ఎక్కిళ్ళు నుదరశూలలు
మిక్కిలి వాపులును, నంజు, మేహపు బాధల్
చక్కగ నశింప జేసెడి
మొక్కయె పల్లేరు గాన మొక్కుము దినమున్
నాగమంజరి గుమ్మా
పల్లేరు ముండ్ల కాయలతో కూడిన మొక్క. ఆయుర్వేదంలో మూత్రవిరేచన (మూత్రాన్ని జరీచేయుట) మూత్ర కృచ్రఘ్న (మూత్రంలో నొప్పిని తగ్గించుట) అశ్మరీహర (మూత్ర వ్యవస్థలో రాళ్లను కరిగించుట) భేదన (శరీరంలో పెరిగిన వ్యాధి లక్షణాలను తొలగించుట), శోధహర (వాపును తగ్గించుట), రక్త శోధన (రక్త దోషాలు తగ్గించుట), భృంహణ (శరీర బరువు పెంచుట), త్రిదోష హర (వాత, పిత్త, కఫ దోషాలు హరించుట) మొదలగు గుణాలు చెప్పబడినవి.
పల్లేరు చెట్టు బెరడుతో కషాయం తయారుచేసుకొని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఉదయం, సాయంకాలం తాగితే పిత్తప్రకోపం వల్ల వచ్చిన తలనొప్పి తగ్గుతుంది.
పల్లేరు పువ్వుల ముద్దను ఎండబెట్టి, చూర్ణంగా దంచి, రెండు గ్రాముల మోతాదుగా, రెండు మూడు ఎండు ద్రాక్ష పండ్లతో కలిపి రోజుకి మూడుసార్లు పది పదిహేను రోజులు క్రమం తప్పకుండా సేవిస్తే ఆయాసం, ఉబ్బసం వంటివి తగ్గుతాయి.
పల్లేరు కాయలు, అశ్వగంధ వేర్లు వీటి సమభాగాల సూక్ష్మ చూర్ణాన్ని అర టీస్పూన్ మోతాదుగా, రెండు టీ స్పూన్ల తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తింటూ, పావు లీటర్ పాలను తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే క్షయ వ్యాధి, దగ్గు, దౌర్బల్యం ఇలాంటి వ్యాధుల్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.