బలురక్కసి పేరు తలువ
తలనొప్పులు రా మరచును దరిదాపులకున్
నలగింజలు విష దోషము
మిలమిల వన్నెల కుసుమము మేలి పసిడియే
నాగమంజరి గుమ్మా
మెరిసే బంగారు రంగు పూవులు, ముట్టుకోనివ్వని ముండ్లు, చిక్కితే పచ్చని పాలు, నల్లనల్లని ఆవాల్లాంటి గింజలు. బహుశా ఈ మొక్కను చూడని వాళ్ళు ఉండరు. పేరు తెలియక పోవచ్చును.
ఇంత చక్కటి పూలున్న ఈ మొక్క పేరు పిచ్చికుసుమ లేదా బలురక్కసి, ఇంకా స్వర్ణ క్షీరి.
మైగ్రేన్ వంటి తలనొప్పులకు, కిడ్నీ వ్యాధులకు ఇది ఔషధమట. ఇంకా మత్తు మందు గా కూడా ఉపయోగిస్తారట. అయితే ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణ లో మాత్రమే వాడవలసిన ప్రమాదకరమైన మందు ఇది.
ఈ గింజలు ఆవాలతో కల్తీ చేస్తారు. 1998లో ఈ గింజల కల్తీ నూనెతో ఎంతో ప్రాణనష్టం జరిగిందంటారు. ప్రాణాంతకమైన ఈ మొక్కలోని ఏ భాగాలను తాకినా, చేతులు కడగకుండా ఆహారపదార్థాలు కానీ, ముఖాన్ని కానీ తాకరాదు
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.