Editorial

Wednesday, January 22, 2025
వ్యాసాలుమరుగున వున్నవారిని వెలికితీసే ప్రయత్నం : సజయకు కేంద్ర సాహిత్య పురస్కారం

మరుగున వున్నవారిని వెలికితీసే ప్రయత్నం : సజయకు కేంద్ర సాహిత్య పురస్కారం

సామాజిక కార్యకర్త భాషాసింగ్ ఆంగ్లంలో రచించిన “అన్ సీన్” అన్న పరిశోధనాత్మక గ్రంథాన్ని “అశుద్ధ భారత్” పేరుతో తెలుగులోకి అనువదించిన సజయకు నేడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించడం విశేషం. గతంలో తాను ఇదే గ్రంధానువాదానికి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం పొందిన విషయంతెలిసిందే. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ చదవండి ఆ పుస్తకం ముందుమాట.

అనువాద సాహిత్య సేవకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ నేడు  పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త సజయకి  ఈ పురస్కారాన్ని ప్రకటించారు. సుప్రసిద్ధ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త భాషాసింగ్ ఆంగ్లంలో రచించిన “అన్ సీన్” అన్న పరిశోధనాత్మక గ్రంథాన్ని “అశుద్ధ భారత్” పేరుతో తెలుగులోకి అనువదించినందుకు గాను సజయ ఈ పురస్కారాన్ని పొందుతున్నారు.

కాగా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలో నేటికీ కొనసాగుతున్న మాన్యువల్ స్కావెంజింగ్ గురించి ఆధారసహితంగా పట్టిచూపే ఈ గ్రంధం అత్యంత విషాదకరమైన జీవితాలను, అందుకు తావిచ్చిన అమానుషమైన వ్యవస్థను బట్ట బయలు చేస్తుంది. మానవ మలాన్ని మనషులు ఎత్తిపోసే దుర్మార్గపు వృత్తిని సమూలంగా నిర్మూలించాలన్న ఉద్యమ దీక్షలో భాగంగా వెలువడిన ఈ గ్రంధం ఇప్పటికీ మీరు చదివి ఉంటే ఎంతో సంతోషం. లేకపోతే ఈ గ్రంథానికి అవార్డు వచ్చిన సందర్భంలోనైనా చదవడం ఎంతో అవసరం. అమానవీయమైన ఈ వృత్తి ఇకపై కొనసాగకూడదంటూ ఆ దిశగా ప్రభుత్వాలు తగిన విధానాలు చేపట్టేలా మనం వత్తిడి తేవడానికి అదెంతో ఉపకరిస్తుంది.

పుస్తకం తెప్పించుకునే ముందు ఈ సమస్యపై మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న సఫాయి కర్మచారి ఆందోళన్ నాయకుడు బెజవాడ విల్సన్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాట చదవడం మరింత మేలు చేస్తుందని భావిస్తూ తెలుపు మరోసారి అందిస్తున్నది.

ఎంతో శ్రమకోర్చి ఈ పుస్తకం రాసిన పాత్రికేయురాలు భాషాసింగ్ కి, తెలుగులో పుస్తకం ప్రచురించిన హెచ్ బి టి సంపాదకులు గీత రామస్వామికి కృతజ్ఞతాభివందనాలు. పురస్కార గ్రహీత సజయకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు.

పుస్తకం కోసం ఈ లింకు క్లిక్ చేయండి లేదా HBT కి ఫోన్ చేయండి – 040 23521849

 

UN SEEN : మరుగున వున్నవారిని వెలికితీసే ప్రయత్నం

బెజవాడ విల్సన్ 

పాకీపని విధానం గురించి చర్చించిన ఎన్నో పుస్తకాలను నేను చూశాను, చదివాను కూడా. అది ఒక అమానవీయమైన విధానం కావటంతో చాలామంది అందులోని క్రూరత్వం గురించి రాయటానికే ఎక్కువ ఆసక్తి చూపించారు. అలాంటి అనేక పుస్తకాలలో దృష్టంతా కూడా ఎత్తుడుదొడ్ల (డ్రై లెట్రిన్లు) ను ఏవిధంగా ఆధునీకరించడం అనే దానిపైనే కేంద్రీకృతమై వుండేది. ‘అన్సీన్ : ది ట్రూత్ అబౌట్ ఇండియాస్ మాన్యువల్ స్కావెంజింగ్’ అన్న ఈ పుస్తకం మాత్రం మిగతా అన్ని పుస్తకాల కంటే కూడా ఎంతో విభిన్నమైంది. ఎందుకంటే – ఈ పుస్తకం ముఖ్యంగా పాకీపని విధానంలో వున్న మనుషుల గురించి చర్చిస్తుంది. తరాల తరబడి ఈ అమానవీయమైన విధానానికి బలైన పాకీ సమూహానికి చెందిన వారి గురించి మాట్లాడుతుంది. ఈ పుస్తకం మా జీవితాలను, పోరాటాలను ఎత్తి చూపింది. అలాగే మా జీవితాల్లోని రెండు ముఖ్యమైన అంశాలను ఈ పుస్తకం బలంగా ముందుకు తెచ్చింది. మొదటిది : మా జీవితాలను, ఆలోచనలను ఈ కులపరమైన విధానం ఎంత బలంగా నియంత్రించగలదో కళ్ళకు కట్టించింది. రెండు : ఈ పని నుంచి మేము విముక్తమవ్వాలని ఎంత బలంగా కోరుకుంటున్నామనే ఆకాంక్షను వెలికితీసింది. మరీ ముఖ్యంగా మా సమూహంలోని ఆడవాళ్ళు ఈ నరకం నుంచి బయటపడాలని ఎంతగా కోరుకుంటున్నారో, తమ చేతులతో ఎత్తుడుదొడ్లను కూలగొట్టడానికి ఏ విధంగా ముందుకువచ్చారో, పియ్యిపెంటలతో నిరంతరం నిండే బుట్టలను ఎలా తగులబెట్టారో, ఈ క్రమంలో వారి జీవిత సహచరులైన మగవాళ్ళు కూడా ఏ రీతిగా వారికి సహాయపడ్డారో ఈ పుస్తకం విస్పష్టంగా వెలుగులోకి తీసుకువచ్చింది.

తోటీ మనుషుల పియ్యిపెంటలను తమ చేతులతో ప్రతిరోజూ ఎత్తవలసి రావటం అనే అసహ్యకరమైన విధానం ఒక ఫ్యూడల్ అణిచివేతకు చిహ్నం.

నేటికీ కొనసాగుతున్న పాకీపని విధానం ఈ సమూహంలోని మనుషులను ఏ విధంగా ధ్వంసంచేసిందో, ఒక తీవ్రమైన జీవన అభద్రతకు ఎంతలా గురిచేసిందో మనమెవ్వరమూ గుర్తించను కూడా  గుర్తించలేకపోతున్నామని ‘అన్సీన్’ పుస్తకం స్పష్టంగా చెప్పింది. తోటీ మనుషుల పియ్యిపెంటలను తమ చేతులతో ప్రతిరోజూ ఎత్తవలసి రావటం అనే అసహ్యకరమైన విధానం ఒక ఫ్యూడల్ అణిచివేతకు చిహ్నం. ఈ క్రమంలోనే అత్తలు కొత్త కోడళ్ళకు మొదటి బహుమతిగా తమ భాగంలోని కొంత ‘జజ్మని’ ని అప్పగిస్తారు. దీనర్ధం ఏమిటంటే తాము శుభ్రంచేసే ఎత్తుడు దొడ్లలో కొన్నిటిని తమ కోడళ్ళకు వారసత్వంగా అందజేయటం అన్నమాట! ఈ పరంపరలో భాగంగా తమ – కోడళ్ళకు పాకీబుట్టను, చీపురును ప్రథమ కానుకగా ఇవ్వటాన్ని చాలా గర్వంగా భావిస్తారు అత్తలు. ఇలాంటి ఎన్నో సంఘటనలను నేను కళ్ళారా చూశాను. ఒక సాధారణ కుటుంబంలో అత్తలు ఏ విధంగా అయితే కొత్తగా వచ్చిన కోడళ్ళకు బాధ్యతలను అప్పగిస్తారో ఇది కూడా అలాంటిదే. పాకీ పని చేసే కుటుంబాలలో ఈ అణిచివేత ఒక తరం నుంచి ఇంకో తరానికి సంక్రమిస్తూ మొత్తం సమూహాన్నే బాధితులుగా మారుస్తుంది. పితృస్వా మ్య కులపీడన కావాలనే వారిని ఈ ఊబిలోకి తోసిందనే వాస్తవం వీళ్ళకు తెలిసే అవకాశం లేదు. ఇలాంటి ఎన్నో మరుగునపడిన అంశాలను ఈ పుస్తకం బహిర్గతం చేసి విస్పష్టంగా చర్చించింది.

నేను నా జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం పని చేస్తున్నారని అడిగితే వచ్చే సమాధానం ఏమిటో తెలుసా? “మా పని మేం చేస్తున్నాం” అనే. మళ్ళీ అదే ప్రశ్న వేస్తే వారి నుంచి వచ్చే తిరుగు సమాధానం “నీకు తెలీదా మేం ఏం చేస్తున్నామో? మేము పాకీపని చేస్తామని నీకు తెలుసు కదా! ” అంటారు. మొత్తం సమూహమంతా కూడా ఇతరుల పియ్యిపెంటలను ఎత్తటమే తమ పని అని ఎలా అంగీకరించగలిగారని నాలో ఆలోచన రేకెత్తింది. ఈ ఆలోచనే ఎంతో బాధాకరమైంది.. తరాలతరబడి తమమీద జరుగుతున్న అణిచివేతను కనీసం ప్రశ్నించను కూడా ప్రశ్నించకుండా ఈ ప్రజలు దానికి తలొగ్గి పనిచేయడమనేదే ఒక పెద్ద కుట్రలో భాగం. ఈ కుట్రకు ప్రాణంపోసింది కులవ్యవస్థ. అది పాకీవాళ్ళను నిరంతరం అణిచివేతలో వుంచుతుంది. “పాకీ సమూహం తలరాత అలావుంది, ఈ పియ్యిపెంటలను ఎత్తిపోసే బాధ్యత వారిదే అని మిగిలిన సమాజం అంతా భావిస్తే, పాకీ సమూహమేమో ఇతరుల పియ్యిపెంటను ఎత్తివేయటం తమ బాధ్యత అని భావిస్తారు! సంక్షిష్టమైన ఈ పరిస్థితిని ఏ విధంగా అర్ధం చేసుకుంటాం? ఈ చిక్కుముడిని ఎవరు విప్పగలుగుతారు? ఎవరు దీన్ని బద్ధలుకొడతారు? ఈ బాధ్యత వేరేవాళ్ళదని పాకీ సమూహం భావిస్తే, కాదు ఈ బాధ్యత పాకీ సమూహానిదే అని సమాజమూ, ప్రభుత్వము భావిస్తున్నాయి. మేము ఏమనుకుంటున్నామంటే రెండువైపుల నుంచి ఆ ప్రయత్నం జరగాల్సిన అవసరం వుందని! ఇక్కడే భాషాసింగ్ పుస్తకం మొదలవుతుంది. ఈ కుట్రను ఛేదించే క్రమంలో నిరంతరం నా ప్రజలు ఈ దుర్మార్గమైన వాస్తవాన్ని ఏ విధంగా సహించుకుంటూ వస్తున్నారో “అన్సీన్” విపులంగా అర్ధం చేయిస్తుంది.

పాకీపని విధానాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజుకి కూడా తాము పెట్టిన కాలపరిమితుల్ని తామే ఉల్లంఘిస్తున్నాయి.

అమానవీయమైన, చట్టవిరుద్ధమైన ఈ పనిని అంతమొందించటానికి అట్టడుగు స్థాయి నుంచి మొదలైన మా చైతన్యాన్ని ఈ వ్యవస్థ గుర్తించనప్పటికీ, విముక్తి కోసం సాగుతున్న మా పోరాటాన్ని విస్మరించటం మాత్రం అసాధ్యం. ఎన్నో తరాలపాటు మేము ఇళ్ళ వెనుకవైపు నుంచి మాత్రమే వెళ్ళి పియ్యిపెంటలను ఎత్తి, పాకీదొడ్లను శుభ్రం చేశాం. ముఖద్వారం నుంచి ప్రవేశం మాకు నిషిద్ధం. మమ్మల్ని ఎంతో కాలం పాటు అలా వుంచేసిన ఆ కనిపించని గోడల్ని గుర్తించి బద్ధలు కొడుతున్నాం. మాకు సానుభూతి అవసరం లేదు. ఆత్మగౌరవం, స్వావలంబన కోసం మా పోరాటం కొనసాగుతుంది. మా ఈ పోరాటానికి సహకరించాల్సింది పోయి ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, సమాజం అందరూకూడా మా దారిలో ఎన్నో అవరోధాలు సృష్టిస్తున్నారు. పాకీపని విధానాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజుకి కూడా తాము పెట్టిన కాలపరిమితుల్ని తామే ఉల్లంఘిస్తున్నాయి. గత ఇరవై సంవత్సరాలుగా కనీసం తొమ్మిదిసార్లు ఈ విధంగా జరిగింది. కానీ, కామన్వెల్త్ క్రీడల కోసం పెట్టిన గడువుని అవి ఆ విధంగా ఉల్లంఘించగలుగుతాయా? ఢిల్లీ మెట్రోప్రాజెక్టుని అలా సంవత్సరాల తరబడి వాయిదా వెయ్యగలరా? కామన్వెల్త్ క్రీడలప్పుడు చోటుచేసుకున్న అవినీతి వల్ల ఏర్పాట్లలో రోజుల తరబడి జాప్యం జరిగినప్పటికీ, అనుకున్న సమయానికే ఆ పోటీలను నిర్వహించారు. అలాంటి వాటికి ఏ విధమైన అడ్డంకులూ లేవు. జరిగిన లోపాల కారణంగా తాము పోటీలను నిర్వహించలేమని ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు కూడా. మరి పాకీపనిని అంతమొందించటానికి సంవత్సరాల తరబడి వాయిదాలు వేసుకుంటూ ఎందుకు వెళ్తున్నారు?

ప్రస్తుతం వున్న 750 మంది లోకసభ సభ్యులు, అంతకు ముందు పనిచేసిన వందలాది మంది సభ్యులు కానీ ఈ విషయమై తమ సహానుభూతిని వ్యక్తంచేస్తూ నిరంతరం ఒక వత్తిడిని లోకసభలో ఎందుకు తీసుకురాలేక పోయారు?

1993లో పాకీ పనిని నిషేధిస్తూ చట్టం వచ్చింది. మరి, ఈ ఇరవై రెండేళ్ళలో 625 మంది జిల్లా కలెక్టర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారి మీద కేసు నమోదు చేయలేదు. ఈ రెండున్నర దశాబ్దాలలో సఫాయి కర్మచారి ఆయోగీ నివేదికను పార్లమెంటులో ఎందుకని ప్రవేశపెట్టలేదు? ప్రస్తుతం వున్న 750 మంది లోకసభ సభ్యులు, అంతకు ముందు పనిచేసిన వందలాది మంది సభ్యులు కానీ ఈ విషయమై తమ సహానుభూతిని వ్యక్తంచేస్తూ నిరంతరం ఒక వత్తిడిని లోకసభలో ఎందుకు తీసుకురాలేక పోయారు? ఈ అనాగరికమైన విధానానికి నిర్ణీత కాలవ్యవధిలో చరమగీతం పాడాలని ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకని నినదించలేకపోయారు? దీనిమీద చర్య తీసుకోవాలని ప్రభుత్వంపై ఎందుకని వత్తిడి పెట్టలేక పోయారు?

దశాబ్దం పాటు సాగిన విచారణ తర్వాత మాకు న్యాయం చేయటానికి తనకు సమయం లేదని కోర్టు తేల్చి చెప్పింది.

1993 లో చట్టంవస్తే ఆ తర్వాత పదేళ్ళనుంచీ ఈ అమానవీయ విధానాన్ని అంతంచేయమని, ఎత్తుడు దొడ్లను కూల్చమని అడుగుతూ ఇప్పటికీ మేము అధికారుల తలుపులు తడుతూనే వున్నాం. ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత ‘ఏ చట్టమూ కూడా తనంతట తాను పనిచేయదు. దాన్ని ముందుకు తోయటానికి ప్రజాబలం ఎంతో అవసరం’ అన్న డా. బి.ఆర్.అంబేద్కర్ చెప్పిన మాటలు మా గ్రహింపుకి వచ్చాయి. మేమంతా సమష్టిగా 2003లో సుప్రీంకోర్టు తలుపుల్ని తట్టాం. కానీ కోర్టు మాకు న్యాయం అందించాల్సింది పోయి, మా భారాన్ని మరింత పెంచింది. ముందుగా అబద్ధపు అఫిడవిట్లను సమర్పిస్తున్న అధికారులను శిక్షించకపోగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న అసత్యాలను నిరూపించాల్సిన బాధ్యతను కూడా మా మీదే మోపింది. దశాబ్దం పాటు సాగిన విచారణ తర్వాత మాకు న్యాయం చేయటానికి తనకు సమయం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ విధంగా సమాజంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన బలహీనవర్గాలకు సాయం చేయటానికి న్యాయవ్యవస్థ పూనుకోవడానికి న్యాయమూర్తులు ఎందుకని అంగీకరించం లేదు….?

ఆ పని చేస్తున్నవాళ్ళు కనిపించగానే ముక్కు మూసుకుని, పక్కకు తిరిగి దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు.

ఈ సమూహం ఎదుర్కొంటున్న కష్టాల గురించి సమాజానికి కనీసమైన అవగాహన లేదు. ‘ఈ పాకీపని ఏమిటసలు? ఎక్కడుంది?” అని ఈ రోజుకి కూడా చాలామంది నన్నడుగుతుంటారు. ప్రతిరోజూ సఫాయి పని వాళ్ళు శుభ్రంచేయటం, పియ్యి పెంటలను ఎత్తిపోయటం వారు చూస్తూనే వుంటారు. ఆ పని చేస్తున్నవాళ్ళు కనిపించగానే ముక్కు మూసుకుని, పక్కకు తిరిగి దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఒక సమూహం తరాల తరబడి ఈ భారాన్ని ఎందుకు మోయాల్సివస్తోందని, వారు ఊపిరి కూడా స్వేచ్ఛగా ఎందుకు తీసుకోలేక పోతున్నారని వీళ్ళు కనీసం ఆలోచించడం గానీ, ప్రశ్నించుకోవటం గానీ చేసివుండరు. ఈ ప్రశ్న వారినెందుకు ఇబ్బంది పెట్టడం లేదు?

అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మిగిలిన దళిత సమూహాల్లో ఈ అంశం పట్ల కనీసమైన సహానుభూతి, సున్నితత్వం లేకపోవటం. పాకీ పనివాళ్ళు దళిత సమూహానికే చెందినప్పటికీ దళిత ఉద్యమాలు ఎప్పుడూ పాకీపని వాళ్ళ విముక్తి కోసం ముందుండి పోరాడలేదు. ఎందుకని? సమాధానం ఒక్కటే ! అదేమిటంటే పితృస్వామ్య కులస్వభావ ఆలోచనా ధోరణులు. విషయాలను కులస్వభావంతో కూడిన ఆలోచనా ధోరణితో చూసినప్పుడు మనకు ఏ సమస్యా అనిపించదు. ఈ పుస్తకంలో భాషాసింగ్ వాటి ముసుగు తీయటానికి ప్రయత్నించారు. పొరలు పొరలుగా ఉండి పైకి కనిపించని అనేక విషయాలు ఈ పాకీపని కొనసాగే క్రమంలో ఎలా దాగివున్నాయో ఈ పుస్తకం బహిర్గతం చేసింది.

భాషాసింగ్ ఎంత ఒత్తిడికి గురయ్యారో, వృత్తిపరమైన ఎన్నో సవాళ్ళను ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో నాకు బాగా తెలుసు. అయినప్పటికీ ఆమె పాకీపనిని నిర్మూలించడం కోసం సాగుతున్న ఉద్యమంతోనే కలిసి నిలబడింది.

ఈ పుస్తకం పేరే దీనికి ఒక నిదర్శనం. ఈ దేశంలో మరుగునపడిపోయి కనిపించకుండా వున్న ఒక సమూహపు ప్రజల గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే, ఇతర ప్రజలు ఈ పాకీ పనివాళ్ళను చూడటం లేదా అంటే, కళ్ళతో చూస్తూనే వున్నారు. కానీ వాళ్ళ ఉనికిని గుర్తించాలనుకోవటం లేదు. మతం, కులం, అధికార యంత్రాంగం, ప్రణాళికలు, రాజకీయాలు ప్రతిచోటా వాళ్ళ ఉనికిని నిర్లక్ష్యం చేయటం వెనుక ఒక కుట్ర దాగివుంది. అందుకే భాషాసింగ్ లాంటి వాళ్ళు కనిపించని భారతదేశమనే ఈ చేదు వాస్తవాన్ని వెలికితీయటానికి చేసే ప్రయత్నాలకు ఈ వ్యవస్థ తనదైన వ్యతిరేకతతోనే ప్రతిస్పందిస్తుంది. ఈ విషయాలపై సున్నితంగా స్పందించి పనిచేసే వాళ్ళు, ఈ ప్రజల విముక్తి గురించి ఆందోళన చెందేవాళ్ళని కూడా ఈ వర్గానికి, ఈ కులానికి చెందిన వారిగానే తలచి అదే ముద్ర వేస్తారు. ఎవరైనా ఒకరు ఒక అంటరాని వ్యక్తి దగ్గరికి వెళ్లే వారిని కూడా అంటరాని వ్యక్తిగానే పరిగణిస్తారు. ఇదీ కులవ్యవస్థకున్న క్రూరమైన అనాగరిక స్వభావం. ఇలాంటి జర్నలిస్టులను ఎగతాళిచేయటం, వాళ్ళ పనిని, రాతలను తక్కువ చేసి చూడటం, వాళ్ళని ‘పాకీ జర్నలిస్టులుగా’ ముద్రవేయటం – ఇదంతా కూడా ఆ క్రూరమైన స్వభావం వల్లే జరుగుతుంది. ఈ క్రమంలో భాషాసింగ్ ఎంత ఒత్తిడికి గురయ్యారో, వృత్తిపరమైన ఎన్నో సవాళ్ళను ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో నాకు బాగా తెలుసు. అయినప్పటికీ ఆమె పాకీపనిని నిర్మూలించడం కోసం సాగుతున్న ఉద్యమంతోనే కలిసి నిలబడింది. కేవలం ఈ దృఢసంకల్పంతోనే ఆమె ఈ అంశం మీద ఎన్నెన్నో విభిన్న కోణాలను ఆవిష్కరిస్తూ ఈ పుస్తకాన్ని పూర్తిచేయగలిగారు.

అంతకంటే మించి ఈ ప్రజల ఆకాంక్షలను ఒకచోట కూర్చి పాకీపనికి వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలకు ప్రేరణ కావాలని, ఒక మంచి మార్పుకు ఇదొక పనిముట్టుగా మారాలని కోరుకుంటున్నాను.

పుస్తకం రాసే క్రమంలో భాషాసింగ్ పాకీపని నిర్మూలనా ఉద్యమంలో భాగమై పోయారు. శ్రమ అనుకోకుండా ఆమె చేసిన ప్రయత్నాల వల్లనే సఫాయి కర్మచారి ఆందోళన ఉత్తర భారతదేశంలో తన పోరాటాన్ని విస్తరించగలిగింది. ఇంతకాలం మరుగునపడిపోయిన ఎన్నో అంశాలను ఈ పుస్తకం బహిర్గతం చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది ఇంగీషులో రావటం వల్ల విధాన నిర్ణేతలను, వాటిని అమలు పరిచేవారిని ప్రభావితం చేయగలుగుతుందని, ఈ సమూహపు జనుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటంలో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.

అలాగే అత్యధికులకు ఈ పుస్తకం చేరుతుందని, ఈ అమానవీయ విధానం పట్ల వారిలో చైతన్యం కలిగిస్తుందని ఆశిస్తున్నాను. అంతకంటే మించి ఈ ప్రజల ఆకాంక్షలను ఒకచోట కూర్చి పాకీపనికి వ్యతిరేకంగా మరిన్ని ఉద్యమాలకు ప్రేరణ కావాలని, ఒక మంచి మార్పుకు ఇదొక పనిముట్టుగా మారాలని కోరుకుంటున్నాను. ఒక అసాధారణ అఖిల భారతాన్ని ఆవిష్కరించటంలో మార్గదర్శిగా ఈ పుస్తకం వుంటుందని నమ్ముతున్నాను, సంపూర్తిగా విశ్వసిస్తున్నాను.

బెజవాడ విల్సన్ సఫాయి కర్మచారి ఆందోళన్ వ్యవస్థాపకులు, జాతీయ కన్వీనర్. వారు రామన్ మెగసెసే పురస్కార గ్రహీత కూడా. 

More articles

1 COMMENT

  1. This great attempt by these lovely socialists such as MegaseseAwardee Sri Bezawada Wilson and learned journalist Mrs. Basha Sing and such other many are the real eradicators of Evil , Cruel and Unethical practice still continuing in most parts of India. How ever these fighters could achieve some change in this un just social order . As rightly pointed by the author the elected rulers never had concern on this hazardous issue. The dirt in the minds of these irresponsible politicians must be cleansed first. The Safai karmaachaari moment organized by Sri. Bezawada Wilson is adorable and will open the eyes of the democratic rulers.
    Let’s Hope for a clean India with clean systems and mechanisation to up keep the dignity and status of cleaning proffessionals.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article