Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌ఆపాదమస్తకం : మారసాని విజయ్ బాబు తెలుపు

ఆపాదమస్తకం : మారసాని విజయ్ బాబు తెలుపు

anandham
Illustration by Beera Srinivas

అలవికాని ఆనందం బహుశా అవమానాలు, అపజయాలు యెదుర్కొన్న వారికే యెక్కువగా దక్కవచ్చు కాబోలు.

మా చిన్నోడి పేరు రాహుల్ సాంకృత్యాయన్. చదువంటే వాడికి యేమాత్రం ఇష్టం లేదు. దానికి తోడు పిల్లల్ని చదవమని వొత్తిడి చేయడం నాకూ నచ్చదు.
వాడు యెలాగోలాగా పదో తరగతికి వచ్చేశాడు. చూస్తుండగానే ఫలితాలు వచ్చాయి.
డ్యాడీ నేను రెండు సబ్జెక్టుల్లో పాసైపోయాను అంటూ ఇంట్లోకి వస్తూవస్తూ అన్నాడు నవ్వుతూ…
వెరీగుడ్ నాన్న. గొప్ప విషయమే అన్నాను నేనూ.
యిదంతా విన్న మా ఆవిడ గౌరికి వొళ్ళు మండిపోయింది. ఆవేశం హద్దులు దాటాయి.
మీవల్లనే పిల్లలు చెడిపోతున్నారు. వాళ్లను కాదు, మిమ్మల్ని అనాలి ముందు అని అంది.
వాడు రెండు సబ్జెక్టుల్లో పాసవ్వడం గొప్ప విషయమే కదా అన్నాను నేను.
మరింత గట్టిగా అరుస్తూ… యిక చాల్లే ఊరుకోండి అని అంది.

 

జీవితంలో ఆపాదమస్తకం కుదిపేసే అపురూప ఆనంద క్షణాల గురించిన అనుభవగాథా సంపుటికి ‘తెలుపు’ ఆహ్వానం. మారసాని విజయ్ బాబు అధిస్తున్న రెండో కథనం ఇది.

అది వేసవి కాలం కావడంతో ఆ రాత్రి మిద్దెపై పడుకున్నాం. పిల్లలిద్దరూ నాకు చెరోపక్క చేరారు. అప్పుడు మేం హైదరాబాద్ చింతలబస్తీలో ఉన్నాం. నేను వార్త దినపత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను.
నాన్నా రాహుల్, చదువంటే నీకు యిష్టంలేదు కదా అన్నాను.
లేదు డ్యాడీ.
వో పని చెయ్. యెప్పటికైనా యేదో వొక పని చేయాల్సిందే. యే పనిచేస్తావో నువ్వే ఆలోచించుకో. రోజుకు వంద రూపాయలు ఇంటికి యివ్వు చాలు. దానిపైన యెంతొచ్చినా నువ్వే వుంచుకో.
సరే డ్యాడీ అన్నాడు వాడు యెంతో వుత్సాహంతో…
మర్నాడు పొద్దున్నే బయలుదేరాడు. పని కావాలని కనిపించిన ప్రతి షాపుకెళ్లి అడిగాడు.
యెక్కడా పని దొరకలేదు.
వొకటీరెండు చోట్ల పని వున్నా రెండు వేల రూపాయల కంటే యెక్కువ యివ్వలేమని వాళ్లు తేల్చి చెప్పేశారు.
అయినా వదలిపెట్టకుండా మరో నాలుగు రోజులు తిరిగాడు.
యెంత యత్నించినా ఫలితం దక్కలేదు.

+++

మా పెద్దోడు మహేష్ బాబు నా దగ్గరకు వచ్చాడు.
డ్యాడీ, వో మెస్ వాళ్లు భోజనం పెట్టి రాహుల్ కు రోజుకు యెనభై రూపాయలు యిస్తామన్నారు. వందరూపాయలు యెవరూ ఇవ్వడంలేదు. రోజూ వాడు మీకు యెనభై రూపాయలు తెచ్చిస్తాడు. ప్లీజ్ డ్యాడీ వొప్పుకోండి. మీరు వొప్పుకోరేమోనని నన్ను చెప్పమన్నాడు.
తీగను మరీ యెక్కువ లాగకూడదనిపించింది.
సరే మహేష్, అలాగేకాని. భోజనం పెడుతారన్నావు కదా. డబ్బులు రోజూ యిచ్చేయాలి. సరేనా అన్నాను.
వాడు యిచ్చేస్తాడు. థ్యాంక్యూ డ్యాడీ.
అది మొదలు…
రోజూ డబ్బులు ఇచ్చేస్తున్నాడు.
చూస్తుండగానే రెండు నెలలు గడచిపోయాయి.
తిరిగి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి.
వో రోజు మహేష్ నాతో యిలా అన్నాడు.
రోజూ రాత్రి 11 గంటల వరకు పనిచేయాలి. ఆదివారాల్లోనూ వెళ్లాల్సిందే. రాహుల్ కు రెస్ట్ కూడాలేదు. వాడివల్లా కావడంలేదు. ప్లీజ్ డ్యాడీ, వాడు చదువుకుంటాడంటా. స్కూలుకు పంపించండి.
పైగా ఫెయిల్ అయ్యాడనీ తన క్లాస్ మేట్స్ తో పాటూ అందరూ వాడిని యెగతాళిచేస్తున్నారట. దాంతో వాడు చాలా ఫీలవుతున్నాడు. అవమానకరంగా వుందని నాతో చెప్పి బాధపడ్డాడు. డ్యాడీ కి చెప్పు, ఈసారి బాగా చదువుకుంటానని అన్నాడు.
ప్లీజ్ డ్యాడీ. వాడిని స్కూలుకు పంపించు.
నేనేమి మాట్లాడలేదు. ఆలోచనలో పడ్డాను.
అవమానాలూ, ఛీదరింపులు రాహుల్ కే పరిమితం కాలేదు. నాక్కూడా యెదురవుతున్నాయి. పిల్లల్ని సక్రమంగా పెంచలేదని.

లోకమంతా అపసవ్య దిశలో నడుస్తున్నప్పుడు… మనం సవ్య దిశలో నడిస్తే యెదురు దెబ్బలు తప్పవు కదా.

చెప్పు డ్యాడీ మళ్లీ అడిగాడు మహేష్.
చూద్దాం అని అన్నాను.

యీతూరి మేం వోడిపోయాం. కానీ యెప్పటీకీ కాదు. యితోధిక వివేకంతో, క్రమశిక్షణతో తిరిగి వుద్యమం రెక్క విప్పుతుందంటాడు వుక్కుపాదం నవల్లోని హీరో.

నిజానికి ఈసారి రాహుల్ కష్టపడి చదివాడు. పరీక్షలు బాగానే రాశానన్నాడు. హిందీ, మ్యాథ్స్ కొంచం డౌట్ అన్నాడు. ఫలితాలు రానే వచ్చాయి. రాహుల్ చెప్పినట్టే ఆ రెండింటిలో ఫెయిల్ అయ్యాడు.
కంగ్రాట్స్ నాన్నా నాలుగు సబ్జెక్టుల్లో పాస్ అయ్యావ్ అంటూ యెంతో ఆనందంతో అభినందించాను.
వాడు కష్టపడి చదవడాన్ని గమనించాను నేను. దారిలో పడ్డాడు కదా. యిక వాడి విజయాన్ని యెవరూ ఆపలేరు అన్న ధీమా కలిగింది నాకు. అందుకే రాహుల్ని హృదయపూర్వకంగా మెచ్చుకున్నాను.

యీతూరి మేం వోడిపోయాం. కానీ యెప్పటీకీ కాదు. యితోధిక వివేకంతో, క్రమశిక్షణతో తిరిగి వుద్యమం రెక్క విప్పుతుందంటాడు వుక్కుపాదం నవల్లోని హీరో.

యీ మాటాల్ని నేను యెంతగానో విశ్వసిస్తాను.
రాహుల్ అన్న మాట నాలోని వుత్సాహాన్ని రెట్టింపు చేసింది.
డ్యాడీ యేం ఫర్వాలేదు. యిన్ స్టెంట్లో పాసైపోతాను. నాకు టూషన్ పెట్టీంచండి అన్నాడు.
ట్యూషన్ లో జాయిన్ అయ్యాడు.
పూర్తిగా చదువులో నిమగ్నమయ్యాడు.

+++

పరీక్షలకు ముందురోజు.
నాన్నా రాహుల్ బాగా ప్రిపేర్ అయ్యావా? అని అడిగాను నేను.
గోడకానుకుని మంచంపై కూర్చోనున్నాను నేను.
రాహుల్ మ్యాథ్స్ బుక్ ను నా వైపుగా విసిరాడు. దానిని పట్టుకున్నాను నేను.
యే లెక్క వేయమంటావో చెప్పు అన్నాడు.
నేను మధ్యలో వో పేజీ తీసి… దీనిని వెయ్ అని అన్నాను.
వేసేశాడు.
జవాబు కరెక్టే.
మరో దానిని చూపాను.
వేసేశాడు.
మరొకటి…
మరొకటి…
మరొకటి… యెక్కడపడితే అక్కడ పేజీలు వోపెన్ చేసి యిచ్చినా వేసేశాడు.
యిక నీకు తిరుగులేదు పో… అంటూ గుండెకు హత్తుకుని పొంగిపొర్లుతున్న ఆనందంతో దీవించాను.
మర్నాడు జరిగిన హిందీ పరీక్ష బాగా రాశానన్నాడు.
మ్యాథ్స్ పరీక్ష రోజున రాహుల్ యెగ్జాం హాల్ లోనికి వెళుతుండగా…
స్లిప్స్ యేమైనా కావాంటే తెచ్చుకో అని యిన్విజిలేటర్ సూచించాడు.
సార్ నాకవసరంలేదు. యే లెక్కనైనా నేను వేసేస్తాను అని గర్వంగా చెప్పి లోనికెళ్లాడు రాహుల్.
అయితే జరిగింది వేరు. విధి విచిత్రమైనది కదా!
ప్రశ్నలు సూటిగా కాకుండా తికమకగా యిచ్చారు.
పరీక్ష రాసివచ్చిన రాహుల్, డ్యాడీ, డౌటే డ్యాడీ అన్నాడు

+++

ఫలితాలు వచ్చాయి.
మ్యాథ్స్ లో రాహుల్ ఫెయిల్ అయ్యాడు.
ఆవిషయం తెలిసిన వెంటనే భోరున విలపించాడు.
యెంత వోదార్చినా వాడి దుఃఖాన్ని అనుమాత్రం కూడా తగ్గించలేకపోయాం. ఆ రోజంతా అదే స్థితి.
మర్నాడు కాస్తా తేరుకున్నా తలచి తలచి దుఃఖించాడు.
వోదార్చి వోదార్చి మేమే వోడిపోయాం.
మూడో రోజు…
డ్యాడీ నన్ను కాలేజీలో చేర్పించు అని అన్నాడు.
అదెలా కుదురుతుంది. పదో తరగతి పాస్ అయితేనే కాలేజీలో చేర్చుకుంటారు.
అదంతా నాకు తెలియదు డ్యాడీ. అన్నయ్య యేడో తరగతి ఫెయిల్ అయితే యెనిమిదిలో చేర్పించావ్. నన్ను చేర్పించు అని మొండికేశాడు.
యెంత చెప్పినా వింటేకదా.
సరే రా అని, వాడిని తీసుకుని కాలేజీల చుట్టూ తిరిగాను.
అప్పుడెప్పుడో చూసినట్టు… ఫెయిలైనా వన్ సిట్టింగ్ లో ఇంటర్ పాస్ చేస్తాం అన్న ప్రకటన గుర్తుకొచ్చింది.
విచారించగా అలాంటిదేమి లేదనితేలింది.
యిలా వారం రోజులు పొద్దున లేచి సాయంత్రం వరకు తిరిగాం.
రాహుల్ కు అర్థమైకానుట్టుంది.

+++

రాహుల్ యింతకూ నువ్వేం కావాలనుకుంటున్నావ్. పోలీసా, కలెక్టరా యిలా నీ మనసులో యేముంది.
డ్యాడీ, నాకు యానిమేషన్ చేయాలంటే చాలా యిష్టం.
అలాగైతే రా పోదాం అన్నాను.
రాహుల్ చకచకా బయలుదేరాడు.
మెహిదీపట్నంలోని యెరీనా యానిమేషన్ సెంటర్ కు వెళ్లాం.
అక్కడి హైయర్ డిప్లొమా యిన్ యానిమేషన్ కోర్స్ ఫీజు 82 వేలు. ముందుగా 10 వేలు అడ్వాన్స్ యివ్వాలి. తర్వాత ప్రతి నెలా నాలుగు వేలు చొప్పున 18 నెలలు చెల్లించాలని చెప్పింది రిసెప్షనిస్ట్.
నిజానికి అంత చెల్లించే స్తోమత లేదు మాకు.
మేడం మీ సార్ తో మాట్లాడుతాను అని అన్నాను నేను.
సార్ బిజీగా వున్నారు. మీరేమైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పండి అన్నది ఆ యువతి.
మేడం మొత్తం ఫీజు 82 వేలు అన్నారు కదా. మేం నెలకు రెండువేలు చొప్పన 41 నెలలు పే చేస్తాం. మాలాంటి వారికి లాంగ్ టర్మ్ కోర్సు వొక్కటి ప్రవేశ పెట్టండి అన్నాను.
సరే నేను సార్ కు చెబుతాను. మీ నంబర్ యిచ్చి వెళ్లండని అన్నది ఆ పిల్ల.

యింత బాగా వేసిన అబ్బాయికి బెస్ట్ యానిమేషన్ అవార్డు యివ్వకుండా… నాకిచ్చారు డ్యాడీ. పైగా నా బొమ్మలు బాగుండవు. మీకు తెలుసు కదా. నేను అవార్డును ఆ అబ్బాయికి యివ్వాలని చెప్పి వచ్చేశాను అని అన్నాడు రాహుల్, చాలా వేదనతో.
నాన్నా… యెంత గొప్పవాడివయ్యా అంటూ ఆలింగనం చేసుకున్నాను. నా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు తొణికాయి.

వారం రోజుల తర్వాత…
ఫోన్ రింగవుతుంటే రిసీవర్ తీసుకుని హలో అన్నాను.
నా పేరు సురేష్ అండీ. యెరీనా యానిమేషన్ మెహిదీపట్నం బ్రాంచ్ హెడ్ ని. మీరు చెప్పిన లాంగ్ టర్మ్ ఆలోచనను ముంబాయిలోని మా హెడ్డాఫీసుకు చెప్పాను. గొప్ప ఆలోచన అని వారు నన్ను ఆకాశానికి యెత్తేశారు. మొదటి స్టూడెంట్ మీ అబ్బాయే. మేం లాంగ్ టర్మ్ కోర్స్ ప్రారంభిస్తున్నాం అని సంబరంలా చెప్పాడు.
నాకు చాలా సంతోషం కలిగింది. చాలా మంచిదండీ అన్నాను నేను.

సంవత్సరం గడచిపోయింది.

వోరోజు రాహుల్ యీ బొమ్మలు యెలా వున్నాయో చూడండి డ్యాడీ అన్నాడు.
అవి అద్భుతంగా ఉన్నాయి. టేబుల్ పై రాడో వాచ్, బుట్టలో పండ్లు, ఫ్లవర్ బొకే… అన్ని ఫోటో తీసినట్టున్నాయి. కానీ అవన్ని యానిమేషన్ స్టూడెంట్ చిత్రించిన చిత్రాలు.
భలే వేశాడు నాన్నా అన్నాను.
యింత బాగా వేసిన అబ్బాయికి బెస్ట్ యానిమేషన్ అవార్డు యివ్వకుండా… నాకిచ్చారు డ్యాడీ. పైగా నా బొమ్మలు బాగుండవు. మీకు తెలుసు కదా. నేను అవార్డును ఆ అబ్బాయికి యివ్వాలని చెప్పి వచ్చేశాను అని అన్నాడు రాహుల్, చాలా వేదనతో.
నాన్నా… యెంత గొప్పవాడివయ్యా అంటూ ఆలింగనం చేసుకున్నాను. నా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు తొణికాయి.
ఆ సాయంత్రం సురేష్ గారు ఫోన్ చేశారు.
విజయ్ బాబు గారూ మీరొకసారి ఆఫీసుకు రాగలరా అని అడిగారు.
సార్ వస్తున్నాను అని చెప్పి బయలుదేరాను.

అది లిబల్టీ ఆఫ్ అమెరికా స్ట్యాచ్యూ. యింతలో వో యుద్ధ విమానం వచ్చి దానిని ఢీకొంది. మంటలు చెలరేగాయి. బుష్…ష్…ష్… అన్న అక్షరాలు స్క్రీన్ పైకి వస్తండగా ఆ శిల్పం మొత్తం దగ్ధమైంది.
అప్పుడు యిరాక్ పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది.

నమస్తే సార్ అన్నాను సురేష్ గారి క్యాబిన్ లోకి అడుగిడుతూ.
రండి విజయ్ బాబు గారూ, కూర్చోండి అంటూ చాలా ఆత్మీయంగా అన్నారు.
నేను కూర్చున్న తర్వాత… కాఫీ, టీ యేం తీసుకుంటారన్నారు.
సార్ యేమీ నాకలవాటులేదన్నాను.
రాహుల్ మీకేమైనా చెప్పాడా అని అడిగారు ఆయన.
జరిగిందంతా చెప్పాను నేను.
విజయ్ బాబు గారూ, మీ అబ్బాయి చెప్పినట్టు… ఆ అబ్బాయి బాగా వేశాడు. ఇక్కడ యానిమేషన్ లో బొమ్మ యెంత చక్కగా వేశాడు అన్న విషయానికి ప్రాధాన్యత లేదు. భావం ప్రధానం.
వుదాహరణకు ఇది చూడండి అంటూ ల్యాప్ టాప్ నా వైపుకు తిప్పాడు.
అది లిబల్టీ ఆఫ్ అమెరికా స్ట్యాచ్యూ. యింతలో వో యుద్ధ విమానం వచ్చి దానిని ఢీకొంది. మంటలు చెలరేగాయి. బుష్…ష్…ష్… అన్న అక్షరాలు స్క్రీన్ పైకి వస్తండగా ఆ శిల్పం మొత్తం దగ్ధమైంది.
అప్పుడు యిరాక్ పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. యుద్ధం ఆగుతుందన్న ఆశ యీ భూ మండలంపైనా మచ్చుకైనా కనిపించలేదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్.

నేను ఆశ్చర్యపోయాను.

అమెరికా దురాక్రమణపై తిరుగుబాటు యీ యానిమేషన్. యెంతటి ఆలోచన. చాలా గర్వంగా ఫీలయ్యాను.
చూశారు కదా విజయ్ బాబు గారూ. మీ అబ్బాయి చేసిన వర్క్. మొత్తం వర్క్స్ అన్నీ వొకో కాన్సెప్టుతో యిలానే వున్నాయి. అందుకే మేం బెస్ట్ యానిమేటర్ ఆఫ్ ద యియర్ అవార్డుకు రాహుల్ సాంకృత్యాయన్ ను యెంపికచేశాం అని ఆయన వివరించారు.

మనసంతా సంతోషంతో నిండిపోయింది.

మర్నాడు…
వెల్లువెత్తిన సంతోషంతో ఫోన్ చేశాడు రాహుల్.
అప్పుడు నేను ఆఫీసులో ఉన్నాను.
డ్యాడీ… పట్టరాని ఆనందం వాడి గొంతులోంచి యెగసిపడింది.
హలో నాన్నా, చెప్పు.
డ్యాడీ, అన్ని సబ్జెక్టుల్లో పాసైపోయాను డ్యాడీ. ఉరకలేసే ఉద్వేగంతో అన్నాడు. చాలా హాపీగా వుందన్నాడు.

అవమానాల, అపజయాల పునాది పైనుంచి అద్భుతమైన విజయం వైపు దూసుకెళితే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు కదా!.

మనంగాక ఇంకెవరు ఈ సమాజాన్ని మరమ్మతు చేయగలరు (if not we… then who else) అంటూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నారు మారసాని విజయ్ బాబు. ఆయన రైతుబిడ్డ. పుట్టింది చిత్తూరు జిల్లా మంగినాయనిపల్లిలో.  స్వతహాగా ఆర్టిస్ట్. సాహిత్యంపై అభిలాషతో కథలు రాశారు. అలాగే మహత్తర జీవిత కాంక్షను రగిలించే తాత్వికతతో ‘కొత్తగీతలు’ అన్న నవలను అందించారు. పైగా సీనియర్ పాత్రికేయులు. ‘సహచర’ సమాంతర ఆలోచనల సామాజిక వేదిక వ్యవస్థాపకులు. జీవితానుభవంలో ఎగసిపడిన ఆనందోత్సాహాలను తాను వారం వారం రాసే ‘ఆపాదమస్తకం’  ‘తెలుపు’కి ప్రత్యేకం.
email: vijayababumarasani@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article