Editorial

Thursday, November 21, 2024
ఆధ్యాత్మికంఉత్తమ ధర్మపథము - గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు

ఉత్తమ ధర్మపథము – గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు

Dharmam

ఒరులేయని యొనరించిన
నరవర! యప్రియము తనమనంబున కగు తా
నొరులకు నది సేయకునికి
పరాయణము పరమధర్మ పథము లకెల్లన్

పూర్వం ఆంధ్రపత్రిక దినపత్రిక సంపాదకీయపు పైభాగంలో ప్రతి నిత్యం ఈ పద్యం ప్రత్యక్షమయ్యేది. కొన్ని సంవత్సరాల పర్యంతము పత్రిక ఆగిపోయే వరకు ఈ పద్యం కొనసాగింది. ఎందుకు? ఈ పద్యం యొక్క గొప్పదనం ఏమిటి? అది ఇస్తున్న సందేశం ఏమిటి? ఇటువంటి సందేహాలన్నింటికీ ఈ పద్య సారాంశమే జవాబు.

ఇది మహాభారతాంతర్గతమైన పద్యం. ఏది ధర్మం? అనే సందేహం వచ్చినప్పుడు చెప్పిన పద్యం. ఈ ప్రపంచంలో అసలైన ధర్మపథం ఏది అన్నప్పుడు ఇతరులు నీ విషయంలో చేసిన ఏదైనా పనివల్ల నీకు కష్టం కలిగినా, నష్టం కలిగినా నీకు నచ్చకపోయినా నీవుకూడా ఇతరుల విషయంలో కష్టనష్టాలు కలిగించే పనిని చేయకపోవడమే ఉత్తమ ధర్మపథము అని తెలుస్తున్నది. ఎప్పుడైనా ఎదుటివారిని కూడా నీవలెనే భావించాలన్న సందేశం ఇందులో ధ్వనిస్తూ ఉన్నది.

మానవ జీవితంలో కొన్ని వేల మందితో కలిసి మెలిసి తిరుగవలసిన సందర్భాలు కొల్లలు. సంఘము వ్యక్తుల సమూహము. సమూహంలోని ప్రతి వ్యక్తికీ తనవైన వ్యక్తిగత అవసరాలు, భావాలు ఉండటం సహజం. అయితే అవేవీ ఇతరులని బాధించరాదు, వారి వ్యక్తిత్వాలను కించపరచరాదు. వాళ్ళ హక్కులను హరించరాదు. ఈ భావనే ఈ పద్యం మనకు బోధిస్తున్నది.

ఎవరైనా మన విషయంలో చేసిన పని ఏదైనా మనకు బాధకలిగిస్తే, దాన్ని తెలుసుకొని ఇతరుల విషయంలో ఆ పనిని చెయ్యకపోవడమే నిజమైన ధర్మం.

ధర్మాన్ని గురించి దాని నిర్వచనాన్ని గురించి పెద్ద పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరైనా మన విషయంలో చేసిన పని ఏదైనా మనకు బాధకలిగిస్తే, దాన్ని తెలుసుకొని ఇతరుల విషయంలో ఆ పనిని చెయ్యకపోవడమే నిజమైన ధర్మం. ఇంతకన్నా సులభమైన నిర్వచనం ధర్మానికి మరొకటి ఉండదేమో!

మన భారతీయ ధర్మంలో ప్రధానమైనవి పురుషార్థాలు ధర్మం, అర్థం, కామం, మోక్షం- అనే ఈ నాలుగు కూడా మానవ జీవన విధానంగా ఉన్న ఏ సమాజమైన ఉన్నత సమాజంగా ఎదిగి గొప్పగా వెలుగుతుంది. భారతీయమైన ఆలోచనల్లో మోక్షానిది ప్రథమస్థానం. మోక్షం అంటే పునర్జన్మ అనేది లేకుండా ఉండటమే. మోక్ష సాధనకు మొదటి మెట్టే ధర్మం. మనిషి తన అవసరాల నిమిత్తం అర్థ సంపాదన అవసరం కాని అది ధర్మబద్ధమై ఉండాలన్నది తాత్పర్యం. అదే విధంగా మూడవ పురుషార్థమైన కామం- అంటే తన కోరికలు తీర్చుకోవడం. దీనిని ఎప్పుడూ భారతీయులు కాదనలేదు. కాని నీవు తీర్చుకునే ఎటువంటి కోరికలైనా అవి ధర్మబద్ధమైనవే కావాలన్నది నియమం. ఈ కట్టుబాటు తప్పినప్పుడు ధన సంపాదనలు, కామవాంఛలు వ్యక్తిని, అతని కారణంగా సమాజాన్ని కూడా ఛిన్నాభిన్నం చేసి పతనం దిశగా దారితీస్తాయి. మన పూర్వులు ధన సంపాదనను కాని, కోరికలను తీర్చుకోవడంగాని తప్పుగా ఎప్పుడూ భావించలేదు. పైగా వాటి వల్ల వ్యక్తి జీవితం, సమాజ జీవితం కూడా ఆనంద దాయకంగా ఉంటాయని చెప్పారు. అయితే వీటిని మాత్రం ధర్మం పరిధిని దాటకుండా నెరవేర్చుకోవాలని నియమాలు ఏర్పరిచారు.

om

నీవు ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుందన్న ఈ మాట వల్ల మానవునికి సంపూర్ణ రక్షణ నిచ్చేది ధర్మ చరణమేనన్నది స్పష్టమవుతుంది.

ధర్మోరక్షతి రక్షిత- అని ఒకమాట ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ధర్మం మాటరాగానే వినిపించే ఈ మాట అతి ప్రాచీనమైనది. నీవు ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుందన్న ఈ మాట వల్ల మానవునికి సంపూర్ణ రక్షణ నిచ్చేది ధర్మ చరణమేనన్నది స్పష్టమవుతుంది. మరి మనం ధర్మాచరణ చెయ్యాలన్నప్పుడు లోకంలోని ప్రతి మనిషిని, సృష్టిలోని ప్రతి జీవిని గౌరవించాలి. ఇక్కడ ఏ లోపమూ రాకూడదు. ఎటువంటి అహంకారమూ మనల్ని ఆవహించి ఉండరాదు. అహంకారమనేది మనల్ని దారి తప్పిస్తుంది. మనల్ని ధర్మదూరుల్ని చేస్తుంది.

మానవుల పట్ల ఆదరణ భావంతో ప్రవర్తించడమే ధర్మాచరణకు తొలిమెట్టు. ఏ విధమైన వ్యత్యాసాలు, ఎక్కువ తక్కువలు లెక్కచేయక నిర్మలమైన మనస్సుతో వారిని గౌరవించాలి. అది మనిషిగా మన కర్తవ్యం. ఇతరులను బాధపెట్టి ఆనందించడం ధర్మవిరుద్ధం. ధర్మవిరుద్ధమైన పనులతో మన బుద్ధి చెడుత్రోవల్లోకి దారితీసి మన పతనాన్ని శాసిస్తుంది. పతనం నుండి తప్పించుకోవడానికి ధర్మాచరణమే ప్రధానం. సమదృష్టి, సమత్వ బుద్ధి, సత్యపథం ఇవన్నీ ధర్మ నిర్వహణలో తోడ్పడే అంశాలు. మానవులుగా పుట్టినందుకు మానవధర్మాన్ని మనసా వాచా కర్మణా ఆచరించాలి. ఉత్తమ విలువలతో మానవతా భరితమైన ఆలోచనలే చేసి వాటినే ప్రచారంచేసి అవే ఆచరణలో పెట్టినప్పుడు మానవ ప్రగతి తప్పక కనిపిస్తుంది. ప్రపంచం సుఖశాంతుల నిలయమవుతుంది. అందుకే మానవసేవయే మనకు ప్రధాన ధర్మం కావాలన్న ఉత్తమ లక్ష్యంతో ముందుకుసాగాలి.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article