Editorial

Saturday, November 23, 2024

డాక్టర్ భూపేన్ హజారికా అస్సాం అనర్ఘ రత్నం. వారి గళం సామాన్యుడి హృదయం. ఆయన పాటలు పేద పల్లీయుల బరువుబాధల్ని, జాలర్ల కడగళ్ళను , రైతన్నల వెతల్నీ స్పృశించి ఓదార్చే చల్లని పదాలు. వారు మన ‘భారత రత్న’. నేడు వారి వర్ధంతి సందర్భంగా ఆత్మీయ స్మరణ.

శ్రీదేవీ మురళీధర్

Shridevi Muralidhar writerజనరంజక జానపద గాయకుడు, సంగీత దర్శకుడు, కవి, రచయిత, పాత్రికేయుడు, సినీనిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త…వీటన్నింటినీ మించి, ప్రపంచ కళాకారుడు, విశ్వమానవుడు డాక్టర్ భూపేన్ హజారికా 1926 లో అస్సాంలో జన్మించారు.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, నరేంద్రదేవ్, శ్యాంప్రసాద్ ముఖర్జీల వంటి మహోధ్యాపకుల రోజులలో బీ.ఏ, ఆపై రాజకీయశాస్త్రంలో ఎం.ఏ పట్టభాద్రులైనారు. దేశభక్తి, జాతీయభావం, విశ్వమానవ శ్రేయోభిలాష కలగలిసిన ఆరోగ్యకరమైన సేవాదృక్పధాన్ని ఆ బ్రిటీషుపాలనా సమయంలో ఏర్పరచుకున్నారు.

గౌహతి ఆకాశవాణిలో పనిచేసి 1949లో ఉన్నతవిద్య కోసం అమెరికా చేరుకున్నారు. అక్కడ తమ రెండవ మాస్టర్స్ డిగ్రీ పొంది ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి కోర్సులో నమోదైనారు. వయోజనవిద్యలో దృశ్య-శ్రవణ మాధ్యమాల వినియోజనం అంశంగా పరిశోధన జరిపి 1952 లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ఆ సమయంలోనే తమ అంకితభావం, కళాభినివేశం పునాదిగా ‘భారతీయ విద్యార్ధి సంఘానికి’ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు.

తమ సంగీత -సాహిత్యాభిలాషల నేపధ్యంలో పర్ల్ ఎస్.బక్, ఎలియనార్ రూజ్వెల్ట్, సోమర్ సెట్ మామ్ వంటి సాహితీవేత్తల పరిచయ,స్నేహాలు పెంపొందించుకున్నారు. అదే సమయంలో ‘న్యూ ఇండియా’ అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. అంతకు పూర్వం ఈ పత్రికకు జయప్రకాష్ నారాయణ్, అంబేద్కర్ వంటి మహాశయులు సంపాదకులుగా వ్యవహరించారు. డాక్టర్ భూపేన్ హజారికా తమ తదుపరి జీవితంలో నాలుగు అస్సామీ పత్రికలకు సంపాదకులై నిర్భయంగా ప్రజాపక్షం వహించారు.

భారత జానపద సంగీతాన్ని ఒక సాంస్కృతిక ప్రతినిధిగా ప్రపంచ శ్రోతల హృదయాలకు చేరువ చేసిన అరుదైన సంగీతకారుడు డాక్టర్ భూపేన్ హజారికా.

మాతృభూమి చేరుకొని తమ ఉత్తమ విద్యార్హతలతో 27 ఏళ్ల వయసులో గౌహతీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ఉద్యోగ నిర్వహణ చేశారు. సంగీత, కళారంగాల మిత్రులు ముంబై చిత్ర పరిశ్రమలో ఉండటం చేత తరచు ముంబై వెళ్తూ ప్రఖ్యాత సంగీత దర్శకులు సలిల్ చౌదరీ,హేమంత్ కుమార్, మహానటుడు బల్రాజ్ సాహనీ, వంటి వారి సాహచర్యంలో ‘ఇప్టా'(ఇండియన్ పీపుల్స్ థియేటర్) అనే చురుకైన (మార్క్సిస్ట్) సాంస్కృతిక ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటూ 1955 ప్రాంతాలలో ముంబై సినీరంగంలో గాయకుడిగా పూర్తిగా స్థిరపడటానికి అక్కడికి చేరుకున్నారు.

భూపేన్ హజారికా వెయ్యికి పైగా గీతాలను రచించి, స్వరపరచారు. ఎన్నో అస్సామీ చిత్రాలకు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు వహించారు. ఆయన చిత్రాలు ‘శకుంతల'(1960), ‘ప్రతిధ్వని (1964),’తోటి-ఘోటి'(1967)రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారాలు పొందాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రపు మొట్టమొదటి రంగుల చిత్రం ‘మేరా ధరమ్ – మేరీ మా’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.

డాక్టర్ భూపేన్ హజారికా అమరగీతాలు

1962 లో భారత-చైనా యుద్ధకాలంలో దేశభక్తి గానధారగా ప్రవహించే కంచుకంఠంతో అస్సామీ గీతం ‘కాటా జవనోర్ మృత్యు హోల్’ (ఇందరు వీరజవాన్లు మరణిస్తోంటే నా బతుకెందుకు?)వంటి గీతాలను యువతను ఉత్తేజపరచేలా ఆలపించారు.

జాతీయ సమైక్యత కోసం’మానుషే మాహోర్ బాబే’ (సాటి సోదరుణ్ణి మానవుడే నిర్లక్ష్యం చేస్తే ఇక దిక్కెవ్వరు?) అని హజారికా పాడిన గీతం అత్యంత ప్రజాదరణతో ఒక జాతీయగీతం స్థాయిని చేరుకుంది.

తన తీరవాసుల తరతరాల దాస్యానికీ, వారి పట్ల జరిగే అరాచాకాలకూ మౌనసాక్షిగా అనాది నుండి ప్రవహిస్తూ పోతున్న గంగానది మౌనాన్ని ప్రశ్నిస్తూ ‘ఓ గంగా బెహతీ హై క్యో?’ అనే హృదయ విదారక గీతాన్ని గానం చేశారు. ఇది సుప్రసిద్ధ గీతకారుడు పండిట్ నరేంద్రశర్మ విరచితం.

ఉత్తమ గాయకుల గళాలను అస్సాం చలన చిత్ర సంగీతంలో ఆవిష్కరించి, స్వీయ సంగీత దర్శకత్వంలో రఫీ, లతా, ఆశ, కిషోర్ వంటి దిగ్గజాలతో పాడించి అస్సాం సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఘనుడు డాక్టర్ భూపేన్ హజారికా.

నిరుపేదల్లో, సామాన్యులలో ఆయన గీతాలు చొచ్చుకు పోయి వారి జీవితపు లోతుల్ని తాకుతాయి. హజారికా గళం సామాన్యుడి హృదయం. ఆయన పాటలు పేద పల్లీయుల బరువుబాధల్ని, జాలర్ల కడగళ్ళను , రైతన్నల వెతల్నీ స్పృశించి ఓదార్చే చల్లని పదాలు.

ఉత్తమ గాయకుల గళాలను అస్సాం చలన చిత్ర సంగీతంలో ఆవిష్కరించి, స్వీయ సంగీత దర్శకత్వంలో రఫీ, లతా, ఆశ, కిషోర్ వంటి దిగ్గజాలతో పాడించి అస్సాం సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఘనుడు డాక్టర్ భూపేన్ హజారికా.

తుప్పు పట్టిన సాంఘిక దురాచారాలను,మూఢ నమ్మకాలను, కులవ్యవస్థను తన గీతాలలో తీవ్రంగా ఖండించారాయన.

హిందీ చిత్రాలలో సంగీతపరంగా ఎన్నెన్ని అవకాశాలు వచ్చినా, ఆచి తూచి ఎన్నుకుని అడుగు వేస్తూ మనసా, వాచా అస్సామీ జానపద సంగీతానికే ప్రాధాన్యమిచ్చి, ఆ కళకే అంకితమైనారు డాక్టర్ భూపేన్ హజారికా. ఆయన గురించి చెప్పుకోవలసిన అతి ముఖ్యమైన గొప్ప విషయమిది.

భూపేన్ హజారికా వెయ్యికి పైగా గీతాలను రచించి, స్వరపరచారు. ఎన్నో అస్సామీ చిత్రాలకు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు వహించారు.

‘భాషా ఆందోళన్’ ఉద్యమంలో ప్రజలను దేశభక్తి దిశగా ఉత్తేజపరచటానికి ఒక పరికరంగా తన గీతాలను, సంగీతాన్ని మలచుకున్న దీక్షాపరుడాయన.

‘ఆరోప్’,’రుడాలీ’,’ఏక పల్’ ఆయన స్వర పరిచిన కొన్ని హిందీ చిత్రాలు.

1967-1972 లో డాక్టర్ భూపేన్ హజారికా విధాన సభ సభ్యులుగా సేవలందించారు. గౌహతిలో అస్సాం ప్రభుత్వం స్థాపించిన ఫిలిం స్టూడియో దేశంలోనే ఒక ప్రభుత్వం స్థాపించిన మొట్టమొదటి స్టూడియో. అది కేవలం ఆయన కృషి ఫలమే!

డాక్టర్ భూపేన్ హజారికాను ఉద్దేశించి ప్రముఖ కళాకారుడు ఎం.ఎఫ్.హుసైన్, తన చలన చిత్రం ‘గజగామిని’ కి సంగీత దర్శకత్వం బాధ్యతను అప్పగిస్తూ అన్న మాటలు – “నా కుంచెతో సంగీతాన్ని సృష్టించలేను. కానీ నీ గీతాలు సప్తవర్ణ చిత్రాలను సృష్టించగలవు. నా చిత్రంలో ఏ మూలనైనా శూన్యతలు చోటు చేసుకుంటే నీ సంగీతం అక్కడ పరిపూర్ణతను చేకూరుస్తుంది'”

1972 లో బెర్లిన్ (జర్మనీ)లో జరిగిన ప్రపంచ సంగీత సదస్సుకు ప్రారంభోత్సవం చేసే అరుదైన గౌరవం డాక్టర్ భూపేన్ హజారికాకు లభించింది. ఆ సందర్భంలో తమ ప్రసిద్ధ గీతం’జయ జయ నవజోత్ బంగ్లాదేశ్’ మొట్టమొదటిసారిగా ఆలపించారు. 2004లో వారు భారతీయ జనతా పార్టీ లో చేరటం జరిగింది.

అస్సాం విద్యార్థి సంఘం 2009 లో ఆయన పుట్టినరోజు కానుకగా డాక్టర్ భూపేన్ హజారికా నిలువెత్తు విగ్రహం గౌహతిలో పేరొందిన సరస్సు దిఘ్లీప్ కోరీ ఒడ్డున స్థాపించి ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరింప జేసింది. కళాక్షేత్ర తమ ప్రియతమ కళాకారుడి గౌరవార్ధం ‘డాక్టర్ భూపేన్ హజారికా సంగ్రహాలయం’ ఏర్పాటు చేసి అందులో ఆయనకు సంబంధించిన నాలుగు వేల వస్తువులను ప్రదర్శించింది. రాష్ట్రప్రభుత్వ పర్యవేక్షణలో ఈ సత్కార్యం జరిగింది.

ఆయన అమెరికా విద్యార్ధి దశలో ప్రియంవదా పటేల్ అనే గుజరాతీ యువతిని వివాహం చేసుకున్నారు. వారికి ‘పున్నాగ్ తేజ్’అనే కొడుకున్నాడు. అయితే హజారికా దంపతులు పదమూడు సంవత్సరాల తరువాత విడిపోయారు.

మన సాంస్కృతిక ప్రతినిధి

భారత జానపద సంగీతాన్ని ఒక సాంస్కృతిక ప్రతినిధిగా ప్రపంచ శ్రోతల హృదయాలకు చేరువ చేసిన అరుదైన సంగీతకారుడు డాక్టర్ భూపేన్ హజారికా. సాంప్రదాయ అస్సామీ సంగీతాన్ని, భాషను, భావజాలాన్ని,యావత్ సంగీత ప్రపంచానికి పరిచయం చేసిన డాక్టర్ భూపేన్ హజారికా నవంబర్ 5, 2011న,తన 86వ ఏట ,ముంబై కోకిలాబెన్ అంబాని ఆసుపత్రిలో దీర్ఘకాల అనారోగ్యంతో కన్నుమూశారు.

‘సిసలైన కళాకారుడు చిరంజీవి’ అని మాన్యుల,సామాన్యుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయి ఋజువు చేసిన భూపేన్ హజారికా నిజంగా అమరుడే !

ఆ పరిపూర్ణ కళాకారుడి అస్తమయానికి దుఖ్ఖిస్తూ సంగీత – సాహిత్య చలనచిత్ర ప్రపంచాలు ఘనమైన నివాళి అర్పించాయి. అస్సాం రాష్ట్రమంతా స్తంభించి పోయి శోకాన్ని ప్రకటించింది.ఆయన భౌతిక కాయం దర్శించటానికి రాష్ట్ర ప్రజలే కాక అభిమానులు,కళాకారులు,రాజకీయ నాయకులు మొదలైన ప్రముఖులంతా చేరి అంత్యక్రియలలో పాల్గొన్నారు.

‘సిసలైన కళాకారుడు చిరంజీవి’ అని మాన్యుల,సామాన్యుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయి ఋజువు చేసిన భూపేన్ హజారికా నిజంగా అమరుడే !

*డాక్టర్ భూపేన్ హజారికాను ఉద్దేశించి ప్రముఖ కళాకారుడు ఎం.ఎఫ్.హుసైన్, తన చలన చిత్రం ‘గజగామిని’ కి సంగీత దర్శకత్వం బాధ్యతను అప్పగిస్తూ అన్న మాటలు – “నా కుంచెతో సంగీతాన్ని సృష్టించలేను. కానీ నీ గీతాలు సప్తవర్ణ చిత్రాలను సృష్టించగలవు. నా చిత్రంలో ఏ మూలనైనా శూన్యతలు చోటు చేసుకుంటే నీ సంగీతం అక్కడ పరిపూర్ణతను చేకూరుస్తుంది'”

  • రచయిత్రి శ్రీదేవీ మురళీధర్ వ్యక్తుల జీవితాలను లోతుగా తడిమి రాస్తారు. అక్షరాల్లో ఆత్మీయంగా ఆవిష్కరిస్తారు. వారు వెలువరించిన గ్రంధాల్లో సినిమా రంగానికి చెందిన ‘నా హాలీవుడ్ డైరీ’, ఆధ్యాత్మిక ధార ‘వేదాంత దేశికులు’ ప్రసిద్ధం. ఈ వ్యాసం నవంబర్ 2011,ఆంధ్రభూమి వీక్లీ నుంచి పునర్ముద్రణ. 
      

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article