నేల ఉసిరికనుచు మేలమాడుదురేమొ
ఉసిరి వేరు నేల ఉసిరి వేరు
చిట్టి మొక్క చేయు గట్టి మేలును చూడు
వదలరింక మొక్క వెదకకుండ
నాగమంజరి గుమ్మా
నేల ఉసిరి ఒక చిన్న మొక్క. ఆకుల వెనక అంటిపెట్టుకున్నట్లున్న చిన్న చిన్న కాయలతో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది.
ఈమొక్క మొత్తం ఉపయోగపడే ఔషధగుణాలు కలిగివుండటం విశేషం. అనేక రుగ్మతలకి, వ్యాధులకీ ఇది విస్తృతంగా వైద్య విధానంలో ఉపయోగపడుతోంది.
మనుషుల్లో హెపటైటిస్-బి వైరస్‌ని అరికట్టడానికి ఈ ఔషధం ఉపయోగిస్తారు. బాక్టీరియా, ఫంగస్‌ల్ని కూడా అరికడుతుంది. అంతేకాక లివర్‌కి రక్షణగా, అతిసార వ్యాధిని నివారించడంలో, కాన్సర్, గర్భనిరోధక ఔషధంగా ఈ మొక్క వినియోగపడుతుంది.
బ్రెజిల్, పెరూల్లో కిడ్నీలో రాళ్ళ నివారణకి ముఖ్య ఔషధంగా ఉపయోగిస్తారు.
నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ మొక్కనుండి ఏర్పడే పాలు అన్నీ ఆయుర్వేద మందుల్లో వాడతారు. చలువకి, దాహార్తిని తీర్చడానికి, బ్రాంకైటీస్‌కి, కుష్టువ్యాధికి, మూత్ర సంబంధ వ్యాధులకి, ఉబ్బసానికి, తయారు చేసే మందుల్లో నేలఉసిరిని ఎక్కువగా వాడతారు. అంతేకాక యునానీ వైద్యపరంగా కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది.
అల్సర్స్‌కి, దెబ్బలకి, తామర, గజ్జి నివారణకి వాడే యునానీ మందుల తయారీలో దీనిని వాడతారు. పచ్చకామెర్ల వ్యాధికి తాజాగా తీసిన దీని వేరు అత్యంత దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మ సంబంధ వ్యాధులకి దీని ఆకులు నూరి కాస్త ఉప్పు కలిపి గాయాలకీ, దెబ్బలకీ, ఇతర చర్మం మీద ఏర్పడే మచ్చలకీ రాస్తే తక్షణ నివారణ ఉంటుంది. పాముకాటుకి విరుగుడుగా కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. లివర్ వ్యాధులకి తయారుచేసే మందులలో, చివరికి లివ్-52లో కూడా దీనిని వినియోగిస్తారు. ఎడారి ప్రాంతవాసులు నేల ఉసిరి వేర్లు, భద్రమిశ్రగంధితో కలిపి ఒంటెలకి అరుగుదల పెరగడానికి ఔషధంగా వాడతారు. నేల ఉసిరి పేస్టును మజ్జిగతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.