Editorial

Thursday, November 21, 2024
వ్యాసాలుYear Roundup 2021 : బ్రహ్మ కమలం తెలుపు - డా. కిరణ్మయి దేవినేని

Year Roundup 2021 : బ్రహ్మ కమలం తెలుపు – డా. కిరణ్మయి దేవినేని

ఏమని చెప్పాలి ఈ సంవత్సరం గురించి…చీకట్లు ముసురుకున్న వేళ ఒక మరపురాని తెలుపు.. ఎదురు చూసి ఎదురు చూసి కన్ను దోయి అలసి పోయే వేళ విచ్చుకున్న బ్రహ్మకమలం…ఈ ఏడాది.

డా. కిరణ్మయి దేవినేని 

ఏమని చెప్పాలి ఈ సంవత్సరం గురించి!

నిజం చెప్పాలంటే కోవిడ్ మహమ్మారి కబళించిన 2020 కంటే కష్టమైన ఏడు – 2021. ఇది వృత్తి పరంగా తీవ్ర అలసట, మానసికంగా అపరిమితమైన వేదన కలిగించిన సంవత్సరం.

ఎంతో ఇష్టంగా ఎంచుకున్న 25 ఏళ్ల వృత్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి గానీ మున్నెన్నడూ కలిగని నిస్తేజం ఈ ఏడు కలిగింది. భయపడింది కరోనా కైనా, బాధ పెట్టింది అది మాత్రమే కాదని చెప్పాలి.

చదువు, మార్పు ఆవశ్యమని అనిపించిన ఏడాది కూడా ఇది. నిజానికి ఒక దీర్ఘ కాలపు విశ్రాంతి కోరుకుంది మనసు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే, ఆ కష్టమక కష్టమేనా అనిపించే కష్టం. కాళ్ళ కింది నేల జారుతున్నా, నిలబడక తప్పని పరిస్థితి. అదే గందర గోళంలో మెట్లు జారి కుడి చేయి ఫ్రాక్చర్. అలాగే అన్ని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక మూడు నెలల గడ్డు కాలం. ఓపిక, స్థిరచిత్తం, మనసు మూలల్లోంచి బొట్టు బొట్టు మనోధర్యంతో కూడ బెట్టుకుని పెంచుకున్న ఆశ ..  చేయి పట్టి నడిపించిన… నడిపిస్తున్న కనిపించని దైవం – శ్రద్ధ, సబూరి.

ఇంత కంటే కష్టం ఎదుర్కోలేదా అంటే ఏమో!

మానవత్వం మీద మనుషుల మీద సన్నగిల్లుతున్న నమ్మకo, రాబోయే కాలం అంతా మంచి కాలం అంటే నమ్మలేని తనం, మెల్లగా అమాయకత్వం సడలినప్పటి భీతి. ఇదంతా నిరాశానా? కాదు. ఒక లాంటి ఎరుక.

పాప పుట్టినప్పుడు ఆస్పత్రిలో పడ్డ నలభయ్ రోజుల యాతన, అమ్మకి breast కాన్సర్ అని తెలిసినప్పుటి బాధ, ఆరేళ్ళ తర్వాత మళ్లీ అది తిరగపెట్టినప్పుడు పడ్డ ఆందోళన, ఆ రెండేళ్ల కాలం అమ్మ ఎక్కువ కాలం ఉండదేమో అన్న దుఃఖ భారం మరువలేనిది. అమ్మ పోయింతర్వాత గత ఏడేళ్లుగా అనుభవిస్తున్న ఒక అనాధ తనం, అందరిలాగే నేను కష్ఠాలకేమి అతీతం కాదు. కానీ ఈ ఏడు చెప్పలేని అన్ని కలగలసిన లాంటి అదనపు వేదన.

మొత్తానికి ఈ ఏడూ కూడా చివరికి వచ్చింది. మరి ఏమనిపిస్తోంది!?

జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎన్నడూ లేనటువంటి విద్వేష భాష, వాతావరణ మార్పులు,
కోవిద్ జాడలో భయం నీడలో బతుకులు.

మానవత్వం మీద మనుషుల మీద సన్నగిల్లుతున్న నమ్మకo, రాబోయే కాలం అంతా మంచి కాలం అంటే నమ్మలేని తనం, మెల్లగా అమాయకత్వం సడలినప్పటి భీతి. ఇదంతా నిరాశానా? కాదు. ఒక లాంటి ఎరుక.

అయితే ఇంతటి నిరాశామయ స్థితిలోనూ నన్ను నిలిపిన స్నేహాలు, అనుభవాలు నిజంగా అరుదైనవి. అనూహ్యమైనవి.

నాకోసం నాలుగు అడుగులు ఆగిన నలుగురు… చిత్రంగా ఆత్మీయులు అని నేను ముందు పెద్దగా అనుకోని కొద్దిమంది మనుషులు… రెండు కన్నీటి చుక్కలు రాల్చి నన్ను వారి ఆత్మీయ స్పర్శ లో హృదయంలో సేద తీర్చిన కొన్ని మనసులు…

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు …నీ కోసమే కన్నీరు నింపుటకు .. నేనున్నానని నిండుగ పలికిన తోడూ నీడలు, చిన్న నాటి స్నేహాలు…

ఎందుకో తెలియని చిట్టి పిట్టలు… నాలుగు గింజల కోసం బాల్కనీ అంతా రోజంతా కువ కువ లాడే సవ్వళ్ళు… ఇవి ఎన్నిసార్లు నన్ను సేద తీర్చాయో చెప్పలేను!

వీటన్నిటితో పాటూ నేను పెంచుకున్న మొక్కలు .. ఎదురు చూసి ఎదురు చూసి కన్ను దోయి అలసి పోయే వేళ విచ్చుకున్న బ్రహ్మకమలాలు.

ప్రతి రోజు నిరాశ పర్చక ఉదయాన్నే రంగులీనే మందారాలు… గులాబీలు… తెచ్చుకున్న మూడేళ్ళకి చిగురించే ఆశకి సంకేతంలా పూసిన పీస్ లిలీ… పక్క జాగాలో అడుగంటిన నీటిమడుగులు… మాయమైన చెట్లు… ఎందుకో తెలియని చిట్టి పిట్టలు… నాలుగు గింజల కోసం బాల్కనీ అంతా రోజంతా కువ కువ లాడే సవ్వళ్ళు… ఇవి ఎన్నిసార్లు నన్ను సేద తీర్చాయో చెప్పలేను!

ఈ ఏడు జనవరిలో మా మిట్టూ పట్టు పట్టినందుకు మా ఇల్లు చేరిన మా పెంపుడు పిల్లి కూన చిట్టి… 24/7 నిరంతరం గాన స్రవంతిలో ఓలలాడించే వివిధభారతి… ప్రతి గదిలో మది మదిలో మనసున మల్లెల మాలలూగించే సంగీతం…

రెండేళ్ల తర్వాత బుక్ ఫెయిర్ లో వెతికి వెతికి ఏరుకున్న సంతోషాలు…చీకటి వెనుక వెలుతురు లాగ చిన్న చిన్న ఆనందాలు… దీపం జాడలో నీడలాగ కొన్ని బాధలని అంగీకరించే చేవ…ఎంత బాధైనా ఎంత క్లిష్ట పరిస్థితులైన మానకుండా చేసిన పని…అడిగిన ప్రతి పని చేయ గలిగింది, చేయ దగింది అయితే కాదనకుండా చేయడం…ముందు అనుకున్న పనులు ప్రాజెక్టులు నెమ్మది గానైనా ఆపక చేస్తూ పోవడం.. వెరసి ఇన్నేళ్ల అంకిత భావంతో చేసిన పనికి గుర్తింపుగా ఒక అవార్డు…రెండు పేపర్ పబ్లికేషన్లు…రెండు టెక్స్ట్ బుక్ చాఫ్టర్లు…ఇరవై ముప్పై దాకా అకాడమిక్ ప్రజెంటేషన్లు…కొన్ని ప్రయాణాలు…

ఏమని చెప్పాలి ఈ సంవత్సరం గురించి!

కొన్ని పూవులు మరికొన్ని తావులు…విరిసిన బ్రహ్మ కమలాలు.

వరంగల్ వాస్తవ్యులైన డా.కిరణ్మయి దేవినేని గైనకాలజిస్ట్.
ఉస్మానియా మెడికల్ కాలీజీలో అసోసియేట్ ప్రొఫెసర్. నివాసం మణికొండ, హైదరాబాద్.
email : kpkiranmai@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article