Editorial

Thursday, November 21, 2024
సంపాద‌కీయంపద్నాలుగేండ్ల తర్వాత వ్యక్తులుగా ‘టి- జాక్’ కలయిక - తెలుపు సంపాదకీయం

పద్నాలుగేండ్ల తర్వాత వ్యక్తులుగా ‘టి- జాక్’ కలయిక – తెలుపు సంపాదకీయం

కెసిఆర్ ప్రభుత్వం గద్దె దిగాక పార్టీలోనే కాదు, బయటా ఒకింత ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడిందనడానికి నిదర్శనం, నిన్న ఎవరికి వారుగా మారిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటి సభ్యులు వ్యక్తిగత స్థాయిలో ఆత్మీయంగా కలిసి మాట్లాడుకోవడం. ఇది రాజకీయ ప్రాధాన్యత లేని విషయం అని వారు అంటున్నప్పటికీ వ్యక్తిగతంగానైనా ఇది పెద్ద విషయమే. ప్రచారం జరగలేదు గానీ ఇది నిజానికి పెద్ద వార్తే.

ఐతే, వీరి ‘కలయిక’ ప్రజల్ని ఆందోళనకు గురి చేసే అంశమే అని అనక తప్పదు. అది గతానుభవాల ఫలితం మరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాన్ని, దశాబ్ధపునర వీరి కార్యాచరణను ఇప్పటికైనా ప్రజలు చర్చిస్తారని, ఆ దిశలో రాయక తప్పని తెలుపు సంపాదకీయం ఇది.

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh Babu
Editor, Teluputv

మలిదశ తెలంగాణాలో, రాష్ట్ర ఏర్పాటుకు కీలకంగా పనిచేసిన రాజకీయ జెఎసి దాదాపు చీలిపోయింది. ఒక వర్గం ఒక్కొక్కరిగా ప్రభుత్వంలో లీనం కాగా మిగతా వారు ఎవరికి వారే అయ్యారని తెలిసిందే. అందులో ప్రభుత్వం వైపు వెళ్లి ఎంపిలు, ఎం, ఎల్. ఏలు, ఎంఎల్ సిలు, కార్పొరేషన్ చైర్మెన్లు, ఓఎస్డిల నుంచి శాసన మండలి చైర్మెన్ వంటి పదవులు దక్కించుకున్నవారి దాకా, చాలా మంది ఎవరి రాజకీయ కారణాలతో వారు వేరయ్యారు. ఇందులో రాజకీయాలకు అతీతంగా ప్రారంభమై అందరినీ సమన్వయం చేసిన కోదండ రాం గారు చివరికి రాజకీయ పార్టీ సైతం పెట్టారు. ఈ ఎన్నికల్లో వారు కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడటం, ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మిగతా అందరికన్నా కోదండరాం గారి ‘ప్రభ’ ఇప్పుడు వెలుగుతున్నది. ఆ లెక్కన మిగతా వారు కాస్త చిన్నబోయినట్టే లెక్క. ‘విద్యుత్ రఘు’ వంటి వారు ఏ రాజకీయపక్షంతో లేనివారూ ఉన్నారు గానీ వారి సంఖ్య చాలా స్వల్పమే అనాలి.

కాగా, హైదరాబాద్ లోని బేగంపేట రోడ్డులో ఉన్న టూరిస్ట్ ప్లాజాలో జరిగిన ఈ సమావేశానికి కోదండరాం హాజరై వెళ్లారు గానీ ఫొటో దిగే సమయానికి వారు లేరని తెలిసింది. ఇది కావాలని చేసినా చేయకపోయినా వారు ఫోటోలో లేకపోవడం చెప్పుకోదగిన విషయమే. కాగా, రఘు సమావేశానికి రాలేదని తెలిసింది. అలాగే తెలంగాణా ఇంజినీర్స్ ఫెడరేషన్ నేత సుదీర్ రెడ్డి కూడా రాలేదు. అధికార పార్టీలో త్వరలో మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉన్నట్టు చెబుతున్న అద్దంకి దయాకర్ కూడా, కారణాలు తెలియ రాలేదు గానీ, ఎందుకో హాజరు కాలేదు.

ఏమైనా, 2009లో ఏర్పడి రాష్ట్ర ఏర్పాటు దాకా అత్యంత సమరశీలంగా పనిచేసిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తాలూకు పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే చరిత్ర. తర్వాత ‘బంగారు తెలంగాణా’ నిర్మాణంలో కెసిఆర్ కు మద్దతుగా ప్రభుత్వంలో భాగమైన వారి చరిత్ర అన్నది వ్యక్తగత స్థాయికే పరిమితం అవుతుంది గానీ అది సకల జనుల చరిత్రగా పేర్కొన దగినదైతే కాదు. కాకపోతే, ఈ పదేళ్ళు వారు ప్రజల తరపున పెదవి విప్పకపోవడం వల్ల చరిత్ర హీనులు అవుతారా అన్న మాట నిజానికి పెద్ద మాట గానీ అది కూడా మునుముందు చర్చకు రావలసే ఉంటుంది. వస్తది కావొచ్చు. ఐతే, ప్రభుత్వంలో మంచి ఉన్నది, చెడు ఉన్నది అని వీరిలో కొందరు అంటూ ఉన్నారు కనుక ఎవరి స్థాయి ఏమిటో ప్రజల్లో నిగ్గు తేలవలసే ఉన్నది. కానీ అందరిలోనూ ఈ పదేళ్ళ కాలం ఒక ‘అనధికార నిర్భంధం’ కొనసాగిందీ అన్నదాంతో ఎవరికీ భేదాభిప్రాయం లేదు. అందువల్లీ ఈ సమావేశం అనాలి.

విశేషం ఏమిటంటే, కొందరు పదవులు పొందిన వారు తాము టిఆరెస్ / బిఆర్ ఎస్ పార్టీలో చేరలేదని, తాము పొందినది ఉద్యమంలో తమ కృషికు గుర్తింపుగా అంది వచ్చిన పదవే కనుక తమ బాధ్యతలను తాము హుందాగా నిర్వహించామనే వాదిస్తున్నారు. చూడాలి మరి,  రేపు రేపు వారు ఇదే మాట అంటారో లేదో అన్నది!

ఏమైనా 2014 వరకూ జెఎసిది ఒక అపూర్వమైన చరిత్ర.

మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగర హారంతో పాటు అనేక రాస్తారోకోలు, రోడ్ల నిర్భంధం, చలో అసెంబ్లీ వంటి వివిధ నిరసన రూపాల్లో తెలంగాణా రాష్ట్ర సాధనలో అత్యంత కీలకంగా పనిచేసిన రాజకీయ జెఎసిది అద్వితీయ చరిత అన్నది నిర్వివాదాంశం. ఐతే, ఆ  స్టీరింగ్ కమిటీని ఎప్పుడైతే కెసిఆర్ నడిపారో అప్పటి నుంచి అంటే కనీసం రాష్ట్ర ఏర్పాటు అనంతరం అనుకుందాం, అప్పడి నుంచి వారంతా ఉద్యమ కారుల నుంచి ‘పునర్ నిర్మాణం’ అన్న దారిలో ‘తమదైన’ పాత్ర పోషించారు. కెసిఆర్ ప్రభుత్వం మారిన నేటి తరుణంలో వారంతా సామాన్య పౌరులుగా మారిన వైనం గమనార్హం. అప్పటి స్టీరింగ్ కమిటీ సభ్యుల్లో అత్యధికులు ఈ సమావేశంలో కలిసినప్పటికీ దీనికి రాజకీయ ప్రాధాన్యం లేని విషయం అంటూ ఉన్నప్పటికీ, అది వ్యక్తిగత విషయమే అని చెప్పినప్పటికీ దానికి కూడా చాలా ప్రాధాన్యం ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఇంతమంది మాజీ ఉద్యమకారులు ఒక చోట కలిసే అవకాశం మొన్న మొన్నటి వరకు కెసిఆర్ పాలనలో ఊహించలేని స్థితి. ఫోన్ల ట్యాపింగ్ తో  సహా ఎవరు ఎక్కడికి వెళ్ళినా ప్రతి కదలికపైనా నిఘా. ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్థులైన వారు ఇంత ప్రజాస్వామికంగా నలుగురిని కలిసే వెసులుబాటు లేనే లేదు. ఆ దృష్ట్యా ఈ కలయికను ప్రజాస్వామిక వాతావరణానికి ప్రతీక అందామా లేక తమ ఉనికి తాము వెల్లడి చేసుకోవడానికి ఆరంభమైన అనివార్య పరిస్థితిగా గుర్తించాలా అన్నది ప్రజా క్షేత్రంలో విశ్లేషించదగిన అంశం.

ఈ సమావేశాన్ని నాటి డాక్టర్ల జెఎసి కన్వీనర్ గా ఉన్న డా. సురేష్ చంద్ర హరి చొరవ తీసుకుని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ సమావేశానికి న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్, పి ఓ డబ్ల్యూ నేత సంధ్య కూడా హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలైన దుర్గా ప్రసాద్, విఠల్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు కూడా వచ్చారు. అడ్వకేట్ల జెఎసి నేత ప్రహ్లాద్ కూడా హాజరయ్యారు. కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులూ ఉన్నారు. ఫోటోలు చూడండి. ఇంకా ఎవరెవరున్నారో తెలుస్తుంది.

పునర్నిర్మాణం అన్నది గాలికి ఒదిలిన కారణంగా, మిగతా లక్ష్యాలేవీ సంస్థ పెట్టుకోక పోవడంతో 2014 నుంచి జెఎసి ముక్కలు చెక్కలైంది. ఆప్పుడు కలిసారంటే మళ్ళీ వారంతా ఒకేచోట కలవడం ఇదే తొలిసారి.

మీకు తెలుసు, దాదాపు 5 రాజకీయ పార్టీలు, 28 ప్రజా సంఘాలతో ఏర్పేడింది జెఎసీ. అది మూడు విధాలా పని చేసింది. అందులోని విద్యావంతుల వేదిక భావజాల మార్పుకోసం పనిచేస్తే, ఎన్జీవో నేతలు, విద్యార్థి సంఘాలు ఉద్యోగులను, విద్యార్థులను గొప్పగా సమీకరించాయి. అప్పటి టి ఆర్ఎస్ రాజకీయ శక్తిగా ఇతర అన్ని పార్టీలను ఏకత్రాటి మీదకు తేగా మొత్తంగా పోరాటం సకల జనుల ఉద్యమంగా మారి స్వరాష్ట్రం ఏర్పడింది. ఇందులో జాయింట్ యాక్షన్ కమిటీ మహత్తర పాత్ర కారణంగా అప్పటి నేతలు ఎప్పటికీ గుర్తుండి పోతారనడంలో సందేహంలేదు. ఐతే, ఈ పదేళ్ళు వారి పాత్రని ప్రజలు గమనించి గుర్తుంచు కుంటారు అని కూడా ఇక్కడే చెప్పాలి.

జెఏసీ ఏర్పాటు నుంచీ ఆ సంస్థ నీరుగారేదాక కీలకంగా ఉన్నది నాటి ఛైర్మెన్ కోదండరాం. వారితో పాటు నాటి కో-ఛైర్మెన్ గా ఉన్నది స్వామి గౌడ్, కో -ఆర్డినేటర్ పిట్టల రవీందర్. వీరంతా సమావేశానికి హాజరయ్యారు. వారు తొలిగా కమిటీగా ఏర్పాటయ్యాక సదరు కమిటీని విస్తరించారు.

రాష్ట్రం ఏర్పాట ఒక్కటే ఈ సంస్థ మౌలిక లక్ష్యంగా కావడం వల్ల అదే ఆ సంస్థ బలంగా ఉండింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక అదే అంశం ఆ సంస్థ బలహీనతగానూ మారింది. పునర్నిర్మాణం అన్నది గాలికి ఒదిలిన కారణంగా, మిగతా లక్ష్యాలేవీ సంస్థ పెట్టుకోక పోవడంతో 2014 నుంచి జెఎసి ముక్కలు చెక్కలైంది. ఆ వివరాలు ఇప్పుడు వదిలేస్తే, ఆప్పుడు కలిసారంటే మళ్ళీ వారంతా ఒకేచోట కలవడం ఇదే తొలిసారి. అందుకే ఈ కలయిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. పద్నాలుగేళ్ళ తర్వాత ఈ వ్యక్తిగత సమావేశం ఒక చారిత్రిక సందర్భంగానూ గమనించవలసి వస్తోంది. ఐతే, సమావేశానికి హజరైన వారిలో ఒకరన్నారు, “మేము జ్ఞాపకాలు కలబోసుకున్నాం” అని. “అంతకన్నా ఈ సమావేశానికి మరో ప్రాధాన్యత లేదని”.

ఐతే, వీరి ‘కలయిక’ ప్రజల్ని ఆందోళనకు గురి చేసే అంశమే అని అనక తప్పదు. అది గతానుభవాల ఫలితం మరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాన్ని, పదేళ్ళ వీరి కార్యాచరణను ఇప్పటికైనా ప్రజలు చర్చిస్తారని, ఆ దిశలో రాయక తప్పని తెలుపు సంపాదకీయం ఇది.

 

నిజానికి దీని రిలవెన్స్ ఏమిటీ అంటే ముందు చెప్పినట్టు ప్రజలు బిఆర్ ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ ను మద్దతు తెలపిన నేపథ్యం. దీంతో తాము -అంటే- కీలకమైన నేతల్లో అత్యధికులు అని భావించాలి. వారికి నిన్నటిదాకా భాగస్వామ్యం పొందిన ప్రభుత్వం నేడు లేకపోవడం, అధికారానికి దూరమైన స్థితి ఏర్పడటం, అదే వారిని ఈ సమావేశానికి హారజయ్యేలా చేసింది. ఐతే, ఆ పార్టీ ఓటమి చెందడంతో కెసిఆర్ గారికి ఇక ముందు ఎవరూ కూడా విస్పష్టంగా మద్దతుగా ఉండి చేసేదేమీ లేదు. వారి వెంట ఉండి – నిలబడి కెసిఆర్ వైఫల్యాలను మోసే అవసరమూ లేకపోవడం గమనార్హం.

విషాదం ఏమిటంటే, ఓడినా గెలిచినా అది వ్యక్తిగత విజయమే అనుకునే కెసిఆర్ కు ఇప్పటికీ గర్వ భంగం కలగలేదని తెలుస్తూనే ఉన్నది. కేటిఆర్ మాటల్లో అదింకా వినిపిస్తూనే ఉన్నది. స్వేద పత్రంలో కూడా అంతా కూడా వారు తమ అధినాయకుడి ప్రభుత్వం చేసిన ఘనత అనే కీర్తిస్తున్నారు గానీ అది సమిష్టి వ్యవహారం అని, ఇతర నేతల కృషిని ఎక్కడా ప్రస్తావించడం లేదు. దాంతో ప్రభుత్వంలో భాగస్వామ్య వహించిన సదరు జెఎసి నేతలకు చాలా ఇరకాటంగా ఉంది. అటు ప్రజలు పక్కన పెట్టడం, ఇటు అధినేత నిర్లక్ష్యం చేయడంతో వారు కనీసం తమ వ్యక్తిగత ప్రతిష్ట గురించి లేదా కనీసం తమ ఉనికి గురించి లేదంటే స్నేహపూర్వక కలయిక కోసం చూసుకోవలసే ఉన్నది.

ఇక్కడ ప్రభుత్వంలో చేరని వాళ్ళు లేకపోలేదు. వారు కూడా ఈ నూతన తరుణంలో నాటి ఉద్యమ కారులుగా తమ పాత్రను తాము నిలబెట్టుకోవాల్సి న అగత్యం ఏర్పడింది. పదేళ్ళ అనంతరం ఇదొక సానుకూల అంశం. మించిపోయిన తరుణమా కాదా అన్నది రేపటి విషయం. కానీ నేడు కలవాల్సిన స్థితి మాత్రం ఏర్పడింది. అంతేకాదు, ప్రభుత్వం మారిన సందర్భంలో ఈ అంతర్గత సమావేశానికి హజరవడానికి ఎవరికీ మరెవరి అనుమతీ అక్కరలేకపోవడం కూడా ఒక రకంగా అందరికీ గొప్ప రిలీఫ్. అంతేకాదు, రాష్ట్రంలో నెలకొంటున్న కాసింత ప్రజాస్వామిక వాతావరణానికి ఇది మంచి ఉదాహరణ కూడా.

ఏమైనా, వీరంతా కలిసి కాసేపు ఆత్మీయంగా గడిపి భోజనం చేసి వెళ్ళడం అన్నది వర్తమాన రాజకీయ వాతావరణం అందించిన ఒక సానుకూల ‘మార్పు’కు చిహ్నం అనే చెప్పాలి.

అది గంటా రెండు గంటలే కావొచ్చు, కానీ మాట్లాడుకునే అవకాశం, కలుసుకుని ముచ్చటించే పరిస్థితి రాష్ట్రంలో నాటి ‘ఉద్యమకారులకు’ కూడా ఏర్పడిందని చెప్పడానికి ఈ సమావేశం తాజా ఉదాహరణ. అంతేకాదు, ఇది పద్నాలుగేళ్ళ తర్వాతి సమిష్టి కలయిక అని గుర్తు చేయడానికే ఈ కథనం.

మొత్తానికి బాగుంది. ప్రజల స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తర్వాత ఒకనాటి జెఎసి నేతలు సంతోషంగా కలిశారు. స్వపక్షం, విపక్షం, వైరి పక్షం అన్నది పక్కన పెడితే, ఒక నియంత మారినప్పుడు ఆనందించడానికి ఎవరూ అతీతులు కాదనడానికి కూడా ఈ కలయిక ఒక నిరూపణ. ఐతే, వీరి ‘కలయిక’ ప్రజల్ని ఆందోళనకు గురి చేసే అంశమే అని అనక తప్పదు. అది గతానుభవాల ఫలితం మరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాన్ని, దశాబ్దపునర వీరి కార్యాచరణను ఇప్పటికైనా ప్రజలు చర్చిస్తారని, ఆ దిశలో రాయక తప్పని తెలుపు సంపాదకీయం ఇది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article