Editorial

Tuesday, December 3, 2024
స్మరణయాదినేనొక నిర్వాసితుణ్ణి! - ఘంటా చక్రపాణి తెలుపు

నేనొక నిర్వాసితుణ్ణి! – ఘంటా చక్రపాణి తెలుపు

 

ఘంటా చక్రపాణి గారి పరిచయం అక్కరలేదని అనుకుంటాం. నిజమే. కానీ ఈ తెల్లవారు జామున వారు తన మూలాలను గుర్తు చేసే అద్భుతమైన కవిత్వంతో మన హృదయాలను కలచి వేస్తున్నారు.  తన చిరునవ్వు వెనకాలి విషాద గతనుగాతాన్ని  పంచుకుని వర్తమానాన్ని ఆవిష్కరిస్తున్నారు.

ఘంటా చక్రపాణి గారిది కరీంనగర్ ని ఆనుకుని ఉన్న ఊరు. పేరు యాస్వాడ. దిగువ మానేరు డ్యామ్ లో వారు జన్మించిన ఆ ఊరు అదృశ్యమైంది. నీట మునిగింది. అది 1980-82 నాటి సంగతి. అప్పట్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి గోదావరిజలాలను వరంగల్ తాగునీటి కోసం తరలించడానికి ఆ డ్యామ్ నిర్మించారు. ఆ సందర్భంగా తమని వాళ్ళ వూళ్లలోంచి తరిమేశారు. కనీసపరిహారం, పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండానే తరిమి వేశారు.

ఈ మధ్య సోషల్ మీడియాలో స్వర్ణ కిలారి పెట్టిన పోస్ట్ చూసిన తరువాత వారు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్స్ చూడడానికి వెళ్ళారు. సుధా గోపరాజు సారధ్యంలో కుటుంబ సమేతంగా వెళ్లారట. అక్కడి అద్భుతాన్ని తమకు సంతోష్ కుమార్, అనిల్ బత్తుల దగ్గరుండి మరీ చూపించారట. ఈ విశేషాలను తన ఫేస్ బుక్ పేజీలో పంచుకుంటూ, ఆక్కడికి వెళ్లి వచ్చాక కదిలిపోయి రాసుకున్న తమ దుఖాన్ని ఆవేదనను మరో మాటలో చెబితే అభివృద్ధి తాలూకు జీవన విధ్వంసాన్ని కళ్ళకు కట్టారు.

అనివార్యం కవిత్వం ఇది. అందులో ఒక నిర్వాసితుడి గొడగొడ దుఖం ఉన్నది. మనిషి పక్షులు  జంతువులతో కూడిన ఆవరణ – పర్యావరణమూ ఉన్నది. పునరుజ్జీవన తెలంగాణా వర్తమానమూ ఉన్నది. మచ్చుకి ఒక భాగం చదవండి.

సుదీర్ఘ పూర్తి కవితకై, అపురూప చిత్రాలకై చక్రపాణి గారి బ్లాగ్ లోని ‘పురాస్మృతులు’ క్లిక్ చేయండి.

నేనొక నిర్వాసితుణ్ణి!

ఒక్కసారి అక్కడికి వెళ్ళిరండి
రణగొణ ధ్వనులకు దూరంగా 
ప్రశాంతమైన ఆ ప్రాంతానికి 
గతించిన కాలంలో బతికి చెడ్డ
పురాస్మృతుల దుఖ్ఖ భూమికి  
ఒక్కసారి వెళ్ళిరండి 
 
శాంతిని కాంక్షించే మీకు 
అసలు యుద్ధమంటే ఏమిటో తెలుస్తుంది
బతుకుపోరులో ఓడిపోయిన విస్తాపితులు  
మట్టిలో నిక్షిప్తమై పోవడం కనిపిస్తుంది 
 
అభివృద్ధిని చూడడానికో
ఆనకట్టను చూడడానికో కాదు
మనిషి ఆనవాళ్లు చూడడానికి
మునిగిపోయిన ఆ వూళ్ళలోకి 
ఒక్కసారి వెళ్ళిరండి 
 
వీలుచూసుకుని ఆరాంతపు విడిదికో 
విహారానికో వెళ్లి ఓ పూట గడిపిరండి 
అభివృద్ధికి దారి చూపిన 
ఆ నేలమీద 
నాలుగడుగులు నడిచి రండి
అది ఎంతటి విధ్వంసమో
ఎలాంటి విషాదమో అర్థమౌతుంది
నీళ్లు పారిననేల స్వర్గసీమని 
చెప్పుకుంటున్న మీరు
ఆ నది నిలిచిన చోటికి 
ఒక్కసారి వెళ్లిరండి 
ఆ నిరాశ్రయ నరకాన్నీ చూసిరండి 
 
వేలాది లక్షలాది మంది ఉసురు తీసిన 
ఆ గాలిని ఒక్కసారి పీల్చిరండి
ప్రాణవాయువు అంటే ఏమిటో తెలుస్తుంది
ప్రాణం విలువేంటో బోధపడుతుంది

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article