నేడు ప్రపంచం పూర్తి కుడిగా, పూర్తి ఎడమగా మారిపోతున్న కాలంలో ఒక మనిషి తన శాయశక్తులా, కుడిఎడమల అతివాదానికి దూరంగా, ఆ రెంటికీ సమానదూరంలో, మధ్యగా, సగటుమనిషికి సన్నిహితంగా జీవించడానికి ప్రయత్నించటంలో గొప్ప స్ఫూర్తి ఉంది.
తొంభై అయిదేళ్ళ వయసులో అత్యంత సమ్యక్ చిత్తంతో నిన్న థిచ్ నాట్ హన్ వియత్నాంలో నిర్యాణం చెందారని వినగానే అది ఒక నిర్వాణమనే అనిపించింది.
వారి దివ్య స్మృతిలో గతంలో నేను రాసుకున్న భాగాలు కొన్ని మరోసారి…
వాడ్రేవు చినవీరభద్రుడు
అది డిసెంబర్ మాసం. 2018. బేగంపేట మయూర్ మార్గ్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ వారు తమ సమావేశంలో మాట్లాడమని అడిగినప్పుడు కొంత ఆలోచనలో పడ్డాను. వారంతా తమ అరవైల్లోనూ, డెబ్బైల్లోనూ ఉన్నవాళ్ళు. జీవితంలో తమ వంతు కర్తవ్యమేదో తాము నెరవేర్చామనీ, కుటుంబపరంగానూ, సామాజికంగానూ కూడా తమ బాధ్యత తాము పూర్తిచేసుకున్నామనీ, శేష జీవితం ప్రశాంతంగా కొనసాగితే చాలుననీ అనుకుంటూ ఉండవచ్చు. అటువంటి వారికి కూడా స్ఫూర్తినివ్వగల జీవితం ఎవరిదై ఉండవచ్చు అని ఆలోచిస్తుంటే, సుప్రసిద్ధ బౌద్ధ సన్యాసి, శాంతిదూత థిచ్ నాట్ హన్ మదిలో మెదిలాడు.
వియత్నాం కి చెందిన థిచ్ నాట్ హన్ (Thich Nhat Hanh) దాదాపుగా గత యాభై ఏళ్ళకు పైగా దీర్ఘకాలంపాటు తన స్వదేశానికీ, తన స్వజనానికీ దూరంగా ప్రవాసజీవితం సాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన 92 వ ఏట, తన చివరిరోజులు తన స్వదేశంలో గడపడానికి వియత్నాం ప్రభుత్వం అంగీకరించింది. ఒకప్పుడు తన 16 వ ఏట తాను బౌద్ధధర్మ దీక్ష స్వీకరించిన ‘తూ హియూ’ పగోడా సన్నిధిలో ఆయన తన చివరిరోజులు గడపడానికి ఈ అక్టోబరులో వియత్నాంలో అడుగుపెట్టాడు. 1966 లో ఆయన వియత్నాం యుద్ధాన్ని ఆపడం కోసం ఒక శాంతిదూతగా అమెరికాలో అడుగుపెట్టినప్పుడు, అప్పటి రెండు వియత్నాం ప్రభుత్వాలూ కూడా ఆయన్ను దేశం నుంచి బహిష్కరించాయి. గత యాభయ్యేళ్ళుగా ప్రవాసిగా జీవిస్తున్న థిచ్ నాట్ హన్ వియత్నాంకి రావడం ఇది అయిదవసారి. కాని ఇది చివరిపర్యటన కావాలనే ఆయన కోరుకుంటూ ఉన్నాడు.
2014 లో ఆయన తీవ్ర అస్వస్థతకి గురైన తర్వాత మాట పడిపోయిన స్థితిలో, కదల్లేని పరిస్థితిలో, వీల్ ఛైర్ మీదనే కాలం గడుపుతున్నప్పటికీ, తన సైగలతోనూ, చిరుమందహాసంతోనూ, ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. అత్యంత శాంతికాముకుడైన ఆ మనిషి ప్రపంచంలోని ప్రతి నియంతృత్వాన్నీ, ప్రతి ఒక్క యుద్ధోన్మాద రాజకీయాధినేతనీ కలవరపెడుతూనే ఉన్నాడు.
ముఖ్యంగా వియత్నాంలోని బౌద్ధధర్మాన్ని వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం పూర్తిగా తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ, అణచివేతని ప్రశ్నిస్తున్న బౌద్ధాచార్యుల్ని అరెస్టులకీ, వేధింపులకీ గురిచేస్తూ ఉన్న ఈ తరుణంలో థిచ్ నాట్ హన్ స్వదేశాగమనం మరింత ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఆయన్ని దేశంలోకి అనుమతించడం ద్వారా తాము మతధర్మాలపట్ల అసహనం చూపడంలేదని వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రపంచానికి సంకేతాలు పంపుతున్నది. కాని, సరిగ్గా, ఆ కారణం వల్లనే వియత్నాం బౌద్ధధర్మాచార్యులు థిచ్ నాట హన్ పట్ల అసంతృప్తి కనబరుస్తున్నారు.
థిచ్ నాట్ హన్ ప్రధానంగా బౌద్ధధర్మాచార్యుడు. కాని ఆయన అనుష్ఠిస్తున్న ధర్మం ప్రజలకి దూరంగా, ఒక ప్రశాంత మఠంలో, నిలువెత్తు నిశ్శబ్ద బుద్ధప్రతిమ ముందు ధ్యానంలో గడిపింది కాదు. యుద్ధం మధ్య, ఆకలి మధ్య, అణచివేతల మధ్య, హత్యలు, అత్యాచారాలమధ్య బుద్ధుణ్ణి అన్వేషించిన మతం ఆయనది.
కాని థిచ్ నాట్ హన్ కి ఇది కొత్త కాదు. 1966 కి ముందు వియత్నాం రెండు వియత్నాంలుగా, కమ్యూనిస్టు, కాపిటలిస్టు శక్తుల యుద్ధప్రయోగశాలగా మారినప్పణ్ణుంచీ కూడా ఆయన అటు ప్రభుత్వానికీ,ఇటు మతాచార్యులకీ కూడా సమానదూరంలోనే జీవిస్తూ వచ్చాడు. తనది ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం కాదనీ, తాను మధ్య వియత్నాం కి చెందినవాడిననీ చెప్పుకుంటూ వచ్చాడు. భౌగోళికంగా కూడా ఆయన పుట్టిందీ, పెరిగిందీ మధ్య వియత్నాంలోనే. నేడు ప్రపంచం పూర్తి కుడిగా, పూర్తి ఎడమగా మారిపోతున్న కాలంలో ఇంకా ఒక మనిషి తన శాయశక్తులా, కుడిఎడమల అతివాదానికి దూరంగా, ఆ రెంటికీ సమానదూరంలో, మధ్యగా, సగటుమనిషికి సన్నిహితంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండటంలో గొప్ప స్ఫూర్తి ఉంది.
థిచ్ నాట్ హన్ ప్రధానంగా బౌద్ధధర్మాచార్యుడు. కాని ఆయన అనుష్ఠిస్తున్న ధర్మం ప్రజలకి దూరంగా, ఒక ప్రశాంత మఠంలో, నిలువెత్తు నిశ్శబ్ద బుద్ధప్రతిమ ముందు ధ్యానంలో గడిపింది కాదు. యుద్ధం మధ్య, ఆకలి మధ్య, అణచివేతల మధ్య, హత్యలు, అత్యాచారాలమధ్య బుద్ధుణ్ణి అన్వేషించిన మతం ఆయనది. కరుణ, ప్రజ్ఞ- రెండు వేరు వేరు పదాలు కావనీ, ప్రజ్ఞ అంటే అవగాహన అనీ,అవగాహన వల్లనే మనిషి కరుణామయుడు కాగలుతాడనీ నమ్మి, అటువంటి ప్రజ్ఞాపారమితను సాధనచేస్తున్న జీవితం ఆయనది. బౌద్ధాన్ని ఆయన మన దైనందిన జీవితంలోకి తీసుకురాగలిగాడు. దాన్ని Engaged Buddhism అన్నాడు. పల్లెల్లో, పట్టణాల్లో, రైళ్ళల్లో, పారిశ్రామిక ప్రాంగణాల్లో, విమానాశ్రయాల్లో, వాణిజ్యప్రపంచంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, కాందిశీకుల పునరావాస కేంద్రాల్లో, తుపాకిమోతల మధ్య, బాంబుల వర్షంలో కూడా ప్రతి ఒక్కచోటా, ప్రతి ఒక్కరూ బౌద్ధాన్ని సాధన చేయగలరనీ, ప్రతి ఒక్క మనిషీ బుద్ధుడుకాగలడనీ ఆయన గత అరవయ్యేళ్ళకి పైగా ప్రపంచానికి చెప్తూ ఉన్నాడు. తన జీవితాన్నే ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు.
నేడు ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత ప్రభావశీలమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాల్లో ఆయన ఒకడు. యుద్ధోన్మాదంతోనూ, లాభాపేక్షతోనూ రగిలిపోతున్న గ్లోబలైజేషన్ యుగంలో ప్రపంచాన్ని సాంత్వనపరుస్తున్న శాంతిదూతల్లో అగ్రగణ్యులైన మొదటి పదిమందిలో ఆయన కూడా ఒకడు.
యాభై ఏళ్ళకే, అరవయ్యేళ్ళకే జీవితగమనంలో అలసిపోతున్న మనల్ని థిచ్ నాట్ హన్ వంటి వాళ్ళు ఆశ్చర్యపరుస్తారు. తమకంటూ ఒక కుటుంబమో, బంధాలో, బాధ్యతలో లేని అటువంటి సాధువులు అంత సుదీర్ఘకాలం పాటు అంత సంఘర్షణ మధ్య తమ జీవితేచ్ఛని కోల్పోకుండా ఎట్లా జీవించగలుగుతున్నారో, ఆ రహస్యమేమిటో మనకి అర్థం కాక మనం నివ్వెరపోతూంటాం.
థిచ్ నాట్ హన్ తన జీవితానందరహస్యాన్ని mindfulness అని ఒక్కమాటలో చెప్తూ వచ్చాడు. బతుకుతున్న ప్రతి క్షణాన్నీ mindful గా జీవించాడు. అట్లా జీవించడమెట్లానో చూపించాడు.
థిచ్ నాట్ హన్ తన జీవితానందరహస్యాన్ని mindfulness అని ఒక్కమాటలో చెప్తూ వచ్చాడు. బతుకుతున్న ప్రతి క్షణాన్నీ mindful గా జీవించాడు. అట్లా జీవించడమెట్లానో చూపించాడు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది జిజ్ఞాసువులకి నేర్పిస్తూ ఉన్నాడు. దేశాలకీ, మతాలకీ అతీతంగా ప్రపంచమంతా ఆయన మాటలు వింటున్నది. ఆయన అమెరికా వెళ్ళిన తొలిరోజుల్లో ప్రసిద్ధ క్రైస్తవ సాధువు థామస్ మెర్టన్ ఆయన్ని చూసి, ‘నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడో ఈ బౌద్ధుణ్ణి చూస్తే తెలిసింది’ అన్నాడట!
థిచ్ నాట్ హన్ కవి, కథకుడు. బుద్ధుడి జీవితాన్ని ఒక నవలగా రాసాడు. బౌద్ధధర్మాన్ని మామూలు పాఠకులకి కూడా అర్థమయ్యే రీతిలో పుస్తకాలు రాసాడు. ప్రసంగాలు చేసాడు. అవన్నీ ఇప్పుడు దాదాపు వందకు పైగా పుస్తకాలుగా వెలువడ్డాయి.
ఆయన రచనల్లో కొన్నింటిని మీకు వరసగా పరిచయం చేద్దామనుకుంటూ ఉన్నాను. అందులో, మొదటిది, ఆరోజు ఆ సీనియర్ సిటిజెన్లకు పరిచయం చేసిందీ The Long Road Turns to Joy: A Guide to Walking Meditation (1996) అనేది.
బౌద్ధధర్మంలో ధ్యానం ఒక ముఖ్యాంగం అని మనకు తెలుసు. బుద్ధుడి సంభాషణల్లో ఒకటైన ‘ఆనాపానసతి సుత్త’ (మజ్జిమనికాయం:118) శ్వాసమీద మనసుపెట్టి ధ్యానం చెయ్యడం గురించి చెప్తుంది. ఆ సూత్రం ఆధారంగా చేపట్టే ధ్యానం విపస్సన (సంస్కృతంలో విపశ్యన) పేరిట ప్రసిద్ధి చెందింది కూడా. థిచ్ నాట్ హన్ ఆ ధ్యాన సాధనని కేవలం ధ్యానమందిరానికే పరిమితం చెయ్యకుండా, వంటగదిలోకి, ఆఫీసుగదిలోకి, చివరికి మన మార్నింగ్ వాక్ లోకి కూడా తీసుకొచ్చాడు. మనం ఏ పనిచేసినా mindfulness చేస్తే అదే ఒక ధ్యానం అవుతుంది అని చెప్తాడు.
Mindfulness అనే మాట ‘ఆనాపానస్మృతి’ లోని స్మృతి అనే పదానికి ఆయన రూపొందించిన ఇంగ్లీషు సమానార్థకం. ఇక్కడ ‘స్మృతి’ అంటే జ్ఞాపకం అని కాదు. దానికి సరైన తెలుగు పదం ‘స్పృహ’.
Mindfulness అనే మాట ‘ఆనాపానస్మృతి’ లోని స్మృతి అనే పదానికి ఆయన రూపొందించిన ఇంగ్లీషు సమానార్థకం. ఇక్కడ ‘స్మృతి’ అంటే జ్ఞాపకం అని కాదు. దానికి సరైన తెలుగు పదం ‘స్పృహ’. మనం ఏ పని చేసినా స్పృహతో చేస్తే అదే ధ్యానం అవుతుంది. కాని, సాధారణంగా మనం ఏ పని చేస్తున్నా ఆ పని గురించిన, ఆ క్షణం గురించిన స్పృహతో చెయ్యం. ఆ క్షణాన మన మనసులో అయితే, గడిచిపోయిన విషయాలేనా కదుల్తుంటాయి, లేదా రానున్న రోజుల గురించిన తలపులేనా ఉంటాయి. మనం మార్నింగ్ వాక్ చేస్తున్నా కూడా మనం నిజానికి అయితే గతంలో ఉంటాం, లేదా భవిష్యత్తులో తిరుగాడుతుంటాం. థిచ్ నాట్ హన్ నేర్పే మొదటి పాఠం, మనం మనసుపెట్టి అడుగులువెయ్యడం ఎలానో చెప్పడం.
Long Road to Joy వందపేజీలు కూడా లేని చిన్నపుస్తకం. కాని,మనం అనుష్ఠించడం మొదలుపెడితే, మనలో శారీరికంగానూ, మానసికంగానూ కూడా అద్భుతమైన మార్పు తీసుకురాగల పుస్తకం. అందులో మొదటి పేజీలోనే థిచ్ నాట్ హన్ ఇలా రాస్తున్నాడు:
‘మీరు మీ శిష్యులతో చేయిస్తున్న సాధన ఏమిటని ఒకప్పుడొకరు బుద్ధుణ్ణి ప్రశ్నించారు. అందుకాయన ‘మేం చేసేపని తినడం, నడవడం, కూచోడం’ అన్నాడు. ‘అదేమిటి, తినడం, కూచోడం, నడవడం, ప్రతి ఒకడూ చేసే పనే కదా’ అన్నారువాళ్ళు మళ్ళా. ‘కానీ మేం కూచుంటున్నప్పుడు, కూచున్నామనే స్పృహతో కూచుంటాం. నడుస్తున్నప్పుడు నడుస్తున్నామనే స్పృహతో నడుస్తాం. తింటున్నప్పుడు తింటున్నామనే స్పృహతో తింటాం’ అన్నాడు బుద్ధుడు.
చాలాసార్లు మనం గతంలో కూరుకుపోడమో, భవిష్యత్తులో తేలిపోతుండటమో చేస్తూంటాం. కాని మనం మన ప్రస్తుత క్షణం పట్ల ఎరుకతో, పూర్తిస్పృహతో ఉన్నట్లయితే, మనమేం చేస్తున్నామో, మనకేమి జరుగుతున్నదో మనకి మరింత లోతుగా అర్థమవుతుంది. అప్పుడు మనం మనకి సంభవిస్తున్నదాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అంగీకరించగలుగుతాం. దానివల్ల సంతోషాన్నీ శాంతినీ, ప్రేమనీ చవిచూడగలుగుతాం.’