నిజానికి వ్యక్తుల మధ్య One to one conversation చేయడానికి వేదికలు దాదాపుగా కనుమరుగవుతున్న సందర్భంలో ఫేస్బుక్ ఒక వేదికగా కనిపించింది తప్ప దీనికున్న పరిమితులు దీనికున్నాయి.
డాక్టర్ విరించి విరివింటి
Facebook అనేది ఫలవంతమైన కన్వర్సేషన్ కి వేదిక కాదు. ఫేస్బుక్ ని ఫ్రేం చేసిన విధానంలోనే conversation లేదా సంభాషణకు ఎలాంటి స్కోప్ ఈయలేదని అర్థం ఔతుంది. కానీ చాలామంది దీనిని సంభాషణకు అనువైనదని చాలా సీరియస్ గా భ్రమపడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది.
వ్యక్తుల మధ్య One to one conversation చేయడానికి వేదికలు దాదాపుగా కనుమరుగవుతున్న సందర్భంలో ఫేస్బుక్ ఒక వేదికగా కనిపించింది తప్ప దీనికున్న పరిమితులు దీనికున్నాయి. ఒక వ్యక్తి మాట్లాడేటప్పటి హావభావాలు, భావోద్వేగాలూ ఇత్యాదివేవీ ఫేస్బుక్ లో కనబడవు. కామెంట్ అనేది సంభాషణకు ఉపయుక్తమైన రూపమేమీ కలిగిలేదు.
ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చుని ఒక విషయంపై మాట్లాడితే ఎంతసేపు మాట్లాడతారు?. ఒక అరగంట? గంట?. ఎంతసేపైనా కానీ అదంతా ఆ టాపిక్ కీ అప్పటి ఆ సమయానికీ తగ్గట్టుగా ఒక మూడ్ లో జరిగిపోతుంది. కానీ ఫేస్బుక్ అలా కాదు. ఒక వ్యక్తి ఒకపోస్ట్ రాశాక..ఇంకో వ్యక్తి మరెప్పుడైనా కామెంట్ చేయవచ్చు. ఆ ఇంకో వ్యక్తి ఈ టాపిక్ కి సంబంధించిన వాతావరణంలో కానీ మూడ్ లో కానీ ఉండే అవకాశం తక్కువ. లేదా ఇంకేదో మూడ్ లో ఉండిండవచ్చు. చిరాకుగా కూడా ఉండిండవచ్చు. ఈ రాసిందంతా చెత్తగా కనిపించవచ్చు. అప్పటికి తన మూడ్ కి అనుకూలంగా ఓ తీవ్రమైన కామెంట్ చేసి వెళ్ళిపోవచ్చు. అదే వ్యక్తి తరువాత మరెప్పుడో వచ్చి ఇపుడున్న మూడ్ కి అనుగుణంగా తీవ్రతను తొలగించిలేదా తగ్గించి మామూలుగా మాట్లాడవచ్చు. ఒకసారి ఇలాగే ఒకాయన నా పోస్ట్ మీద తిట్లదండకం అందుకున్నాడు. ఆయన అటువంటి వ్యక్తేమీ కాదు. చదువుతో పాటు సంస్కారం ఉన్నవాడే. మరుసటి రోజు చెప్పిన విషయం ఏమంటే అతడు ఆ కామెంట్ చేసేటపుడు చాలా బాధలో ఉన్నాడనీ విపరీతంగా తాగి ఉన్నాడనీ. ఆ మూడ్ లో నుండి బయటకు వచ్చాక అతడు చాలా మామూలు వ్యక్తిలా మారి మామూలు గా కామెంట్స్ చేశాడు. ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
మనిషి అనేవాడు కేవలం కొన్ని కామెంట్స్ తో అది కూడా ఫేస్బుక్ కామెంట్స్ లో దొరుకుతాడా? మనుషులంటే కేవలం ఓ పది పన్నెండు మాటల మూటనేనా?
వ్యక్తుల మధ్య సంభాషణనే కష్టంగా ఉంటే డిబేట్ లంటూ దిగుతుంటారు కొంతమంది. ఒక ఆర్గానిక్ సంభాషణకే దిక్కులేదురా సామీ అంటే ఇంక డిబేట్లా?
డిబేట్ చేసే వాతావరణమే ఫేస్బుక్ లో సాధ్యం కాదు. ఒకవేళ డిబేట్ అని పేరు పెట్టి కామెంట్స్ రూపంలో ఏదైనా నెరపినా…అది కేవలం అస్మదీయులు తస్మదీయులని మనుషులను విడగొట్టుకోవడానికి తప్ప మరెక్కడికీ దారి తీయదు. ఈ వాతావరణం లేని మూడ్ లేని యాంబియన్సే లేని డిబేట్ లకు పరమ సాంక్టిటీ ఇచ్చేసి చేసిన కామెంట్ ఆధారంగా మనుషులను అంచనా వేసేసే జోకర్ బ్యాచ్ కూడా ఒకటి తయారైంది.
మనిషి అనేవాడు కేవలం కొన్ని కామెంట్స్ తో అది కూడా ఫేస్బుక్ కామెంట్స్ లో దొరుకుతాడా? అంత సులువా? జీవితంలో తోడుగా ఉండే పార్టనర్ ను కానీ పుట్టిన పిల్లలను కానీ అర్థం చేసుకోవడంలో విఫలమయ్యే మనుషులం ఫేస్బుక్ లో ఓ రెండు కామెంట్స్ చేసినతను లేదా ఆమెను క్షణంలో డిసైడ్ చేసేయగలమా? మనుషులంటే కేవలం ఓ పది పన్నెండు మాటల మూటనేనా?
ఎవరో ఏదో కామెంట్ చేశారని ఎక్కడికో వెళ్ళి ఆ వ్యక్తిని కొడతానని ఒకాయన బయలుదేరితే కోర్టులో కేసులేస్తానని ఇంకోకాయన బయలుదేరుతాడు. ఇదేదో సరదా వ్యవహారంలా తయారైంది. వ్యక్తులు కేవలం కొన్ని అక్షరాలు పదాలు కొన్ని వాక్యాలూ కొన్ని ఫోటోలు మాత్రమే కాదు. తనదైన జీవితాన్ని అనుభవాల్నీ ఆకాంక్షలనీ కష్టాలనీ నష్టాలనీ కలిగిఉన్న వ్యక్తి ఓ పది పదాల్లో పది వాక్యాలలో తెలిసిపోతాడనుకోవడం ఎంతటి మూర్ఖత్వం!
కొందరు విచిత్రంగా సంబంధం లేకుండా నో లేక సబ్జెక్టు తెలియకనో లేదా వారి అవగాహన మేరకో కామెంట్స్ చేస్తారు. “ఠాఠ్ ..నీకు బుద్ధి లేదు, కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, చదువుకున్నావా చదువుకోలేదా, ఎంతకెంతకెంతకెంతకెంతకెంత కండకావరం” అని రెస్పాండ్ ఐతే చాలా వింతగా విచిత్రంగా ఉంటుంది. వీలైతే అర్థం అయ్యేలా చెప్పవచ్చు. ఫేస్బుక్ లో అర్థం చేయించడానికి నూటొక్క లిమిటేషన్స్ ఉంటాయి. ప్రయత్నం చేయవచ్చు. కుదరకపోతే వదిలివేయవచ్చు. మన భావాలతో పొంతన లేని వారు పదే పదే విసిగిస్తుంటే unfriend చేసుకోవచ్చు. మరీ విసిగిస్తే బ్లాక్ చేసుకోవచ్చు. పొద్దున్న లేచినప్పటి నుండీ ఆపోజిట్ అభిప్రాయలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చెప్పడం మొదలెట్టామంటే తలకాయమీద మెడకాయ ఉన్నవాడెవడైనా మనల్ని బ్లాక్ చేసుకునే పోతాడు. అదేమంత పెద్ద విషయం కాదు.
ముఖ్యంగా మనం చదివిన విషయాల్లోంచి అనుభవాల్లోంచే ఏదైనా రాయగలం. కామెంట్స్ రూపంలో చెప్పేందుకు ప్రయత్నించగలం. వివిధ వ్యక్తులు రాసింది చదవడం వలన జీవన అనుభవాన్ని మరింత విస్తృత పరుచుకోగలం. విస్తరించగలం. అందరితో అన్ని కాలాల్లో ఏకీభావం ఎవరికైనా ఎందుకుంటుంది? అసలెందుకుండాలి? ఎవరి జీవితానుభవాన్నో లేక అభిప్రాయాన్నో పూర్తిగా తప్పేనని ఎవరైనా ఎలా చెప్పగలం. మనకు బాధ కలిగేంత విబేధంతో ఉన్నపుడు one to one conversation సాధ్యం కాని ఫేస్బుక్ లో వర్చువల్ స్నేహాన్ని కొనసాగించడంలో పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే నన్ను బ్లాక్ చేసుకున్నవారికీ లేదా నేను బ్లాక్ చేసినవారికీ నా శతకోటి కృతజ్ఞతలు. Let us agree to disagree అనే కాకుండా let us stop this never ending useless faceless conversation. అని ఒక ఒప్పందానికి వచ్చి హాయిగా ఎవరి సేఫ్ జోన్ లో వారు ఉన్నట్టే కదా.
విభిన్న అభిప్రాయాలను చదవడమే కాకుండా అవి ఆ విధంగా విభిన్నంగా ఉంటాయని అర్థం కావడానికి సమయం పడుతుంది. వాటిని భరించడానికి సహనం పెరగడానికీ సమయం పడుతుంది. విభిన్నతల మధ్య బతకలేకపోతే మనిషి తనుకు తాను ఒక Atom గా ఒక Itom గా తయారవుతాడు.
నిజానికి మనుషులుగా నిజ సంబంధాలలో దూరమౌతూ ఫేస్బుక్ లోని వర్చువల్ రిలేషన్స్ తో ఏదో సాధించేస్తున్నామనే భ్రమ చాలామందికి ఉంటుంది. ఫేస్బుక్ ద్వారా మనల్ని వ్యావృతం చేసుకోవచ్చు. నేనెందుకు రాస్తుంటానంటే నాకెంతవరకు తెలుసో తెలుసుకోవడానికి నాకెంత వరకు తెలియదో తెలుసుకోవడానికి. To know how much I know and to know how much i do not know. కామెంట్స్ కి ఉండే పరిమితులను దృష్టిలో ఉంచుకుని అందరు విభిన్న వ్యక్తుల అభిప్రాయాలను వినడం నేర్చుకుంటుంటాం. విభిన్న అభిప్రాయాలను చదవడమే కాకుండా అవి ఆ విధంగా విభిన్నంగా ఉంటాయని అర్థం కావడానికి సమయం పడుతుంది. వాటిని భరించడానికి సహనం పెరగడానికీ సమయం పడుతుంది. అదే learning. సహనాన్ని కూడా వయసుకు తగ్గట్టు నేర్వలేకపోతే విభిన్నతల మధ్య బతకలేకపోతే మనిషి తనుకు తాను ఒక Atom గా ఒక Itom గా తయారవుతాడు.
అలాకాకుండా ఈ ఫేస్బుక్ డైనమిక్స్ తెలిసిన వారు కొంతలో కొంత సంభాషణనూ పరిమితులతో డిబేట్ నూ ఆహ్వానించవచ్చు. భిన్నాభిప్రాయాలు గల స్నేహితులు ఒకచోట కూర్చుని ఎంతైనా చర్చించి తిట్టుకుని చివరకు చాయ్ తాగి దమ్ముకొట్టి వెళ్ళిపోగలరు కానీ ఫేస్బుక్లో అలా జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది స్నేహం కాదు. స్నేహమనే నటన. స్నేహంగా ఉండడమనే ఒక ఫాల్స్ పర్సొనా. అది ముందు గుర్తించాలి. వర్చువల్ స్నేహం నిజమైన స్నేహంగా మనసున్న స్నేహంగా మరలడం కష్టం. ఉదాహరణకు నాతోసహాయం పొందినవారే కావొచ్చు లేదా నాతో ఫోన్లలో మాట్లాడినవారే కావొచ్చు ఏదైనా ఒక నా అభిప్రాయం వారికి నచ్చక పోతే..నాతో ఉన్న స్నేహానుసారం నాకు ఫోన్ కూడా చేసి డిస్కస్ చేయవచ్చు. కానీ వెంటనే తిడుతూ ఓ పోస్ట్ పెట్టేస్తుంటారు. ఏమంటే ఆ స్నేహం నిజమైన స్నేహం కాదు. బోలుతంనం. Emptyness. Empty friendship. దాని యుటిలిటీ అంతవరకే.
ఈ ఫేస్బుక్ మీడియంని ఎంతవరకు ఉపయుక్తకరమైన సంభాషణా వేదికగా మార్చగలం అన్నది మనందరి ముందు ఉన్న ప్రశ్న. నిజానికి మార్చలేం. ఫేస్బుక్ వాడు కూడా దీనిని వ్యక్తుల మధ్య సంభాషణకు మరింత బెటర్ ప్లాట్ ఫాం లా మార్చేందుకు ఏమైనా చేస్తాడేమో వేచి చూడాలి.
మనుషులం కేవలం కొన్ని కామెంట్ల మూటలుగా మారడమే కాకుండా సాటి మనుషులు కూడా కొన్ని కామెంట్ల మూటలు అనుకోవడం వలన వస్తున్న విచిత్రమైన పరిస్థితులివి. ఈ ఫేస్బుక్ మీడియంని ఎంతవరకు ఉపయుక్తకరమైన సంభాషణా వేదికగా మార్చగలం అన్నది మనందరి ముందు ఉన్న ప్రశ్న. నిజానికి మార్చలేం. ఫేస్బుక్ వాడు కూడా దీనిని వ్యక్తుల మధ్య సంభాషణకు మరింత బెటర్ ప్లాట్ ఫాం లా మార్చేందుకు ఏమైనా చేస్తాడేమో వేచి చూడాలి.
డాక్టర్ విరించి విరివింటి సామాజిక సమస్యలపై స్పందించే కవీ, రచయితా షార్ట్ ఫిల్మ్ మేకర్. మీదు మిక్కిలి చక్కటి హస్తవాసి గల వైద్యులు. ‘రెండో అధ్యాయానికి ముందుమాట’ వారి తొలి కవితా సంపుటి.