినిమా తీశాడు. రామలింగం కొడుకు నాయిన ప్రేరణగా అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 1996లో ‘బొబ్బిలిపులి’తో కార్టూనిస్టుగా ప్రారంభమై, ఆంధ్రభూమిలో పదేళ్లు పనిచేసి, టీవీ5 చానల్‌లో ‘యానిమేషన్‌ అధిపతి’గా పనిచేసి, ఇప్పుడు ‘నమస్తే తెలంగాణ’ సంపాదక కార్టూనిస్టుగా స్థిరపడ్డాడు. 2010 లోనే ‘నమస్తే తెలంగాణ’ ఏర్పాట్లు జరిగాయి. 2011 లో కేవలం తొమ్మిది నెలల ముందు ఏర్పాట్లతో ఉద్యమ గొంతుక ఆవిష్కృతమయింది. ఆంధ్రభూమిలో పనిచేస్తున్న మృత్యుంజయ నావద్దకు వచ్చాడు. సంపాదకుడిగా నేను మంచి కార్టూనిస్టు కోసం వెతుకుతున్న కాలం. సహజంగానే తెలంగాణ తత్వం ఉన్న వాళ్లకు ప్రాధాన్యత.

రాజకీయ కార్టూన్లను ఫస్ట్‌ పేజీ బ్యానర్‌ స్టోరీలలో వాడుకున్న చరిత్ర నేను అంతకు ముందు పనిచేసిన ‘ఆంధ్రజ్యోతి’ది. అక్కడ పూర్తిగా బ్యానర్‌ స్టోరీలకు కార్టూన్లు వేయించిన అనుభవం వల్ల ఒక పట్టాన ఎవరూ నచ్చలే. కానీ మృత్యుంజయ ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు అతని మ్యానువల్‌, డిజిటల్‌ క్యారికేచర్లు, అతని గీత నచ్చాయి. పైగా నల్లగొండ, భూదాన్‌ పోచంపల్లి, వాళ్ల నాయిన గురించిన ముచ్చట, తెలంగాణ అభినివేశం ‘నమస్తే తెలంగాణ’కు మృత్యుంయ గీతకారుడయ్యాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా మృత్యుంజయ వెనుదిరిగి చూడలేదు.

తెలంగాణ కల సాకారమై రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ‘మృత్యుంజయ’ గీసిన రెండు కార్టూన్లు ‘ పటం’ కట్టి పెట్టుకోదగినవి.

హైదరాబాద్‌, కేరళ, బెంగుళూరులలో కార్టూన్‌ వర్క్‌షాప్‌లలో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో ‘సోలో’ కార్టూన్ల ప్రదర్శన పెట్టాడు. చైనా, బ్రెజిల్‌, రుమేనియా, టర్కీ, ఇటలీలో మృత్యుంజయ కార్టూన్లు ప్రదర్శితం అయ్యాయి. గ్రీసు, చైనా, రుమేనియాలలో ఉత్తమ కార్టూనిస్టు అవార్డులు గెలుచుకున్న మృత్యుంజయ.. జాతీయ ఎయిడ్స్‌ సంబంధ కార్టూనిస్టుగా ఉత్తమ కార్టూనిస్టు అవార్డు, వంశీవారి అవార్డు ‘కళా రత్న’, కార్టూన్‌ వాచ్‌ మ్యాగజిన్‌ ‘లైఫ్‌ అఛీవ్‌మెంట్‌’ అవార్డు గెలుచుకున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే దివంగత కార్టూనిస్టు శేఖర్‌ ‘గిదీ తెలంగాణ’ లాగానే మృత్యుంజయ తెలంగాణ ఉద్యమ సందర్భంలో వందలాది కార్టూన్లు వేశాడు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులకన్నా, తెలంగాణ ఉద్యమంలో మృత్యుంజయ గీసిన కార్టూన్లు ‘ప్లకార్డులు’గా ఊరేగడమే గొప్ప గౌరవంగా నేను అనుకుంటాను.

మృత్యుంజయ నీకింకా భవిష్యత్తు ఉన్నది. దారి ఉన్నది. దుమ్మురేపే చైతన్యంతో సాగిపో….

తెలంగాణ ఉద్యమంలో‘సాగరహారం’ సందర్భంలో, ఆత్మహత్యలు వద్దు అంటూ మృత్యుంజయ గీసిన కార్టూన్లు ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయి. పోలీసుమయమైన వరంగల్‌, జర్నలిస్టుల ఊరేగింపు సందర్భంగా ‘కలం కవాతు’ ‘కలియుగ రాజగోపాలుడు’ మృత్యుంజయకు పేరు తెచ్చాయి. తెలంగాణ కల సాకారమై రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ‘మృత్యుంజయ’ గీసిన రెండు కార్టూన్లు ‘ పటం’ కట్టి పెట్టుకోదగినవి.

భూదాన్‌ పోచంపల్లి బిడ్డగా ఎదిగి, తెలంగాణ ఉద్యమంలో ఒదిగి జాతీయ, అంతర్జాతీయ అవార్డులందుకున్న మృత్యుంజయకు ఇంకా భవిష్యత్‌ ఉన్నది. నవతెలంగాణ కార్టూనిస్టులకు ఏటేటా అవార్డులిస్తున్నది. ఆ అవార్డుల జ్యూరీ చైర్మన్‌గా మృత్యుంజయను ఏకగ్రీవంగా అత్యుత్తమ కార్టూనిస్టుగా ఎన్నుకున్నప్పుడు కూడా ఇదే అభిప్రాయం. మృత్యుంజయ నీకింకా భవిష్యత్తు ఉన్నది. దారి ఉన్నది. దుమ్మురేపే చైతన్యంతో సాగిపో….

అల్లం నారాయణ తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్‌, నమస్తే తెలంగాణ పూర్వ సంపాదకులు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article