Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌"సూరీడు దిగొచ్చినట్టుంది" - మారసాని విజయ్ బాబు తెలుపు

“సూరీడు దిగొచ్చినట్టుంది” – మారసాని విజయ్ బాబు తెలుపు

Illustration by Beera Srinivas

సూరీడు దిగొచ్చినట్టుంది

వొక పని మరో పనిని నిర్దేశిస్తుందని అనుభవజ్ఞులు అంటుంటారు. నా జీవితంలోనూ సరిగ్గా అదే జరిగింది. అనుకోకుండా యెదురైన వో సంఘటన నా జీవిత దిశను పూర్తిగా మార్చేసింది.
విధి విచిత్రమైనది కదా!

బహుశా నాకప్పుడు అయిదేళ్లు వుండచ్చు.

నేను మొట్టమొదటి సారిగా ట్రాక్టర్ ను చూసింది అప్పుడే. అప్పటికి దాని పేరు కూడా నాకు తెలియదు. అది మా చేనును దున్నుతుంటే భలేగా అనిపించింది.

హేయ్… అంటూ చప్పట్లు చరిచాను.

దాని పైకి యెక్కాలనిపించింది. ఆ డ్రైవర్ లాగే నాకూ రివ్వున తిరగాలనిపించింది.

మా తాత మారసాని మల్లయ్యను అడిగాను.

తాతా నేనూ దున్నుతా. నన్ను దానిపైకి ఎక్కించు అని.

మా తాతకు నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆయన నన్ను వెంటబెట్టుకుని తిరిగేవాడు.

వెంటనే ఆయన దున్నుతున్న ట్రాక్టర్ ను ఆపేశాడు. నన్ను దానిపై కూచోపెట్టాడు. డైవర్ నడుపుతుంటే… నేను కూడా దాని చక్రం (స్టీరింగ్) పట్టుకున్నాను. నేనే నడిపినంతగా సంబరపడిపోయాను.

కాలం గిర్రున తిరిగింది.

జీవితంలో ఆపాదమస్తకం కుదిపేసే అపురూప ఆనంద క్షణాల గురించిన అనుభవగాథా సంపుటిలో ఇది ఏడో కథనం.

వొక జర్నలిస్ట్ గా యిరవై మూడేళ్లు పనిచేశాను. వుద్యోగం వదలిన తర్వాత మా పల్లెకు వెళ్లాను. చాలా రోజుల తర్వాత నన్ను చూసి వూరువూరంతా సంతోషపడింది.

బాబూ, యిది నీ పుట్టిన వూరు. అప్పడప్పుడు వస్తుండాలి. యేళ్ల తరబడి రాకపోతే యెట్లా. మీ భూములు చూడు యెట్లున్నాయో… అనాథల్లా. నాలుగు మామిడిచెట్లు పెట్టినా యీ పాటికి పెద్ద తోపు అయిండేది అని వూరువూరంతా చెప్పింది. మా పెద్దనాన్న కొడుకు శ్రీరాములు అన్నయితే మరీ యెక్కువ వాపోయాడు.

అన్నా, వ్యవసాయం అంటే నాకు మక్కువే. నీళ్లు లేవుకదన్నా. యిక చెట్లు యెలా పెట్టను.
పక్కనే నా బోరు వుందికదా. సాకేస్తానులేరా. చూస్తుండగానే చెట్లు పెరిగిపోతాయి అని హామీ యిచ్చాడు.
చాలా సంతోషమన్నా. పది రోజుల్లో వస్తాను. గుంతలు తీద్దాం అని చెప్పి, హైదరాబాదుకు తిరిగు పయనమయ్యాను.

యేదో తెలియని అనిర్వచనీయమైన భావన నన్నల్లుకుపోతోంది.

మా పల్లెలో వ్యవసాయంపై యిష్టమున్న వ్యక్తి వొకరంటే వొకరు కూడా కనిపించలేదు. అందుకు కారణాలు సవాలక్ష ఉన్నాయి. యేదేమైనా నా మనసులో అనంతమైన బాధ చోటుచేసుకుంది.

అనుకున్నట్టుగానే మామిడి చెట్లు పెట్టేశాం. మనసంతా మాధుర్యంతో నిండిపోయింది.

యిక నేను నీళ్లుపెట్టే పనిని శ్రీరామన్నకు అప్పచెప్పి హైదరాబాద్ వెళ్లాలనుకున్నాను. యింతలో ఆయన మాటలో తేడా వచ్చింది. యెందుకలా అంటున్నాడో తెలియక తికమకపడ్డాను.

అన్నా యేమైంది. నువ్వు చూచుకుంటానంటేనే కదా చెట్లు పెట్టించాను.

నావల్లా కాదులేరా. వేరే యెవరికైనా చెప్పు. నీళ్లు కావాలంటే నా బోరులోంచే తీసుకో అంటూ… యిక మాట్లాడటానికి యేమీలేదన్నట్టు యింట్లోకి వెళ్లిపోయాడు.

యిదేంటిది… కనీసము మాట్లాడను కూడా మాట్లాడకుండా వెళ్లిపోవడం యేమిటి?

చాలా బాధ కలిగింది.

యెంతలా చెప్పాడు. యిప్పుడేమయిందని. ఆ రాత్రంతా ఆలోచనలు మెదలాడాయి.
తెల్లారింది.

శ్రీరామన్న గురించి యిక ఆలోచించడం వృధా అనిపించింది. వేరే యెవరైనా మనిషిని పెట్టాలను కున్నాను. కానీ మా పల్లెలో వ్యవసాయంపై యిష్టమున్న వ్యక్తి వొకరంటే వొకరు కూడా కనిపించలేదు. అందుకు కారణాలు సవాలక్ష ఉన్నాయి. యేదేమైనా నా మనసులో అనంతమైన బాధ చోటుచేసుకుంది.

చెట్లకు నీళ్ళుపెట్టేస్తే యిక చేసే పనేమీ వుండేదికాదు. మిగిలిన సమయం అంతా పుస్తకాలు చదువుకుంటూ చెట్టూ, చెలమ, కొండకోనల్లో గడిపాను. ప్రకృతితో సహజీవనం మనసుకు యెంతో హాయిగా తోచింది.

చెట్లంటే నాకు చాలా ఇష్టం. నాటిని ప్రేమగా చూసుకునే వారు దొరకనందున పల్లెలోనే నెల రోజులు ఉండాల్సివచ్చింది.

చిత్తూరు జిల్లా నడిబొడ్డునున్న మా మంగినాయనపల్లి ప్రకృతి రమణీయతకు లోగిలి. వారానికోసారి మామిడి చెట్లకు నీళ్ళుపెట్టేస్తే యిక చేసే పనేమీ వుండేదికాదు. మిగిలిన సమయం అంతా పుస్తకాలు చదువుకుంటూ చెట్టూ, చెలమ, కొండకోనల్లో గడిపాను.

ప్రకృతితో సహజీవనం మనసుకు యెంతో హాయిగా తోచింది.

అక్కడ యెంతో బాగుందనిపించింది. హైదరాబాద్ వెళ్లి చేసే పనేముందనే ప్రశ్న మొదలైంది.

ఆ మాటే నా భార్య గౌరికి, అమ్మ రంగమ్మకు చెప్పాను. మామిడి చెట్లుతో పాటు సేద్యం చేద్దామనుకుంటున్నాను అని.

నీ మనసుకు యేమనిపిస్తే అదే చేయ్ అని అంది అమ్మ.

మీ యిష్టం అంది గౌరి.

అప్పుడే నా చిన్ననాటి కోరిన మళ్లీ చివురించింది.

యెంతో ఇష్టంగా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. పొలాన్ని దున్నుతుంటే యేదో గొప్ప విజయం సాధించిన అనుభూతి కలిగింది.

సహజ సిద్ధమైన యెరువులతో పంటలు సాగుపనులు చేపట్టాను. అలాగే మాపల్లెలో యిల్లుకట్టడం పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యాను.

యెండనకా, వాననకా నేను చేస్తున్న పనులు చూసి వూరువూరంతా విస్తుపోయింది.

మా చిన్నమ్మ అయితే కొడుకుల్ని తిట్టిపోస్తోంది. వాణ్ణి చూడండ్రా… మీరూ వున్నారెందుకూ… వాడు యెలా పనిచేస్తున్నాడో చూడండ్రా… యెర్రటి యెండను కూడా వాడు లెక్కచేయడంలేదు. నిజానికి ఆ సూరీడే దిగొచ్చేసినట్టుంది అని రోజూ అరుస్తోంది.

నీకు కష్టమంటే యేమిటో తెలియకూడదని నిన్ను పెంచి పెద్దచేశాను. యిప్పుడు నిన్నిలా చూస్తుంటే బాధగా వుంది అని అమ్మ అంది.

అమ్మా, నీకు నచ్చినట్టు జీవించమని నన్ను దీవించావు. నిజానికి నాకు కష్టంగా లేదు. యెందుకంటే నేను పనిని శరీరంతో చేయలేదు. మంఛి వుషారైన మనసుతో చేస్తున్నాను. నన్ను చూసి కష్టం బెదరిపోతోందమ్మా. పైగా నాకు చాల సంతోషంగా వుంది. పొద్దంతా కష్టపడటంతో శరీరం యెంతో తేలిగ్గా వుంది. మంచిగా ఆకలేస్తోంది. యేమి తిన్నా మాధుర్యంగా అనిపిస్తోంది అని అన్నాను.

యీ బట్టలు, బుదదా అంతా యేందిరా. నాకు నచ్చడంలేదు.

అమ్మా… అమ్మా… అమ్మా… నా బంగారు అమ్మా…… నాకు చాలా బాగుందమ్మా…

యిక మా చిన్నమ్మ అయితే కొడుకుల్ని తిట్టిపోస్తోంది. వాణ్ణి చూడండ్రా… మీరూ వున్నారెందుకూ… వాడు యెలా పనిచేస్తున్నాడో చూడండ్రా… యెర్రటి యెండను కూడా వాడు లెక్కచేయడంలేదు. నిజానికి ఆ సూరీడే దిగొచ్చేసినట్టుంది అని రోజూ అరుస్తోంది.

ఆనోటా యీనోటా ఆ మాటలు నా చెవిన పడ్డాయి.

నాకెంతో ఆనందం కలిగింది.

‘ఆ సూరీడే దిగొచ్చేసినట్టుంది’

అంతకంటే గొప్ప అవార్డు ఈ ప్రపంచంలో మరేదీ ఉండదనుకుంటా…

మారసాని విజయ్ బాబు  రైతుబిడ్డ. పుట్టింది చిత్తూరు జిల్లా మంగినాయనిపల్లిలో.  స్వతహాగా ఆర్టిస్ట్. సాహిత్యంపై అభిలాషతో కథలు రాశారు. అలాగే మహత్తర జీవిత కాంక్షను రగిలించే తాత్వికతతో ‘కొత్తగీతలు’ అన్న నవలను అందించారు. పైగా సీనియర్ పాత్రికేయులు. ‘సహచర’ సమాంతర ఆలోచనల సామాజిక వేదిక వ్యవస్థాపకులు. జీవితానుభవంలో ఎగసిపడిన ఆనందోత్సాహాలను, అందలి తాత్వికతను వారం వారం ‘ఆపాదమస్తకం’ శీర్షిక ద్వారా అందిస్తారు. పాత వాటి కోసం కింద క్లిక్ చేసి చదవండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article