బుద్ది జ్ఞాపకశక్తుల నొద్దికగను
మనకు నొసగు మండూకపర్ణి నయముగను
బ్రహ్మియు సరస్వతుల పేర్ల పరిచయమ్ము
పిల్లలున్నట్టి యిండ్లను చెల్లి నిలుచు
నాగమంజరి గుమ్మా
బ్రహ్మి, సరస్వతి ఆకు, మండూకపర్ణి అని ఈ మొక్కకు పేర్లు. ఈ మొక్కను ఉపయోగించి బ్రాహ్మీమాత్రలు, బ్రాహ్మీఘృతము, సరస్వతారిష్ఠము, బ్రాహ్మరసాయనము, బ్రాహ్మీతైలము మొదలగు ఆయుర్వేద ఔషధాలు తయారుచేస్తారు. ఇవి నరాలకు బలాన్ని కలుగజేసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఇది ఉన్మాదము, అపస్మారము మొదలగు మానసిన వ్యాధులలో ప్రయోజనకారి. జ్ఞాపక శక్తిని పెంచడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది. విషయ గ్రహణం, విషయ ధారణ శక్తులను ద్విగుణీకృతం చేస్తుంది. ఒక కప్పు పాలతో చెంచా సరస్వతీ ఆకుల చూర్ణాన్ని కలిపి రోజూ రెండుపూటలా తాగాలి.
సరస్వతీ ఆకు రసం కొద్దిగా పంచదారతో కలిపి నిత్యం సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి పొందుతుంది. నిత్యం కొద్దిగా వాముపొడిని, నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మొక్క సమూలం నీడలో ఎండించి, పాలతో తీసుకుంటే, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.
చదువుకునే పిల్లలున్న ఇళ్లలో సరస్వతీ లేహ్యం తప్పక ఉంటుంది.
దేశీయ వైద్యంలో ఈ మొక్క పత్రాలను ఉపయోగిస్తారు. వీటిని మజ్జిగలో మూడు రోజులు నానబెట్టి (కొద్దిగా ఉప్పు వేసి) ఎండించి పొడిచేసి టానిక్ లాగా పిల్లలకు ఇస్తే చాలా మంచిది. ముఖ్యంగా బాలింతలకు ఇస్తే రక్తహీనత అరికట్టి, రక్తం వృద్ధి చెందుతుందని అంటారు. చర్మవ్యాధులకు, నరాల బలహీనతకు కూడా వాడుతారు.
గొంతు బొంగురుగా ఉన్న పిల్లలకు, మొక్క పొడి చేసి, తేనెలో కలిపి ఇస్తుంటే, క్రమేపి స్వరపేటిక వృద్ధి చెంది మంచి కంఠ స్వరం కలుగుతుందని అంటారు. చదువుకునే పిల్లలున్న ఇళ్లలో సరస్వతీ లేహ్యం తప్పక ఉంటుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.