Editorial

Sunday, September 22, 2024
చారిత్రాత్మకంTJF నుంచి TUWJ : నాడు ఉద్యమంలో - నేడు పునర్నిర్మాణంలో - అస్కాని మారుతి...

TJF నుంచి TUWJ : నాడు ఉద్యమంలో – నేడు పునర్నిర్మాణంలో – అస్కాని మారుతి సాగర్

LOGO

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 20 యేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఉద్విగ్న జ్ఞాపకాలు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పలు  తీసుకున్న ఎన్నో కార్యక్రమాలు…చరిత్రకు బీజం వేసిన  31 మే 2001 తెలంగాణ పాత్రికేయ లోకానికి ఒక దారి దీపం.

MARUTHI
Askani Maruthi Sagar, General secretery, TUWJ

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్… మే 17, 2011… ఉదయం 11 గంటలు కావస్తుంది. ఢిల్లీ కి వెళ్లాల్సిన ప్రత్యేక రైలు పట్టాల మీద సిద్ధంగా ఉంది. పత్రికలు, చానల్స్ అని తేడా లేకుండా వాటిల్లో పనిచేసే వందలాది జర్నలిస్టులు ఆ మెయిల్ గాడి ఎక్కుతున్నారు. అందరి లక్ష్యం ఒకటే దేశ రాజధాని పురవీధుల్లో దిక్కులు పిక్కటిల్లేలా పాత్రికేయ సమాజమంతా ‘జై తెలంగాణ’ అని నినదించాలని… ఆ దెబ్బ కు కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలనేది. తమ హక్కుల కోసం కాకుండా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆత్మ గౌరవం కోసం జర్నలిస్టులు చేసిన తెలంగాణ చైతన్య యాత్ర అది. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం లో దాదాపు రెండు వేల మంది జర్నలిస్టులు పాల్గొనగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒకే వేదికను పంచుకుని ‘ఆఖరి మోఖా… ఔర్ ఏక్ ధక్కా’ అని ముక్తకంఠంతో ప్రతిన బూనారు.

ఇలా ఒకటా రెండా 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎక్కడ తమ వంతు భూమిక పోషించాలో అక్కడ ముందుండి నడిచిన ఉద్యమ సంస్థ తెలంగాణ జర్నలిస్టు ఫోరం. ‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అనే టాగ్ లైన్ తో సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం అల్లం నారాయణ, పాశం యాదగిరి ఇలాంటి ప్రముఖ జర్నలిస్టులతో పాటు క్రాంతి కిరణ్, పిట్టల శ్రీశైలం, రమణ కుమార్, కందుకూరి రమేష్ బాబు, శశికాంత్, రాజేష్ లు మరికొందరు జర్నలిస్టులతో కలిసి టి జె ఎఫ్ ను ఏర్పాటుచేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం అప్పటి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన వెంటనే తెలంగాణ వెనుకబాటుతనాన్ని చాలా దగ్గరి నుండి చూసిన బుద్ధిజీవులుగా ఓ పదుగురిలో పుట్టిన ఆలోచనకు రూపమే ఈ తెలంగాణ జర్నలిస్టు ఫోరం.

షోయబుల్లాఖాన్, గులాం రసూల్ లాంటి జర్నలిస్టు అమరవీరుల వారసులుగా తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి కలం యోధులంతా కలిసి రావాలని 2001 మే 31 న టీజేఎఫ్ ఆవిర్భావ సందర్భంగా పిలుపునిచ్చారు. దగాపడ్డ, దిగులుపడ్డ తెలంగాణ విముక్తి కోసం కలాలే కత్తులుగా మారి ఉద్యమించాలని పిలుపునివచ్చింది. 50 సంవత్సరాలుగా విశాలాంధ్ర ఉక్కు పిడికిలి లో నలుగుతున్న తెలంగాణలో… పుట్టిన గడ్డ మీదనే రెండవ శ్రేణి పౌరులుగా గుర్తించబడటాన్ని ఎంతకాలం సహించాలంటూ జర్నలిస్టులలో ఆలోచన రేకెత్తించారు. వనరుల దోపిడీ ఆగాలన్న, మన కొలువులు మనకు దక్కాలన్నా, మన నీళ్లు మనకే సొంతం కావాలన్నా, మన నిధులు, మన బొగ్గు, ఇలా ఎన్నో చివరికి అధికారం మనదే కావాలన్నా తెలంగాణ ఒక్కటే మార్గం అంటూ ఉద్యమించాల్సిన ఆవశ్యకతను విశదీకరించారు. దీంతో తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ కలం వీరులు కదంతొక్కారు.

DELHI

రాజధాని నడిబొడ్డున ర్యాలీలు, బహిరంగ సభల నిషేధం ఉన్న సమయంలో దానిని బద్దలుకొట్టి గన్ పార్కు నుండి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు దాదాపు పది వేల మంది జర్నలిస్టులతో అతి పెద్ద ర్యాలీ నిర్వహించిన చరిత్ర టీజేఎఫ్ దే.

తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమాలు క్రమంగా పుంజుకున్నాయి. మొదట్లో ఆయా ప్రాంతాల్లో జర్నలిస్టు సోదరులు ఏర్పాటు చేసే సభలకు కవులు, కళాకారులు, మేధావులను ఆహ్వానించి ఆలోచింపచేసే ప్రసంగాలతో పాటు తెలంగాణ ఆటపాటలతో రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేసింది. రాజధాని నడిబొడ్డున ర్యాలీలు, బహిరంగ సభల నిషేధం ఉన్న సమయంలో దానిని బద్దలుకొట్టి గన్ పార్కు నుండి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు దాదాపు పది వేల మంది జర్నలిస్టులతో అతి పెద్ద ర్యాలీ నిర్వహించిన చరిత్ర టీజేఎఫ్ దే. అనంతరం జరిగిన సమావేశంలో ఒకే వేదిక పైకి తెలంగాణ ఉద్యమం తో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీ పెద్దలను కలపడం తో పాటు ఉద్యమ నేత కేసీఆర్ ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అలయ్ బలాయ్ తీసుకొని తెలంగాణ సమాజానికి తమ ఐక్యతను చాటి చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల చీఫ్ లతో ‘మీట్ ద ప్రెస్’ నిర్వహించి తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయాలని చెప్పించారు. విశాలాంధ్రలో అసెంబ్లీలో జరిగే సమావేశాల్లో మన సభ్యులకు ఇచ్చే గౌరవం చూసి ఒకింత ఆందోళన తో తెలంగాణ రాష్ట్రం వస్తే మన అసెంబ్లీ ఏ విధంగా ఉంటుందో నగరంలోని శ్రీధర్ ఫంక్షన్ హాల్ లో మాక్ అసెంబ్లీ రూపంలో చూపించే ప్రయత్నం చేసింది.

MOCK

MOCK

మార్చ్ సందర్భంలో సైతం ట్యాంక్ బండ్ పై ఉన్న ఇనుప కంచెను దాటడానికి వరూ సాహసించని సమయంలో కవరేజ్ కు వెళ్ళిన తెలంగాణ జర్నలిస్టులు తెగువ చూపించి పోలీసుల దాడిలో చివరికి తమ కెమెరాలు, వాహనాలను కూడా కోల్పోయారు. అదేవిధంగా సాగర హారం లో సైతం తమ వంతు పాత్ర పోషించారు. ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్థి నాయకులతో అనేక సందర్భాల్లో భేటీ అయ్యి ఉద్యమ దిశానిర్దేశం చేయడంతోపాటు వారి మధ్య ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వారందరినీ కలిపే ప్రయత్నాన్ని టీ జె ఎఫ్ చేసింది. చివరికి అసెంబ్లీకి బిల్లు వచ్చినప్పుడు తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ హాల్లో ఏ విధంగా ఉండి ఫ్లోర్ మానేజ్మెంట్ చేయాలి అనే విషయంలో సైతం లక్డికపూల్ లోని ఓ ప్రముఖ హోటల్లో ప్రత్యేక సమావేశాన్ని తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసింది. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ సమావేశానికి వచ్చి హాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకుని దిశా నిర్దేశం చేసుకున్నారు ఇలా ఎక్కడ జర్నలిస్టు ఫోరంగా ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహించాలో అక్కడ నిర్వహించింది.

పునర్నిర్మాణంలో భాగస్వామ్యం

TUWJ

ఉద్యమంలో తెగించి కొట్లాడిన తెలంగాణ జర్నలిస్టుల ప్రయోజనాలు, హక్కులు ముఖ్యమని భావించింది. ఉద్యమ నేత కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి మార్చి 8,2014 న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దాదాపు పది వేల మంది జర్నలిస్టులతో తెలంగాణ జర్నలిస్టు జాతర సభను నిర్వహించి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘంగా రూపాంతరం చెందింది.

తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చే వరకు ఉద్యమ సంస్థ గా ఉండి 14 ఏళ్ల పాటు ఉద్యమకారులతో భుజం భుజం కలిపి ముందుకు సాగిన టీ జె ఎఫ్, ఉద్యమం లోనే కాదు పునర్నిర్మాణంలో కూడా ఉండాలని భావించింది. ఉద్యమంలో తెగించి కొట్లాడిన తెలంగాణ జర్నలిస్టుల ప్రయోజనాలు, హక్కులు ముఖ్యమని భావించింది. ఉద్యమ నేత కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి మార్చి 8,2014 న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దాదాపు పది వేల మంది జర్నలిస్టులతో తెలంగాణ జర్నలిస్టు జాతర సభను నిర్వహించి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘంగా రూపాంతరం చెందింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్ జర్నలిస్టులకు అండగా ఉంటానని ప్రకటించారు. గత ఏడేళ్ల పాలనలో జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం తద్వారా పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుండటం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ కన్వీనర్ గా ఉన్న అల్లం నారాయణను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి తెలంగాణ మీడియా అకాడమీకి ఛైర్మెన్ ను చేశారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు కలిపి కోటి రూపాయలు మాత్రమే ఫండ్ ఉండగా వందకోట్ల సంక్షేమ నిధి తెలంగాణ జర్నలిస్టులకు అవసరమని ప్రెస్ అకాడమీకి వచ్చి ప్రకటించడమే కాకుండా ఇప్పటివరకు 34.5 కోట్ల రూపాయలు ఇవ్వడం, మరో 17.5 కోట్లను విడుదల చేయడంతో 52 కోట్ల సంక్షేమ నిధి సమకూరినట్లు అయింది. ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్ లెస్ ఆరోగ్య భద్రత కార్డులు అందించగా మొదట్లో ఆ కార్డు ద్వారా ఎంతోమంది జర్నలిస్టులు చికిత్స చేయించుకున్నారు.

LOGOతెలంగాణ జర్నలిస్ట్ ఫోరం స్ఫూర్తి తో యూనియన్ గా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం టి యూ డబ్లూ జే గా ముందుకు సాగుతూనే ఉంటాం.

అయితే, ఈ మధ్య కాలంలో ఆ కార్డులు పలు ఆసుపత్రుల్లో పని చేయడం లేదు. కాబట్టి ప్రభుత్వం వాటిని మళ్ళీ పునరుద్ధరించాలి. ప్రధానంగా ముఖ్యమంత్రి జర్నలిస్టుల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా ఎప్పుడెప్పుడు చర్యలు తీసుకుంటారా అని ఎదురుచూస్తున్నారు. దేశం లో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 20 వేల మందికి అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చుకున్నాము. సంక్షేమ నిధితో మరణించిన జర్నలిస్టు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వారికి పెన్షన్ సౌకర్యాన్ని మీడియా అకాడమీ అందిస్తుంది. సంక్షేమ నిధి ద్వారా వచ్చిన వడ్డీతో దాదాపు ఐదు కోట్ల రూపాయల మేర పలు జర్నలిస్టు కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. గత సంవత్సర కాలంగా కరోనాతో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్ సోకిన వారికి తక్షణ సహాయం కింద దాదాపు రెండున్నరవేల మందికి నాలుగు కోట్లకు పైగా అందించారు. దానితోపాటు యూనియన్ విజ్ఞప్తి మేరకు ఎవరైనా మరణిస్తే రెండు లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు మీడియా అకాడమీ ప్రకటించింది అయితే ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ జర్నలిస్టు సమాజం కోరుతుంది. కొవిడ్ కారణంగా టీ జె ఎఫ్ ద్వి దశాబ్ధి ఉత్సవాలు జరుపుకోలేకపోతు న్నప్పటికీ స్వరాష్ట్రంలో జర్నలిస్టులు ఆశిస్తున్న ఫలాలు ప్రభుత్వ సహకారంతో సత్వరమే పొందాలని కోరుకుంటున్నాము.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article