Editorial

Wednesday, January 22, 2025
ఆరోగ్యంఅరవింద్ సమేత - 'ఇప్పపువ్వు' తెలుపు

అరవింద్ సమేత – ‘ఇప్పపువ్వు’ తెలుపు

IPPAPUVVU

మనలో చాలా మందికి ఇప్పపూలను సారాయి తయారు చేయడానికి ఉపయోగిస్తారని తెలుసు. కానీ ఇప్పపూల వలన సారాయి తయారీ మాత్రమే కాకుండా అనేక ఉపయోగాలు ఉన్నాయని గ్రహించం.  నిజానికి ఇప్పపువ్వే గురిజనులకు కల్పవృక్షం. అదే వారి బతుకు దెరువు కూడా.

Aravind Pakideఅరవింద్ పకిడె

తాడ్వాయి అడవుల్లో ప్రతీ సంవత్సరం మార్చి నుంచి మే చివరి దాక ఇప్పపువ్వు సీజన్ నడుస్తుంది.

ఎండాకాలం ముందు ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో విప్ప చెట్లు ఆకు రాలుస్తాయి. ఆ సమయంలోనే కస్తూరి వాసన కలిగిన పూలు పుష్పించడం మొదలవుతుంది.

పూలు సాధారణగా ఉదయం సమయంలో రాలుతాయి.

30 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100 నుండి 150 కిలోల ఇప్ప పూలు లభిస్తాయి. ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు.

ఏటా వేసవిలో ఇప్పచెట్లు పూత, కాతలతో అడవి కళకళలాడుతుంది.

ఇప్పపూల సేకరణ..

ప్రతి సంవత్సరం ఇప్ప పూవు సేకరణలో గిరిజనులు నిమగ్నమవుతారు. తునికాకుతో పాటు ఉపాధినిచ్చే ఇప్పపూల కోసం మంటుటెండను సైతం లెక్కచేయకుండా చిన్నాపెద్దా తరలుతారు. తెల్లవారుజామునే తట్టా బుట్టా, ఆహారంతో బయలుదేరి, సాయంత్రం కల్లా ఊళ్లకు చేరుతారు.

ఇప్పపూల నిల్వ

గిరిజనులు సేకరించిన ఇప్పపూలను ఎండబెట్టి దానిలో పుప్పొడి రేణువులు పొయ్యేదాకా కర్రమొద్దులతో బాదుతారు. అనంతరం చెరిగి గుమ్ముల్లో దాచుకుంటారు. మొదట దాని అడుగున ఆకులు వేసి తొక్కుతారు. మధ్యమధ్య ఎండబెట్టిన వేపాకులు చల్లుతారు. దీంతో ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది.

ఇప్ప పూల ప్రాధాన్యత…

గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ, వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు.

గృహ అవసరాల కోసం వినియోగం…

వర్షాకాలం వచ్చిందంటే చిక్కుడు గింజలు, అల్చందలు కలిపి ఉడికించి అంబలి కాస్తారు. ఇప్పపువ్వు కలిపి అన్నం వండుతారు. మరికొందరు గిరిజనులు ఇప్ప ఉండలను ఆల్పాహారంగా తీసుకుంటారు.

ఇప్పపూలను పెంకుల్లో వేయించే సమయాన దంచిన వెల్లుల్లి, మిర్చి, అల్లం కలుపుతారు. అన్నీ కలిపి మోదుగాకుల్లో ఉండలుగా చుడుతారు. వాటిని నేతితో, ఇప్పనూనెతో కలిపి తింటారు.

పలువురు ఇప్పపువ్వుతో సారా తయారు చేసి సేవిస్తారు.

ఇప్పబద్దల నుంచి నూనె తీసి పంటలకు, దీపం చమురుగా వాడుతారు.
అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లే మేకలు, గొర్రెలు, పశువులు సైతం ఇప్పపువ్వు తింటాయి.

మందుల తయారీలో…

ఇప్పపూలను మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు.
పూల నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం తదితర వ్యాధుల నివారణకు వాడుతారు. మాలిష్‌కు కూడా వినియోగిస్తారు.
ఇప్పబద్దలను సబ్బులు, ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. ఇప్పపూలతో పళ్లు తోముకుంటే దంతవ్యాధులు, దగ్గు దరిచేరవని గిరిజనులు చెబుతున్నారు.
ఇప్పపువ్వుతో తయారైన సారా తాగితే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు.

IPPAPUVVU

ఆయుర్వేద రంగంలో

పలు ఆయుర్వేద మందుల తయారీలోనూ వాడతారు. వైద్యశాస్త్రంలో ప్రాధాన్యం వైద్యశాస్త్రంలోనూ ఇప్పచెట్టుకు ఎంతో ప్రాధాన్యముంది.
ఆయుర్వేదంలో ఇప్పచెట్టును మధూక వృక్షమని వ్యవహరిస్తారు. దీ న్ని శాస్త్రీయ నామం గ్లీజేరియా గ్లాబ్రా కాగా, మేడికేటెడ్ ఆయుర్వేదిక్‌లో దీన్ని వాడుతారు.
అటవీ ప్రాంతంలోని గిరిజనులు టేకు చెట్లను సైతం నరికి వంట చెరుకుగా, కట్టెలుగా, దుంగలుగా, నాగళ్లుగా వాడుతారు కానీ, ఇప్పచెట్టును నరికే ప్రసక్తే ఉండ దు.
ఓ అంచనా ప్రకారం ప్రతి ఎకరం భూమిలో పది నుంచి పదిహేను అంతకుమించిన సంఖ్యలో కూడా ఇప్పచెట్లుంటాయి.

పువ్వులో ఔషధ గుణాలు పోషక విలువలు..

ఇప్ప పూలు, గింజల నుంచి తీసే నూనెలో ఔషధ, పోషక గుణాలు ఉన్నాయని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో తేలిందని ట్రైఫెడ్ చెబుతోంది.
బాలింతలకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు శారీరక బలహీనత నివారించే గుణాలు వీటిలో ఉన్నాయని పేర్కొంటోంది.
సాధారణ శారీరక బలహీనత నుండిరక్షిస్తుంది. వీటిని నేరుగా తినడం వల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు.

ఇతర ఉపయోగాలు

సారాయి కాచడమే కాకుండా ఇప్పపూలతో ఇప్పజామ్‌, కేక్‌, లడ్డు, హల్వా, నూనె తదితర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.
బాగా ఎండిన తరువాత లావుపాటి కర్రతో పూలలోని పొట్టు పోయేంత వరకు కొట్టి, గాలి దూరని విధంగా వెదురు బుట్టలలో నింపి నిల్వ చేస్తారు. వీటిని తమ అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు.
గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి, వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరానికి లభించేది.
కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు.
గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారాయి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది. ఢిల్లీకి చెందిన డాక్టర్‌ ఎస్‌ఎన్‌.నాయక్‌ భారత శాస్త్రీయ, సాంతికేక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్‌, చాక్లెట్‌, జామ్‌, కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు.

అరవింద్ పకిడె పాత్రికేయడు, ఫోటోగ్రాఫర్. చరిత్ర, సంస్కృతి గురించి నిరంతరం తపనలు పోతూ అందంగా రికార్దు చేసే క్షేత్రస్థాయి అడుగు, కన్ను.

తన ఫేస్ బుక్ అకౌంట్

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article