జనవరి 19వ తారీఖు
క్రీ,శ.1163 యిదే తారీఖున కాకతీయ రుద్ర దేవుడిచ్చిన అనుమకొండ శాసనం అత్యంత ప్రముఖమైనది. దీన్నే వేయి స్తంభాల గుడి శాసనం అని కూడా అంటారు. శాసనం తెలుగు, సంస్కృత భాషలలో యివ్వబడ్డది. తెలుగు భాగంలో రుద్రదేవుడు అనుమకొండలో తన పేర రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యునికి ఆలయం కట్టించినట్టుచెప్పబడ్డది. అట్లే సంస్కృత భాగంలో కాకతీయుల ప్రశస్తులు, తొలి కాకతీయుల వంశ వృక్షమివ్వబడ్డాయి. రుద్రదేవుడి విజయాలు చెప్పబడ్డాయి.
గోవిందరాజును, మంత్రకూట(మంథని) గుండనను ఓడించాడని చెప్పబడ్డది. అనుమకొండ పైకి దాడి వచ్చిన జగద్దేవుని ఓడించినట్టు, పొలవాస మైలిగిని ఓడించి ధనరాసులన్నీ కొల్లగొట్టి నట్లు చెప్పబడ్డది. అట్లే కందూరు భీమచోడుణ్ణి, ఉదయనచోడున్ని ఓడించి, ఉదయనుని కుమార్తె పద్మావతిని వివాహమాడి నట్లు, ఆ సమయంలోనే పానగల్లులో ఉదయ సముద్రం, భీమచోడ సముద్రం అనే తటాకాలను తవ్వించినట్టు చెప్పబడ్డది.
వాస్తవానికి తెలంగాణాలో (నిజాం రాజ్యంలో) మొదటిసారిగా శాస్త్రీయంగా చదవబడ్డది హనుమకొండ శాసనమే.1882 లో జే. ఏ. ఫ్లీట్ తొలిసారి దీన్ని పరిష్కరించారు. అక్కడనుండి తెలంగాణాలో శాసనాల పఠనం పరిష్కరణ ప్రచురణలు ఆరంభమైనాయి.
ఆసక్తికరంగా కాకతీయుల రాజ్య సరిహద్దులు శాసనంలో చెప్పబడ్డాయి. అవి తూర్పున సముద్రము, పడమర కళ్యాణ కటకం, దక్షిణాన శ్రీశైలపర్వతాలు ఉత్తరాన మాల్యవంత పర్వతాలు.
శాసనం చివర ఖేటక గ్రామాన్ని మద్ది చెరువుల పేర మహేశ్వర రవి వాసుదేవుల అర్చనలకివ్వబడ్డట్టు చెప్పబడ్డది. వాస్తవానికి తెలంగాణాలో (నిజాం రాజ్యంలో) మొదటిసారిగా శాస్త్రీయంగా చదవబడ్డది హనుమకొండ శాసనమే.1882 లో జే. ఏ. ఫ్లీట్ తొలిసారి దీన్ని పరిష్కరించారు. అక్కడనుండి తెలంగాణాలో శాసనాల పఠనం పరిష్కరణ ప్రచురణలు ఆరంభమైనాయి.
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా.దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.
👍 👍 GOOD