నేలతంగేడు మొక్కల లీల జూడు
చాల నౌషధ గుణముల సబల చూడు
గాలి వాలు పెరిగినట్టి వీలు చూడు
పెరటి మొక్కగా పెరగదు బీడు చాలు
నాగమంజరి గుమ్మా
మనం ప్రత్యేకించి నాటే పని లేకుండా కేవలం గాలికి పెరిగి మనకి ఉపయోగపడే పొదలాంటి మొక్కల్లో ఒకటి సునాముఖి. ప్రాంతీయతని బట్టి దీనిని ఇంగ్లీషులో ఇండియన్ సెన్నా, టిన్నెర్‌వెల్లీ సెన్నా అనీ, హిందీలో సనాయె, సనాకపట్ అనీ, కన్నడలో నెలవరికె, సోనాముఖి అనీ, మలయాళంలో సున్నముక్కి, కొన్నముక్కి అనీ, తమిళంలో నిలవిరారు, నెలవరకారు అనీ, తెలుగులో సునాముఖి, నేలతంగేడు అనీ, సంస్కృతంలో స్వర్ణపత్రి అనీ, గుజరాతీలో నట్‌కి సానా అనీ వ్యవహరిస్తారు.
సునాముఖి ఆకులు, కాయలు కూడా ఔషధ గుణాలు కలిగి ఎంతో ఉపయోగపడతాయి. దీని ఆకులు, కాయలు ఎండబెట్టి నూరడం ద్వారా సునాముఖి పొడిని తయారుచేస్తారు. ఇది అజీర్తి రోగాలకి, శరీరంలో యిన్‌ఫెక్షన్స్‌ని నిర్మూలించడానికి, ఊపిరితిత్తుల్లోని ఏర్పడిన సూక్ష్మక్రిముల నిర్మూలనకీ, అలాగే ఊపిరి తిత్తులకు మంచి బలాన్ని చేకూర్చడానికీ, కీళ్ళనొప్పులకీ, ఉబ్బసవ్యాధికి, ఆయుర్వేద వైద్య విధానంలో ఔషధ తయారీలో అత్యంత ముఖ్యంగా వాడు తున్నారు.
జుట్టురాలకుండా, చుండ్రు పట్టకుండా కాపాడుతుంది. సౌందర్యసాధనాల్లో కూడా సునాముఖికి ప్రముఖస్థానం ఉందని చెప్పవచ్చు.
షట్షాకర చూర్ణం, అష్టయాది చూర్ణంగా లభ్యమవుతున్న ఈ ఔషధాలు ఆయుర్వేదపరంగా సునాముఖితో తయారుచేయబడు తున్నవే. అంతే కాక దీనికి ఒంట్లో వేడిని తగ్గించే గుణం విపరీతంగా ఉంది. శరీరానికి మంచి చలువ చేస్తుంది. కంటి సంబంధిత రోగా లని కూడా అరికడుతుంది.
సునాముఖి వేరు నుండి తయారు చేయబడిన ఔషధం విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందించడంలోను, ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలో, రక్త కణాలలోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికి ఉపయోగపడతాయి. దీనిలో లభ్య మయ్యే ప్రధాన మూలకాలు సెన్నోసైడ్ ఎ, బిలు ఔషధ తయారీకి చాలా ఉపయోగపడుతున్నాయి. సునాముఖి ఆకుల్ని కొబ్బరినూనెలో నిల్వచేసి నిత్యం తలకి రాసుకుంటూ వుంటే, కేశాలు ఒత్తుగా పెరిగి, దృఢంగా ఉంటాయి.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.