Editorial

Saturday, September 21, 2024
Serialరక్ష - తెలియని లోకాలు తెలుపు : 8th Chapter

రక్ష – తెలియని లోకాలు తెలుపు : 8th Chapter

నిన్నటి కథ

ఏది నిజమో, ఏది అబద్ధమో నిర్ధారించుకోవడం ఎలా?’ ఆలోచనల సుడిగుండాల్లోంచి ఎప్పుడో తెల్లవారు జామున తనకు తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారిపోయింది రక్ష. మరునాడు ఉదయమే లేచి, అందరూ గుడికి వెళ్లి రక్ష పేరున అర్చన చేయించారు. పదకొండు గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్నారు. పన్నెండు గంటల ప్రాంతంలో ఒక పోలీసు ఉద్యోగి వచ్చి, రక్ష చెప్పిన విషయాలు రాసుకున్నాడు. పెద్ద వాళ్లతో కొన్ని సంతకాలు తీసుకుని వెళ్లిపోయాడు. కొందరు ఊరివాళ్లు కూడా వచ్చి, కాసేపు మాట్లాడిపోయారు. ఆ రోజు సాయంత్రమే రక్ష వాళ్లు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తర్వాత?

ఎనిమిదో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

తాను హైదరాబాద్ కు వచ్చిన మరుసటి రోజే తన కార్యక్రమం ప్రారంభించింది రక్ష. ముందుగా, తాను కొన్ని నిర్ధారణలు చేసుకోవాలి. తన అనుభవాలు భ్రమలో, వాస్తవమో తేల్చుకోవాలి. నిజమైతే, ఆ నీలి బిలం రహస్యాలు తన నిజమైన తండ్రి ఈ భూమి మీద ఎక్కడ దాచి ఉంచాడో తెలుసుకోవాలి. దానిని ఎవరి చేతుల్లో పడకుండా రక్షించి ఆ అదృశ్య లోకానికి చేర్చాలి. తనకు తండ్రి ద్వారా లభించి, ఇంకా తనకే తెలియని ఏవో శక్తులు తనకు ఈ పనిలో సహాయపడవచ్చు. కానీ వాటి గురించి ఇప్పటి వరకు తనకు తెలియదు. వెతుకులాటను ఎక్కడి నుంచి ప్రారంభించాలో తనకు అర్థం కావడం లేదు. అలా అని ఆలస్యం చేయడానికి లేదు. ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడికి వెళ్లాలో… అంతా గందరగోళంగా, అయోమయంగా ఉంది.

నిజానికి ప్రొఫెసర్ శరత్ ప్రొఫెసర్ కాడు. కేవలం డిగ్రీ చదువుతున్న విద్యార్థి మాత్రమే. అతడు రక్ష కన్నా ఐదేళ్లు సీనియర్. ఫిజిక్స్, గణితంలో అతనికున్న పట్టు, ఆసక్తి చూసి అతని స్నేహితులందరూ సరదాగా ‘ప్రొఫెసర్’ శరత్ అని పిలుస్తారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ శరత్ ను కలిసింది రక్ష. నిజానికి ప్రొఫెసర్ శరత్ ప్రొఫెసర్ కాడు. కేవలం డిగ్రీ చదువుతున్న విద్యార్థి మాత్రమే. అతడు రక్ష కన్నా ఐదేళ్లు సీనియర్. ఫిజిక్స్, గణితంలో అతనికున్న పట్టు, ఆసక్తి చూసి అతని స్నేహితులందరూ సరదాగా ‘ప్రొఫెసర్’ శరత్ అని పిలుస్తారు. స్టీఫెన్ హాకింగ్, ఐన్స్టీన్, న్యూటన్లు అతనికి చాలా దగ్గరైన వాళ్లు, ఎక్కువ ఇష్టమైన శాస్త్రవేత్తలు. వాళ్లను ఒక రకంగా ఔపోసన పట్టాడని చెప్పుకుంటారు. లెక్చరర్లకు కూడా అర్థంకాని విషయాలు అతను చెప్పగలడని పేరు తెచ్చుకున్నాడు. మాడ్రన్ ఫిజిక్స్ లో పరిశోధన చేయాలనేది అతని లక్ష్యం. అలాంటి విషయాలపైన పత్రికల్లో, సైన్స్ జర్నల్స్లో తరచుగా వ్యాసాలూ, సైన్స్ ఫిక్షన్ కథలూ రాస్తుంటాడు. ఫ్యూచర్ సైన్స్ పత్రికలో సైన్స్ ఫిక్షన్ కథల పోటీలో ఇటీవలే అతడు రాసిన ఒక కథకు బహుమతి వచ్చింది.

కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూతబడి ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న పిల్లలు కొందరు తమ సందేహాలు తీర్చుకోవడానికి అతని దగ్గరికి వస్తుంటారు. గణితంలోనూ, సైన్స్లోనూ వాళ్ల సందేహాలు తీరుస్తుంటాడు శరత్. అతడు చెప్పే పద్ధతి వినేవాళ్లకు ఎంతో కుతూహలాన్నీ, ఆసక్తినీ కలిగించే లాగా ఉంటుంది. పిల్లలందరూ అతడిని ‘శరతన్నయ్యా’ అని పిలుస్తారు. అలా అతని దగ్గరకు వెళ్లే వాళ్లలో రక్ష కూడా ఉంటుంది. తాను ఆ ఉదయం శరత్ కు ఫోన్ చేసి, ‘అతడు రాసిన కథలో తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటి గురించి మాట్లాడ్డానికి సమయం దొరుకుతుందా?’ అని అడిగింది. శరత్, ‘తాను ఆ రోజు ఖాళీగానే ఇంటి దగ్గరే ఉంటానని, పదకొండు గంటల ప్రాంతంలో రావొచ్చని,’ చెప్పాడు. సరిగ్గా పదకొండు గంటలకు వాళ్లింటికి వెళ్లింది రక్ష.

రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు,  4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com 

రక్ష వాళ్లుంటున్న వీధిలోనే శరత్ ఉంటున్నాడు. ఆ రెండు అపార్ట్మెంట్ల మధ్య ఐదు నిమిషాల నడక దూరం మాత్రమే ఉంటుంది. శరత్ అందరితో కలివిడిగా ఉంటాడు. అడిగినా అడగక పోయినా అవసరం వస్తే తనకు చేతనైన సహాయం చేస్తాడు. బుద్ధిమంతుడనే పేరు తెచ్చుకున్నాడు. ఆ రెండు కుటుంబాల మధ్య స్నేహం కూడా ఉంది. కాబట్టి, పిల్లల రాకపోకలకు ఏ అభ్యంతరాలూ ఉండవు. రక్ష వెళ్లే సరికి వాళ్ల అమ్మ ఆఫీస్ కు వెళ్లిపోయింది.నాన్న మహబూబ్ నగర్ జిల్లాలో అటవీశాఖలో ఉద్యోగం చేస్తూ నల్లమల అడవిలో ఉంటాడు. సెలవు దొరికినప్పుడల్లా హైదరాబాద్ కు వచ్చి వెళుతుంటాడు.

“మనకు అందనంత దూరాల్లో, అంటే వేల వేల కాంతి సంవత్సరాల దూరాల్లో, మన అత్యాధునిక టెలిస్కోపులకు కూడా ఇంకా అందని దూరాల్లో మరిన్ని ప్రపంచాలు ఉంటే ఉండొచ్చునేమో! కానీ, మన చుట్టే ఉంటూ, మనకు తెలియని లోకాలు ఉన్నట్టు రాశావు కదా? ఎంత కథైనా అది నమ్మేలా ఉండాలి కదా?”

రక్ష వెళ్లేసరికి అక్కడ శరత్ తో బాటు మరో ఇద్దరు పిల్లలు సాధన, కార్తీక్ కనిపించారు. వాళ్లు పదవ తరగతి చదువుతున్న పిల్లలు. రక్షకు స్నేహితులు. రక్షను చూడగానే, ‘హాయ్!’ అంటూ చిరునవ్వుతో పలకరించారు. “ఊరికి వెళ్లావటగా, ఎప్పుడు వచ్చావు రక్షా?” అడిగింది సాధన. “నిన్ననే వచ్చాను,” అని జవాబు చెప్పి, చిరునవ్వుతో వాళ్లను పలకరించింది రక్ష. తరవాత శరత్ వైపు తిరిగి, “శరతన్నా! మ్యాగజైన్లో నువ్వు రాసిన కథ చదివాను. బాగుంది. ఎంతో ఆసక్తి కలిగించేలా ఉంది. కానీ, అది చదివిన తరవాత నాకు కొన్ని సందేహాలు కలిగాయి. వాటి గురించి నిన్ను అడిగి తెలుసుకోవాలని అనిపించింది. అందుకే వచ్చాను,” అంటూ శరత్ సమాధానం కోసం చూసింది.

“అప్పుడే చదివేశావా? నిజమే! అది ఈనాటి కాల్పనిక కథ. నీలాంటి టీనేజ్ పిల్లల కోసమే రాశాను. అయితే ఆ గణిత విషయాలూ, ఆ పదజాలం హైస్కూలు స్థాయి పిల్లలకు అంత తేలికగా అర్థంకావు. కానీ మీలాంటి చదివే ఆసక్తి ఉన్నవాళ్లకు వీలయినంత సులువుగా అర్థమయ్యేలా రాయడానికే ప్రయత్నం చేశాను. కొన్ని మౌలిక విషయాలు తెలిసి ఉంటే మరింత బాగా ఆస్వాదిస్తారు. ఈనాటి పిల్లలకు చదివే ఆసక్తి కలిగించాలనే ఆ కథ రాశాను. నువ్వు చదివినందుకు చాలా సంతోషం. ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం ఆ కథ నీలో కలిగించిందంటే అది బాగుందనే అనుకుంటున్నాను. సరే, నీ సందేహాలు ఏమిటో అడుగు,” అన్నాడు శరత్.

“మనకు తెలియకుండా, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించిన కథ కదా అది. పైగా అది మనకు ఎంతో దూరంగా, ఎక్కడో విశ్వాంతరాళంలో ఉన్న ప్రపంచం కూడా కాదు. మనకు దగ్గరలో మన భూమి మీదే, మన చుట్టే మరిన్ని ప్రపంచాలు ఉండొచ్చు అనిపించేలా కథ రాశావు. అది మనకు కనిపించదని, వినిపించదని, మన ఈనాటి శాస్త్రీయ పరికరాలకు అందదని, మన స్పర్శకు తెలియదని రాశావు. ఇది పూర్తిగా అభూత కల్పన అనే అనిపిస్తుంది కదా? జానపద కథైతే ఫరవాలేదు, కానీ దీనిని ఈనాటి పిల్లలం ఎలా అంగీకరిస్తాం?” అని, శరత్ ఏమంటాడో అన్నట్టు చూసింది రక్ష.

“అవును, అలాగే రాశాను,” తరవాత విషయం చెప్పమన్నట్టు తలపంకించాడు శరత్.

మళ్లీ రక్ష అంది, “మనకు అందనంత దూరాల్లో, అంటే వేల వేల కాంతి సంవత్సరాల దూరాల్లో, మన అత్యాధునిక టెలిస్కోపులకు కూడా ఇంకా అందని దూరాల్లో మరిన్ని ప్రపంచాలు ఉంటే ఉండొచ్చునేమో! కానీ, మన చుట్టే ఉంటూ, మనకు తెలియని లోకాలు ఉన్నట్టు రాశావు కదా? ఎంత కథైనా అది నమ్మేలా ఉండాలి కదా?”

రక్ష అడిగిన ప్రశ్నలు, వాళ్లు మాట్లాడుతున్న విషయాలు ఆసక్తికరంగా అనిపించి, మిగతా ఇద్దరు పిల్లలు కూడా కుతూహలంగా, ‘శరత్ ఏం చెపుతాడా?’ అని అతని జవాబు కోసం చూశారు. అతడు జవాబు ఏమీ ఇవ్వకుండా లేచి, లోపలి గదిలోకి వెళ్లాడు.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

ఏడో అధ్యాయంఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం | రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article