Editorial

Monday, December 23, 2024
సైన్స్ఒక పర్యావరణ ప్రేమికుడి హెచ్చరిక : ‘సూరజ్’ కా సాత్వా ఘోడా 

ఒక పర్యావరణ ప్రేమికుడి హెచ్చరిక : ‘సూరజ్’ కా సాత్వా ఘోడా 

SURAJ

అందరం ప్రస్తుతం 02 గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఈ యువ పాత్రికేయుడు C02 గురించి ఆలోచించవలసిందే అంటున్నారు. అది మోతాదు మించితే భస్మీపటలమే అంటూ ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా మనల్ని హెచ్చరిస్తున్నారు. సరికొత్త విధానాలతో జీవన శైలి మార్చుకోవడమే శరణ్యం అని గట్టిగా సూచిస్తున్నారు.

సూరజ్ వి. భరద్వాజ్

అనగనగా అంటూ మొదలుపెట్టడానికి ఇది రాజుల కథ కాదు! అలా చెప్తూ, ముగ్గులోకి దించి కథవైపు దృష్టినాకర్షించేందుకు ఎవరూ చిన్నపిల్లలు కాదు! ఇది మన కథ! మానవాళి భవిష్యత్ తరాల కథ! ఒక సౌరకుటుంబం కథ! నవగ్రహాల్లో పక్కపక్కనే ఉన్న రెండు గ్రహాల కథ! అక్కడి కార్బన్ డై ఆక్సైడ్ కథ! అదేంటి కార్బన్ డై ఆక్సైడని, మళ్ళా మనకథ అంటాడు, తింగరోడనుకోకండి! ఒక్కసారి చదవండి! ఆలోచించండి! ఆ తరవాత కార్యోన్ముఖులు కండి!

సూర్యుని కక్ష్యలో ముందు బుధడు తరవాత శుక్రుడు, నెక్స్ట్ భూమి ఉన్నాయి. పుట్టుకల మూలం ఒకటే కావడంతో గ్రహాల మధ్య భౌతిక, రసాయనపరమైన సారూప్యతలు సర్వసాధారణం. అలాగే భూ, శుక్ర గ్రహాల మధ్య కూడా పోలికలున్నాయి! ఆవిర్భావం తొలినాళ్లలో ఓ బిలియన్ సంవత్సరాల వరకు ప్లానెట్ వీనస్ ఒక స్వర్గసీమలా ఉండేది. ఆ తరవాతే అక్కడ పరిస్థితులు భయంకరంగా మారి అదో నరకంలా తయారైంది! భూగ్రహంతో పోలిస్తే ప్రకృతిలో సహజసిద్ధమైన విపత్తులు రావడం, అగ్నిపర్వతాలు బద్దలవడం, వాటిలోంచి కాలుష్యసహిత పొగ, లావా ఉబికి వచ్చి పర్యవరణాన్ని చిందరవందర చేయడం, ఇలా ప్రతీ సహజ పరిణామం రెండింటిలో సేమ్ టు సేమ్! ఇక ప్లానెట్ వీనస్ పై ఉన్న సముద్రాలు అతి పురాతనమైనవి. ఆవిర్భావం నాటి పరిస్థితులు అక్కడ ఉండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలతో కప్పబడి, అంతగా సూర్యకిరణాలు తాకకుండా ఉన్న శుక్రగ్రహం, వాస్తవానికి భూగ్రహం కంటే చల్లగా ఉండాలి. కానీ, అది ఓ మరిగేపొయ్యిలా ఉంటుంది! భస్మమయ్యేటంత ఉష్ణంతో, సీసమే కరిగేలా కాగుతుంటుంది! భూమికంటే శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండటమే ఇందుక్కారణమా? అంటే, నో అంటారు సైటిస్టులు! అక్కడ బొగ్గు వినియోగం లేదు, ధూమశకటాలు నడవవు! మరెందుకంత కార్బన్ కాలుష్యం? మానవ జాడ అస్సలు లేని ప్లానెట్ వీనస్ లో ప్రకృతే పర్యావరణాన్ని ధ్వసం చేసింది! ఎందుకు? శుక్రుడు తనంతట తానే గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ లో కూరుకుపోయాడు! ఎలా?

కొన్ని దశాబ్దాలక్రితం సముద్ర శాస్త్రవేత్తల పరిశోధనల్లో అకస్మాత్తుగా ఒక సున్నితమైన, భయంకరమమైన నిజం బైటపడింది. మానవ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా వాతావరణంలో సీఓ2 శాతం క్రమంగా పెరుగుతోందని వెల్లడైంది. ఓషనోగ్రఫీ ప్రకారం మంచుగడ్డలు ఇందుకు సజీవసాక్షాలు!

SURAJ

వెనూషియన్ అట్మాస్పియర్లో ఉన్న 90 శాతం సీఓ2 గ్యాస్ వల్లే సమస్యంతా! వాతావరణంలోని సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాల వల్ల సూర్యకిరణాలు శుక్రుని ఉపరితలాన్ని చేరడం లేదు. ఒకవేళ మేఘాల మధ్య నుంచి చిన్నచిన్న ధారలుగా లోపలికి వెళ్ళినా, సీఓ2 పొగ దుప్పటిలా పనిచేసి, సూర్యరశ్మిని వెలుపలికి రాకుండా చేస్తుంది. అలా ఆ సౌరశక్తి దట్టంగా ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ తో మిశ్రమంచెంది వాతావరణంలో వేడిని అలాగే పట్టి ఉంచుతుంది. ఆ విధంగా రానురాను శుక్రగ్రహం ప్రెజర్ కుక్కర్లా మారి ఓ నరకకూపమైంది. తద్వారా జీవరాశి మనుగడకు ఆస్కారమివ్వని వ్యర్థగోళం తయారైంది! ఆవిర్భావ దశలో శుక్ర, భూగ్రహాలు ఒకే మోతాదులో కార్బన్ మూలకాలను కలిగి ఉన్నా, కొన్ని మిలియన్ సంవత్సరాలు బొత్తిగా పొంతనలేని భిన్నమార్గాల్లో ముందుకు సాగాయి. అసాధారణమైన పరిస్థితుల వల్ల, అతివేగంగా కార్బనీకరణ జరిగి శుక్రుడు జీవులకు ఆవాసయోగ్యం కాకుండాపోయాడు! శుక్రడు, భూమి రెండింటిలోనూ కార్బన్ ఓ నిర్ణయాత్మక మూలకమే! ఐనా, మోతాదు మించితే అది కొన్ని విపరీతపరిణామాలకు దారి తీస్తుందనడానికి శుక్రగ్రహం మంచి ఉదాహరణ!

ఇక భూమ్మీద అలాకాదు. ఇక్కడ కర్బనం కొన్ని వేలఏళ్లుగా ఘనపురాయి సొరంగాల్లో నిల్వ ఉంది. సముద్ర తీరప్రాంతాల్లో సున్నపురాయి గుట్టల రూపంలో నిక్షిప్తమై ఉంది. అగ్నిపర్వతాల నుంచి వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ లో కొంతభాగం సముద్రాలు సంగ్రహిస్తున్నాయి. నీటిలోని ఏకకణ జీవుల వల్ల కొన్ని మిలియన్ సంవత్సరాల తరవాత సీఓ2 చిన్నచిన్న కార్బన్ చిప్పలుగా మారి ఒకదగ్గర రాశులుగా పోగై తీరం మీదే సున్నపురాయి గుట్టలుగా ఏర్పడుతోంది. కొన్ని జలచరాలు కూడా కార్బన్ డై ఆక్సైడ్ తో అపారమైన కోరల్ రీఫ్స్ ను నిర్మిస్తున్నాయి. జీవుల ప్రమేయం లేకుండా కూడా సముద్రపు నీటిలో కరిగి ఉన్న సీఓ2 సున్నపురాయిగా మారుతుంది! ఇక మిగిలిన ఆ కొద్ది మొత్తం, సీఓ2 గ్యాస్ రూపంలో వాతావరణంలో ఉంటుంది. భూతలంపై దాని మొత్తం 1% లో 300 లవ వంతు మాత్రమే! కార్బన్ లేకపోతే భూగోళం చల్లబడి మంచులా ఘనీభవిస్తుంది! ఓ పెద్ద ఐస్ బాల్లా తయారవుతుంది! మనం కూడా ఇక్కడ జీవించే పరిస్థితులుండవు! అలా అని 10 వేలల్లో 3 గా ఉండాల్సిన కార్బన్ మాలిక్యూల్స్ అధమపక్షం రెట్టింపై 6 కు చేరినా, ముప్పులా పరిణమిస్తుంది! వాతావరణంలో వేడి పుట్టించి జీవకోటికి అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా కొన్ని తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.

కార్బన్ లేకపోతే భూగోళం చల్లబడి మంచులా ఘనీభవిస్తుంది! ఓ పెద్ద ఐస్ బాల్లా తయారవుతుంది! మనం కూడా ఇక్కడ జీవించే పరిస్థితులుండవు! అలా అని 10 వేలల్లో 3 గా ఉండాల్సిన కార్బన్ మాలిక్యూల్స్ అధమపక్షం రెట్టింపై 6 కు చేరినా, ముప్పులా పరిణమిస్తుంది!

SURA

శుక్రగ్రహంపై ఉన్న వేడి భూమండలం మీద ఎన్నడూ ఉండదు. శుక్రుడిపై సముద్రాలు కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితమే ఇగిరిపోయి శూన్యంలో కలవడమే అందుక్కారణం! దీంతో అక్కడి వాతావరణంలోని సీఓ2 ను సంగ్రహించి దాన్ని ఖనిజరూపంలో నిక్షిప్తం చేసే వ్యవస్థ లేకుండాపోయింది. దీనికి తోడు అగ్నిపర్వతాలు చిమ్మే కార్బన్ డై ఆక్సైడ్ నిత్యం దట్టంగా పేరుకుపోతుండటంతో శుక్రుడిపై వాతావరణం మనకన్నా 90% భారంగా మారిపోయింది. సీఓ2 మిళితమైన ఉష్ణం నుంచి వెలువడే రేడియేషన్ తో ప్లానెట్ వీనస్ భయంకర దావానలాలకు ఆలవాలమైంది. మరోవైపు భూమి అందుకు పూర్తి విరుద్ధం.

అత్యద్భుతమైన జీవకోటితో సజీవంగా, స్థిరంగా సౌరవ్యవస్థలో తన ఉనికి చాటుకుంటోంది. భూగ్రహం మీద జీవజాలం అధికంగా అడవుల్లో ఉంది. అడవులు ఎక్కువగా ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. వసంతరుతువు రాగానే వాతావరణంలోని సీఓ2 ను పీల్చుకుని అడవులు పెరుగుతాయి. భూగోళాన్ని ఆకుపచ్చగా మార్చి సస్యశ్యామలం చేస్తాయి. ఒకవేళ సీఓ2 తగ్గితే, శిశిర రుతువులో రాలి క్షయించిన ఆకులు కార్బన్ డై ఆక్సైడ్ ను మళ్లీ వాతావరణంలోకి వదులుతాయి. ఇదొక సైకిల్! దక్షిణార్ధగోళంలో కూడా ఇదే రిపీటవుతుంటుంది. ఇందులో ఎక్కువ భాగం సముద్రప్రాంతం కావడంతో ఉత్తరార్ధగోళంలోని అడవులే భూగోళం మీద ఏటా తలెత్తే సీఓ2 మార్పులను నియంత్రిస్తాయి. ఇలా కొన్ని వేల ఏళ్లుగా భూగ్రహం మీద సకల జీవకోటి ఊపిరి పీల్చుకుంటూ, ప్రత్యుత్పత్తి జరుపుతూ ప్రశాంతంగా మనుగడసాగిస్తోంది.

SURAJకానీ, కొన్ని దశాబ్దాలక్రితం సముద్ర శాస్త్రవేత్తల పరిశోధనల్లో అకస్మాత్తుగా ఒక సున్నితమైన, భయంకరమమైన నిజం బైటపడింది. మానవ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా వాతావరణంలో సీఓ2 శాతం క్రమంగా పెరుగుతోందని వెల్లడైంది. ఓషనోగ్రఫీ ప్రకారం మంచుగడ్డలు ఇందుకు సజీవసాక్షాలు! అందుకే శాస్త్రవేత్తలు, అంటార్కిటికా, ఆర్కిటిక్ వలయాల్లోని గ్లేసియర్ల పొరల్లో కొన్ని లక్షల ఏళ్లక్రితం వాయువులు ఏర్పరచిన మంచు చారలను పరిశోధించి విశ్లేషించారు. భూ వాతావరణంలో గడచిన 8 లక్షల సంవత్సరాలుగా ఉన్న సీఓ2 శాతాన్ని లెక్కగటారు! 20 వ శతాబ్దం వరకు కూడా సీఓ2 ఎప్పుడూ 1% లో 300 వ వంతును మించలేదని గుర్తించారు. ఆ తరవాత నుంచి గణనీయంగా పెరుగుతూ ఇప్పుడది ప్రమాదస్థాయిని చేరింది. పారిశ్రామికవిప్లవం తరవాత 40% అధికమైంది. విలాసవంతమై అవసరాల కోసం బొగ్గు, పెట్రోలియం ప్రొడక్ట్స్, గ్యాస్, ఇతర శిలాజ ఇంధనాలను మండించటం ద్వారా ఆధునిక మానవ సమాజాలు, భూసంగ్రహణ సామర్థ్యాన్ని మించి పొగ రూపంలో కార్బన్ డై ఆక్సైడ్ ను గాల్లోకి వదులుతున్నాయి. ఫలితంగా భూమి వేడెక్కుతోంది! దాని ఉపరితలం మీద కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ హీట్ రేడియేషన్ జెనరేటవుతోంది! సూర్యకాంతి తాకితే, సహజంగానే భూమి వేడెక్కుతుంది. దీనికితోడు సూర్యకిరణాల నుంచి వెలువడే హీట్ రేడియేషన్ను సీఓ2 పీల్చుకుని ఉపరితలం మీదే పట్టి ఉంచుతుంది. ఫలితంగా గ్రహంపై భరించలేనంత వేడి పుట్టి గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ కు దారితీస్తుంది! ఎకాలజిస్టుల ప్రకారం, ఆ ఎఫెక్ట్ మైల్డ్ గా ఉంటే ఏ సమస్యా లేదు. అధికమైతేనే, ఎర్త్ క్లైమేట్ ను తీవ్రంగా అస్థిరపరుస్తుంది! ప్లానెట్ పై జీవనగమనాన్ని చిద్రం చేస్తుంది!

సీఓ2 మోతాదు మించితే భస్మీపటలమే! అది సృష్టించే కాలుష్యం వల్ల భవిష్యత్తులో మన పిల్లలు కర్కశమైన రేడియోఆక్టివ్ హీట్ వేవ్స్ కు బలవుతారు! భూమి నిస్సారమై ఎడారిలా మారుతుంది! కరువు కరాళనృత్యం చేస్తుంది! భూమిపై కొన్ని వేల ఏళ్లుగా మనుగడ సాగిస్తోన్న కోట్లాది జీవజాతులు అంతరించిపోతాయి!

మనిషికి సౌకర్యాలపట్ల ఉన్న బలహీనత, ఆస్తులు, అంతస్తుల పట్ల ఉన్న అత్యాశ, సమాజంపట్ల ఉన్న నిర్లక్ష్యాలు తనతోపాటు సమస్త జీవకోటినీ ప్రమాదంలోకి నెడుతున్నాయి! అగ్నిపర్వతాల రూపంలో సాలీనా 500 మిలియన్ టన్నుల సీఓ2 వాతావరణంలో కలుస్తుంది. భారీస్థాయిలో కనిపించినా, పర్యావరణవేత్తల లెక్కప్రకారం దీంతో పెద్దనష్టం లేదు. ఆధునిక వ్యవస్థలో మనం వాడుతున్న పెట్రో సాధనాల వల్ల గాల్లో కలుస్తోన్న 30 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ తో పోలిస్తే ఇది కేవలం 2% మాత్రమే! ప్రతి ఏటా ప్రపంచపు వాతావరణంపై మనం 400 బిలియన్ టన్నుల అదనపు కార్బన్ డై ఆక్సైడ్ భారాన్ని మోపుతున్నాం! ఇలా భూమిపై పోగైన అదనపు కర్బనశక్తంతా ఎక్కడో ఓచోట కేంద్రీకృతమవుతుంది. దాంట్లో కొంత గాలిని వేడెక్కిస్తుంది! చాలావరకు సముద్రంలో కలిసి, ఆ జలాలను వేడెక్కిస్తోంది! ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో సైతం ఉష్ణోగ్రతలు హెచ్చుతున్నాయి. ఆర్కిటిక్ పోల్ సర్కిల్లో మంచుకప్పు కరిగిపోతోంది! మంచుపర్వతాలు, ఐస్ గ్లేసియర్లు కరుగుతున్నాయి! సముద్ర నీటిమట్టం పెరిగిపోతోంది! భూభాగం తగ్గుతోంది! భూమి కోతకు గురవుతోంది. సీఓ2 మోతాదు మించితే భస్మీపటలమే! అది సృష్టించే కాలుష్యం వల్ల భవిష్యత్తులో మన పిల్లలు కర్కశమైన రేడియోఆక్టివ్ హీట్ వేవ్స్ కు బలవుతారు! భూమి నిస్సారమై ఎడారిలా మారుతుంది! కరువు కరాళనృత్యం చేస్తుంది! భూమిపై కొన్ని వేల ఏళ్లుగా మనుగడ సాగిస్తోన్న కోట్లాది జీవజాతులు అంతరించిపోతాయి!

 

SURAJ

భూగ్రహం శాంతించాలి! యుగయుగాలు మనమంతా చల్లగ బతకాలి! సర్వేజనా సుజనో భవంతు! సర్వే సుజనా సుఖినో భవంతు!

శుక్రగ్రహంపై వాతావరణాన్ని అక్కడి పరిస్థితుల కారణంగా ప్రకృతి ధ్వంసం చేస్తే, భూగ్రహంపై మానవ తప్పిదాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి! శుక్రుడి మాదిరి సలసల మరిగించే ఉష్ణోగ్రతలు భూమిపై ఏర్పడొద్దంటే, మనం కొన్ని పద్ధతులు పాటించాలి. సరికొత్త విధానాలను అవలంభించాలి. జీవనశైలి మార్చాలి! నాగరిక సమాజం పోకడలు మారాలి. పాలకులు పంథా మార్చాలి! జనంలో చైతన్యం తేవాలి! పొల్యూషన్ కారక ఫాసిల్ ఫ్యూయల్ వాడకాన్ని బహిష్కరించాలి! ఎలెక్ట్రిక్, సోలార్, విండ్ పవర్ లాంటి సాంప్రదేయతర ఇంధనాలపై దృష్టిసారించాలి. కాలుష్యరహిత భవిష్యత్తు కోసం చెట్లు నాటాలి! అడవులు భారీగా పెంచాలి! నగరాల్లో విశృంఖలమైన పెట్రోప్రొడక్ట్స్ వినియోగం తగ్గాలి. హానికారక వ్యర్థాలను వదిలే పరిశ్రమలకు కళ్లెం వేయాలి! కాలుష్యపూరితంగా మారిన మహానగరాలను, పట్టణాలను పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని పరిరక్షించాలి! అట్మాస్పియర్లోకి క్లోరోఫ్లోరో కార్బన్స్, గ్రీన్ హౌజ్ గ్యాస్ ల పంపింగ్ ను నియంత్రించి, ఓజోన్ పొరను కాపాడాలి. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టాలి!

అలా భూగ్రహం శాంతించాలి! యుగయుగాలు మనమంతా చల్లగ బతకాలి! సర్వేజనా సుజనో భవంతు! సర్వే సుజనా సుఖినో భవంతు!

‘సూరజ్ వి. భరద్వాజ్ సీనియర్ జర్నలిస్టు. ఉస్మానియాలో విశ్వ విద్యాలయంలో జర్నలిజంలో ఎంసిజె చదివిన ఈ కరీంనగర్ బిడ్డ అనతికాలంలోనే టెలివిజన్ జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. క్రైం  నుంచి పోలిటికల్ రిపోర్టింగ్ వరకు తనది చురుకైన పాత్ర, ప్రవేశం. ప్రస్తుతం టి న్యూస్ బ్యూరోలో  పనిచేస్తున్న తాను ముఖ్యమంత్రి, సచివాలయ కార్యకలాపాలను ప్రజలకు అందజేస్తున్నారు. మంచి వాక్యం రాయగల అరుదైన ఈ టెలివిజన్ జర్నలిస్టు ‘తెలుపు’ కోసం సూరజ్’ కా సాత్వా ఘోడా  పేరిట  మనం చూస్తున్న లోకాన్నే సరికొత్తగా దర్శనం చేయిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article