జీవి మాయ
సిద్దార్థ
కొంత మంది ప్రేమించడం కోసమే పుడుతారు
యాప మాను నీడల్లాగా…
వాగు బుగ్గల్లాగా…
మనసు మీద పొడిపించుకున్న
పచ్చబొట్టుల్లాగా…
నుదిటి గీతాల రాతల్ని
అవ్యక్తం చేస్తూ
కొంతమంది తల్లులంతే
మిగిలిన ఆయింత ప్రేమను తినమని
బతిమిలాడి తినిపిస్తరు కలిముద్ద
నీకు లాగా…
గట్టు మైసమ్మ నుదిటి మీద పెట్టిన
బొట్టు నువ్వు
కన్నీటి దీపంలో చలి కాచుకునే
సేద తీరే .. జీవ బంధువులం
మణీ, మానవాతీ…
తెలంగాణా అమ్మ
గుండె లయవూ
జీవి మాయవూ… నువ్వు
నీతో నువ్వు చెప్పుకోవడం తప్ప
నీలో నువ్వు కాగిపోవడం తప్ప
వేదనతో నీ సంగత్ కారీ తప్ప
చూసింది…తెల్సిందీ ఏముంది
దునియాకు
నీ అడుగుల సడి ఎప్పటికీ ఆగదు.
చేదబాయి కాడ రాత్రుల్లో
ఖాళీ బొక్కెనతో కథలెల్లబొసుకున్నావ్
సుక్కల రాత్రులతో సావాసం చేసినవ్.
నీకు ఎవరిమీదా ఆరోపణలు లేవు
జ్వరమొచ్చిన బతుకమ్మల దిగులు
నీ చూపులల్ల
మణెమ్మ.. నాగమణేమ్మ…ఘట్కేసర్ మణింగల్
రైలు స్టేషన్ల వున్న పాత బోగీనెక్కి
ఎంతదూరం పోతావో చెప్పు
నీ కొంగుల్ల ఒడిసి పట్టుకున్న
పోద్దాల్ల …మధ్యాహ్నాలతో…
ఎంతదూరం …ఎంతదూరం పోతావో
చెప్పు
కసరు జామ కాయలను కొరుక్కుంట
నవ్వుకుంట
ఎంతదూరం…ఎంతదూరం పోతావో
చెప్పు
నువ్వాడిన గచ్చకాయల చేతి వెళ్ళను
ఎంత దూరమని మోసుకపోతవో చెప్పు
చెప్పు…నేను గూడ అక్కడిదాకా
వచ్చి కలుస్తా
కాలపు మలుపు గుట్టల
జాడలల్ల
మళ్ళీ మొదలయితదా…మన ఆటపాటల
బచ్ పనా
అప్పుడయినా ఆగుతదా మోసపు
కరోణా రవాణా…
రాగవతీ…గుణవతీ …
నిద్రను దులుపుకొని దీపంలోకి జారిపోయావా…
మా పూర్తయిపోయిన స్త్రీ
ఎక్కడయినా ఏ గల్లీ …గనుమలల్ల
నిలబడి మళ్ళా పలుకరిస్తావా
నువ్వు అనుకోకుండా తెంపిపోయిన
జ్ఞాపకం
అతి నిశ్శబ్దం …అతి దుఖం …ఆతి నరకం
శాశ్వితం.
నీ జీవి మాయకు
దండాలు
అనుకోకుండా కరోనా కాటుకు బలైపోయిన మా నాగమణికి
అటువంటి స్త్రీ మూర్తులందరికీ…