చలువ చేయు వేరు చల్లని యా నీరు
వేరు గడ్డలనుచు పేరునొందె
చిన్న ముక్క తోడ నన్నారి చేయగా
సురుచి దాసులవని నరులు లేరు
నాగమంజరి గుమ్మా
ఈ సుగంధి పాల చెట్టు వేర్లు ఒక తీగలాగా చెట్టు మొదట్లో పెరిగి భూమిలోకి వెళతాయి.ఈ వేర్లు ఆరోగ్యానికి చాలా మంచివని అయుర్వేదం చెప్తోంది.శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు పండ్లు,చెట్టు వేర్లు కూడా ఉపయోగపడతాయి.
ఈ మొక్క వేళ్ళను ‘సుగంధి గడ్డలు’ అని కూడా అంటారు. వీటితో ‘నన్నారి’ లేదా ‘సుగంధి పానీయం’ తయారు చేస్తారు. నిమ్మ రసంతో కలిపి షర్బత్ చేస్తారు.
సుగంధిపాల చెట్లు వేర్లని కత్తిరించేసి, ఎండలోపెట్టి,వీటిని నీళ్ళలో మరిగించి పంచదారకలిపి ఒక చిక్కని ద్రవాన్ని తయారు చేస్తారు.ఇలా చేసిన సిరప్ ని నన్నారి అంటారు. ఒక గ్లాసులో కొద్దిగా నన్నారిని పోసి, అందులో ఒక నిమ్మకాయను పిండి, చల్లటి సోడాను కొట్టి గ్లాసులో పోసి ఇస్తారు.దీనినే నన్నారి షర్బత్ అంటారు. ఇది ఒంటి వేడిని హరించి చలువ చేస్తుంది. పలు ఆయుర్వేద, సంప్రదాయ వైద్యాలలో ఉపయోగపడుతుంది.
షర్బత్ అంటే నన్నారి షర్బత్ అదీ రాయలసీమ మాత్రమే అనేంత పేరు తెచ్చుకున్న ఈ నన్నారి షర్బత్ ని ఒకసారి తాగితే వదిలిపెట్టరు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.