వాడ్రేవు చినవీరభద్రుడు
భ్రాంతిలేని జీవితాన్నే కోరుకున్నాం మనం.
జీవించడం ఎలానూ తప్పదు
ఈ కప్ లో ఒక స్పూన్ నమ్మకాన్ని కూడా కలపమన్నాం.
కాలువగట్టుమీద సోమరి కునుకు తీసిన మధ్యాహ్నాల్లో
‘ఏది నిజంగా ఏమిటి?’
అన్న ధ్యాసే లేదు మనకి.
వ్యాపకాల్ని వెతుక్కుంటో రోజులకి రోజులు
ప్రయాణాల్లో కూరుకుపోయినప్పుడు
ఒకటి రెండు సందేహాలు కలిగినా
ప్రాట్ ఫాంల పైని పోర్టర్ల సందడి కమ్మేసింది మనని.
ఇప్పుడిక ఈ వేగాల ఆరాటాల అల్లిక జిగిబిగిలో
కాళ్ళూ చేతులూ కూరుకుపోయి
ఆక్రందించడమొకటే మిగిలింది మనకి.
అన్నీ ఉన్నాయి ఇక్కడ
అనుభవించడానికి తీరిక తప్ప.
ఇంక జీవితానికి అర్థం వెతక్కు.
అభిలషించినదానికీ, అందినదానికీ మధ్య
ఆ అందమైన తెరనట్లా ఉండనివ్వు.
మనోహరమూర్తి రెబెకాని ముసుగు తొలగించి
చూడాలనే ఆ శిల్పీ తపించాడు.
కాని అతనూ మానవుడే కద.
మన విషాదమంతా తొలగించలేని ఆ చివరి తెర.
భ్రాంతిలేని జీవితం ఎంత సుందరమో తెలీదుగానీ
ఈ భ్రాంతిబంధురమైనదే అత్యంత సుందరం మనకి.