చెట్లకు సమర్తవేడుక …ఎంత సున్నితం! ఎంత సుందరం! మరెంత సంబురం!
డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి
ఇంటివెనుక పొదలెక్కపారిన పొట్లచెట్టు తొలిపువ్వు పూసి
పుష్పవతి అయిందని, సమర్తాడిందని, పెద్దమనిషయిందని
ఒకప్పుడు ఇంటింటి తల్లులకు ఎంత మహదానందం ..!
విత్తనం కాయను వదిలి, పండించి, వొలిచి, ఎండబెట్టి,
పిడుక బూడిదకలిపి కడుముంతలోనో, బట్టమూటలోనో
ఏడాది పొడవునా విత్తనాన్ని కంటికిరెప్పలా కాపాడుకుని
రోహిణికార్తె ఎల్లుదలకు ఒక మంచిరోజుచూసుకుని
చెట్లగుడ్డతవ్వి, ఇదు …తొమ్మిది…పదకొండు …చొప్పున విత్తనాలు పెట్టి
కోల్లుకొంగలు తవ్వకుండా రాత్రీపగలూ కనిపెట్టుకొని
రోజుకు రెండుపూటలా మరిచిపోకుండా చల్లటినీళ్లు చల్లి
విత్తనం- తనచేతులుజోడించి భూమిమీదికి రాంగనే…
చెట్టగుడ్డల్లో మొలకలు.. పొత్తిగుడ్డల్లో శిశువులైనట్టు
ఆహా!…మట్టిమనిషికి ఎంతెంతటి మాతృత్వపు సంబురం!
కందిపొరుకదెచ్చి మొలుకల చుట్టూ పదిలంగా నాటి
మారాకు, తీరాకు… ఆ తదుపరి తీగలు సాగుతున్నకొద్దీ
మరిన్ని వావిలి పొరుకలుదెచ్చి పందిరి ఎక్కించుడంటే
ఇల్లు ఇగురుబెట్టి – పందిరి పచ్చవడ్డంతటి సంబురం కదా!
కాలచక్రం గిర్రున తిరిగి మృగశిరదాటి ఆరుద్ర రానేవచ్చె
మనిషిచేసిన సేవను ఎక్కడనన్న.. చెట్టు దాచుకుంటదా?
శుక్రవారంపూట.. పొట్లచెట్టు పుష్పవతి కానేఅయ్యే…!
పువ్వు కనబడుడే ఆలస్యం… అమ్మ, పంచపాల తీసుకపొయి
పూతపూసిన ఆకులన్నిటికీ.. పసుపుకుంకుమలు… వేసేది,
చెట్లగుడ్డదగ్గర మరింత వెడల్పుచేసి 5 చెంబులనీల్లు పోసేది,
చుట్టు మెట్టిండ్ల ఆడపిల్లలకు నువులుబెల్లం పలారం పెట్టేది.
అసలు ఆ పండుగ– ఆ సందడి, ఆ ఆనందమే వేరు…
అది అమ్మముఖంలో చూస్తే తప్ప అర్థంగాదు మరి !
ఎందుకమ్మా ఇంత సంబురమని అడుగుతే –
అయిటికి తొలుసూరు పంట – పొట్లకాయెలేనాయె
మనిషికి బతుకుదెరువే… తరువులుగద నానా
ధనం చూసుకమురిసేదేకని తినికురిసేదా… అనేది.
శ్రమైకజీవనంతో మమేకమైన మన సంస్కృతిలో
పచ్చనిచెట్లకూ పర్యావరణానికి ఎంతటి మహోన్నతస్థానం!
మళ్ళీ అమ్మ తర్వాత నా భార్య కవిత పొట్లచెట్టుకు పసుపు లేసిన వైనాన ఈ యాది, కవిత